దశ తప్పిన బ్లాగావతారం

Posted by

దేవుడున్నాడు.. తేడాలొస్తే శపిస్తాడు అనుకునే వారు.. ఈ టపా చదవకుండా ఇటు నుండి ఇటే టపాకట్టేయ్యండి. దేవుడున్నాడు.. కానీ దయాహృదయుడు అనుకునే వారు.. భారాన్నంతా దేవుడు మీద వేసి చదవటం మొదలు పెట్టండి. దేవుడున్నాడని నమ్మని వారు మీ బాగేజీని నమ్మినవారికి ఇచ్చి ఇటు రండి.

*********************************************************************************************************
బ్లాగ్ ప్రపంచంలో ఏదో జరుగుతూనే ఉంటుంది.. కొన్ని మనకు తెలుస్తాయి, మరి కొన్ని అసలు కనపడవు. ఒక టపా నుండి మొదలైన ఆలోచన వేలానువేల కోట్ల అడ్డంకులను అధిగమిస్తూ మరలా ఓ టపాగా రూపాంతరం చెందుతుంది. ఒక టపా ప్రకంపనలు ఒక టపాలో స్పందనగా సీతాకోకచిలుక రెక్కల టపటపలా మారే సందర్భాలు ఉన్నాయి. ఇది మానవ మానస ప్రయత్నమా… లేదా ఒక అద్వీతీయమైన శక్తి వీటి వెనుకుందా అంటే.. ఓ కథ చెప్పాలి. ఆ కథలో ముఖ్యపాత్రనాదే!! ఇప్పుడు మీకా కథను క్లుప్తంగా చెప్పాలన్నా కనీసం మనం గత మంగళవారం వరకూ అయినా ప్రయాణించక తప్పదు.

17-06-2008, మధ్యాహ్నం ఒంటిగంటన్నర, ప్రాంతం: ఆఫీసులో నా డెస్క్.

అత్యంత శ్రమతో రెండు కాళ్ళూ కూర్చిపై పెట్టి నీల్ డౌన్ (స్కూల్ లో అవకాశాలు పెద్దగా రాలేదు మరి 😦 ) చేసి .. రెండు చేతులూ పైకి లేపి, హెడ్ ఫోన్ ద్వారా వస్తున్న linkin park musicకి బొత్తిగా లయ కలపకుండా, ఆదిత్యా ఛానల్ ఆంకర్లల కన్నా కొంచెం అతిగా ఊగితూ ఎందుకో అటు చూస్తే.. ఓ అబ్బాయి నోరు వెళ్ళబెట్టుకుని నేను ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నానా అని చూస్తుండడం చూసాను. అందరూ లంచ్ కి వెళ్ళారు కదా.. హాయిగా ఏకాంత వేళ.. ఉప్పోంగే భావాల్లా ఆడుకుందామనుకుంటే.. పాపం ఓ జీవి హతాసుడైనాడు. ఛాస్.. కాఫీ బ్రేక్ లో ఓ రెండు మూడు ఛలోక్తులు విసిరి మరీ కొట్టిన impression ఎత్తిపోయింది. కొత్త ఎంట్రీ కావున వచ్చేవారం ట్రేనింగ్ లో మన టాలెంట్ చూపవచ్చునులే.. ఈ లింకిన్ పాటలకు ఊగుతుంటే.. ఏదో పూన్నిందనుకునే ప్రమాదం ఉందని గ్రహించి చట్టుకున U turn తీసుకుని, ఇళయరాజా కలెక్షన్ వినడం మొదలుపెట్టా. కంటి చూపుతో చంపేయచ్చు అని తెలుసుగాని, ఐదో గేర్ లో హైవే లో దూసుకుపోతున్న నా మనసును ఒకే ఒక్క చూపు వల్ల ఒకటో గేర్ లో గతుకుల రోడ్డు మీదకు తీసుకురావచ్చని ఇప్పుడే అవగతమైంది. బోర్లా వేసిన Dust bin పై కాళ్ళు చాచుకుని, కూర్చిలో వెనక్కి వాలి, కళ్ళు మూసుకుని వస్తున్న పాటను ఆశ్వాదిస్తుంటే.. ఇదీ బానే ఉందే అనుకుంటూండగా,,, “డభ్” అని చెవిలో ఒక శబ్దం. కళ్ళు తెరిచి చూద్దును కదా..

