తెలుగు బ్లాగులు ఎందుకు చదవాలి అంటే..

Posted by

నాకు వ్రాయటం ఇష్టం.. అది సహజంగా నాకు అలవడింది. తెల్లని కాగితం మీద నీలపు అక్షరాలు జాలువారుతూంటే.. మనసవ్వటం అంటే అదేనేమో!! ఇప్పటకీ ఈ-మేల్ కన్నా ఉత్తరానికే నా ఆదరణ. అలాంటిది నేను.. తెలుగు బ్లాగు ప్రపంచంలోకి చాలా లేట్ ఎంట్రీ ఇచ్చాననే చెప్పుకోవాలి. తెలుగు బ్లాగులు అంతగా రాయకపోయినా.. నేను తెలుగు బ్లాగులు బాగానే చదువుతా. మొన్నామధ్య సౌమ్య గారి.. “ఎందుకు చదవాలి?”, అటు తర్వాత మరెవరిదో.. “తెలుగులో ఎందుకు చదవాలి” అన్న టపాలు చదివాకా.. తెలుగు బ్లాగులు వల్ల నేను నేర్చుకున్న జీవితం, ఈ టపాలో చెప్పాలనిపిస్తుంది.

* భాషోద్యమం: తెలుగు నాశనం అయ్యిపోతుంది. తెలుగుకి భవిష్యత్తు లేదు.. ఆంగ్లం అనే ఉప్పెనలో తెలుగు కొట్టుకుపోతుంది అని జనాలు గోల చేస్తుంటే.. నా వంతు సంతాపం పాటించేదాన్ని. కాని ఇప్పుడు ఆ భయమే లేదు.. చిట్టి చిన్నా తవికల నుండి,.. సమస్యా పూరణాల వరకు తెలుగు మీద పట్టున్నవారిని చదివితే ముచ్చటవేస్తుంది. అల్లసాని వారి పద్యాలనుండి నేటితరం రచయితల వరకు అందరి గురించి, అన్నింటి గురించి తెలుగు బ్లాగుల వల్ల నేర్చుకోవచ్చు. ఎస్.పి.బి గారు ప్రతీ “పాడాలని ఉంది” ఎపిసోడ్ లో తెలుగుకు పట్టుబట్ట కట్టమని మనవిచేస్తారు. ఇక్కడ ఎంచుమించు అదే జరుగుతుంది. చదివి మీ వంతు సహాయం అందించండి.

* జ్ఞాన సంపుటి: రేపు ఎవరైనా “జనరల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంది.. మంచి సైట్ చెప్పు” అని అడిగితే.. కూడలి, జల్లెడ చూడమంటా!! మన వాళ్ళు మిస్స్ అయ్యే జాతీయాంతర్జాతీయ విశేషాలు ఏమీ ఉండవు. వార్తలే కాదు.. వాటి విశ్లేషణలు, వివరణలు, అభిప్రాయాలు చాలా బాగుంటాయి. Competitive Exams కోసమే కాదు, “ఈ టీవికి ఇక సుమన్ లేరు”, “చక్రవాకం అయ్యిపోయింది” లాంటి వార్తలు మొద్దుబారిన మెదడుకు కొత్త ఉత్సాహం ఇస్తాయి.

*స్నేహానికి అడ్డా: పుస్తకం మంచి స్నేహితుడు లాంటిది అంటారు. కాని మంచి పుస్తకాన్ని ఎన్నుకోవటం అంత తేలిక కాదు. సౌమ్య గారు, చదువరి గారు పుస్తకాలను పరిచయం చేసే విధానం ఎంత అద్బుతంగా ఉంటుందంటే.. ఆ పుస్తకం చదవకపోతే.. జీవితంలో ఎదో కోల్పోయిన భావం కలుగుతుంది. సాహితీ వ్యాసాలకు కొదవలేదు. పుస్తకప్రియులకు తెలుగుబ్లాగు అడ్డా అనే చెప్పాలి. ఇక మాటా మాటా కలిసి, అభిప్రాయాలు ఏకమై స్నేహితులుగా మారేవారెందరో!!

* మనసు మాటై.. మాట మనసై: టపా పెరగన్నం అయితే.. దానికొచ్చే వ్యాఖ్యలు ఆవకాయ లాంటివి అని ఎవరో బ్లాగరు ఏదో సందర్భంలో అన్నారు. నిజమే.. మనసు మాటలు కాదు.. తేలికగా మాటల్లో పెట్టాలి అంటే!! చాలా కష్టపడో.. లేదా ఆవేశంలో మనకి తోచింది రాసేసాకా.. ఓ రిలీఫ్ ఉంటుంది. ఇతరులు ఆ టపాను చదివి.. అర్ధం చేసుకుని, అన్వయించుకుని, ఆరాధించి, వ్యాఖ్యానించినప్పుడు కలిగే ఆనందం వర్ణానాతీతం. నా బ్లాగులో ఇప్పటి వరకు నాకొచ్చిన చాలా కమ్మెంట్స్ అపరిచుతులనుండే !! “మన ఇద్దరి Frequency ఒక్కటే” అని అనుకునే సందర్భాలు బ్లాగ్లోకంలో కోకొల్లలు.

* స్ట్రెస్స్ బస్టర్: Please అన్న పదం వాడిన ప్రతీసారి.. ఆలోచనలో పడతా.. నన్నూ బినిత అనుకుంటారేమో జనం అని. అంతలా పాతుకుపోయింది రెండు రెళ్ళ ఆరు నా బుర్రలో!! ఆఫీసులో ఎవరైనా మూడీగా కనిపిస్తే.. కొన్ని తెలుగు బ్లాగుల లింకులు కొడతావారికి.. దెబ్బకు నవ్వుకుంటారు. వ్యంగ్యంలో మనకు మనమే సాటి అని నా అభిప్రాయం. తీవ్రమైన పరిస్థితులలో కూడా నవ్వు కలిగించే ఆభరణం మన బ్లాగ్గర్లది.

