పరిచయం

Posted by

సాయం సంధ్యవేళ, సముద్ర తీరానా.. ఇసుకలో భారంగా నడిచే పాదాలు, అయినా అలసిన మనసుని తట్టి లేపే చల్లని గాలి; చెదురుతున్న కురులని సర్దడంలో సన్నని విసుగు, అయినా పెదాలపై చిరునవ్వు తెప్పించే ఆహ్లాదమైన వాతావరణం. ఎదురువస్తూ పలకరిస్తున్న గాలికి రెప్పలు వాలిపోతున్నా.. అనంతముగా కనిపించే నీలిసాగరం రెప్పని కట్టిపడేస్తుంది.

“ఎంత గాంభీర్యం .. ఎంత నిఘూడత్వం.. ఊ..నీలో ఎముంది?” అంటూ ఆలోచించేలా చేసే సముద్రాన్ని చూస్తూ తెలియకుండానే ముందుకు నడక సాగుతుంది.

అల్లంత దూరాన ఘోషిస్తూ ఇప్పుడు కనిపించే సముద్రం ఎమీ అంత ప్రశాంతంగా లేదు.. వచ్చి పొయే అలలు .. ఏదో కల్లోలపడుతూ, ఎందుకో కలవరపడుతునట్టుగా .. మన కోసమే ఎదురు చూస్తునట్టుగా అనిపిస్తుంది.. రా రమ్మని పిలుస్తు ఉంటుంది.

ఇంత అభిమానమా అని ఇంకాస్త ముందుకు అడుగులు వేస్తే..” వందనం.. అభివందనం!!” అంటూ పాదాలను సున్నితంగా తాకుతుంది. అప్పుడే ముద్దాడి, అప్పుడే వెన్నక్కి వెళ్ళిపొయే అల చూస్తే ఎందుకో తెలియని బాధ. రెప్ప పాటులో ఏర్పడిన భందం, చేజారిపోతుంది అన్న భయం.

నీరు పాదాల అడుగును విడవగానే.. మనసు నిలువుమన్నా వినదు. తన గమ్యం ఎంటో తెలిసాక.. అటే పరుగులు తీస్తుంది. ఇక నేనూ ఆగలేను అంటూ నిలువెత్తు అల శీర్షాభిషేకం కానిస్తుంది. ఆ భావావేశంలో, ఆ పరవశంలో ముందుకు వెళ్ళామా?? .. తనతో పాటు తిరిగి రాని తీరాలకు తీసుకువెళ్తుంది.

జీవితంలో వ్యక్తులతో పరిచయాలు కూడా ఇలాగే ఉంటాయి!! తొలిచూపులో మెరుపు, మాటల్లో చిలిపితనం, స్పర్శలో సున్నితత్వం, కౌగిలో పరవశం.. అటుపై చేరవలసిన తీరం!! మనకున్న ప్రతీ సంబంధం ఒక ప్రత్యేకం. కొన్ని దైవాధీనం ఐతే, మరి కొన్ని స్వయం నిర్ణయాలు.

తప్పటడుగులు వేస్తున్న మనల్ని నడిపించే చేయ్యి నుంచి, నీరసించిన అడుగులు తడబడుతుంటే సాయంగా నిలిచే చేతుల వరకు, జీవనం ఓ నిరంతర ప్రయాణం. ఆ మజిలో తారసపడిన ప్రతీ మనిషి, ఇసుకలో పాదం గుర్తు లాంటి వారు. కొన్ని అడుగులు మనకు మార్గదర్శకం ఐతే, మనలని అనుసరించే అడుగులు మరిన్ని. కలిపి అడుగులు వేసే స్నేహాలు నుంచి, అడుగులో అడుగై మనతో మమేకమైయే జీవిత భాగస్వామి వరకు, అన్ని పరిచయాలు మనిషిగా మనల్ని సంపూర్ణం చేసెవే!!

