వాన అలిగితే..

Posted by

“”వర్సం పప్పొతుంది డాడి, వర్సం పప్పోతుంది !!” అని చిన్నా అరిచేవరకు నువ్వు నా రాకను గమనించలేదు అంటే, అసలు నేనిప్పుడు రావాలా వద్దా అని ఆలోచిస్తున్నా!! నన్ను చూసి ఆ చిన్ని గొంతులో ఎన్ని భావాలు.. నేను ఎక్కడనుండి వస్తున్నానో అని ఆశ్చర్యం, వచ్చి ఏమి చేస్తాను అని భయం, మెరుపులా గర్జిస్తానేమో అని అనుమానం, అయినా ఆనందం!! అది నా కోసం పడే ఆనందం. నీకు అర్దమైయేలా చెప్పాలి అంటే, “ఇట్స్ ఎక్స్ క్లుసివ్ ఫర్ మి”. నువ్వూ నా కోసం అలానే వేచి చూస్తావు అనుకున్నాను, నీ మనసు నా కోసం తపిస్తుందని భ్రమించా! ఆశాగా నిన్ను చేరాలి ఉబలాటపడ్డాను. కాని ఏది?? నీ లేత బుగ్గ పై జారినా, నీ చేతిని గిచ్చినా నువ్వు ఈ (నా??) లోకంలోకి రావటం లేదు. ప్రారబ్దం!!

ఎందుకు నీలో ఇంత మార్పు? మనమిద్దరము గడిపిన కాలం నువ్వు మర్చిపోయావా?? నేను వస్తున్నాను అని ఏ మాత్రం తెలిసినా, నా కోసం ఎంత ఎలా నిరీక్షించేదానవు? ఎంత చలి గాలి వీస్తున్నా, ఈదురు గాలి కంటిలో దుమ్ము కొడుతున్నా, ఇంటిలోకి వెళ్ళకుండా అలానే చూస్తూ ఉండెదానవు. నేను చినుకులా వచ్చీ రాకుండా ఊరిస్తుంటే నువ్వు బుంగ మూతి పెట్టి నా వైపే చూసేదానవు. అంత ముద్దుగా నువ్వు చూస్తుంటే, మనసాగక నేను విజృంభిస్తే, నాలో పూర్తిగా తడిచి, అటు ఇటు పరిగెత్తుతూ, గెంతులు వేస్తూ ఆటలు ఆడుకునే రోజులు ఎలా మరుగున పడ్డాయి?? నేను వస్తే నువ్వు దాక్కునే పరిస్థితి రాకూడదని పుస్తకాలన్ని ప్లాస్టిక్ కవర్ చుట్టి, నువ్వు “అన్నింటికీ సిద్ధం, నువ్వు రా” అంటే రాకుండా ఉండగలనా??. నీలో నన్ను నింపుకొని, నేను వెళ్ళగానే, ఇంటికి వెళ్ళి, అమ్మ తిట్లను, గోరుముద్దలను ఒకేలా ఆస్వాదిస్తూ, వేళ్ల తో చిక్కుతీసుకుని కురులు ఆరబెట్టుకుంటూ, నేను వెళ్ళిపొయాను అని గుర్తు రాగానే, నా నీటిలో కాగితపు పడవలు వేసేదానవు. మన కలయిక గుర్తులుగా మారిన నేలలో నీ అడుగులను, ముద్దయిపోయిన నీ పాదాలను చూస్తూ.. ముక్కు దిబ్బడ వేసుకుపొతున్నా, తల భారంగా మారుతున్నా, వళ్ళు వేడేక్కుతున్నా, నా ఆలోచనలతోనే నిద్రలోకి జారుకునేదానవు.

మరి ఇప్పుడో?? నేను ఒక అడ్డంకి నీకు. నీవు బయటకు వెళ్తున్నప్పుడు వస్తే, “సమయం, సందర్భం లేకుండా ఏంటి ఈ పాడు వాన” అని ఈసడింపు. నీవు దారిలో ఉండగా నేను వస్తే .. నీ ప్రియమైన తెల్ల డ్రెస్స్ పాడవుతుందని భయం. నువ్వు ఆఫీసులో ఉండగా వస్తే అసలు నా ఉనికే తెలియదు నీకు. ఎవరో చెప్పినా “ఓ.. డామ్న్ ఇట్” అనడానికే!! నీకూ బరువులు భాధ్యతలు పెరిగాయిలే అని సరిపుచ్చుకుని, నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకునే వేళ వస్తే, “అమ్మో వాన!! కరెంటు పోతుంది ఏమో, కేబుల్ రాదేమో – మంచి ప్రోగ్రామే!!, ఇంటెర్నెట్ కన్నెక్ట్ అవ్వదు ఏమో – కొత్త పాటలు విందామనుకున్నానే??” అని టెన్షన్. పోనీ నీ నుండి దూరంగా వెళ్ళి ప్రపంచంలో ఏ మూలో భోరుమంటుంటే, “అన్-టైమ్లీ రేన్, మనకు నెగ్గే ఛాన్స్ ఉన్నప్పుడే వస్తుంది” అని తిట్టుకుంటుంటే నేను ఎటు పోయేది?? ఎమైపోయేది?? నాకన్నా నీకు అందరూ ఎక్కువే.. కదూ??!!