* చదువుట వ్రాయుటకొరకే: ఇంతా చదివాకా.. ఆలోచించకుండా ఉండలేము. ఆలోచించాకా.. స్పందించకుండా.. వ్రాయకుండా ఉండలేము. చదివాక రాస్తాము.. రాసేసాక మల్లా చదువుకుంటాము. ఇది ఒక లూప్. ఆరోగ్యకరమైన ప్రమానం.

ఈ కారనాలకే కాదు మరెందుకైనా… తెలుగు బ్లాగులు చదువుతూనే ఉండండి.

9 comments

  1. పూర్ణిమ గారు, “నాకు వ్రాయటం ఇష్టం”.. “మనసవ్వడం అంటే ఇదేనేమో” ఇలాంటి వాక్యాలు చదువుతుంటే ఇదేదో నాకు బాగా తెలిసిన ఫీలింగ్ లా ఉందే అని మీ బ్లాగ్ లోకి ఎంటరయ్యి వరుసబెట్టి టపాలన్నీ ఇప్పుడే చదివాను.. ఏం రాస్తున్నారండీ!! ముఖ్యంగా ఈ టపా చాలా నచ్చింది నాకు..

    నేనైతే ఈ మధ్య ఓ కొత్త టెక్నిక్ కనిబెట్టా.. ఎవరన్నా ఫ్రెండ్ కి ఈమెయిల్ బాకీ పడి వారాలు వారాలు దాటిపోతుంటే ‘ఏం సాకు చెప్పాలా’ అని తల పట్టుకోకుండా “హేయ్ ఇది చదువసలు ఎంత బావుందో!” అంటూ ఒక మంచి టపాకి లింక్ ఇచ్చేసి భుజమ్మీద చెయ్యేసేస్తున్నా (virtual గానే అనుకోండి) :))

    Like

  2. మీ తెలుగు, మీ భావాలు చాలా బావుంటాయి.
    ఇలా రాస్తూ వుండండి.

    Like

  3. సింపుల్ గా చెప్పలంటే, బాగుంది.నాకు అలవాటైన కారణాలను మీరు అలవోకగా భాషీకరించేశారు, భావాలనూ కుమ్మరించేశారు. అందుకే మరోసారి…చాలా బాగుంది.
    http://www.parnashaala.blogspot.com

    Like

  4. @ నిషిగంధ:
    మీ అభినందనకు కృతజ్ఞతలు!! మీ ఉపాయం కూడా బాగా నచ్చింది నాకు.. నెనూ ఓ రాయి వేస్తా!!

    @శ్రీవిద్య:
    థాంక్స్ అండి!!

    @ మహేశ్
    ధన్యవాదాలు.

    Like

  5. చాలా బాగుందండి
    మీ టపాలన్నీ చదివాను, చాలా బాగున్నాయి
    భావాలను ఇలా అక్షరాలుగా మార్చి రాయడం ఒక గొప్ప కళ అనే చెప్పాలి, అదీ ఈ కళ మీకు తెలుగు లో ఇంత బాగా వచ్చినందుకు మీకు నా అభినందనలు
    తెలుగు గురించి మాట్లాడడం, తెలుగు చానెల్స్ చూడడం ఇంకా తెలుగంటేనే చిన్నతనంగా భావించే వారున్న ఈ సమాజంలో ఇలా తెలుగు బ్లాగుల ద్వార మీలాంటి వారు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది

    Like

  6. రాం గారికి:

    నా బ్లాగుకి ముందుగా మీకు స్వాగతం. నా చిన్ని ప్రయత్నాన్ని మెచ్చి అభినందించినందుకు ధన్యవాదాలు!! తరచూ బ్లాగును విచ్చేయగలరని ఆశిస్తూ..

    పూర్ణిమ

    Like

  7. తెలుగు BLOGS మీద, మీ ANALYSIS అద్బుతం. ఎంతొ చక్కగా చెప్పారు. ఎంతో సంతోసం.. ఆనందం.. ఆశ్చర్యం .. ఎక్కడో ఖండాల ఆవల నివసిస్తూ ..ఎందరో తెలుగు వీరులు.. వీర మాతలు .. ఆధునిక జీవన శైలి లో ఉంటూ కూడా.. ఎంత ప్రేమ.. తెలుగు మీద.. కథల మీద, కవితల మీద, సాహిత్యం మీద.. ఊపిరి సలుపని ఉద్యోగ బాధ్యతల నడుమ.. ఎంతో విలువైన కాలాన్ని వెచ్చిస్తూ… మీ ఎనలేని సేవ కి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం? పాత పాటల ఖజానాలు http://www.surasa.net, http://www.chimatamusic.com .. అలాగే అత్యద్బుత గని http://www.maganti. org, ఇంకా ఎన్నో ఎన్నో web mags, websites, blogs… ఒక జ్యోతక్క, ఒక మురళి కృష్ణ, ఒక విహారి, ఒక c.b. రావు, ఒక సౌమ్య, ఒక పావని, ఒక సుజాత, ఒక ఇన్నయ్య, ఒక దార్ల, ఒక కొల్లూరి, ఒక వర్మ, ఇంకా ఎంతో మంది.. వారి వారి టపాలతో… telugu blogs వరల్డ్, తెలుగు బాషాబి వృద్ది కోసం .. వీరి తపన, తాపత్రయం, ప్రేమ, అభిమానం.. ఏః రాళ్ళతో తూయగలం.. దేనితో వెలకట్ట గలం.. పాదాబి వందనాలు సమర్పించడం తప్ప..

    Like

Leave a comment