Affectionately dedicated to HP Compaq 6720s

ప్రేమించే హృదయానికి ప్రణమిల్లవే.. మనసా!!

“నువ్వు అందంగా ఉంటావా?” అని మీలో ఎవరైనా నన్ను అడిగితే, “ఊ” అనే ధ్వని మీ చెవిని చేరుతుంది. “అద్దం ముందు నిలబడి మనల్ని మనం రెప్పపాటు కాలమైనా చూసుకోగలిగితే మనం అందంగా ఉన్నట్టే!!” అన్న అనుభవం నా మనసులో ప్రతిధ్వనిస్తుంది. అందాన్ని నిర్వచించు అనగానే ఓ పది famous quotations మీ ముందు ఉంచగలను. కానీ పైన చెప్పింది మాత్రం నా మనసుకి చాలా దగ్గరైయ్యింది. ఈనాడు ఆదివారంలో వచ్చే ఒకానొక “ఇది కథ కాదు” లో అందానికే కొత్త అర్ధం ఇచ్చేలా ఉండే ఒక అమ్మాయి డైరీలో రాసుకున్న మనసది. ఆసిడ్ పడి పూర్తిగా కాలిపోయిన తన మొహాన్ని శస్త్రచికిత్స తర్వాత డాక్టర్లు చూసుకోమని అద్దం ఇస్తే.. చూసి భరించలేక అద్దాన్ని విసిరికొడుతుంది. ఆ రాత్రి తన డైరీని ఈ వాక్యంతో మొదలుపెడుతుంది. ఇది చదివి ఓ పదేళ్ళవుతుందేమో.. అయినా నా ఆలోచనలలో నిలిచిపోయింది.

ఊహాలోకాన్ని కట్ చేసి మనషులుండే ప్రపంచానికి వస్తే.. ఆఫీసులో ఎవరైనా కొత్తగా అమ్మాయి చేరిందంటే.. చాలా వరకు అబ్బాయిలు ముందు ఆ అమ్మాయిని చూస్తారు, నచ్చితే కాళ్ళవంక చూస్తారు.. పెళ్ళయ్యిందా లేదా అని. అలలు వచ్చి పాదాలను తాకి వెళ్ళిపోతుంటే.. ఏదో బాధ, ఆ బంధానికున్న వయసు క్షణికమే అయినా. ఆకర్షణ మొదలైన క్షణంలోనే ప్రేమించడం మొదలు పెట్టినా ఆమె వివాహిత అన్న మరుక్షణం వీరి గుండెలు ముక్కలవుతాయి. ఆ తర్వాత దాని సరిచేసే బాధ్యత నాలాంటి వాళ్ళ స్నేహితుల మీద ఉంటుంది. ఆకర్షించేంతగా లేకపోతే గొడవే లేదు.. ఆ అమ్మాయితో సఖ్యత కుదిరితే హాయిగా స్నేహితులు అయ్యిపోతారు. గౌతం రాసినట్టు.. “ఒక అందమైన అమ్మయితో ‘ఫ్రెండ్’ అనిపించుకోవటంకంటే ‘అన్నయ్య ‘ అనిపించుకోవటం మంచిది” అన్న సిద్ధాంతం నవ్వు తెప్పించినా అది నిజం. 🙂 ఇది అబ్బాయిల స్వగతమైతే, మరి అమ్మాయిలో?? మేమేది అంత త్వరగా బయటపడము కానీ ఎంచుమించు ఇలానే ఆలోచిస్తాము, ఆలోచించాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు. పెళ్ళికి అతిముఖ్యం “ఈడు-జోడు” అనే కాంసెప్ట్ అని మాకూ తెలుసు. (ఇది నా అనుభవసారం మాత్రమే.. ఏకీభవించకపోయినా గౌరవిస్తారని ఆశిస్తున్నా!! There is no attempt to generalize, whatsoever!!)

