“అసమర్ధుని జీవ యాత్ర” గోపిచంద్ రచనలలో ఉత్కృష్ఠమైనది తెలిసికూడా నేను చాలా ఏళ్ళు చదవలేదు.. పుస్తకం అందుబాటులో ఉంచుకుని కూడా. కారణం దాని గురించి చాలా విని ఉండడం. అది ఒక మనోవైజ్ఞానిక నవల అని, అందులో ముఖ్యపాత్ర సైకో అనీ, రెండు భిన్న వ్యవస్థలకు మధ్య అతడు నలిగిపోతాడని.. లాంటివి తెలియడం వల్ల ఇది మన తలకు ఎక్కదని వదిలేసా!! పుస్తకం చదవటం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితిలో దీనిని చదివా. (చదవాల్సి వచ్చింది!!) 132 పేజీలున్న ఈ పుస్తకం భలే చిట్టిగా ఉంటుంది. నేను గంటలో చదివేశాను.. చాలా సమయం పడుతుందనుకున్నాను మొదట్లో!! తలనొప్పి, తిక్కగా అనిపించడం లాంటివి ఏమి జరగలేదు. లైట్ రీడింగ్ అనిపించింది.
ఇక కథకి వస్తే.. ఇక్కడ నాకర్ధమైనవి రెండే రెండు. ఒక్కటి.. అసమర్ధత ఏమిటి, ఇంకోటి..జీవ యాత్ర అంటే ఏమిటి. ఈ కథలోని నాయకుడు.. సీతారామారావు! ఇతడి స్వభావం పరిచయం చేయటానికి రచయిత ఒక కలను ఆశ్రయిస్తాడు. కలలో మన హీరో పార్వతీపరమేశ్వరులను తపస్సు చేసి ప్రత్యక్షమైయ్యేలా చేసుకుంటాడు. ఏం వరం కావాలని అని అడిగితే.. ఆకలి వేయగానే పంచభిక్షపరమాన్నాలు కావాలంటాడు. అసలు ఆకలిలేకుండా చేస్తా అంటూ శివుడో ఆఫర్ ఇస్తాడు. వద్దుపొమ్మంటాడు మనవాడు.. ఆకలి కావాలని పట్టుబడతాడు. అంటే ఇతడికి సమస్య అంటే వెగటులేదు, పరిష్కారం మాత్రం సునాయాసంగా కావాలి. ఇలాంటి వ్యక్తి నిజజీవితంలో కూడా ఇలాంటి ఆశలు, ఆలోచనలు పెట్టుకుని తనని తాను నాశనం చేసుకుంటాడు. హాయిగా ఆనందంగా గడపాల్సిన జీవితాన్ని తన అసమర్ధతో పాడుచేసుకుంటాడు, కథ ఇంతే.. అతని మానసిక సంఘర్షణని వర్ణించిన తీరు అమోఘం.. ఒక్కో సారి అతగాడి వితండ వాదాలు మనకీ నిజమే అనిపిస్తాయి. అవి నిజం కూడా!! కానీ పరిష్కారానికి అవి పనికి రావు.
నవల ముగిసేసరికి సీతారామారావు చనిపోతాడు. అతను ఒక భయంకరమైన “విఫలం” గా మిగిలిపోతాడు. ఇతడు చదువుకున్నాడు.. కానీ ఆ చదువుని ఎవరి శ్రేయస్సుకి ఉపయోగించలేక పోయాడు.. ఆఖరకు తనకోసం కూడా!! సీతారామారావు ఒక కాల్పనిక పాత్ర, నిజమే.. కానీ అతగాడు మన అందరిలోనూ ఉంటాడు.. చిన్న చిన్న పాళ్ళల్లో!!
సివిల్ సర్వీసెస్ రాసే (రాయనివారు కూడా) చాలామంది అభ్యర్దుల్లో (నా అనుభవంలో) .. “అబ్బే..దొడ్డి దారులు తొక్కితేగాని, రాంకులు రావు” అని అంటారు. సరిగ్గా ప్రయత్నించరు. తప వైఫల్యానికి కారణం so called system అంటారు. అయ్యుండచ్చు.. కుదిరితే సిస్టంని మార్చు,,,లేకపోతే ఉన్నదానితోనే నీకు రావాల్సిన ఫలితం సంపాదించు. ఏదీ చేయకపోతే అసమర్ధత!!
