మా అమ్మ ఎప్పుడూ ఒక సామెత చెప్తూంటారు “చదువుకున్న వాడికన్నా చాకలి వాడు మేలని”. అది విన్నప్పుడల్లా నవ్వాలో ఏడ్వాలో తెలియదు నాకు. ఆ వాక్యాన్ని కొట్టిపారేయలేను, అలా అని ఒప్పుకోనూ లేను. ఆ చదువుకున్నవాడిది కేవలం పుస్తకజ్ఞానమయితే ఆ చాకలి వాడిదే పైచేయి, అనుభవసారం ఎక్కువుంటుంది కనుక. పుస్తకాలతో పాటు జీవితాన్ని చదివితే మనిషికి తిరుగుండదు. జీవితాలను అర్ధంచేసుకునే వీలు గాని, సమయం గాని మన విద్యావిధానం అంతగా కలిపించదు కాబట్టి, చాకలియే మేలు అనిపిస్తుంది ఒక్కోసారి.
ఈ మధ్యనే నేను చదివిన కొడవగంటి కుటుంబరావు గారి నవల “చదువు” నాకెంతగానో నచ్చింది. నాకు నచ్చిన నచ్చని పుస్తకాలగూర్చి రాసేది, ఎవరి రచనా శైలినో, కథావస్తువునో, పాత్రల విశిష్టతో సమీక్షించడానికి కాదు. అంత సాహిత్యానుభవం నాకు లేదు. ఇది కేవలం నాకు ఉన్న పరిధుల్లో చెప్పిన కథను అర్దంచేసుకున్న వైనం.. అంతే!! ఇహ నవల గూర్చి మాట్లాడుకుంటే.. ఓ చిన్నారి అమ్మవడిలో కూర్చుని అక్షరాలు అభ్యసించటంతో మొదలవుతుంది ఈ కథ. సీతమ్మ తన కొడుకు సుందరానికి శాయశక్తులా విద్య వంటపట్టించాలని తాపత్రయం చూడ ముచ్చటగా ఉంటుంది. చిన్నారిలో సహజంగా నేర్చుకోవాలనే తపన మురుపిస్తుంది. సుందరం బాల్యం చదువుతున్నంత సేపు “నేను ఇంతేగా” అనిపిస్తూనే ఉంది. చిట్టి వేళ్ళ మధ్య బలపాన్ని గట్టిగా పట్టికుని, అమ్మ ఎటు తిప్పుతూ ఉంటే చేయ్యి అటు తిరుగుతూ రాయడం.. ఎంత ఆనందమో కదా!! ఒకటి రెండు సార్లు చెప్పినా అదే తప్పు పునరావృతమైనప్పుడు దండన, “చూడమ్మా.. నాకు వచ్చేసింది” అన్నప్పుడు విజయగర్వం.. అవ్వనీ మధురానుభూతులు. అమ్మ చూపిస్తే కాని ప్రపంచం తెలియదు. అమ్మతోడిదే లోకం, ఆ బుడివయస్సులో.