“మగవారి హక్కులను సోదాహరణంగా వివరింపుడు” (60 m) అన్న మెసేజ్ కనిపించింది జీటాక్ లో..
ఏంటీ అరవై మార్కులూ నాకేనా?? ఎంతకీ??
అది ప్రశ్న.. నీ జవాబు బట్టి మార్కులు ఉంటాయి..
అదే కదా నేను బ్లాగ్ చేసింది? చదవలేదా??
ఓ.. అవునా?? చూస్తానుండు..

చేతిలో ఓ గులాబీ ఉంటే బాగుణ్ణు.. “Like my post, Not like my post” అంటూ రేకులు తెంపుతూ రిసల్ట్ కోసం తెలుగు సినిమా హీరోయిన్ లా రొమాంటిక్ గా ఎదురుచూసేదాన్ని. ఇప్పుడేమో ఆర్ట్ సినిమాల్లోలా .. deep breaths, huge sighs!! ఏమంటారో.. బాగుంది అని తనకనిపిస్తుందా… “what nonsense” అని నాకు వినిపిస్తుందా?? క్షణంలో నాగైదు సార్లు మారే నా ముఖకళవికలను చూస్తే జంధ్యాల గారు “వెలగనా వద్దా అని ఆలోచించే tubelight మొహమూ.. నువ్వూనూ” అని అనేవారు. రామా!! ఎందుకొచ్చిన తిప్పలు నాకు ఇవి. మగవారు.. వారి హక్కులు.. చివరికి నా తిప్పలు. అప్పటికే లంచ్ లో అరవీరభయంకరంగా జరిగిన చర్చలో.. మా భాషలో నువ్వు రాసినదాన్ని “తడి గుడ్డతో గొంతు కోయటం” అంటారు అని తీర్మానించారు. వారి భాష తెలుగు. నా భాష ఏ రకైమన తెలుగు కిందా పరిగణించలేమని చాలా పూర్వమే నిర్ణయం తీసేసుకున్నారు. నాది తెలుగే అని ఒప్పించడం కన్నా.. నా భాషకు ఓ గుర్తింపు తెచ్చి indian currencyలో ఒక ఎంట్రీ లా వేయించుకోవటం తేలిక!! ముక్కూ మొహం తెలియని అబ్బాయిలను blogger లో moderate చెయ్యచ్చు అన్న ధైర్యంతో టపా రాసినా.. ఇప్పుడు మా వాళ్ళందరికీ తెలిసేలా చెయ్యటం అవసరమా?? అవసరమే.. బగ్ (software bug) తప్ప నాకో ప్రపంచం లేదని వీరంతా నన్నో బగ్ (పురుగు) లా చూస్తుంటే.. నేను సైతం అంటూ వీళ్ళకు తెలియద్దూ??

బాగుంది రా… నీ బ్లాగ్. బాగా రాశావ్ అన్న ఫలితం వెలువడింది. (అనవసరం గా టెంషన్ పడ్డానే.. పోనీలే..)
ఇది విను .. (ఓ ఫైల్ నా వైపు ప్రయాణిస్తుంది.)
ఏంటిది.. దీనికీ నా టపాకీ లింకా?? (తిట్లున్న ఆడియో ఫైల్ కూడా దొరుకుతున్నాయేమో అన్న భయంతో)
కాదు.. ఇది నీ వచ్చే టపాలో విషయం.

తీరా చూస్తే.. దశావతారం లోని “రాముని మాత్రం కంటే..” పాట. ఆసాంతం విని..

