2003-04 సీసన్ లో ఊకదంపుడు దంచాక, వివిస్ లక్ష్మణ్ ఒకానొక ఇంటర్వులో తనకిష్టమైన పుస్తకాల్లో “Its not about bike, My journey back to life” అని చెప్పిన మరుక్షణం ఈ పుస్తకం చదివేయాలనుకున్నాను. కాని ఎక్కడ??.. ఇంటర్నల్లు, సెమిస్టర్లు, ఎగ్జాములు అంటూ గడిచిపొయింది. పోనీ ఉద్యోగంలో చేరాకైనా అనుకుంటే.. ట్రేనింగులు, మీటింగులు, బిల్డులు..రిగ్రషన్లు అంటూ కాలం నిలవలేదు. ఏదో సినిమాకి ప్రసాద్స్ కి వెళ్తే టికెట్స్ దొరకలేదు.. అక్కడే ఉన్న “Odyssey”లో ఈ పుస్తకం పట్టా!! ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చి ఆ పుస్తకం చదవాలా అని మనసు ఉవ్విల్లూరింది. లక్ష్మణ్ చెప్పారని కాదుగాని ఓ వ్యక్తి సంపూర్ణ జీవితం నా చేతుల్లో ఉందంటే ఓ వింత అనుభూతికి లోనయ్యా!! లాన్స్ అర్మ్ స్ట్రాంగ్ గురించి బాగానే తెలుసు నాకు, అతడో ప్రపంచ ప్రధమశ్రేని సైక్లిస్ట్ అని, అత్యంత కష్టసాధ్యమైన “టూర్ డి ఫ్రాన్స్” ను ఏడు సార్లు గెలుచుకున్న అపరయోధుడని, అదీ కాన్సర్ లాంటి మృత్యువుని గెలిచాడని. అయినా తన మాటల్లో తన కథ చదువుదామని పుస్తకం తెరిచా.. నా ఊహకు కూడ అందని ఎన్నెన్నో అనుభూతులు ఆవిష్కృతం అయ్యాయి.. వాటినే ఈ బ్లాగులో పంచుకునే ప్రయత్నం. ఇది ఒక పుస్తకాన్ని సమీక్షించటం కాదు, ఒక జీవితపు అవశేషాలు నాలో మిగిలిన వైనం.
దిగువ మధ్యతరగతి జీవనాలు ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కటేనేమో అనిపించింది లాన్స్ బాల్యం చదువుతుంటే. ఎవరో ఒకసారి “మధ్యతరగతి జీవితమంటే ఒక రైలుభోగీలో కూర్చుని ఇంకో రైలు వెళ్ళుతుంటే మనమే కదులుతున్నాం అని భ్రమించడం” అని వ్యాఖ్యానించారు. ఆ వాక్యం వినగానే మనసు చివ్వుక్కుమనిపించింది. కానీ లాన్స్ తల్లి తన బిడ్డను ఎలాంటి భ్రమలోనూ బ్రతకనివ్వలేదు. తన శక్తి ఎంతో, తాను ఏమివ్వగలదో అన్నీ సవివరంగా చెప్పింది. లాన్స్ ఎప్పుడూ ఆ పరధుల్లోనే తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నాడు. బహుముఖప్రఙాసాలిగా ఎదిగాడు. సైక్లింగ్, స్విమ్మింగ్, మారతాన్లలో తన సత్తువును చాటాడు. ప్రపంచపటంపై తన ఉనికి అప్పుడప్పుడే చూసుకుంటున్న సమయంలో, ఓ సాయంత్రం వచ్చిన తలనొప్పి మరువక ముందే భయంకరమైన దగ్గుగా మారి, తాను నిల్చున్నా కూర్చున్నా నిలువన్నివ్వని నొప్పి తో, తన ఊపిరితిత్తులవరకు పాకి.. కేవలం వారం రోజులలో కాన్సరని తెలియటమే కాక, తన చరిత్ర ఇక క్షణాలదే అని తెలిసిన్నప్పుడు నా మెదడు మొద్దు బారింది. లాన్స్ ఆరోగ్యంగా ఇంకా జీవించి ఉన్నాడు అని నాకు తెలుసు. అయినా ఎందుకంత భయపడ్డానో!! ఒక సారి ఫ్రెండ్ ఫోన్ చేసి “హౌస్ లైఫ్??” అని అడిగితే.. “ఏమో రాఘవా!! కొత్తగా ఏమీ జరగడంలేదు. అలా అని జీవితం ఆగిపోనులేదు” అని సమాధానమిచ్చాను. దానికి తను “జీవితం ఇచ్చే ట్విట్స్ ఆండ్ టర్న్స్ మన ఊహకు అందవు. జీవితం ఎలా వస్తుందో అలానే అంగీకరించటం తప్ప”. అనగానే ఊ కొట్టాను. వారంరోజుల క్రితంవరకు సంపూర్ణ ఆరోగ్యవంతుడైన లాన్స్ ఇప్పుడు మృత్యుముఖంలో ఉన్నాడు,.. నిజంగానే మన ఊహకు అందవు… రాఘవతో అన్న “ఊ”ను ఇప్పుడు అనుభవించాను!!
