బాబా గారికి, NETIZEN వారికి ధన్యవాదాలు!!

Posted by

న్యాయంగా ఈ టపాకి సీతారామారావు Vs డోరియన్ గ్రే అని శీర్షిక పెట్టి ఎప్పటిలానే నా సోది మొదలెడితే… ఎవరు చదువుతారో చదవరో గాని, నేను కృతజ్ఞతలు చెప్పాలనుకున్న బాబా గారు, నెటిజెన్ వారు చూడకపోతే ఈ టపా ఇక్కడ రాసి దండగ!! వీరెవరో బ్లాగ్లోకానికి నేను చెప్పనవసరం లేదు. అందుకే సీతారామా రావు, డోరియన్లను పరిచయం చేసుకుందాం.

సీతా రామారావు.. త్రిపురనేని గోపిచంద్ రాసిన “అసమర్ధుని జీవయాత్ర” అనే తెలుగు నవలలో కథానాయకుడు. డోరియన్ గ్రే.. ఆస్కర్ వైల్డ్ రచించిన ఇంగ్లీషు నవల “ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే” లో నాయకుడు. నేను అసమర్ధుని జీవయాత్ర పై రాసిన టపా కి బాబా గారు “ఎక్కడో చదివాను ఈ పుస్తకానికి డోరియన్ గ్రే కి సారూప్యం ఉండని ఆ వివరాలు ఎవరైనా తెలుపగరలరా?” అని వ్యాఖ్యానించారు. “నాకు తెలియదండీ” అని చేతులెత్తేసే ప్లానులో ఉండగా.. ” ఎవరండీ,అన్నది, డొరియన్ గ్రేకి, అసమర్ధుని జీవయాత్రకి కధలో పోలికలున్నవని? నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ?” అన్న నెటిజన్ వారు ఈ ప్రశ్నకు సమాధానమల్లే కనిపించారు. “చెప్పండి.. చెప్పండి” అని వెంటబడితే చెప్పేస్తారనుకున్నాను. రెండు పుస్తకాలకీ లంకెలిచ్చి.. చుదువుకో అని చెప్పకనే చెప్పారు.

ఇక చేసేది ఏమీ లేక.. డోరియన్ గ్రే గురించి కాస్త తెలిస్తే.. పుస్తకం కొనాలో లేదో నిర్ణయించుకోవచ్చునని మొదలు పెట్టా!! నవల పూర్తి చేయగానే.. పేజీ మధ్యలో మడత పెట్టి ఒక భాగం లో సీతారామారావని, మరో దాంట్లో గ్రేని పెట్టి.. 1, 2, 3 అని వారిలో తేడాలు రాసేసి.. “నాకర్ధమియ్యిందీ” అని ఓ టపా రాయాలన్న ఆశయంతో మొదలుపెట్టినా.. చదువుతున్నంత సేపూ ఇక ఏ ఇతర ఆలోచనా రాకుండా ఈ రచనలో మినిగిపోయా. నవల పూర్తి అయ్యింది. ఇప్పుడు ఈ కథానాయకుల సారూప్యం చూద్దామా??

ఈ ఇద్దరూ నవలా కాలంలో బోలెడన్ని మార్పులకు గురవుతారు. మొదట్లో.. అందరి లానే ఉంది.. ఒక సుఖవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందిచడానికి పూర్తి అవకాశం ఉన్న వీరిద్దరూ.. నవల ముగిసేసరికి ఒక భయంకరమైన విఫలంగా మిగిలిపోతారు. ఇద్దరూ.. ఆత్మహత్య చేసుకుంటారు. ఇలాంటి మనుషులూ ఉంటారా అని అనుమానం కలిగేలా ఉంటుంది వీరి ప్రవర్తన.. కానీ నిజానికి వీరిద్దరూ మనందరిలో చిన్ని చిన్నిపాళ్ళల్లో అయినా ఉంటారు. వీరిద్దరి అధోగతికి మాత్రం కారణాలు వేరు.. ఒకరు తన comfort zone వదిలి బయటకు రాక.. మరొకరు అవతలి వారి comfort గమనించక అసమర్ధులుగా మిగిలిపోతారు. ఒకరు false prestigeకి చిరునామాగా మారితే.. మరొకరు youth and pleasureకి బానిసవుతాడు. ఇద్దరి జాతి, మతం, వ్యవహార శైలి, ఆలోచనా సరళి, జీవితాన్ని జీవించిన విధానం, విఫలమనిపించుకోడానికి కారణాలు చాలా చాలా విభిన్నం. ఈ పాత్రల ద్వారా ఆయా రచయితలు చెప్పాలనే విషయాలకు.. నిజంగానే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా!! ఈ రెండూ నేను చదివిన విభిన్న పుస్తకాలు. నాకు నచ్చిన పుస్తకాలు. నాలా quotation collection hobby ఉన్నవారికి ఈ పుస్తకాలు.. ఖజానాలు.