విన్నాను.. శైవులు, వైష్ణువులకు మధ్యపోరాటం..
ఊ.. కానీ అది కాదు నువ్వు రాయాల్సింది.
మరి??
ఈ సినిమాలో కమల్ ఏమి చెప్పాలనుకున్నాడో నాకర్ధం కాలేదు. నువ్వు చెప్పు.
నేనీ సినిమా చూడలేదు..
అయితే చూసి రాయి.
మీకే అర్ధం కాకపోతే.. ఇక నా చిట్టి బుర్ర సంగతేంటి..
అయినా సరే..

అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. ఎంచుమించు రాముడంతటి వారు.. ఎక్కు పెట్టిన ప్రశ్నను అలా వృధా చేయరు. హైదరాబాదులో పర్వాతాలు లేవుకనుక నాలాంటి పిచ్చుక మీద ప్రయోగించడమే. కానీ ఇప్పుడు నేనే రాముణ్ణి.. ఎలా అంటారా?? కైక పట్టుతో తండ్రి ఆన మేరకు రాముడు అరణ్యవాసం కి వెళ్ళెను. ఇప్పుడు రాయమన్న ఆ మనిషి ఐ.టీలో బిక్కుబిక్కుమంటున్న నాకు, ఉన్న ఏకైక గాడ్ ఫాదర్. రాముడు నేను. తెల్లారగట్ల 9:30 కి సినిమా చూడడానికి, అదీ ఓ శనివారం పూట.. ఇంతకన్నా అరణ్యవాసం ఉంటుందా!! మరి కైక ఎవరు అని అడగకండి… “మగవారి హక్కులే నా డిమాండ్” అన్న నా టపా!!

నా అరణ్యవాసం కబురు మా రాజ్యమంతటా (టీమంతా) పాకటంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి “సంతాపం” ప్రకటించారు. పది కమల్ హాసన్లు ఎవరెవరు లాంటి క్లిష్ట ప్రశ్నలకు.. స్ర్కీన్ మీద ఎక్కువ సేపు ఎవరు కనిపిస్తే.. వారంతా కమల్ లాంటి చిట్కాలు చెప్పారు. మనుషులకే ఎంసెట్లు, ఈసెట్లు ఉంటాయని.. ధైర్యంగా ఉండమనీ వెన్ను తట్టారు. కంటనీరు ఆపుకుంటూ.. నా మనోధైర్యాన్ని పెంచడానికి “సినిమాని సినిమాలానే చూడాలి” అన్న తారక మంత్రం ఉపదేశించారు. శుక్రవారం పూట ఇంటికి వెళ్తుండగా అందరూ మరీ మరీ చెప్పి పంపించారు.. జాగ్రత్త అని.

