వేసవి సాయత్రం.. సూర్యుడు తన ప్రతాపమంతా చూపించి “మళ్ళొస్తా!!” అంటూ పడమరలో అస్తమిస్తున్నాడు. చల్లని గాలితో పాటు, చంద్రుడూ రాబోతున్నాడు. ఇప్పటిదాకా నిర్మానుష్యంగా ఉన్న వీధి కొత్త సందడి నేర్చుకుంటుంది. ఇళ్లకు చేరే వారితో, ఆటలాడే చిన్నారులతో..వహనాలతో యమా బిజీగా ఉంది. ఈ సందడంతా కాసేపే, ఆ తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమిస్తారు.. అప్పుడు మళ్ళీ ఒంటరిగా నేను. ఒంటరితనం జీవితానికి ఒక కొత్త అందాన్ని ఇస్తుంది. ఒక ఆనుభూతినో ఒక ఊహనో కౌగిలించుకుంటే.. ఒంటరితనం కూడా అందమే!! ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ.. ఈ ప్రాంతానికి ఉన్న ఏకైక చెత్తకుండీని, పాష్ గా గార్బేజ్ బిన్ ని. రండి.. ఈ ఆహ్లాదమైన వేళ మీతో మాటా మంతి కాసేపు..
నన్నిక్కడ సుమారు ఓ పదేళ్ళ కింద అప్పటి యం.సి.హెచ్ వారు స్థాపించారు (భారీ పదమా?? పోనీ.. పెట్టారు!!) ఆ తర్వాత ఓ రెండు మూడు సార్లు మరమత్తులు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ renovation ఉందట. Makeover కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. చెత్త కుండీలు ఎలా ఉంటాయో మీకు తెలుసుకదండీ..నేనోక చోట, చెత్త ఒక చోట!! నేనే కాక..నా పరిసర ప్రాంతాలన్నీ చెత్త మయం. గాల్లో ఎగురుతూ ఉండే చెత్త.. ఆ కంపు వాసనా.. ఇవ్వన్నీ మీరు సృష్టించేదే!! చెత్త డబ్బాను సరిగ్గా ఉపయోగించక నేనున్నా లేకున్నట్టే చేస్తారు మీరు. ఇప్పుడు ఎంటో గ్రేటర్ సిటీ అవుతుందటగా?? ఇప్పుడైనా ముందు చెత్తనెట్లా పాడేయ్యాలో నేర్పమని నా మాటగా మీ వాళ్ళకు చెప్పండి. ఏంటా హడావిడి అక్కడ.. అయ్యో!! ఎవరో ఆడుకుట్టున్న పిల్లాడు కింద పడ్డట్టున్నాడు. ఓ క్షణం ఆగండీ.. ఏమి జరుగుతుందో తెలుసుకుని వస్తాను.
పాపం పిల్లాడికి బానే తగిలింది దెబ్బ.. మూతంతా రక్తం కారుతుంది, స్పృహలో లేడు. ఇప్పుడే ఆసుపత్రికి తీసుకువెళ్ళుతున్నారు. వాళ్ళ అమ్మ గుక్క తిప్పకుండా ఏడుస్తుంది. కన్నపేగు కదండీ అలానే ఉంటుంది కదా!! నాకెలా తెలుసుననుకుంటున్నారా?? చూస్తుంటే తెలియదంటారా?? ఈ వీధి చివరన ఉన్న అమ్మ ఓ ఫేద్ద ఉద్యోగం చేస్తుందట.. పొద్దున పోయి రాత్రి వేళకు వస్తుంది. తన మూడేళ్ళ కూతురిని వదిలి వేళ్ళాలంటే ఆ అమ్మ పాణం మీదకొస్తుంది. విడవలేక విడవలేక వెళ్తుంది ప్రతీ ఉదయం. రాత్రి రాగానే ఆ అమ్మ-బిడ్డల కౌగిలింతలు, ముద్దులు, ముచ్చట్లు, ఆటలు.. చూడాలి అంతే!! ఇక ఆ పక్క వీధిలో ఉన్న మూడో ఇంటిలో ఉండే అమ్మ.. నేను ఇక్కడ వచ్చినప్పుడు కొత్త పెళ్ళికూతురు. చానాళ్ళు ఎదురుచూస్తేగాని సంతానం కలుగలేదు. ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు?? అమ్మ కావటానికి పడే వేదన అర్ధమైంది. ఇక ఈ ఎదురింట్లో ఉండే అమ్మ.. నాకు బాగా తెలిసిన అమ్మ. మేస్త్రీ పని చేస్తారు భార్యాభర్తలిద్దరూ.. ఉన్న కొంతలో పిల్లలను ఎంత చక్కగా తీరుస్తుందని.. ముత్యాల్లా ఉంటారు వాళ్ళూ. అందులో శీను ఆమెకు పుట్టలేదు. వాడి అమ్మ కథ వేరే..