ఇదీ నాకర్ధమైన విషయం. మీరు ఏకీభవించక పోతే.. కారణాలు తెలుపగలరు. ఒక సందేహం కూడా ఉంది. నాయకుడు.. ప్రతినాయకుడూ అన్న పదాలు తరుచుగా ఎవరిని ఉద్ధేశ్యించి అంటామో మనకి తెలుసు. ఈ రెండు కథలలోనూ lead character (అసలు కథ ఎవరి గురించో వారు..) ప్రతినాయకుడల్లే అనిపిస్తూ.. ఒక disaster లా కనిపిస్తారు. వీరిని కూడా “కథానాయకులు” అని వ్యవహరించవచ్చా?? లేక ఇలాంటి పాత్రలను వేరేగా అనాలా?? సందేహం నివృత్తి చేయగలరు.

ఎలాంటి పుస్తకాన్ని (హార్డ్ కాపీలు మాత్రమే) అయినా సరే ఏకబిగువ చదివే నాకు, ఈ పుస్తకం వల్ల రెండు విజయాలు కలిగాయి.. ఒకటి.. 230 పేజీలున్న ఈ నవలను పూర్తిగా ఆన్-లైన్ లో చదవటం.. రోజులో కొన్ని ముఖ్య పనులకు మధ్య ఉండే ఐదు-పది నిమిషాల వ్యవధిని ఉపయోగిస్తూ నవలను పూర్తి చేయటం. అందుకు నాకు నేనే ఓ చిన్ని పార్టీ ఇచ్చుకోవాలేమో. 😉

ఈ పుస్తకాలను చదవదలచిన వారు, కింది లంకెలను చూడగలరు.
అసమర్ధుని జీవయాత్ర

The Picture of Dorian Gray.

పుస్తకాన్ని పరిచయం చేసిన బాబాగారికి, చదివేలా చేసిన నెటిజన్ వారికి మరో మారు హృదయపూర్వక ధన్యవాదాలు.

19 comments

  1. అసమర్ధుని… కి ఇచ్చిన లంకె పని చెయ్యటంలేదు.

    Like

  2. Very interesting commentary.
    నెటిజెన్ గారు నక్కకీ నాగలోకానికీ అన్నప్పుడు .. కొంచెం ఆదుర్దాగా ఊపిరి బిగబట్టాను. అదే ఉపమానం మీరూ ఇక్కడ ఉపయోగించారు. ఆ వాడుకలో తరాల భేదం ఉన్నది. ఒకటి కంటే ఇంకోటి ఎంతో గొప్పది అని చెప్పే ఉద్దేశం ఉన్నది. మరి ఈ రెండు పాత్రల్నీ, నవలల్నీ, కథనాల్నీ పోలిస్తే ఏది నక్క, ఏది నాగలోకం? కేవలం తేడా ఉంది అని చెప్పడమే ఉద్దేశం ఐతే ఈ వాడూక సరికాదేమో.
    ఏమైనా, నెటిజెన్ గారు తన ఉద్దేశం వివరిస్తే బాగుంటుంది.
    మీ ప్రశ్నలు .. అందుకనే ఆధునిక పాశ్చాత్య సాహిత్యంలో Protagonists అంటారు. నాయకుడు నాయిక అని కాకుండా ప్రధాన పాత్ర అంటే సరిపోతుంది. మన సాహిత్య పరిభాష చాలా మట్టుకు సాంప్రదాయ సాహిత్య లక్షణ గ్రంథాలనించి రావడం ఒకటి, పూర్తి సద్గుణ సంపన్నులు కాని వాళ్ళు నాయికా నాయకులుగా ఉండడానికి అనర్హులు అన్న సాంప్రదాయ భావన ఒకటి దీనికి కారణాలు కావచ్చు.
    రెండు పుస్తకాలూ చదివి చాన్నాళ్లయింది, ఇప్పుడు అంత క్లియర్గా గుర్తు లేవు. ఈ రెంటికీ ఇంకో సామ్యం – రోజులు చెల్లి కుళ్ళిపోతున్న ఒక వ్యవస్థకి ప్రతీకలుగా ఈ ఇద్దరు పాత్రల సృష్టీ జరిగింది.