శనివారం తెల్లారింది. ఈ సూర్యుడు కూడా లేట్ రావచ్చు కదా?? మరీ ఇంత టైమ్ ఫాలోయింగా!! రాత్రి నిద్రలేక ఇప్పుడు ఇంత త్వరగా లేచి.. ఛా!! ఎలా అయితేనేమి 9 గంటలకు ప్రసాద్స్ చేరుకున్నాము. నేను అరణ్యవాసంలా భావిస్తున్నానని వీడికెలా తెలిసిందో.. సకల ఏర్పాట్లు చేశాడు.. ఏ మాత్రం సౌకర్యం కలగకుండా!! ముందు ఓ ఐదు నిమిషాలు గేట్ దగ్గరే నిలుచోబెట్టాడు. సినిమా థియేటర్ గేట్ల ముందు పడిగాపులు పడాల్సి వస్తుంది.. ఖర్మ!! తర్వాత ఎలానో పంపించాడు. ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకున్న నాలాంటి వారి నుండి.. రేపటి షోకి టికెట్స్ ఉన్నాయా అని కనుక్కోడానికి మాత్రమే వచ్చినవారుతో సహా అందరూ కలిసి పెద్ద క్యూలు కట్టాము ప్రతీ కౌంటరు దగ్గర. ఎంత సేపనీ ఇలా నిలబడడం అన్న నిరాశకి నా లైన్ త్వరగా కదలటం ఊరటనిచ్చింది. చక చక కదిలిపోతుంది. నా ముందో ముగ్గురు ఉన్నారంతే.. ఆహా భాగ్యం అనుకుంటున్న నాకు హావెల్స్ ఆడ్ లోలా షాక్ కొట్టింది. అసలు అక్కడ కౌంటరు తెరిచే లేదు. ఇప్పటి వరకూ అంతా ఎందుకు నిలుచున్నారు? వెళ్ళిపోతున్న వారెవ్వరూ చెప్పలేదు?? అక్కడ కూడా లాజిక్క్ పీకుతుంది నా మనసు. “ఇలానే నిలుచుని ఉంటే వాళ్ళు అలానే నిలబెడతారమ్మాయ్.. చెప్పు టికెట్స్ తీసుకోమని.” అని నా వెనుక ఒక అతను అన్నారు. వారు చెప్పింది నేనింకా డీకోడ్ చేసుకుంటూ వింత మొహమేసుకుని చూస్తుంటే.. కౌంటర్లో పిల్ల “మేము నిలబడద్దన్నా.. అంతా నుంచున్నారు.. సరే ఇటు ఇవ్వండి” అని మాకు టికెట్స్ ఇచ్చింది. ఇంతకు ముందు రియాక్ట్ అవ్వటం ఆలస్యం అవటంతో బాటు నా వెర్రి మొహం చూసి నాకు తెలుగు రాదనుకుని.. “You should raise voice.. otherwise people won’t notice you.” అని అతను అనేసరికి అభిమానం పొడుకొచ్చి “ఈ కౌంటర్ తెరిచి లేదు” అన్న సమాచారాన్ని నాకొచ్చిన మూడు భాషల్లోనూ రైల్వే అనౌన్సర్ లా చెప్పుకుంటూ పైకి ఎక్కా!!

ఇంక ఐదు నిమిషాలే ఉంది.. సినిమా మొదలవడానికి. ఇంత ఆపదలోనూ ఎస్కలేటర్ అంటే భయం పోలేదు. మెట్లే ఎక్కా.ఆయాసంతో, అలసటతో పాటు కొనుకున్న పాప్ కార్న్ తీసుకుని వెళ్ళి సీటులో కూలబడ్డా.. సినిమా మొదలయ్యింది.. విరామం వచ్చింది. మల్లా మొదలయ్యింది.. మల్లా అయ్యిపోయింది. మా వాళ్ళు ఇచ్చిన తారకమంత్రం భలే పనిచేసింది అందుకే.. “బుష్ కాబిన్ లో మిగిలిన వారు అమెరికన్ ఆక్సెంట్ తో ఎందుకు మాట్లాడడం లేదూ??, బైయో వెపన్ లాంటి కీలక ఆంతరంగిక విషయాన్ని అమెరికా వాళ్ళు భారతీయులకు వదిలేస్తారా?? అమెరికన్ డాన్స్ బార్ లో మల్లికా తెలుగు పాట ఎందుకు పాడుతుంది? 12 వ శతాబ్దంలో కమల్ కి అసిన్ జంట. 21 వ శతాబ్దంలో కూడా.. ఈ లోపు వీరు ఎన్ని ఏడు జన్మలు ఎత్తే అవకాశం ఉందా?? బయొ వార్మ్ ని మింగిన విలన్ ఎటూ decease అవుతున్నా.. సునామీలో కొట్టుకుపోతున్నా అతడిని భారత జెండా వల్లే చనిపోయినట్టు చూపించడం దేనికి? లోకనాయకుడికి లోకల్ ఫీలింగ్ ఏంటి?” లాంటి ప్రశ్నలు ఏమీ వేయకుండా హాయిగా ఆనందించింది నా మెదడు.