జీవితం అనే ఇసుక తిన్ననలో, కాలపు అలలుకు చెదరిపొయినా, మనసు ఫలకం పై నిలిచి ఉండే, ప్రతీ పరిచయానికి ఇదే నా జొహారు!!

5 comments

  1. చాలా ఆలోచనతో రాసినట్టున్నారు. “అన్ని పరిచయాలు మనిషిగా మనల్ని సంపూర్ణం చేసెవే!!” బాగుంది. ఇందులో శీర్షాభిషేకం అనే పదం నన్ను కొంత ఆలోచింపజేసింది. శీర్షాన్ని అభిషేకిస్తుంది అనే అర్థంలో దీన్ని వాడొచ్చా అని. క్షీరాభిషేకం, కనకాభిషేకం, పుష్పాభిషేకం వంటి పదాల్లో దేనితో అభిషేకిస్తున్నామో ఆ వస్తువు ముందుంది. టపా చివరి వాక్యం నాకు సరిగా అర్థంకాలేదు.

    Like

  2. పరిచయమై దూరమయ్యే స్నేహాలు సముద్రపుటొడ్డున ఇసుకలో పాద ముద్రలు. పోలిక భలే చెప్పారు. సముద్రం నా స్నేహితుడు అనే భావనకూడా చాలాబావుంది.
    శీర్షాభిషేకం అన్న వాడూక నాకు నచ్చింది.
    @రానారె .. హాయిగా వాడొచ్చు. సమాసం కాబట్టి దాణికి మనం చెప్పుకునే విగ్రహ వాక్యం మీద ఆధారపడి ఉంటుంది అర్ధం. క్షీరంతో అభిషేకం .. తృతీయ తత్పురుష. శీర్షానికి అభిషేకం .. షష్ఠీ తత్పురుష. ఇప్పుడో ఎసైన్మెంటు. ప్రేమాభిషేకం, పట్టాభిషేకం – వీటికి ఏమని విగ్రహవాక్యం రాయొచ్చు.

    Like

  3. రానారె గారు: “చాలా ఆలోచనతో రాసినట్టున్నారు” – నా ప్రతీ టపా అంతే!! ఇందులో చెప్పాల్సిన దానికన్నా ఆలోచనలే ఎక్కువుగా కనిపించాయా?? ఏమో!! “శీర్షాభిషేకం” అన్న పదం విన్న గుర్తు లేదు కానీ.. అలా వాడడం తప్పు అనిపించలేదు. మీరడిగి మంచి పని చేశారు.. గురువర్యులే సమాధానం చెప్పారు కదా!! 🙂

    చివరి వాక్యం.. జీవితాన్ని ఇసుక తిన్నెగా, పరిచయాలను పాద ముద్రలుగా, అలలను కాలంగా ఊహించుకుంటే.. కాలంతో పాటు పరిచయాలు మరుగును పడ్డా.. మన మనసులో ఎప్పుడూ ఉంటాయని చెప్పడానికి ప్రయత్నించాను.

    గీతాచార్యగారు: నెనర్లు!!

    కొత్తపాళీ గారు: ముందుగా అభినందనలకు నెనర్లు!! ఇక మీరు బెత్తం తీసుకుని సిద్ధంగా ఉండండి. ఆ ఆసైన్మెంట్ నేనూ చేస్తున్నా..

    ప్రేమాభిషేకం: ప్రేమతో అభిషేకం (నాకు ప్రేమకు అభిషేకం అని కూడా అనిపిస్తుంది)
    పట్టాభిషేకం: పట్టానికి (సింహాసనానికి) అభిషేకం

    తోచింది చెప్పా.. సరి చేసే బాధ్యత మీదే!!

    Like

  4. భావసంపద బావుంది. భాషనింకొంచెం పదునుపెడితే, మరింత అందం వస్తుంది.
    అచ్చుతప్పయ్యి ఉండవచ్చు – “నిఘూడం” కాదు “నిగూఢం”.

    Like

Leave a comment