ఎందుకో ఓ సాయంత్రం ఈ ఆలోచలన్నీ కొత్తగా మళ్ళీ పలకరిస్తుంటే.. టపాను రాసా. ఆ పది వాక్యాలకీ ఇప్పుడింత ఉపోద్ఘాతమా అవసరమా? అని అనకండి. పరిచయం చేసేంత గొప్పగా నేను రాయనూ లేదు. ఇప్పుడు మనం ఆ పది వాక్యాల గురించి మాట్లాడుకోవడమూ లేదు .. దానికి వచ్చిన స్పందన మాత్రమే ఈ టపా ఉద్దేశ్యం .

దిలీప్ కవితలను నేను బ్లాగులు చదువుతున్నప్పటి నుండీ చూస్తున్నాను. ఏదో హాయి కనిపించేది వాటిలో. తను నా రెండు టపాలకు వ్యాఖ్యానించాక ఆ అభిప్రాయం స్థానే ఒక కొత్త ఆశ మొదలయ్యింది. తన కవితలను, తక్కిన అందరి టపాలను కూడా, నా రచనలలోని అందాన్ని నాకు పరిచయంచేసినట్టుగా వివరించి చెప్తే బాగుణ్ణు అని అత్యాశ. ఈ టపాకు వ్యాఖ్యానిస్తూ.. “మనసు నమ్మలేనిదాన్ని మెదడు పరిహసిస్తుంది. అందుకని మనసు తనకి అరుదుగా దొరికే అవకాశాలని వదులుకోదు. ఇంకా తీవ్రంగా పరిహసిస్తుంది.” అంటూ నిత్యం మనలో జరిగే అంతర్సంఘర్షణని మాటల్లో చిత్రీకరిస్తూ ఇలా సాగించారు ” అనుభవించి, శోధించి, సాధించి ఒక సత్యాన్ని కనుగొంటుంది. ఆ సత్యం ప్రేమకి వ్యతిరేకం కాదు. ప్రేమ మీద మరింత నమ్మకాన్ని పెంచేది. ప్రేమని ద్విగుణీకృతం చేసేది. ప్రేమ యొక్క అసలు తత్వాన్ని బయటపెట్టేది. మనిషిని స్వయం ప్రకాశం వైపు నడిపించేది. తనని ఒక గొప్ప ప్రేమికురాలి(ప్రియుడి)గా చేసేది. అది తెలుసుకోగానే మనసు ప్రేమ కోసం పరితపించడం మానేస్తుంది. కానీ ఆ స్థితిలో ఇంకా తోడు కోసం పరితపిస్తూనే ఉంటుంది. ఆ తోడు నుండి ప్రేమని ఆశించడానికి కాదు, పొందడానికి కాదు. ఆ తోడుకి ప్రేమని పంచడానికి!” నా మనసులో ఎంత ప్రేమ ఉందంటే.. నీకివ్వకుండా ఉండలేను అనే భావం.. నాకైతే అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. అలాగే దిలీప్ నా “చివరిప్రేమలేఖ” కు ఇచ్చిన వ్యాఖ్య కూడా ఆలోచింపచేసేట్టుగా ఉంటుంది.

ఇక భావకుడన్ గారి విషయానికి వస్తే.. వీరూ అసాధ్యులే!! వీరు నా చివరి ప్రేమలేఖకు ఇచ్చిన వ్యాఖ్యాను గమనిస్తే.. చాలా subtleness తో కూడిన ఆ లేఖ రాసిన అమ్మాయి psycheని నా ఊహలనుండి తన అక్షరాలుగా దిగుమతి చేసారు. అందమే ప్రేమకు తొలి మెట్టు అంటున్న నన్ను ఈ క్రింది కవితతో హెచ్చరించారు. ఇది వారి కవిత, న్యాయంగా వారి బ్లాగులో ఉండాల్సింది. మీరంతా వారిని మెచ్చుకోవాలి. అయినా ఒక అందమైన కవితా, అందులోని జీవితం ఒక మూల వ్యాఖ్యగా మాత్రమే మిగిలిపోకూడదని.. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. నాకు తెలిసిన పాఠం మీతో పంచుకోవాలనే ఈ ప్రయత్నం. అసందర్భంగా అనిపించినా ఇక్కడే చెపేస్తా.. మీరు తెలుగు బ్లాగులు రాయని వారైతే ఇప్పుడే మొదలు పెట్టండి. రాసేవారైతే ఇంకా రాయండి. మనసులో ఉన్న ఎంతటి భావాన్నైనా ఓ నాలుగు తెలుగు ముక్కలలో రాసేయ్యండి. మీరు అందంగా రాయలేకపోయినా ఫర్వాలేదు. నా తెలుగుతోనే నేను ప్రయత్నిస్తున్నాను.. నన్ను చూసి ధైర్యం తెచ్చుకోండి 🙂 అటు తర్వాత అందులోని అందాన్ని, ఆనందాన్ని, ఆవేదననీ అర్ధం చేసుకునేవారు, అర్ధం చెప్పేవారు బోలేడుమంది. ఈ బ్లాగ్ ప్రపంచంలో జీవిస్తే కేవలం భాషేకాదు, భావం, భావుకత, అర్ధం అంతరార్ధం అన్నీ నేర్చుకోవచ్చు. ఓ జీవిత కాలం సరిపడా అనుభూతులను పోగు చేసుకోవచ్చు.