ఒక్కప్పుడు నేను తెచ్చే నల్లని మబ్బులు,చల్లని గాలి, మెరుపులు ఉరుములు, మట్టి వాసన, చినుకులు, వడగండ్లు, నేను చేసే శబ్దం అన్నీ నీకు ప్రాణం, కాని ఇవ్వలా, నేనంటే నీకు గుర్తువచ్చేది బురద, చీకటి, ట్రాఫిక్ జాం, రోడ్ల మీద గతుకులు, చిరాకు లాంటివి. ఎప్పుడూ వచ్చిపొయే వానకు స్పందన అవసరమనిపించకపోవచ్చు. కానీ స్పందించే హృదయం నీకుందని, అదిలేకపోతే మనిషిగా నీ ఉనికికే ప్రమాదమని మర్చిపోకు. మీ సైన్స్ టీచరు చెప్పినట్టు ఓ కాలంలో ఓ పధ్ధతిగా రావాల్సిన నేను, ఇప్పటికే అలవాటు మానేసా!! నువ్వు ఇలానే చేస్తే ఇక ఎప్పటికీ రాను. ఆనంద్ డివిడి పెట్టుకుని.. “అబ్బా.. ఎంత వానో!!” అని చూసుకోవటం తప్ప నేను ఎన్నడూ కనిపించను” అని వర్షం వెళ్ళిపోతుంది అనుకున్నా ఒక క్షణం,

అసలు వాన వస్తుందిప్పుడు, మబ్బు పట్టింది కదా అనుకునే మేడ మీదకు వెళ్ళా!! చినుకు కోసం ఎదురుచూస్తూనే, మనసు ఏవో ఊసులు చెప్తుంటే ఆలకిస్తూ ఉండిపొయా!! మనసు కూడా మనం చెప్పేది వినదు.. దానికి వాదనలు, ప్రతి వాదనలతో పని లేదు. దాన్ని మభ్యపెట్టలేక, అలా అని అది చెప్పిన దానితో ఏకీభవించలేక సంఘర్షణ పడే వేళ చినుకులు రాలుతున్నా కూడా ధ్యాస మరలలేదు, “వర్సం పప్పొతుంది డాడి” అని చిన్నా అనేవరకు. తర్వాత ఎంత ఎదురుచూసినా వాన రాకపొయేసరికి, అలిగిందేమో అని భయం వేసింది. వానకే మాటలు వస్తే నన్ను ఎలా విమర్శించేదో వచ్చిన ఊహకు రుపాంతరం ఈ బ్లాగు.

7 comments

 1. మీ బ్లాగు చూడటం ఇదే మొదటిసారి, చక్కగా రాస్తున్నారు. వాన స్వగతం బాగుంది. నిజంగానే వాన అందాన్ని,అదిచ్చే ఆనందాన్ని చిన్నప్పటిలాగ ఇప్పుడు అనుభవించలేకపోతున్నాం. వాన పడుతుండగా ఈ కామెంటు రాస్తున్నాను, యాదృచ్చికమేమో మరి!!

  మీ బ్లాగుని కూడలికి కలపమని వీవెను గారికి ఓ మెయిలు కొట్టండి.

  Like

 2. ఒక చిన్న సూచన, మీ బ్లాగు టెంప్లేటు బ్యాక్ గ్రౌండు రంగు మారిస్తే బాగుంటుంది.

  Like

 3. @sirisiri muvva:

  మొదటి సారి నా బ్లాగును విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఏవో మనసుకి వచ్చిన ఆలోచనలు, వచ్చీరాని భాషలో పెడుతున్నాను. మీ కామెంట్ కాస్త టానిక్ లా పనిచేస్తుందని ఆశిస్తున్నా!!

  వీవెన్ గార్కి రెండు మూడు సార్లు మెయిలు పంపించాను, కాని లాభం లేకపొయింది. ఇప్పుడు మరల ప్రయత్నిస్తా. మీ సూచన మేరకు బ్లాగు టెంప్లేట్ మార్చగలను త్వరలో!!

  మళ్ళీ మళ్ళీ నా బ్లాగుకి వస్తారని ఆశిస్తున్నాను!! 🙂

  Like

 4. బాగుంది. వానే కదా ప్రకృతికి సంబంధించిన ప్రతి అంశమూను. నాకైతే వాన అంటే ఎప్పుడు గిట్టేది కాదు 🙂 కాకపోతే నేను అలా అనుకునేది డాబా గురించి. నా ఎం. ఎస్. సీ సహాధ్యాయి విద్య మాటల్లో చందు (చందమామ) గురించి 🙂

  Like

 5. ప్రశాంతి గారు:
  చందూ నాకు ఆప్తుడే.. ఇప్పటికే నా బ్లాగులోకి రాలేనందుకు అలిగాడు. త్వరలోనే తీసుకువస్తా!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s