ఇక ఈ సినిమా ద్వారా కమల్ ఏమి చెప్పదలుచుకున్నాడో నాకు తెలీదు గాని, నేను అర్ధం చేసుకుంది మాత్రం ఇది.. Mankind never learns from history, that is why it repeats. దేవుడు పేరుతో కొట్టుకోవాలని మనుషులు నిర్ణయించుకోవాలే గాని, ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. రెండో విషయం.. దేవుడున్నాడా లేడా అన్నది “half glass water” లాంటిది. సగం ఉన్నాయీ అన్నచ్చు… సగం లేవూ అనచ్చు. ఎవరూ తప్పు కాదు. మనం చేసే ప్రతీ క్రియకు దేవుడే నిర్ణయించాడనుకోవచ్చు.. ఉదా: ఈ టపాను మీరు మీ పూర్వ జన్మ పాప ఫలితంగా చదువుతున్నారు. లేక మన ప్రతీ చర్య వెనుకా మన మెదడు ఇచ్చే ఏదో reasoning ఉంటుంది. ఉదా: nonsense లో కూడా సెన్స్ చూడడానికే ఈ టపా ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. మనం ఎలా అర్ధం చేసుకుంటే అలా. అందుకే కమల్ దేవుడున్నాడనీ .. లేడనీ ఒక నిర్ణయంగా చెప్పలేదు. సునామి దేవుడు పంపాడని అసిన్ నమ్మకం.. ప్రకృతి వైపరిత్యం అని కమల్ వివరణ. వారిద్దరిలానే.. అభిప్రాయాలు కలవకపోయినా మనుషులంతా కలిసి ఉండాలని అని సారాంశం. ఇది సినిమా చూసి నాకు అర్ధం అయ్యింది. కమల్ చదివితే ఏమి అంటారో..

ఈ రెండు ముక్కలు చెప్పటానికి ఇంతిలా మా మెదళ్ళు తినాలా అని మీరు అడుగుతున్నారా?? అయితే.. మీరు జె.ఎన్.టి.యులో చదవలేదన్న మాట.. అక్కడే చదివితే నాకన్నా తక్కువ మార్కులు వచ్చినవారై ఉండాలి. ఈ మాత్రం రాయకపోతే.. 60 మార్కులు ఇచ్చేత్తారూ?? “ఎం చెప్పామ్మనది కాదండి.. ఎంత చెప్పామన్నదే” ముఖ్యం.

17 comments

  1. హమ్మో…! చైతన్య స్రవంతి (stream of consciousness) అంటే తెలీని “పూర్” అని చెప్పి, ఇలా బోల్తా కొట్టిస్తావా?

    చెప్పాల్సిందంతా చక్కగా చెప్పేసి Chaos ధియరీ చెప్పి తప్పుకుంటావా? మళ్ళీ equilibrium ధియరీపై వివరణలొకటి…నీ పాండిత్యాన్ని దాచటానికి!

    అయినా టైటిలేంటి కాస్త తిక్కగా ఉంది? దశ తిప్పిన బ్లాగావతారమా…లేక అది నిజంగా నే “దెశ” నా?

    Like

  2. మీ బ్లాగు టైటిల్ గా దశ తప్పిన బ్లాగావతారం అని రాద్దామనుకుని, పొరబాటున ఇంకేదో రాశారా?