భావకుడన్ గారు: నచ్చితే వ్యాఖ్యగా, నచ్చకపోతే సూచనగా స్వీకరించమన్నారు. జీవితాన్ని నేర్పిస్తుంటే కాదనగలనా?? అందునా… I’m a very good girl, said me all teachers, you see!! 😉

కవిత: “జాగ్రత్త మిత్రమా”

చెత్తకుండిలో మనసు
అబ్బాయిల బెరుకు
సంసారపు సొగసు
దానిలో ఒడిదుడుకు

తెలిసిన వో మనసూ
“అందం చూసే వాళ్ల కళ్ళల్లోనే”
మరిచావే ఈ మాటను
చిన్నబుచ్చకు నిరీక్షణను

అభిరుచులు కలిసిన తొడు
బంగారానికి తావి అద్దేను
అది లేని జత కూడేవా
పిచ్చొని చేతిలో మొగలి పువ్వేనూ

సామాజికతకు, అధైర్యానికీ,
నిరాశకూ నిస్పృహకీ
తల ఒగ్గి సర్దుకుపోయావా
జీవితమంతా అంతేనూ

మన కనకపు విలువను
కొలిచే కంసాలి తప్పక ఉండేను
కావలసినదంతా తన కొరకు
వేచి చూసే గుండేనూ

కాదని సర్దుకు పోయావా
జీవితాంతం ఇక అంతేను
విసుగు చెంది ఆపావో
“సగటు మనువు”లో పడ్డట్టే

స్ఫందించే మనసూ
అది పొందే భావుకత
ఇవన్నిటికీ “సగటు మనువు”
కర్కసమైన గొడ్డలి పెట్టే

ఇది చదివాకా “ప్రేమించే హృదయానికి ప్రణమిల్లవే.. మనసా ప్రణమిల్లవే..” అనే “ఋతురాగాలు” (బంటి సంగీతం) సీరియల్ లో పాట పదే పదే పెదవి పై ఆడుతోంది. అంతర్జాలంలో ఈ పాట ఆచూకీ తెలిపిన వారికి “మనసు తీరేంత ప్రేమ కలుగుతుంది”. 😉 కనిపిస్తే చెప్పరూ.. ప్లీజ్!!

అద్దరగొట్టే బ్లాగర్లే కాదు, బెదరగొడుతున్నా చదివి ఆదరించే “కమ్మెంటర్లు” ఉన్నారని నిరూపించే బ్లాగ్లోకానికి ఓ జై కొడుతూ.. సెలవు!!

13 Responses to “ప్రేమించే హృదయానికి ప్రణమిల్లవే.. మనసా!!”

 1. కత్తి మహేష్ కుమార్

  ఎక్కడో మొదలెట్టి,ఎక్కడెక్కడికో వెళ్ళావ్. అన్నీ చెప్పినట్టున్నావ్, కానీ ఇంకా ఏమైనా చెబుతావని ఎదురుచూసేలా చేసి ముగించావ్.