అమ్మ కొంగు కాస్త వదిలి బడికి పోతాడు సుందరం మనలాగానే. మొదట వికటించినా, తర్వాత అలవాటుపడతాడు. అమ్మ చూడని ప్రపంచంలోకి వెళ్తాడు. పుస్తకాలను జీర్ణించుకుంటూనే మనుషులను, పరిస్థితులను, పరిసరాలను చదువుతూ ఉంటాడు. తనకి చాలా విషయాలు ఏమిటో ఖచ్చితంగా తెలియవు, అయినా గమనిస్తాడు, ఆలోచిస్తాడు. “ఇది” అన్న నిర్ణయానికి రాకపోయినా సరే… అర్దంచేసుకునే ప్రయత్నం మానడు. చదువన్నది అతనికి ఒక అవసరం కాదు. దాని వల్ల వచ్చె లాభనష్టాలను బారేజీ వెయ్యలేడు. స్వతహాగా చదువంటే ఇష్టం. చదవడం తెచ్చి పెట్టుకున్న అలవాటు కాదు. చదువును డబ్బు కోసమో, పరపతికోసమో, పలుకుబడికోసమో మరి ఇంక దేనికోసమో కాకుండా, చదువు చదువులా చదివే మనసున్న వాడు. కెరీర్ ఓరియంటెడ్ కానందువల్ల నవల ముగిసే సరికి ఆర్ధికంగా గొప్ప స్థాయిలో ఉండకపోవటం వలన అతను “విఫలమే”మో అనిపించవచ్చు ఒక్క క్షణం. దానికతడు ఎన్నడూ ప్రాధాన్యం ఇవ్వలేదని గ్రహించాక అంతగా పట్టించుకోలేదు నేను. తన తండ్రి మరణించిన్నప్పుడు, తల్లికి మరో వివాహం అనేది అతని వయసుకు, ఊహకి అందని విషయం. కాలక్రమంలో తన చెల్లెలి స్నేహితురాలు భర్త చనిపోతే చాలా చింతిస్తాడు. ఆ అమ్మాయికి ఏ విధంగా సాయం చెయ్యాలా అని మధనపడతాడు. తన వేదనను, దానికి తను అనుకునే పరిష్కారాన్ని ఒక కథగా వ్రాసి పత్రికకు పంపిస్తాడు. నా అభిప్రాయంలో ఇలా కొత్తను ఆహ్వానించే మేధస్సును, మనోదృక్పధాన్ని అతనికి “చదువు” కలిగించింది. ఇందుకే నాకీ నవల మరీ నచ్చింది.
సుందరం కొడుక్కి అతని భార్య చదువు చెప్పే సన్నివేశంతో ఈ నవల ముగుస్తుంది.. ఇంకో కొత్తతరం ఆరంభానికి సూచికగా. నా మనస్సు ఎందుకో “అయ్యో!!” అంటూ మూలుగుతూనే ఉంది. మొదట్లో చూడముచ్చటగా కనిపించిన సుందరం-సీతమ్మల అనుబంధం బీటలువారుతుంది. తల్లీబిడ్డలమధ్య అంతులేని అగాధం ఏర్పడుతుంది. సీతమ్మ బిడ్డను చదివించాలన్న బలమైన కోరిక, క్రమశిక్షణతో పెంచటం, బిడ్డ శ్రేయస్సుకై శ్రమించడం అన్నీ ఆమె ఒక మంచి తల్లి అనేలా కనిపిస్తాయి. కానీ రాను రాను సుందరం జీవితంలో “అమ్మ” తగ్గుతూపోతుంది. సుందరం ప్రపంచంలోకి అడుగిడి పాఠాలు నేర్చుకుంటుంటే, అతడి తల్లి నాలుగు గోడల మధ్య బందీగా మిగులుతుంది. అమ్మ ఓనమాల దగ్గరే ఆగిపోయిందని సుందరం, కొడుకు “చేయి”దాటిపోయాడని సీతమ్మ బాధపడతారు. ఇది నాకు మింగుడుపడని విషయం.. వారిద్దరి మధ్య దూరం రావటానికి కారణాలు ఎమైనాకావచ్చు, కానీ ఎంత “ఎదిగినా” మొదలు భూమిలో స్థిరంగా ఉంటేనే పచ్చదనం. ఆమెను అలా చిత్రీకరించటంలో రచయిత ఉద్ధేశ్యం నాకు బోధపడలేదు.