    Like

  3. ఆదిత్యా ఛానల్ ఆంకర్లల కన్నా కొంచెం అతిగా ఊగితూ
    ముక్కూ మొహం తెలియని అబ్బాయిలను blogger లో moderate చెయ్యచ్చు అన్న ధైర్యంతో టపా రాసినా..
    “బుష్ కాబిన్ లో మిగిలిన వారు అమెరికన్ ఆక్సెంట్ తో ఎందుకు మాట్లాడడం లేదూ??, బైయో వెపన్ లాంటి కీలక ఆంతరంగిక విషయాన్ని అమెరికా వాళ్ళు భారతీయులకు వదిలేస్తారా?? అమెరికన్ డాన్స్ బార్ లో మల్లికా తెలుగు పాట ఎందుకు పాడుతుంది? 12 వ శతాబ్దంలో కమల్ కి అసిన్ జంట. 21 వ శతాబ్దంలో కూడా.. ఈ లోపు వీరు ఎన్ని ఏడు జన్మలు ఎత్తే అవకాశం ఉందా?? బయొ వార్మ్ ని మింగిన విలన్ ఎటూ decease అవుతున్నా.. సునామీలో కొట్టుకుపోతున్నా అతడిని భారత జెండా వల్లే చనిపోయినట్టు చూపించడం దేనికి? లోకనాయకుడికి లోకల్ ఫీలింగ్ ఏంటి?” లాంటి ప్రశ్నలు ఏమీ వేయకుండా హాయిగా ఆనందించింది నా మెదడు.
    బాగున్నాయి.మంచి పరిశీలన
    ఎప్పుడో చనిపోయిన లింకన్ పూనాడనుకునే ప్రమాదం ఉందని గ్రహించి –అస్సలు బాగా లేదు
    మధ్యలో రెండుపేరాగ్రాఫులు తగ్గించి..కొద్దివాక్యాలుగా మారిస్తే ఇంకా క్రిస్ప్ గా ఉండేది.

    Like

  4. మహేశ్ గారు:
    నేనంత బాగా రాస్తున్నానో.. మీరంత బాగా చెప్తున్నారో తెలియడం లేదు. కృతజ్ఞతలు!! టైటిల్ తప్పుగా అచ్చయింది. సరి చేశా!!

    శరత్ గారు: నెనర్లు

    రావుగారు: అచ్చు తప్పు అది.

    రాధిక: థాంక్స్!!

    రాజేంద్ర కుమార్ గారు: మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఏది బాగుందో.. ఏది బాలేదో చక్కగా చెప్పారు. “లింకన్” ప్రస్తావన తీసేశాను. వ్యాసం పొడుగును కావాలనే పెంచాను. I didn’t want it to be crisp.

    Like

  5. మనసారా నవ్వుకొని చాల రోజులైంది. ఆ కొరత ఇవాళ తీరింది మీ టపాతో. మీకు సర్వ కాల సర్వావస్థలయందు ఇలాగే టపాలను వండి వార్చుటకు దేవుడు తీరికనివ్వు గాక.

    Like

  6. ఆహా! ఇదేదో సినిమా రివ్యూ కామోసు అని చదవడం మొదలెట్టానండి, సినిమా గురించి మూడు ముక్కల్లో చెప్పి సినిమా చూడడం గురించి టపా అంతా చెప్పి కేక పెట్టించారండి !! మీ వాక్చాతుర్యానికి జోహార్లు… కొస మెరుపు ఏవిటంటే ఇంత పెద్ద టపా వ్రాసినా చివరి వరకు Interesting గా చదివించడం. పూర్ణిమ గారా మజాకా నా.

    Like

  7. పూర్ణిమా,
    ఏంటలా అంటారు? ప్లెచర్ భారత జెండా వల్ల మరణించడం చూసి నా ఒడలు పులకరించి కళ్ల వెంట నీళ్ళొచ్చాయి తెలుసా? నా ముందు, వెనక సీట్లలో కూచున్న వాళ్లు కూడా జెండా వాడి గుండెల్లో దిగ్గానే ‘వావ్’ అన్నారు తన్మయంగా! ఇప్పుడర్ధమైందా వాడలా ఎందుకు చచ్చాడో?