  ఒక్క మాట చెప్పనా! సాహిత్య భాషలో దీన్ని ‘Steam of consciousness’ అంటారు. ఆంగ్లంలో James joeys,మన తెలుగులో ది గ్రేట్ ‘చలం’ గారు ఈ ప్రక్రియలో దిట్టలు.చలం గారి ‘మ్యూజింగ్స్’ చదవండి.

  మీరు తెలీక అసంకల్పితంగా రాసుంటే మీలో దాగున్న రచయితకి నా జోహార్లు.తెలిసి రాసుంటే అబినందనలు.

  Like

  Reply
 2. L Ragas

  పూర్ణిమ

  చాల బాగుంది, క్రికెట్ లైవ్ స్కోరు చూసినట్లు మీ బ్లాగ్స్ ను వాటి మీద రసజ్ఞుల కామెంట్స్ ను రిఫ్రెష్ చేసి చూస్తూ ఉన్నా. చాల చాల బాగుంది ..

  keep it up.

  Like

  Reply
 3. Purnima

  “ఏంటమ్మయీ.. ఈ రాతలు?” అంటున్నారేమో అనిపించింది ఒక్క క్షణం. భయపడ్డా.. 😦
  మరలా చదివాకా అర్ధమైయ్యింది పొగిడారని. చలం మైదానం, ప్రేమలేఖలు తప్పించి ఇంక ఎమీ చదవలేదు. సాహిత్య ప్రక్రియలు నాకు తెలియదు. వాటిలో నేను “పూర్”నిమను. :-((
  musings is the perfect label for this blog. But can you suggest a telugu equivalent?

  Like

  Reply
 4. కత్తి మహేష్ కుమార్

  మ్యూజింగ్స్ ని తెలుగులో, ‘ఆలోచనా స్రవంతి’ అనొచ్చు.నీ టపాకు ముద్దుగా ‘స్రవంతి’ అని నామకరణం చేస్తే సరిపోతుందేమో! లేదూ…‘మన:ప్రవాహం’,‘హృదయతరంగం’అంటే కాస్త హెవీగా ఉన్నా, బాగుంటాయి. ఆలోచించు.

  Like

  Reply
 5. Purnima

  ఏం సాగర్??.. వీకెండ్ ప్లాన్స్ ఏమీ లేవూ?? మీ బ్లాగు ఇప్పుడే చూస్తున్నా.. మొన్నామధ్య వెతికితే కనిపించలేదు. 😦 Thanks for the comment!!

  Like

  Reply
 6. అన్నమయ్య పలుకుబడులు

  “పూర్”నిమ గారూ మీ “అనుకోలు” చాలా బావుంది.

  Like

  Reply
 7. బొల్లోజు బాబా

  చాలా బాగుంది.
  ఎన్నోవిషయాలు, ఒకదానికొకటి పెనవేసుకుపోయి, సప్తవర్ణ ఇంద్రధనుస్సులా ఉంది.
  రెండవసారి చదివి ఏంచెప్పదలచుకున్నారు, ఏంచెపుతున్నారూ అని తరచి చూస్తే, ఈ పోష్టులో అన్నీ వున్నాయనిపించింది.
  అల్రడీ, మహేష్ గారు చెప్పినట్టుగా స్ట్రీమ్ ఆఫ్ కాంషస్ నెస్ (చైతన్య స్రవంతి) చక్కగా పండింది.
  వీలైతే చలం మ్యూజింగ్స్, నవీన్ “అంపశయ్య” చదవండి. మీ శైలి మరింత పదునెక్కుతుంది.

  బొల్లోజు బాబా

  Like

  Reply
 8. meenakshi.a

  hi purnima gaaru.mee tapa lannii chaala baguntayi.
  mee tapalanni chaduvutuntanu kani comments rayanu.anduke meeku nenu kottaga anipinchochu.
  meeranna “ruturaagaalu”doordarshan lo vachedi kada 7,8 years back.naaku konni lines maatrame gurtunnayi.

  Like

  Reply
 9. Purnima

  అన్నమయ్య పలుకుబడులు:
  ఇది నా ప్రయోగం కాదండీ.. నా కొలీగ్ ఒకరు ఇలా ఏడిపించేవారు.