ఈ రచనను ఇంకో వంద సార్లు చదివినా, మరెప్పుడూ చదవలేకపోయినా.. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సన్నివేశం చెప్పనా?? సీతమ్మ కొడుక్కి ఒక్కోక్కటే వరుసగా నేర్పిస్తుంది. చురుకైనవాడు కావున, చదువంటే ఇష్టం చేతన సుందరం అవ్వనీ గబగబా నేర్చుకునేస్తాడు. అక్షరాలన్నీ వచ్చేసాయని ఆనందిస్తున్న వేళ, ఇంకా గుణింతాలు ఉన్నాయి అని చెప్తుంది అమ్మ. అవి నేర్చుకునే దాక ఆగలేక, “అమ్మా.. నీ పేరు రాయనా” అని అడిగి, “అమ” అని వ్రాస్తాడు, “చూశావా.. అమ అని రాశావు, అమ్మ అని కాక. అందుకే గుణింతాలు రావాలి” అని చెప్తుంది. కొంతసేపటికి సుందరం వచ్చి “రాయలేన్ననావు గా.. ఇదో నీ పేరు” అని చూపిస్తాడు. “పలక మీద వాడూ రాసినది చూసి ఒక్క క్షణం నిర్ఘాంతపోయి కొడుకును దగ్గరకి తీసుకొని రెండు చెంపలా ముద్దుపెట్టుకున్నది” అని రచయిత చెప్తారు. ఏమి రాసాడో తెలిసిన మరుక్షణం నాలో అనిర్వచనీయమైన భావన. మాటల్లో పెట్టలేను.. మీ ఊహకే వదిలేస్తున్నా!! ఇంతకీ సుందరం రాసింది “అంమ”!!
‘చదువు’ ఎంతొ బావుంటుంది. బహుసా కొ.కొ రచనల లో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందిన నవల అనుకుంటాను. అప్పటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను చక్కగా తెలుసుకోగలం. సుందరం, అతని తల్లి పాత్రల లో మనల్ని చూసుకున్నట్టే.. కాలం గడిచిన కొద్దీ వాళ్లు దూరం కావటం సహజమైన పరిణామం. చిన్నప్పటి మాదిరి గా పెద్దవాళ్లు ప్రవర్తించరు కదా! అలానే.. చదువుకున్న వాడిని అని.. లక్ష్మి దగ్గర సుందరం ఒక పదునైన మాట అంటాడు. దానికి ఆవిడ చాలా నొచ్చుకుంటుంది. ఇది కూడా చాలా సహజం గా అనిపిస్తుంది. (అతను చేసింది ఒప్పు కాదు.. అయినా ఆ ప్రవర్తన ఇప్పటికీ చాలా మంది లో చూస్తాం) అయ్యో.. ఈ నవల ఇలా ముగిసిందేమిటి అనిపిస్తుంది.. కానీ ఈ ముగింపు ‘చదువు’ ని ‘చదువు’ కోసం (ఉద్యోగం కోసం కాకుండా) చదివే ఒక వ్యక్తి – వ్యక్తిత్వాన్ని గూర్చి ఆలోచింప చేస్తుంది. నాకు మాత్రం, సుందరం కొన్నాళ్ల తరవాత మంచి ఉద్యోగం తెచ్చుకుని, (తన కొడుకు ని చదివించడం కోసం.. etc.. ) చక్కగా స్థిరపడ వచ్చని అనిపించింది.
LikeLike
బాగుంది. మరో సాహితీ పిపాసి. జనవరి నించీ మీరు రాస్తున్నా ఎలా నా కళ్ళబడలేదబ్బా?
సంతోషం. బ్లాగ్లోకానికి స్వాగతం. కొనసాగించండి.
LikeLike
సుజాత గారు:
నిజమేనండి.. మారుతున్న కాలంతో పాటు మనమూ మారతాము. కానీ ఈ కథలో సీతమ్మ, సుందరం మధ్య దూరం నాకెందుకో అవసరానికి మించి ఉందనిపించింది. ఎందుకో వాళ్ళ Relationలో Breakdown కనిపించింది. మీరన్నదీ సబబే.. దూరాలు ఒక్కో పదనైన మాటతో ఇంకా పెరుగుతాయి. టపా చదివి, ఒప్పిగ్గా నాకు అర్ధమైయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు!!