ఒకసారి జరిగిన రేసులో బాగానే మొదలుపెట్టినా, మధ్యలో లాన్స్ కి ఓపిక పూర్తిగా పోతుంది. అయినా సైకిలు దిగి కుంటుతూ, పడుతూ లేస్తూ తన గమ్యాన్ని చేరుకుంటాడు. “ఎప్పుడూ మధ్యలో వదిలిపెట్టకు, చివరిదాక ప్రయత్నించు” అన్న తన తల్లి మాటలకు కట్టుబడడమే!! మాటకు విలువిచ్చి తన తల్లి విలువను పెంచాడా?? తల్లి విలువ తెలుసు కాబట్టి మాటకు విలువినిచ్చాడా?? అన్న ప్రశ్న నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆ ఒక్క వాక్యమే లాన్స్ ను కాన్సర్ని ఎదురుకునేలా చేసింది. I’ll not let it take over me అని తన ధృడ నిశ్చయాన్ని తెలిపాడు. అత్యంత క్లిష్టసాధ్యమైన ట్రీట్మెంట్ తీసుకున్నాడు. తన తలపై చుక్కలుపెట్టి బ్రేయిన్ సర్జరీ చేసినా.. కెమోతెరపీ తీసుకున్నా.. ఆ భాదనంతా భరించింది కాన్సరుని గెలవన్నివ్వకూడదని.. అది మోండితనమే.చావుని కూడ ఎదిరించేంత. “Death is not a cocktail party conversation” అంటాడు లాన్స్ ఒక సందర్భంలో, అయినా మృత్యువుతో సంభాషిస్తూనే ఉంటాడు, ఆ సొద వినలేకె చావు కూడ వెళ్ళిపొయిందెమో!! బక్కచిక్కి చావుకు మరో రూపంగా మంచంపై పడున్న లాన్స్ కోసం ఒక స్పాన్సరు రావటం, అతని స్థితి చూసాక కాంట్రాక్ట్ రద్దు చెయ్యటం.. లోకం పోకడ చెప్పకనే చెప్తుంది.
ఇంతా చేసి అంతా బాగయ్యాక లాన్స్ సైక్లింగ్ పై ఆసక్తి లేకపొవటం నాకు ఆశ్చర్యమేసింది. తనకు కాన్సరు అని తెలిసినప్పుడు కూడా ఆటకు దూరమైయ్యాననే ఎక్కువ మధనపడతాడు. బాగయ్యాక మాత్రం ఆటపై ఆసక్తి లేకపొవటం… ఒక భీభత్సమైన యుద్ధంలో గెలిచాక, ఓ మాములు పోట్లాట మజానివ్వదు. చావునే మట్టికరిపించిన తనకు ఇప్పుడు “టూర్ డి ఫ్రాన్స్” కూడ ఓ మామూలు విషయంలా తోచింది ఏమో!! కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు ప్రోద్బలంతో మళ్ళీ రేసింగ్ మొదలు పెట్టి అనితర సాధ్యమైన విజయాలను సొంతం చేసుకున్నాడు. మనిషన్న ప్రతీవాడూ చెయ్యెత్తి జేకొట్టాల్సిన విజయాలు సాధిస్తున్నా, “డ్రగ్స్” అంటూ సాధించే మనుషులను ఎదురుకోవాల్సివచ్చింది. కెమోతెరపీ వల్లే అతనికింత బలం వచ్చిందని ఆరోపించిన వారికి ఏమి తెలుసు, ఛాతీలో ఒక పరికరాన్ని పెట్టుకుని అందులో నుండి వెలువడే కెమికల్స్ అన్నీ తన నరనరాల్లోకి చొచ్చుకుపోతుంటే కలిగే వేదన. నాలుగు నెలల కాలంలో ఆ పరికరం చుట్టూ ఫ్లెష్ పెరిగాక దాన్ని తన శరీరం నుండి వేరు చెయ్యటంలో కలిగిన వ్యధ??