ఇంజనీరుంగులు, యం.బి,ఏలు చదివిన మన అమ్మాయిలు కూడా పరాయిదేశంలో మొగుడన బడే మగాడి చేతి నానా హింసలకు గురై.. అయితే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. లేకపోతే ఏడుస్తూ ఇంటికి వస్తున్నారు. అంత చదివిన చదువులు బ్రతుకు నేర్పవు. జీవితమనే సాగరం ఒడ్డుపై నిలబడి పుస్తకజ్ఞానంతో ఆవలివైపుకు చెరాలనుకోవటం అసమర్ధత. ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకునే మనస్తత్వం ఏర్పరుచుకోలేకపోవటం అసమర్ధత.
“నేనా??.. నీ తోనా ఆడేది??” అంటూ తర్జనబర్జనలో కాలం వెళ్ళదీస్తూ విశ్వక్రీడలకు సన్నద్ధం అవుతున్నాము. అహం అనే నెపంతో సమస్య పరిష్కారానికి ప్రయత్నించక పోవటం అసమర్ధత, ప్రయత్నలోపానికి అనేకానేక కారణాలు చెప్పి, స్వనింద నుండి తప్పించుకోవటం అసమర్ధత. మన క్రీడాసమాఖ్యలో పేరుకుపోయిన అసమర్ధత..ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో!! ప్రయత్నించాక కచ్చితంగా మనకు నచ్చిన ఫలితం రావాలని లేదు. రాదెమో అన్న భయంతోనో, అపనమ్మకంతోనో అసలు ఏమీ చెయ్యకపోవటం అసమర్ధత.
పైవాటిలానే చెప్పుకుంటూ పొతే.. వ్యక్తిగతంగా, సమాజికంగా ఎన్నెన్నో ఉదాహరణలు. మామూలుగా మనిషిలో ఉండే చిన్న చిన్న అసమర్ధతలను అడ్డుకొనకపోతే అవి విశ్వరూపం దాల్చి ఎంత విపరీతాలు సృష్టిస్తాయో… ఆ విపరీతాల పరాకాష్ఠ సీతారామారావు. కొంచెం exaggerate చేశాడేమో రచయిత అనిపించవచ్చు.. నిజానికి అంత దారుణంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఇక జీవితమంటే.. నదిలాంటిది!! చిన్నగా మొదలై.. బలం పుంజుకుంటూ.. దారిలో ఎదురైయ్యేవాటిని వీలైతే తనతో తీసుకెళ్తూ, లేకపోతే అధిగమిస్తూ.. రూపాంతరం చెందుతూ.. ఒకచోట ప్రశాంతంగా.. మరోచోట.. ప్రళయంలా సాగుతూ తన గమ్యాన్ని చేరటమే. ఈ పుస్తకం నాకు నేర్పింది ఈ రెండు పాఠాలే!!
నాకున్న మేధస్సుతో నాకర్ధమైన కథ ఇదీ.. నా అభిప్రాయాలు. నేనూ తప్పు కూడా అయ్యుండచ్చు. అందుకే.. ఇక మీరే చదవండి. మీకు నచ్చుతుందో.. నచ్చదో చూడండి. అంతర్జాలంలో ఈ రచన ఇక్కడ దొరుకుతుంది. (ఈ రచనను చదవడానికి తెలుగు వన్ వారితో రెజిస్ట్రేషన్ తప్పనిసరి)
పాఠకుడు చెప్పిందే రచనకు అర్థం. కాబట్టి మీ చిట్టి బుర్రకు నాతరఫున ఓ శబాష్ ఏసుకోండి. బాగా చెప్పారు.
ఇక “జీవితమనే సాగరం ఒడ్డుపై నిలబడి పుస్తకజ్ఞానంతో ఆవలివైపుకు చెరాలనుకోవటం అసమర్ధత. ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకునే మనస్తత్వం ఏర్పరచుకోలేకపోవడం అసమర్ధత” లైన్లు కేక!
ఈ టాపిక్ మీద నేనూ ఒక టపా గెలికా http://www.parnashaala.blogspot.com లో చూడగలరు.
LikeLike
అసమర్ధుని జీవితయాత్ర పుస్తకాన్ని సుమారు ఓ పదిసార్లు చదివి ఉంటాను. అద్భుతమైన కధనం, ఒక్కో సన్నివేసాన్నీ అనెక రకాలుగా విశ్లేషించుకోగలిగే అవకాసం ఉన్నటువంటి పుస్తకం.
ఎక్కడో చదివాను ఈ పుస్తకానికి డోరియన్ గ్రే కి సారూప్యం ఉండని ఆ వివరాలు ఎవరైనా తెలుపగరలరా?
మీ పోష్టు చాలా బాగుంది.
బొల్లోజు బాబా
LikeLike
ఎవరండీ,అన్నది, డొరియన్ గ్రేకి, అసమర్ధుని జీవయాత్రకి కధలో పోలికలున్నవని?
నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ?
LikeLike
మహేశ్ గారికి:
మీ టపా చదివి వ్యాఖ్యానించా.. చూసారా??
బొల్లోజు బాబ, నెటిజెన్ గార్లకు:
డొరియన్ గ్రే గురించి నాకు ఏమీ తెలీదు. 😦 గూగ్గిల్లితే ఆస్కార్ వైల్డ్ నవల అని తెలిసింది.. అదే నా??
నెటీజెన్ గారు: వీటిలో నక్క ఏది? నాగలోకం ఏది? ఎందుకలా?? సందేహం నివృత్తి చేయగలరు.
LikeLike
మీ విశ్లేషణ బావుంది. నాకు కూడా మొదటసారి చదివినప్పుడు సీతారామారావు పాత్ర కొంత విపరీతంగా అనిపించింది. మీరన్నట్టు “అతగాడు మన అందరిలోనూ ఉంటాడు.. చిన్న చిన్న పాళ్ళల్లో” – అందరిలో కొంచెం పాళ్ళల్లో వున్నదాన్ని ఒక పూర్తి స్థాయి పాత్రగా మలచటం వల్ల కొంత విపరీతంగానూ, అతిశయంగాను అనిపిస్తుందనుకుంట.
LikeLike
నెటిజన్ గారు,
నెను సాధికారికంగా చెప్పటం లేదు. అసమర్ధుని జీవితచరిత్ర పుస్తకం గురించి నేనోక సారి మీకులాంటి పెద్దాయన వద్ద గొప్పగా చెపితే, ఆయన నాగాలితీసేసి ఈ డోరియన్ గ్రే గురించి, ఓ విష బీజాన్ని నాలో నాటాడు.
సరే మరెందుకు కామెంటు చేసావని అడగవచ్చు. ఎందుకంటే ఇక్కడేమైనా చర్చజరిగితే, కొన్ని విషయాలు తెలుసుకోవచ్చన్న ఆశతో.
ఏది నక్కో, ఏది నాకలోకమని చర్చించటానికి నావద్ద ఆయుధాలు లేవు. డొరియన్ గ్రే పుస్తకాన్ని కూడా చదవలేదు.
ఇవన్నీ పూర్తిగా వ్యక్తిగతమే. ఇప్పుడు మళ్లీ అడుగుతున్నాను, రెండు పుస్తకాలలో ఏది నక్కో, ఏది నాకలోకమో కొంచెం విశ్లేషించి చెప్పగలరు. ఎందుకంటే మీరు రెంటినీ చదివినట్లున్నారు.
బొల్లోజు బాబా
LikeLike
“డొరియన్ గ్రె” ని ఆస్కార్ వైల్డ్ 1890 ప్రాంతాల్లో ప్రచురించాడు.
అసమర్ధుని జీవయాత్ర దాని తరువాత ప్రచురింపబడ్డది.
ఆస్కార్ వైల్డ్ నవలకి గోపిచంద్ నవలకి సంబంధం లేదు.
త్రిపురనేని గోపిచంద్ వివరాలు ఇక్కడ చూడండి – http://gopichand-tripuraneni.blogspot.com/
డొరియన్ గ్రే ని ఇక్కడ చదవ్వోచ్చు: http://www.gutenberg.org/etext/174
LikeLike
‘సమస్య అంటే వెగటులేదు, పరిష్కారం మాత్రం సునాయాసంగా కావాలి.’
ఈ వాక్యంలో ఎంతో నిజం ఉందండి.మన సమాజంలో ఎంతో సమర్ధత కలిగిన వ్యక్తుల్లో కూడా ఈ అవలక్షణం ఉంటుంది.నాకు పెద్దగా పుస్తకాలు చదివే అలవాటు లేదు కానీ ఈ బ్లాగు లోకంలో కొచ్చాక అన్నీ చాలా ఉత్సుకత రేకెత్తిస్తున్నాయి.మీ బ్లాగులో విశ్లేషణలు చూస్తే ఆ పుస్తకాలు కచ్చితంగా చదవాలనిపిస్తుంది.మిగతా అందరి బ్లాగరుల ప్రోత్సాహంతో నేనూ కొంత తెలుగు జ్ఞానాన్ని సంపాదించ గలిగితే అదే పదివేలు.మీ విశ్లేషణలు మాత్రం కేక అండి.