కొత్తపాళీ గారు:
నా ఊహల ప్రపంచానికి మీకు స్వాగతమండోయ్!! జనవరి నుండి రాస్తున్నా ఎందుకో నేను బ్లాగ్లోకంలో పాగా వేయలేకపోయా.. ఇప్పటికైనా చూడాలి మరి.
నా టపా చదవటమే కాక, మీ Signatureని వదిలి వెళ్ళినందుకు Thanks!!
LikeLike
పూర్ణిమ..
నేనే మీకు థాంక్స్ చెప్పాలి. ”చదువు” చదివినపుడు నేనూ ఎంత అమ్మకూచి లా ఉండేదాన్నో గుర్తొచ్చేది. మా అమ్మ గారు అసలు చిన్నపుడు ఎండాకాలం సెలవుల్లో, సెలవుల తరవాత చేరబోయే క్లాసు పుస్తకాలు సేకరించి, చదువు చెప్పేసేవారు. ముఖ్యంగా ఇంగ్లీష్ సాహిత్యం లో గలివర్ గురించీ, రిప్వాన్ విన్కిల్ గురించీ.. సిండే రిల్లా, ఆలిస్.. వీళ్ళందరి గురించీ.. సెలవుల్లో అమ్మ చెప్తుంటే.. అబ్బ.. చదువుకుంటే, ఎన్ని చదవోచ్చో అని ఇంట్రస్టు వచ్చేది. ఆ రోజుల్ని గుర్తు చేసినందుకు..
Do you really need word verification?
LikeLike
సీతమ్మకీ సుందరానికీ మధ్య పెరిగిన దూరం ఆ కాలానికి సహజం. ఇటువంతి పరిణామమే కుటుంబరావు జెనెరేషన్ వారైన మధ్య తరగతి వారందరికీ జరిగి ఉంటుందని నా నమ్మకం. ఉదాహరణకి మా అమ్మా, అమ్మమ్మ. వారి తరవాత జెనెరాషన్స్ కి (అంటే 1940 తరవాత పుట్టిన వాళ్ళు) తరాల అంతరం మరీ ఎక్కువ కాదు అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు యువత (అంటే 85 తరవాత పుట్టిన వాళ్ళు) సామాజికంగా, మానసికంగా తమ తలిదండ్రుల నించి చాలా దూరం అవుతున్నారని నాకు తోస్తోంది.
LikeLike
‘చాకలి నయం’అన్న సామెత లెక్కల గురించి వచ్చింది అని విన్నాను. చాకలి నోటితో లెక్కలువేస్తే, చదివినోడు పేపరునో లేక ఇప్పుడు క్యాలిక్యులేటర్నో ఉపయోగిస్తాడు.
‘చదువు’ ఏదో క్లాసులో నాన్ డిటైల్గా పెట్టారు. అప్పుడు చదివా. ఇప్పుడు సరిగా గుర్తులేదుగానీ, నువ్వు చెప్తుంటే ఒక్కసారి ఆ సీను కళ్ళముందు మాత్రం మెదిలింది.
LikeLike
ఏంటో పూర్ణిమా,
ఊరికే చూద్దామని, ఏవో నాలుగు మాటలు ప్రచురించుకుందామని బ్లాగ్లోకంలోకి తొంగి చూశాను.
నీ టపాలు చదువుతుంటే చదువుతూనే ఉండబుద్ధేస్తోంది.
కొంచెం విరుద్ధంగా అనిపించినా, తనివి తీరా నీ టపాలు చదువుకుని కొన్నాళ్ళు చదవడం ఆపినా పర్వాలేదనిపిస్తోంది:-)
ఇదిగో, “చదువు” గురించి నా అభిప్రాయం.
http://onamaalu.wordpress.com/2008/03/19/%e0%b0%9a%e0%b0%a6%e0%b1%81%e0%b0%b5%e0%b1%81-%e0%b0%9a%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8%e0%b1%81/
LikeLike