అనుకోకుండా ఒక రోజు ఓ అమ్మాయి వచ్చింది, నా దగ్గరకు. పేరు “పిచ్చిది” అనుకుంటా.. (మీ వాళ్ళు అంతా అలానే పిలిచేవారు) పొత్తిళ్ళలో ఓ పసికందును పెట్టుకుని వచ్చింది.. ఇక్కడే ఉండేది. చెత్త ఎటూ మీరంతా బయటే వేస్తారు కనుక ఈ పిల్ల నా గదిలో ఉండేది. తనలో తను మాట్లాడుకుంటూ ఉండేది. ఎప్పుడూ ఆ పిల్లాడి చింతనే ఆమెకు. వాడిని అపురూపంగా చూసుకునేది. తను చెత్తలో దొరికింది తినేది.. ఆ పాపడికోసం మాత్రం వీద్దుల్లో తిరిగేది.. అడుకున్నేది. వచ్చిన దానితో ఆ పిల్లాడి పోషించేది. ఓ రాత్రి పడుకుని ఉండగా.. కుక్కలన్నీ చేరాయి..ఆ పసికందు మీద కన్నేసి!! బాబును కాపాడుకోవటం కోసం ఆమె కుక్కలతో పోరాడింది. బిడ్డకు ఏమీ కానీలేదు. ఆమెకు మాత్రం చాలా కాట్లు అయ్యాయి. ఆ గాయాల్తో ఆమె కొన్ని రోజలకి చనిపోయింది. అప్పటి నుంచీ ఆ బిడ్డను ఈ మేస్త్రమ్మే పెంచుకుంటుంది. మీ మానవుల్లో ఉన్న “అమ్మతనం” దగ్గరగా చూస్తేనే ఇంత ఆనందమైతే ఇక ఆ వరం పొందుతే ఎంత మధురమో!!
ఆహ్లాదమైన వాతావరణంలో మాట్లాడుకుందామని భారీ, భారీ అనుభవాలను పంచుకున్నానా?? ఏం చేస్తాం. ఆ పిల్లాడికి దెబ్బ తగిలేసరికి.. మనసు అటే పోయింది. జీవులంటిలో ఈ మాతృత్వం ఉంటుందట కదా.. మీరు చాలానే అదృష్టవంతులు!! మాకలాంటి భాగ్యం లేదు.. నాకూ ఓ అవకాశం ఉంటే.. మనిషిగా పుడతా.. ఇవ్వనీ అనుభవిస్తా!! నా సంగతి ఏమో గాని మీకు ఆలస్యమవుతుందేమో..ఇక వెళ్లి రండి. ఇంకెప్పుడైనా.. ఏమిటిది?? ఎవరిదో పసికందు ఏడుపు వినిపిస్తుంది. అయ్యో… నా వళ్ళో ఎవరో పసిపాపను వదిలేసారు.. ఇంకా రక్తపు మరకలు కూడా వదలలేదు. ఎవరినైనా పిలవండీ.. ఈ పాపను తీసుకేళ్ళమనండీ. ఇక్కడే నా కళ్ళముందే కుక్కలు పీక్కుతినడం నేను చూడలేను. ఇది చెత్త కుండీ అని చెప్పండి.. ఇక్కడ నిజమైన చెత్తను వేయాలి గాని, మీకు నచ్చని ప్రతీది నాలో వెయ్యోద్దని చెప్పండి. నా మనసుకింత గాయం భరించే శక్తి లేదు, చూస్తూ ఉండలేను.. ఏమీ చెయ్యనూలేను. ప్లీజ్.. చెప్పండి.. త్వరగా ఎదో ఒకటి చెయ్యండి..పాపని రక్షించండీ..
*************************************************************************************
చెత్తకుండీకి కూడా ఓ మనసు ఏడిస్తే.. మనల్ని చూసి అది ఎంతగా ఏడుస్తుందో అన్న ఊహకు రూపాంతరం ఈ టపా!! అదృష్టం.. దానికి మనసు లేదు. మనకేమో “అలవాటు” పడిపోవడమనే కవచం ఉంది. ఎంతటి విపరీతాలకైనా అలవాటు పడిపోవడం, మొద్దుకెక్కిపోవడం.. మన నైజం!!
Poornima garu, manasu karigi kallalo chErindi.
Title ‘chetta kumdIkI O manasunte..’ ani pedite baaguntundemo choodandi.
LikeLike
చెత్తకుండీ మనసునికూడా మానవత్వంతో నింపేసారు. బాగుంది.
LikeLike
WOW!
LikeLike
@mohana: thanks for the compliment! And the title edited as per ur suggestion.
@Mahesh: thanks 🙂
@kotta paali: Thanks!! 🙂
LikeLike
పూర్ణిమ గారు మనసుని కదిలించేలా వ్రాసారండి, చాలా బాగుంది.
LikeLike