ఇది లాన్స్ కథే అనుకున్నా.. కానీ అతన్ని మించి నన్ను ఆకట్టుకున్నారు, లాన్స్ జీవితంలో ముఖ్యపాత్ర పోషించిన నలుగురు స్త్రీలు. వారిలో ప్రధమం అతడి తల్లి. ఒక మనిషికున్న మనోబలానికి ఈమే పరాకాష్ట అనిపించింది. చిన్నవయస్సులోనే ఎన్నో కష్టాలు పడుతున్నా మరో చిన్నారిని దృఢమైన వ్యక్తిగా తీర్చిదిద్దిన తీరు నన్ను ప్రభావితం చేసింది. తన సమస్యలేమిటో, తన ఏమివ్వగలదో ఏమి తీసుకోగలదో ఆ చిన్ని హృదయానికి వివరించిన తీరు అమోఘం అనిపించింది. కల్మషంలేని వారి సంభాషణలు తల్లీ-బిడ్డ, స్నేహితుల మధ్య తేడాను చెరిపివేసాయెమో అనేలా ఉంటాయి. ఇక పోతే అతని భార్య!! “మగాడు తన భార్యను ప్రేమిస్తాడు, కాని ఆమె తల్లి అయ్యాక గౌరవిస్తాడు” అని ఎదో డైలీ సీరియల్ లో భారి డైలాగు. నిజం లేకపోలేదు ఆ మాటలో. అసహజమైన పద్దతుల్లో లాన్స్ బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె పడిన అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. తను ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు, దగ్గరుండి అన్నీ చూసుకున్న నర్స్ ని లాన్స్ దేవత అని వ్యవహరిస్తాడు. మనకూ దేవతలానే కనిపిస్తుంది. ఇక ఆ కష్టకాలంలో లాన్స్ కి తోడుగా ఒక గాళ్ ఫ్రెండ్ ఉండేది. ఈమె పాత్ర కూడ చాల ముఖ్యమైంది. కానీ ఎందుకో వారి బంధం కొనసాగదు.
పుస్తకమైతే మూసేశాను గాని, ఆ తాలుకు గుర్తులు నాలో ఇంకా వినిపిస్తున్నాయి, జీవితం ఒక అందమైన అనుభవం అని మళ్ళా నిరూపించిన ఈ ప్రయాణం నాతో ఎప్పుడు ఉంటుంది.
అవును ఈ వ్యక్తి గురించి చదివింది నాకు బాగా గుర్తు ఉంది. కాకపోతే జీవిత చరిత్ర గురించి తెలీదు. మీ టపా చదివాక పుస్తకాన్ని చదివిన అనుభూతినిచ్చింది. తప్పకుండా నేను కూడా ఈ పుస్తకాన్ని కొని చదువుతాను.
LikeLike
పుస్తకం నిరాశపరచదు అనే ఆశిస్తున్నా!! Thanks for your comment.
LikeLike
ప్రశంతిగారు చెప్పినట్లు నేను ఈ పుస్తకాన్ని కొని చదవలేను కానీయ్యండి, మీరు కనుక ఒక్కసారి మీరు కొన్న ఆ పుస్తకాన్ని చేబదులుగా ఇవ్వగలిగితే.. బదులుగా నాదగ్గరున్న వేరే పుస్తకాన్ని మీకు వస్తు మార్పిడి పద్దతి ద్వారా ఇవ్వగలను.
ఏమంటారు..
ఇక్కడ మరొక్క విషయం, పాత రోజుల్లో అన్నట్లు, “పుత్తకం, విత్తం, వనిత ఒక్క సారి చేతులు మారాయంటే .. అలాగే తిరిగిరావు..” అన్నాడట ఓ మహానుభావుడు.. కానీ నావిషయంలో మత్రం అలా జరగదని మీకు బ్లాగు సాక్షిగా మాటిస్తున్నాను.. పువ్వుల్లో కాక పోయినా, యధావిధిగా చెక్కు చెదరకుండా తిరిగి అంద జేయగలనని మాటఇస్తున్నాను.
LikeLike
i read about him in news paper long back. anyways, nice review of the book
LikeLike
Good review. I will try to read this book.
LikeLike