    Like

  8. hmmm.. మా అబ్బాయి జల్సా అనుభవంతో , ముందు జాగ్రత్తగా ఈ సినిమా టికట్లు తెచ్చి మమ్మల్ని పంపాడు. నేను బాగుందంటే తను ఫ్రెండ్స్ కలిసి వెళతామని. నేను, మావారు బలయ్యాము. పన్నెండవ శతాబ్దిలో మునిగిన విగ్రహం, సునామీలో పైకి వచ్చింది కదా. అప్పటి శవం కంకాళం చేయి అలాగే ఉంటుందా అన్ని శతాబ్దాలు?? అసలు ఈ సినిమా టైటిల్ కి కమల్‍హాసన్ పాత్రలకి సంబంధం ఉంది ఓకె. కాని కథకు దానికి ఏంటి సంబంధం. చివర్లో లోకనాయకుడా పాట పెట్టింది నిర్మాతను గెంతించడానికి, హీరో వేషాలు ఎలా వేసాడో చూపడానికా ఇంత బిల్డప్పు…

    Like

  9. భావకుడన్ గారు:
    ఆ ప్రార్ధనేదో ఇంకాస్త గట్టిగా కోరుకోండి.. ఆఫీసులో వాతావరణం చూస్తుంటే.. కష్టమే అనిపిస్తుంది.
    నవ్వించగలనా అన్న నా అనుమానాన్ని.. మీ వ్యాఖ్యతో దాదాపుగా పోగొట్టారు 🙂

    వేణూ గారు:
    థాంక్స్..థాంక్స్.. అంటూ ఓ వంద సార్లు మీకు చెప్పాలనుంది. నా రాతల మీద నాకంత నమ్మకం లేదు కావున.. మీక్కలిగిన ఆనందం గురించి ఇన్కా అనుమానమే.. కానీ ఈ వ్యాఖ్య వల్ల నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. మీ వ్యాఖ్య చూసాక.. భూమి మీద కాలు పెట్టడం ఎంత కష్టమైయ్యిందో!!

    సుజాత గారు:
    మీరన్నది నిజమే.. కానీ దేశభక్తికి మించిన దైవభక్తి లేదన్న నా ప్రఘాడ విశ్వాశాన్ని.. ఈ మధ్యనే నేను చదివిన టాగోర్ రచన “Home and the world” తునాతునకలు చేసింది. ఇందులో విశ్వసమస్యను చూపించారు. విలన్ గెలిస్తే ప్రపంచానికే ప్రమాదం, అతను ఇండియాను టార్గెట్ చేసుకోలేదు కదా!! When you are the fighting for the cause of humanism.. talking of patriotism is belittling the whole process. మదర్ తెరిస్సా ఇండియన్ కాకపోయేవారు, ఇండియాలో పుట్టి ఉన్నా.. ఎందుకంటే మానవత్వానికి కంచెలు ఉండవు. ఇది నా అభిప్రాయం.

    జ్యోతి గారు:
    మీకొచ్చిన అనుమానం నాకూ వచ్చింది. ఎప్పుడో ఒకసారి ఆమీర్ ఖాన్.. మరెప్పుడో.. కమల్ హాసన్.. సినిమాలో నేను వెత్తుకునే ఆనందం కలిగిస్తారు. అందుకే వీరిని ఎక్కువ ఇబ్బంది పెట్టను నేను. 😉

    కృష్ణుడు గారు: నెనర్లు!! 🙂

    Like

  10. ఏదేమైనా నేను దశావతారం సినిమా చూడాలనే నిర్ణయించుకున్నాను. గుడ్ అనాలిసిస్
    సాహితీ యానం

    Like

  11. మీకు మీ స్నేహితులిచ్చిన సలహాలే మీరు మాకిచ్చినట్టు గా భావించి జాగర్తలు పాటించి సినిమా చూస్తాంలెండి.

    http://muralidharnamala.wordpress.com/

    Like

  12. దశావతారం పైన మీ అభిప్రాయం నిజమే. కమల్ 10 GETUPS వెయ్యాలి అనుకున్నాడు వెశాడు. మనం కొన్నం కనుక 3 గంటలు చూడాలి ..

    Like

Leave a comment