    Like

  3. అసమర్ధుని జీవయాత్ర నేను అభిమానించే పుస్తకాలలో ఒకటండి. డోరియన్ గ్రే గురించి పరిచయం చేసి లంకె కూడా ఇచ్చినందుకు బాబా గారికి, నెటిజెన్ గారికి, మీకూ బోలెడు నెనర్లు. నేను ఇంకా డోరియన్ చదవలేదు కాని మీరు వ్రాసిన విశ్లేషణ ప్రకారం చూస్తే రెండు రచనలు అప్పటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల పై వ్రాసినవా అనిపిస్తున్నాయండి, like false prestige and youth pleasure. మనలో చిన్న చిన్న పాళ్ళలో వుంటారు అని బాగా చెప్పారు. అంతే కాదు నాకు తెలిసి ప్రతి ఊరిలోనూ సీతారామారావు లు ఉంటారు ప్రత్యేకించి 70’s & 80’s లో ఇలా false prestige సోమరి తనం తో జీవితాన్ని శిధిలం చేసుకున్న వారి కధలు చాలా ఉన్నాయి అని మా నాన్న గారు చెప్పగా విన్నాను.

    Like

  4. మీ ఆశక్తికి, ఓపికకు అభినందనలు. ఇన్నాళ్లకు నాలోని అనుమానానికి, సాధికారక సమాధానాన్ని పొందగలిగాను. చాలా చాలా ధన్యవాదములు.
    బొల్లోజు బాబా

    Like

  5. నాకూ, నీలాగే కథానాయకుడూ, ప్రతినాయకుడూ లాంటి సందేహాలుండేవి. కాకపోతే ఆంగ్ల సాహిత్యాన్ని నా తలమీద బలవంతంగా రుద్దిన నా కాలేజీ రోజుల్లో కాస్త జ్ఞానోదయమై..‘lead character’,’principle character’,`protagonist’ లాంటి పదాలు తెలిసి ఆదుకున్నాయ్.

    ఈ మధ్య నవలలు soft copy గా దొరకడం ఒక సౌలభ్యమే. నా దగ్గర కొన్ని ఆణిముత్యాలున్నాయ్. కావాలంటే మెయిల్ చెయ్యగలను.

    Like

  6. కొత్త పాళీ గారికి నమస్కారాలు:

    Interesting that you find my post interesting. Thanks 🙂

    నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా అంటే.. “నక్క ఎవరు? నాగలోకం ఎవరు?” అని అడగడం సబబే మాట. నేనూ నెటిజన్ వారిని ఇదే ప్రశ్న అడిగా. రెంటి మధ్య విపరీతమైన తేడా ఉంటే ఇలా అంటారేమో.. ఒకటి మంచిది మరోటి చెడ్డది అన్న భావం రాదేమో అని అనుకున్నా. సరిచేసినందుకు నెనర్లు.

    నా ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు. Protogonist కి తెలుగులో అంతే భారీగా పదం లేదా??

