Affectionately dedicated to HP Compaq 6720s

స్వామీ, అతని మిత్రుల కథ చెప్పనా??

ఓసోస్.. ఆ కథా?? దాని గురించి మాకూ బోలెడు తెలుసు… స్వామీ అనే చిన్న కుర్రాడు.. మాల్గుడి అనే మనోహర పట్టణంలో తన తల్లిదండ్ర్రులతో ఉండేవాడు. ప్రాణప్రదంగా చూసుకునే ఒక బామ్మ కూడా.. నాన్న చలా స్ట్రిక్ట్.  అతగాడికి మణి, రాజన్ అనే స్నేహితులు ఉంటారు. వారితో అతని ఆటపాటలు, చిలిపి చేష్టలు, అమాయకపు భయాలు ఇవ్వనీ చదవని వారుండచ్చు.. చూడనివారుండొచ్చు. కానీ రెండూ చేయని వారి చాలా అరదు, అని అంటారా? సరే.. కాదనను.. కానీ నేను చెప్పదలుచున్న స్వామీ వేరు, అతని మిత్రులు వేరు.. అర్.కె. నారాయణన్ రాయలేదు.. వీరిది మాల్గుడి కాదు. వీళ్ళు కనిపించేది.. “సలాం హైదరాబాద్” అనే తెలంగాణ నవలలో. రాసింది లోకేశ్వర్.. ఆ కథేమిటో చూద్దామా…

* ఇందులో ముఖ్యపాత్రధారి, స్వామీ. అతని కథతోనే మొత్తం హైదరాబాద్ కథ (చరిత్ర) చెప్తాడు.. రచయిత. ఇతని చుట్టూనే కాదు.. హైదరాబాద్ లో ఏ కొద్ది సేపు గడిపిన వారికైనా తను ఇలానే అల్లుకుపోతుంది. తన నుండి విడిపోని బంధం కలిగిస్తుంది. ఈ రచన చదవండి.. కాదనిపించకపోతే నాకు చెప్పండి.

* ఆర్.కె.నారాయణ్ రాసిన స్వామీ ఆండ్ హిస్ ఫ్రెండ్స్ లోలా ఈ స్వామీకీ ప్రాణ స్నేహితులు ఉన్నారు. పేరుకే కాదు.. నిజంగా వీరు “ప్రాణాలిచ్చే” స్నేహితులు. మాల్గుడిలో గట్లెమ్మటా.. పుట్లెమ్మటా.. ఆ స్వామీ వాళ్ళు ఆడుకుంటే.. గల్లీలలోనూ, కాలేజీ గ్రౌండ్లలోనూ వీళ్ళు ఆడుకున్నారు జీవితాలను పణంగా పెట్టి!! బాల్యం ఆ స్వామీకి స్నేహం కుదిరిస్తే.. యవ్వనంలోని ఉడుకు రక్తం ఈ స్వామీ స్నేహ రహస్యం. ఓ విషయం చెప్పనా?? మీకూ నాకూ లాగానే.. స్వామీకి  ఆర్.కె.నారాయణ్ రాసిన స్వామీ ఆండ్ హిస్ ఫ్రెండ్స్ భలే ఇష్టం.

* రాజన్ వాళ్ళ నాన్నకి ట్రాంస్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే ఆ స్వామీ ఏడుస్తాడు కదా.. అలానే ఈ స్వామీ ఏడుస్తాడు తన మిత్రులు బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయినప్పుడు. Professional అన్న టాగు, మెడలో ఐ.డీ తగిలించుకున్నా క్లోజ్ కోలీగ్స్ వెళ్ళిపోతుంటే నేనూ మూలుగుతా!! “హర్ ములాఖత్ కా అంజామ్ జుదాయి క్యోం హోతీ హై??” ప్రతీ కలయికా.. వీడ్కోలే గమ్యమంటూ ఎందుకు పరిగెడుతుంది?? 😦