LikeLike
నెటిజెన్ గారు థాంక్స్
బొల్లోజు బాబా
LikeLike
సీతారామారావు రక్తంలోనే ఒక ఫాల్స్ ప్రిస్టేజి ఉంది చూడండి!అందుకే దేవుడు ప్రత్యక్షమైనా వరం కూడా మెలిక పెట్టి అడుగుతాడు. ఆకలి ఉండాలిట, కష్టపడకుండా దొరకాలిట! కూరలమ్మాయి పుచ్చు వంకాయలిస్తున్నదని తెలిసినా అడగలేడు, జట్కా వాడు తక్కువ దూరానికి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడని తెలిసినా అడగలేడు. అడగలేక కాదు, జమీందారు కదా, అడగటం నామోషీ! ‘మీరివ్వాల, మేం తినాల ‘ అని జట్కావాడనగానే చప్పబడి పోతాడు.
నేనొక ఆదర్శ ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించి చూపిస్తాను అనుకుంటాడు. చివరకి పెళ్ళాం మీద చెయ్యి కూడా చేసుకుంటాడు. పక్కింటి పిల్ల తప్పు చేసిందని తెలుసు, జమీందారు గారు గొంతెత్తి పోట్లాడితే నామోషీ, అందుకే కూతురి తప్పు లేదని తెలిసీ ఆ పాపను కొడతాడు. అందుకే అతడు అసమర్థుడయ్యాడు. ఇలాంటి అసమర్థులకు సమాజంలో కొదవలేదు ఈ నాటికీ!
బాగుంది మీ విశ్లేషణ
LikeLike
పూర్ణిమా,
నీ టపాలు చదివాక నా గురించి నాకు అనిపించింది ఇది:
http://onamaalu.wordpress.com/2008/07/21/%e0%b0%93%e0%b0%a8%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/
ఇక అసమర్థుని జీవిత యాత్ర గురించి అద్భుతంగా వ్యాఖ్యానించావు.
అంతా చెప్పేశావు. నేను అర్థం చేసుకోవలిసిందీ, నేర్చుకోగలిగేదీ చాలా ఉంది.
అభినందలు తెలిపి వెళ్ళిపోదామనుకున్నాను.
అంతలోనే కొన్ని ఆలోచనలు పంచుకోవాలనిపించింది. ఈ ఒక్క టపాయే కాదు, నువ్వు రాసిన కథా, నీ టపాలు ఇంకొన్నీ నన్ను ఆలోచింపచేసి ఈ వ్యాఖ్య రాయాలినిపించేలా చేశాయి.
“సమస్య అంటే వెగటులేదు, పరిష్కారం మాత్రం సునాయాసంగా కావాలి.” ఇది నాకు నేను చదివినప్పుడు అంతగా అవగాహనకు రాలేదు. ఈ ఒక్క వాక్యం అతని అసమర్ధతకు భాష్యం చెప్తుంది.
వాదాలు నిజమైనా అవి పరిష్కారానికి పనికి రావు. ఇది కూడా బాగా చెప్పావు.
పుస్తకాలు చదివినా, జీవితాలు చదివినా, ఎంత నేర్చినా practicals కి వచ్చే సరికి బోలెడన్ని subtleties ఉంటాయి. అవి ఎదురవ్వగానే మనం నేర్చుకున్నది అంతా వృథా అనిపించచ్చు. అప్పటి వరకూ నేర్చుకున్న వాటికి కొత్త భాష్యం తెలియచ్చు. కొత్త విషయాలే నేర్చుకోవలసి రావచ్చు. అక్కడే ఉంది అసలు challenge.
చదువుకున్న అమ్మాయిలూ, ఉద్యోగాలు చేసే వారూ, గృహిణులూ, డబ్బున్న వారూ, లేని వాళ్ళూ అనే తేడా లేకుండా ఎందరో ఆడవాళ్ళు అందరికీ తలవంచుతుంటారు. ఎందుకంటారు? ఆత్మహత్యలూ, అసహయాతలూ అరుదు కాకున్నా, ఆచరణలో అపజయాలను అధిగమించే వారూ ఉంటారు. వారి కథలు బహుశా మనకు తెలియవు. వారు పాఠాలు నేరుగా జీవితంలోనే రాస్తుంటారు.
http://pramadavanam.blogspot.com/2008/07/blog-post_11.html
ఇక్కడ కూడా నేను కొన్ని ప్రశ్నలు అడిగాను.
నీకున్న అవగాహనతో, భాషా పటిమతో, భావోద్వేగంతో నువ్వు నా ఆలోచనలకూ, ప్రశ్నలకూ స్పందించగలవేమోనని ఎదురు చూస్తున్నాను.
అప్పుడప్పుడూ ఇలా బ్లాగ్లోకంలోకి వచ్చిపోతుంటాను. కొత్త విషయాలు తెలుసుకుంటుంటాను.
LikeLike