    ఈ రెంటికీ ఇంకో సామ్యం – రోజులు చెల్లి కుళ్ళిపోతున్న ఒక వ్యవస్థకి ప్రతీకలుగా ఈ ఇద్దరు పాత్రల సృష్టీ జరిగింది.- దీనిలో సందేహాలు ఉన్నాయి. సీతారామారావు కథ మొదలెట్టడమే అతను పాతాళానికి చేరుతున్న మురికి కాలువలా వర్ణిస్తాడు. అతని చూట్టూ ఉన్న పాత్రలు అతనిని నిజంగా అభిమానిస్తున్నారని అనిపించదు. (అతని భార్య మినహాయింపేమో దీనికి). అప్పుడున్న సామాజిక పరిస్థుతల బట్టి కూడా ఇతడు అసమర్ధుడే!! కానీ గ్రే అలా కాదు.. నవల మొదట్లో అతని శారీకాకారం, మనసిక అందం అందరినీ కట్టిపడేస్తుంది. అందరూ ఇతన్ని ఆరాధిస్తారు. ప్రేమిస్తారు. ఎట్టొచ్చీ ఇతడు ఇతరుల బలహీనలతో ఆడుకోవడం ఇతని బలహీనతగా మారుతుంది. రోజులు చెల్లి కుళ్ళిపోతున్న ఒక వ్యవస్థకి ప్రతీక సీతారామారావు అయితే.. అత్యంత జనాదరణ పొందిన ఒక వ్యవస్థ (అందాన్ని ఆరాధించడం) వల్ల కలుగు విపరీత పరిణామాలు గ్రేలో చూపించారనిపించింది. మీరే మంటారు??

    ఒక పుస్తకం చదివి పక్కకు పెట్టేసేలా లేడు ఆస్కర్ వైల్డ్.. అతని రచనల గురించే కాదు.. అతని జీవితం కూడా తెలుసుకోవాలేమో!!!

    వేణూ గారికి: మీ వ్యాఖ్యకు నెనర్లు. 🙂

    బాబా గారు: మీ టపాలు నేనెక్కువ చదవలేదు గానీ, ఇతర టపాల్లో వ్యాఖ్యలు బట్టి .. I can tell you that this book would fascinate you. Liking or not liking would follow. నెనర్లు

    మహేశ్ గారు: అదృష్టవంతులండీ.. బలవంతంగా అయినా రుద్దినవి ఇప్పుడు ఇలా పనికి వస్తున్నాయి. మాకు రుద్దిన విషయాలు వళ్ళా ఉపయోగం లేదు.. రుద్దని విషయాలు అసలే తెలీదు. 😦

    ఆణిముత్యాలని ఊరించి.. కావాలా అని అడగాలా.. పంపించేయండి.

    Like

  7. అసలు టాపిక్ డైవర్ట్ చేస్తున్నా అనుకోక పోతే ఓ విషయం చెప్పాలని ఉంది.. ఇక్కడ అందరు ఉదహరిస్తున్న సామెత కు చిన్ని correction అది నాగ లోకం కాదు నాక లోకం, అంటే స్వర్గం. స్మశానాలలో తిరిగే నక్క ఎక్కడ నాకలోకం(స్వర్గం) ఎక్కడా రెండిటికీ ఉచ్ఛారణలో స్వల్ప పోలిక తప్ప వేరే ఏమైనా పోలిక ఉందా… స్వల్ప సారూప్యత కలిగి ఉన్నా ఒకదానికంటే ఇంకోటి చాలా గొప్పది అనే అర్ధం వచ్చే చోట ఉపయోగించాల్సిన సామెత అది అని నా అభిప్రాయం.

    మహేష్ గారు ఆ ఆణిముత్యాలని నాకు కూడా పంపించండి (venusrikanth@gmail.com)

    Like

  8. విషయం సరిగా తెలియకపోయినా ఈ టపా వ్రాసి నా అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నందుకు మన్నించండి. నేను నవలలు చదవడం మానేసి చాలా కాలమైనా లీలగా గుర్తున్న పాత విషయాలను నెమరు వేసుకొని వ్రాస్తున్నాను – The picture of Dorian Gray కు అత్యంత సన్నిహితంగా ఉన్న నవల ఒకటి “లత” వ్రాశారు అనుకొంటాను. పేరు గుర్తు రావడం లేదు.