  బాబా గారు:
  ఇలాంటి వ్యాఖ్య మీనుండి రావటం ఇది రెండో సారి అనుకుంటాను. మొదటిసారి చదివి.. అర్ధం కాకపోతే మళ్ళీ చదువుతారు. అర్ధమయ్యిందని చెప్తారు. నేనూ ఈ అలవాటును నేర్చుకోవాలి.. ఒకే సారి టపా చదివేసి .. ఎక్కకపోతే వదిలేస్తున్నా. నేనూ మీలానే ప్రయత్నిస్తాను. నెనర్లు!!

  మీనాక్షి:
  టపాలన్నీ చదువుతున్నందుకు ధన్యవాదాలు. మీకు కమ్మెంట్ రాయాలనిపిస్తేనే రాయండి. మరేం ఫర్వాలేదు. మీకు తెలిసిన ఆ కొన్ని లైన్లూ చెప్పరూ.. I’m dying to know that song. ఒక లైన్ కి మించి ముందుకు జరగటం లేదు నేను. 😦

  Like

  Reply
 10. వేణూ శ్రీకాంత్

  పూర్ణిమ గారు చాలా బాగా చెప్పారండీ… మహేష్ గారు చెప్పిన సాహితీ ప్రక్రియ గురించి నాకు తెలీదు కాని, మీ ఆలోచనా స్రవంతి లోకి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఒక టాపిక్ నుండి మరో టాపిక్ కి అలవోకగా మారుస్తూ ప్రయాణం చేయించారు.

  మీ టపా చదివాక నా అభిప్రాయం చెప్పాలి అనిపించింది. అభిరుచులు కలిసిన వివాహం మొదట్లో exciting గా అనిపించినా తర్వాత flat గా ఉంటుందేమోనండి. అన్నిటికీ తానా తందానా అనుకుంటుంటే ఏముంటుంది చెప్పండి. అభిరుచులు కలవక పోయినా వివాహం, సహజీవనం పై సరైన అవగాహన ఉన్న జంట అయితే చాలు. అలాంటి వారు conflict ఉన్నా ఒకరి అభిరుచులని ఒకరు గౌరవించుకుంటూ కలిసి విజయవంతం గా ముందుకు సాగ గలరని నా ఉద్దేశ్యం.

  ఋతురాగాలు గురించి వెతికానండీ కాని టైటిల్ సాంగ్ ఉంది కాని మీరు చెప్పిన పాట ఎక్కడా దొరకలేదు. టైటిల్ సాంగ్ పోస్ట్ చేసిన వ్యక్తి నే మీరు చెప్పిన పాట గురించి అడిగాను చూద్దాం దొరుకుతుందేమో. టైటిల్ సాంగ్ లంకె : http://www.youtube.com/watch?v=OW_DaYkE-_E

  Like

  Reply
 11. Purnima

  @venu:

  You got a very interesting point. This is one of the quotes I’ve read:

  Don’t marry anyone I like.. since you don’t need a duplicate of yours.

  Don’t marry someone so different from you that a common space can’t be found.

  Marry someone so similar yet so different.

  But the point is.. do we really have a choice in marriage or it just seems like we do??

  Thanks for your compliments and hope I’m good enough to invite you time and again. 🙂

  Like

  Reply
 12. వేణూ శ్రీకాంత్

  మంచి Quote చెప్పారు. do we really have a choice ? కొంచెం కష్టమైన ప్రశ్నే కానీ నా దృష్టిలో answer depends on several circumstances సామాజిక పరిస్తితులు , తల్లిదండ్రులు ఇంకా చాలా. కాని ఒకటి మాత్రం నిజం కోరుకున్నది దక్కించుకోటానికి పోరాడే తత్వం ఉన్న నేటి యువతరం “నాకు చాయిస్ కావాలి” అనుకుంటే వుంటుంది, అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా. కాకపోతే వెతికి సాధించు కోడానికి కష్టపడాల్సి వస్తుంది.

  Like

  Reply
 13. ఏకాంతపు దిలీప్

  @పూర్ణిమ
  🙂 నాకూ ఆ పాట కావాలి.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

%d bloggers like this: