అనగనగా ఒక ఈడెన్ గార్డెన్స్ ..

Posted by

( ఊహ భలే విచిత్రమైనది. నాకు అత్యంత ఇష్టమైన మాచు గురించి ఆడమ్ గిల్ క్రిస్ట్ మన భాషలో తన మనవలకి చెప్తే ఎలా ఉంటుంది అన్న ఊహకు రూపాంతరం ఈ టపా!! )

పూర్వం క్రికెట్ట్ ఆటలో అసమాన్య, అనితర విజయాలు సాధించిన ఆస్టేలియా జట్టులో అంతర్భాగం నేను. అది 2001 సీసన్. మేమంతా మంచి ఊపు మీద ఉన్నాము. 16 టెస్ట్ మాచులు గెలిచి, రికార్డ్ సృష్టించాము అప్పటికే!! ఇక ఇండియాలో కూడా గెలిస్తే మేము అప్రకటిత జగజ్జేతలం – కానీ ఇండియా అంటే మాటలు కాదు. రాకుమారుడు ఏడు సముద్రాలు ఈది, విష సర్పాలను తప్పించుకుని, దుర్గమ ప్రదేశంలో దాక్కున్న రాక్షసుని చంపి రాకుమారిని రక్షించాడు లాంటి ఫేరీ టేల్స్ లా ఉంటుంది ఇక్కడ ఆడడం. విపరీతమైన ఎండ, ఉక్కపోత, వంటిలో నీరంతా బయటకు వస్తుంటే.. మట్టిలేచే పిచ్ మీద వేసిన చోటే వేసి చంపే అనీల్ లాంటి స్పిన్నర్.. ఇవన్నీ ఒక ఎత్తయితే అర లక్షకు పైగా జనం నీ పతనం కోసమే చెవిలో గూడుకట్టుకుని పోరుతుంటే.. ఒక్కో బంతికి ఎదురునిలవడం సాహసోపేతమే!! అప్పటివరకూ మేమెప్పుడూ గెలవలేదు ఈ దేశంలో. మూడు టెస్ట్ లు ఆడాలి. అనీల్ ఆడడం లేదు.. మాకు పెద్ద ప్లస్. అలా అయినా ఈ సారి ఈ మిషన్ పూర్తి చెయ్యాలని కాచుకున్నాము.

మొదటిది ముంబాయిలో.. చించేసాము. నేను వాళ్ళ బౌలింగును చీల్చి చెండాడా. “మాన్ అఫ్ ది మాచ్” నాకే. సిరీస్ లో తొలి విజయం చాలా ఉపయొగకరమైంది; అవతివారు కోలుకునే ముందే దెబ్బ తీసే చాన్స్ మనకి ఉంటుంది. మా టీమ్ ఆ ఛాన్స్ వదులుకోదల్చలేదు. రెండో టెస్ట్ కోల్కతాలో!!

మొదలు పెట్టాము.. బాగా మొదలుపెట్టాము. కానీ భారత టీమ్.. ఎప్పుడు విజృంభిస్తుందో తెలీదు. హర్భజన్ హాట్రిక్ తో మా నడుం విరిగింది. నేను డక్కవుట్ అయ్యా!! అయినా మావాళ్ళు వదలలేదు. స్కోర్ బాగా కూడబెట్టాము. ఇండియా.. బాట్టింగ్ కి ఒక్కక్కరే వస్తున్నారు.. వెళ్తున్నారు. మేము మా లక్ష్యానికి ఒక్కో మెట్టూ దగ్గర అవుతున్నాము. లక్ష్మణ్ ఒక్కడే బాగా ఆడాడు. కానీ ఫాలో ఆన్ తప్పించలేకపోయాడు. విజయ విరహం మేము భరించలేకపోయాము. ఫాలో ఆన్ enforce చేశాము. మళ్ళా ఇండియన్స్ వచ్చారు.. కాసేపు ఉండి. మళ్ళా వెళ్ళటం మొదలుపెట్టారు. సచిన్ అవుట్ అవ్వగానే ఓ పెద్ద రిలీఫ్. గాంగులీ బానే ప్రయత్నించాడు. అతడు అవుట్ అయ్యాకా.. రాహుల్ వచ్చాడు..లక్ష్మణ్ ఇంకా ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరో ఒక్కరు చాలు మేము కలలు కన్న తీరం చేరుకోడానికి.