    Like

  9. పూర్ణిమ గారు,
    అసమర్ధుని జీవయాత్ర, ఈ పుస్తకాన్ని నేనెప్పుడో నా చిన్నప్పుడు చదివాను. కాని అప్పుడు సమాజం గురించి తెలిసింది చాలా తక్కువ కావడం వల్ల సరిగ్గా అర్ధం కాలేదు. కాని తర్వాత చదవగా బాగా అర్ధం అయింది. డొరియన్ గ్రే గురించి నేనూ విన్నాను. ఇన్నాళ్ళకి మీవల్ల చదివే భాగ్యం దొరికింది. అందుకు మీకు కృతజ్ఞతలు. కాకపోతే నాకో సందేహం, జీవితాన్ని జీవిస్తారా? జీవితంలో జీవిస్తారా?

    Like

  10. @పూర్ణిమ గారు,
    నేను కూడలిలో చేరిన మొదట్లో మీ భానుమతి గారి పుస్తక విశ్లేషణ చదివి.తరువాత అసమర్ద్తుని జీవిత యాత్ర విశ్లేషణ చూసి అమీర్‌పేట్‌లో ఒక బుక్ హౌస్‌లో కొని అసమర్ద్తుని జీవిత యాత్ర చదివాను.చాలా బాగుంది.మల్లీ ఎప్పుడో వదిలేసిన అలవాటు మొదలయ్యింది మీ వల్ల.మీకు చెప్పలేనన్ని నెనర్లు.దాంతోనే ‘డ్రీం బిగ్ ‘ అని మరో పుస్తకం కూడా కొనేసాను జి.క్రిష్ణమూర్తి గారిది అనుకుంట చదవాలి.మీ దగ్గర ఏవైనా ఇంకా లంకెలు గాని బుక్స్ కాని ఉన్నా పంపగలరు.

    @ మహేష్ గారు,
    నాకు కూడా మీ సేకరణలు పంపగలరు నెనర్లు.Mail: kranthi.mkumar@gmail.com

    Like

  11. పూర్ణిమ గారు,

    మీ బ్లాగు చాలా బావుంది. ఈ రోజు కూడలి లొ కొత్త పొస్టులు ఏమి వచ్చాయో చూసే సరికి సగం వరకు మీ బ్లాగు కి సంబంధించిన ఫీడులు కనిపించాయి . అన్ని పొస్టులు ఒకేసారి ఎలా వచ్చాయి అని అశ్చర్యం తో మీ బ్లాగ్ కి వెళ్ళి చూస్తే, చాలా వరకు పాత పొస్టులు కనిపించయి. ఏవో సాంకేతిక కారణాల వల్ల ఈవిధం గా వచ్చాయేమొ నాకు తెలీదు ( అదే కారణం అయినచొ మీరు ఈ వ్యాఖ్యను చదవటం ఇక్కడితొ ఆపివేయవచ్చు). కాని, ఉద్దెశ్య పూర్వకం గా రప్పించినట్లయితే, ఈ ధోరణి ఒక రకంగా కూడలి లొ మొదటి పుట స్థానం కొసం అనారోగ్యకర పోటిని పెంచుతుందేమో అని నా అనుమానం. అలాగె మిగతా బ్లాగ్గర్లు కూడా అసౌకర్యం గా అనుకోవచ్చు కూడ. ఇది నా అభిప్రాయం మాత్రమె. అలోచించగలరు. అన్యధా భావించవద్దు.

    Like

  12. సామెత విషయంలో వేణు చెప్పిన మాటలు కరక్టు.

    పూర్ణిమ, డోరియన్ గ్రే గురించి స్థూలంగా మీరు చెప్పిన మాటలు కరక్టే. రెండు రచనల్లో ఒక తేడా ఏంటంటే .. డోరియన్ గ్రే రచన పూర్తిగా ఎలిగొరీ (Allegory) అందులో డోరియనే శిథిలమవుతున్న విక్టోరియన్ సమాజం. మేడిపండు చూడ అన్నట్టు పైకి పటాటోపంగా మిలమిల్లాడుతూ నవల మొదట్లో డోరియన్ లాగా అందంగా కనిపిస్తూ ఉన్నా, అది లోపల అంతా డొల్లే అనీ, ఐతే పైకి అంతా బాగానే ఉండటం వల్ల అది పూర్తిగా కూలిపోయే దాకా దాన్ని ఎవరూ గ్రహించరనీ అన్నట్టు..(అందుకే అతనిలో వస్తున్న దారుణమైన మార్పులు అతని శరీరంలో కనిపించవు, బొమ్మలో కనబడతై)
    నాకు గుర్తుండి డోరియన్ గ్రేలో ఇంకో ప్రధాన పాత్ర ఉంటాడు .. ఒక ప్రభువు .. అతనే డోరియన్ కి చెడఉ అలవాట్లన్నీ మప్పేది. డోరియన్ పాత్రకంటే అతని పాత్ర ఆసక్తి కరంగా ఉంటుంది అధ్యయనం చెయ్యడానికి.
    ఇలా చూస్తే అసమర్ధుని జీవయాత్ర రియలిస్టిక్ పద్ధతిలో చెప్పింది. సీతారామారావు సమాజానికి ప్రతీక అయినా .. కథలో అతని మనుగడ సమాజంలో బతుకుతున్న ఒక వ్యక్తి బతుకు లాగానే నాడుస్తుంది.

    Like

  13. మరో డైవర్షన్ –
    వేణుగారన్నట్లు “నక్కకు, నాక లోకానికి” అన్నదే అసలు సామెత.

    The Picture of Dorian Gray కు దాదాపు అనుకరణగా “లత” రచన ఒకటి ఉందని గుర్తు. చాలా కాలం క్రితం చదివాను. పేరు గుర్తు రావడం లేదు. నా అజ్ఞానాన్ని ఇలా ప్రదర్శిస్తున్నందుకు మన్నించండి.

    Like

  14. @venu: Thanks for correcting me. I’ve been under a wrong impression for a long time !!

    @Sudhakar babu: naaku sambindinchani vishayam kaadule ani tappukokunda.. meekunna info ni maa to share chesukunnaru. “lata” ekkadundo pattukundaam 😉

    pratap: enti meeru mottam chadivesaaraa?? .. oka roju lo?? naaku vaaram pattindi andi :-(( Thanks for your comment!!

    @nani: naakunna alavaatla nundi naa chottu pakkala vaaru tappinchukokundaa choose alavaatu naadi 😉 rasaara.. chadivimaa?? ani kaaka opika to chaduvutunna meeku dhanyavaadaalu.

    g. krishnamurthy gaari collection choosi koodaa konaledu. meeru chadivi cheppa galaru.

    Like

  15. ఉదయ్ గారు:
    అవతలి వారి ఇబ్బంది దేవుడు ఎరుగు.. టపాల సంఖ్య ఎక్కువవుతుంది కావున, వాటికి లేబెల్స్ సరిగ్గా పెట్టాలని ఈ ఉదయం కెలికా.. ముందసలు లేబల్ ను సరి చేయడం రాలేదు.. సరే అని కొత్త లేబెల్ పెడితే.. ఇదో ఇలా అన్ని కూడలిలో ప్రత్యక్షమైనాయి. ఎంత ఎబ్బట్టుగా ఉండిందో. కావాలని చేసింది కాదు.. నా బ్లాగు చాన్నాళ్ళూ కూడలి లో రాకపోతేనే పెద్దగా పట్టించుకోలేదు.. ఇలా అందరికీ తెలియడం కోసం చేస్తానా?? ఇదే కారణం కావున మీ వ్యాఖ్య మధ్యలోనే ఆపేయాలి, మీరు చెప్పినట్టు గా.. కానీ అసౌకర్యం ఎవరికైనా కలగవచ్చును… అపార్ధం ఎవరైనా చేసుకోవచ్చును. అందుకే ఈ సర్దిచెప్పడం. 🙂

    వీవెన్ గారికి మేల్ పంపించాలా?? నేనో టపా రాశి క్షమాపణలు అడగాలా అని ఆలోచిస్తున్న వేళ మీ వ్యాఖ్య వచ్చింది. మరలా ఇలా జరగకుండా జాగ్రత్త తీసుకోగలను.

    కొత్తపాళీ వారు: మీరన్న ప్రతీ అక్షరం తో ఎకీభవిస్తున్నాను. 🙂

    సుధాకర్ గారు: సామెతలో తప్పును ధృవపరచినందుకు ధన్యవాదాలు.

    Like

  16. పూర్ణిమ,

    సుబ్బరంగా వర్డుప్రెస్సుకి మారిపోండి. నేనలాగే చేశా. అక్కడ లేబుల్సు మార్చటంలాంటివి యమా తేలిక 🙂

    Like

  17. @పూర్ణిమ: ఈ శీర్షికలో “నెటిజన్” ని చేర్చాల్సిన అవసరం లేదేమో!
    మీకు ఉన్నంత సమయంలోనే డొరియన్ గ్రే ని చదివి, పదిమందికి పరిచయం చేస్తు, మీ అభిప్రాయాలను, కూడ పంచుకున్నందుకు అభినందనలు.ఆంగ్ల సాహిత్యం వేరు. వైల్డ్ జీవించిన కాలం, అతనిని ప్రభావితం చేసిన సమాజాం వేరు. అలాగే గోపిచంద్ జీవించిన నాటి సామాజిక నేపధ్యం వేరు. గోపిచంద్‌కి, జమిందారి వాసనలు పోని జమిందారి కుటుంబాలు గురించి తెలుసు. ఆ కుటుంబాలు ఆర్ధికంగా ఎలా దెబ్బతిన్నవో తెలుసు. అవి ఆయనని ప్రభావితం చేసినవి.

    ఇక “నక్కకు, నాకలోకానికి”. చదువరికి సారూప్యాలు కనిపించి ఉండవచ్చు, కనపడవచ్చు.ఆ రెండు పుస్తకాలు విభిన్నమైన సామాజిక నేపధ్యాలలో పుట్టినవి. రెండు వేర్వేరు సాహిత్య ప్రపంచాలకు చెందినవి.

    ఇక బోల్లోజు బాబా గారి వ్యాఖ్య: “….ఈ డోరియన్ గ్రే గురించి, ఓ విష బీజాన్ని నాలో నాటాడు. ” అది విషపు బీజం అని వారికి అర్ధమైనది కదా?

    ఎందుకనో కొంతమంది తాము ఎన్నుకున్న అంశం మీద పరిపూర్ణమైన దృష్టిని సారించి, తమ సమయాన్ని వెచ్చించి, పరిశోధించి తమ మేధను పూర్తిగా ఉపయోగించకుండా, “ఇది సరిపోతుందిలే, ఇది చాలులే” అని అనుకుంటూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఆ అలసత్వం, ఆ నిరాసక్తత మూలంగా ఈ”విషపు బీజాలు” వ్యాప్తి చెందడమే కాకుండా మరెన్నో మేధలను వక్ర మార్గాన్ని పట్టిస్తున్నవి.

    ఇంకేవొ పనుల ఒత్తిడిలోఉండి, మీయీ టపాకి వెంటనే స్పందించలేకపోయినందుకు, మీకు నా క్షమాపణలు, పూర్ణిమ.

    Like

  18. నెటిజన్ గారు: మీరెక్కడైనా ఈ టపా శీర్షిక పై కన్నేస్తే చాలుననుకున్న నాకు.. వచ్చి చదివీ అభినందిస్తూ ఓ వ్యాఖ్యను చూడగానే పదివేలు అనుకున్నా.. “శీర్షికలో అనవసరం”.. “ఆలస్యమైనందుకు.. సారీ” అంటూ నా పది వేలూ తీసుకెళ్ళిపోయారే.. :-(( నావి నాకించేయ్యండి 😉

    ఇక విషయానికి వస్తే.. ఉద్ధేశ్యపూర్వకంగా కాకపోయినా మీరు నన్ను కొట్టారనుకోండి (action)… నాకు దెబ్బ (effect) తగులుతుంది!! అలానే మీరేదో మీ అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నించినా నాకది ప్రేరణగా నిలిచింది. అందుకే మీరు శీర్షికలో ఉండడం న్యాయం. మీ వ్యాఖ్య రాకపోయినా ఎప్పుడోకప్పుడు ఈ పుస్తకాన్ని చదివేదాన్ని.. కానీ రెంటి మధ్యా సారూప్యత చూసేదాన్ని కాదు. ఇంతిలా ఆలోచించేదాన్ని కాదు. అందుకు నెనర్లు.

    మీరు పని ఒత్తిడిలో ఉంటారనే ఈ శీర్షిక ఎంచుకున్నా!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s