అప్పటికప్పుడు వికెట్ పడితే బాగుణ్ణు.. అని ఆరాటం. ఆ రోజు ఆట ముగిసే లోపు పడినా మహదానందమే. నాలుగో రోజు మొదటి గంటలో.. పోనీ లంచ్ కన్నా ముందు. లంచ్ నుండి రాగానే.. సరే.. టీ లోపు. కనీసం ఆట ముగిసేసరికి.. ఊ..హూ.. లాభంలేదు.. ఆ ఎండల్లో మూడు రోజులనుండి అన్నీ గంటలు ఫీల్డింగ్ చేసి అలసి నీరుగారిపోయాము. పరిగెత్తే సంగతి వేరు.. అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు. కానీ బాట్టింగ్ చేస్తున్న లక్ష్మణ్- రాహుల్ పట్టువిడువరు. బాకీ పడ్డ పరుగులు కొట్టి, మాకు ఓ మహా పర్వతం లాంటి లక్ష్యం ఇచ్చారు. మేము ఊహించని రీతిలో ఆత్మరక్షణలో పడి.. అదీ చేతకాక చతికిల పడ్డాము. మా విజయ పరంపరకి అడ్డు నిలిచింది ఆ ఇండియన్ టీమ్.

క్రికెట్ట్ భలేంటి ఆట.. బాట్టింగ్ లో ఎన్ని విధానాలు.. ఒకరి చేతిలో బాట్ట్ గోడలా ఉంటుంది.. Rock Solid Defence. ఒకరి చేతిలో స్టెన్ గన్ లా ఉంటుంది.. Bullet Speed shots. కొంతమంది చేతిలో మంత్రదండం లా ఉంటుంది.. sheer timing. మరి లక్ష్మణ్ చేతిలో?? చిత్రకారుడి చేతిలో కుంచె లాగా. క్రికెట్ గ్రౌండ్ అనే Canvas మీద గీసిన Monalisa..ఆ మాచ్ లో లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్!! మొనాలిసా.. ఎందుకో తెలుసా.. అందులో అట్టహాసం ఉండదు, అందం తప్ప. ఆ నవ్వు అన్వయించుకునే వారి బట్టి దాని అందం పెరుగుతుంది. సింపుల్ గానే అనిపిస్తుంది… అర్దం చేసుకునే కొద్దీ complexities బయటకి వస్తాయి, ఇది అతని ఆటతీరు మాత్రమే. Optimism కి మనిషి రూపం ఇస్తే అతడే. మాటలో ఎంత మృదుత్వమో.. ఆటలో అంత Sharpness. ఆ మాచ్ లో డ్రావిడ్, భజ్జీలది చాలా ముఖ్యపాత్ర.. కానీ లక్ష్మణ్ has stolen the show.

ఆటల్లో గెలుపోటములు సహజం. కానీ కొన్ని మధురానుభూతులుగా మిగిలిపోతాయి. 16 టెస్ట్ మాచుల్లో నిరాటకంగా గెలిచిన టీములో inseparable పాత్ర పోషించి, ముంబాయిలో వీరవిహారం చేసి.. కోలకత్తాలో చతికలపడ్డా!! హీరోకి జీరోకి ఒక్క ఇన్నింగ్స్ తేడా అంతే!! ఆ పై చెన్నైలో కూడా ఓడిపోవటంతో సిరీస్ చేజార్చుకున్నాం. ఏమి తప్పు చెశామో తెలీదు.. జగత్తు మాత్రం ఒక అనిర్విచనీయమైన క్రికెట్ట్ చూసింది. మాకు ఇండియన్ టీమ్ అంటే.. ఎప్పుడూ భయమే!! ఎగసి పడుతుందే.. అందుకు కాదు. పడినా.. లేస్తుందే అందుకు!!!

6 comments

  1. హి..హి.. నిజానిజాలు మీ పని వరకేనా?? “మంచి కామెడీ” లో కూడా వెత్తుక్కోమంటారా??

    Like

  2. టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాలోఆన్ ఆడిన జట్టు గెలిచిన సందర్భాలు రెండే ఉన్నాయి. వాటిలో ఒకటి కలకత్తా టెస్టు. గమ్మత్తేమిటంటే, రెండు సందర్భాల్లోనూ ఓడింది ఆస్ట్రేలియానే.

    కలకత్తా టెస్టు కళ్లముందు మెదిలింది మీ టపా చదువుతుంటే. బాగా రాశారు. ఓటమి అంచులవరకూ వెళ్లి తిరిగిరావటం.. మనకే ఇలా ఉంటే ఆడినవాళ్లకెలో ఉందో కదా. సిరీస్ మొత్తం U-Turn తిరిగింది ఈ గేం రెండో ఇన్నింగ్స్ తో.

    Like

Leave a comment