*ఒక తల్లి తన బిడ్డను కోల్పోతే ఆ బాధ వర్ణణాతీతం. తన బిడ్డ పోయాడన్న నిజం నమ్మలేక.. అతడు తన కళ్ళముందు కనపడక పడే వేదన, బాధకు పరాకాష్ఠ అనిపిస్తుంది. కానీ ఈ పుస్తకం చదివితే ఇంకా హృదయవిదారక సందర్భాలున్నాయని తెలిసింది. వరుసగా ముగ్గురిని పోగట్టుకున్న ఓ తల్లి, తన నాలుగో బిడ్డకు కూడా అనారోగ్యం చేసి మంచం పడితే.. అతడి ప్రతీ కదలికలో ఆమెకు చావు సూచనలు కనిపిస్తాయి. మృత్యువుతో ఆమెకు అంత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఒకరకంగా ఆమె మృత్యువుకి అలవాటు పడిపోయి.. బిడ్డ చనిపోయిన నాలుగు రోజుల వరకూ ఏడవలేదు!! నన్ను చాలా కష్టపెట్టిన ఘట్టం ఇది.

* “There’s nothing in hyderabad man.. not even strikes. I know how many holidays we used to get due to issues in B’lore” షేర్ ఆటోలో వెళ్తుంటే ఓ ఇంజనీర్ మనోగతం ఇలా బయటపడింది. హైదరాబాద్ లో గొడవలు ఆషామాషీగా జరగవు తండ్రీ.. తలలు తెగిపడతాయి.. ఊర కుక్కల్ని వేటాడినట్టు గల్లీల్లో తరిమి తరిమి కాలుస్తారు.. బయట నుంచుని పిల్లాడికి అన్నం తినిపిస్తున్న తల్లి ఏ తుపాకీ గుండెకైనా బలికావచ్చు. పండు ముసలిదాని ముక్కుపుడకకోసం ముక్కే కోసికెళ్ళగలరు. నమ్మాలనిపించకపోతే.. 60, 90 దశకాలలో హైదరాబాదును చూసిన వారిని అడగండి.. హైదరాబాద్ అంటే వెన్నులో ఎందుకు వణుకు పుట్టేదో!! అంతలా రక్తసిక్తమైనది ఈ నేల. ఆ రక్తాన్ని మనకి అంటుకోకుండా ఈ పుస్తకాన్ని పూర్తి చేయలేము.

* అరెరే.. 1960లలో జరిగిన తెలంగాణ పోరాటం.. ఇంత దారుణంగా నీరు కారిపోయింది. ఇప్పుడా చనిపోయిన వాళ్ళ త్యాగాలంతా వృధా అని కాసేపు విచారించాను. ఆ మర్నాడు మా డాక్టర్ రెసెప్షన్ లో ప్రజా సాహితీ పుస్తకం తిరగేస్తుంటే.. ఈ వాక్యం కనిపించింది. “విప్లవాలకు విఫలం అవ్వడం అంటూ ఉండవు.. అవి జరగటమే విజయమని”. అసలు ప్రత్యేక తెలంగాణ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు.. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత.. అప్పుడన్ని ప్రాణాలు ఒక ఆశయం కోసం పోరాడితే.. ఇప్పుడది పదవుల పాకులాటగా మారిందనిపిస్తుంది.

* “చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్” అన్న సినీ కవి ఎవరో గాని.. జీవితాన్ని కాచి వడబోశారు. తెలంగాణ విప్లవంలో ప్రాణాలు పోగొట్టుకున్న ఓ యువకుడి చావును రచయిత వర్ణించిన తీరు చెప్పడానికి నాకు మాటలు సరిపోవు. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా కాలనీలో ఓ పదిహేనేళ్ళ అబ్బాయి.. బావిలో పడిన చిన్న పాపను రక్షించబోయి చనిపోయాడు. కాలనీ అంతా ఏకమై ఏడ్చింది ఆ రోజు. చిన్నదాన్ని కావున అమ్మ బయటకు రానివ్వలేదు. నువ్వప్పుడు చూడలేదు కదా ఇప్పుడు చెప్తా విను అంటున్నట్టు అనిపించింది ఈ ఘట్టం చదువుతుంటే!!

* ఈ మధ్య పుస్తకాల కొట్టుకు వెళ్ళిన ప్రతీ సారి.. ఓ అందమైన ముస్లిం అమ్మాయి కనిపిస్తుంది, White Mughals అన్న పుస్తకం మీద. చరిత్ర నాకెందుకులే అని వదిలేస్తున్నా!! తీరా చూస్తే అది పాట్రిక్, ఖైరున్నిసా అనే హైదరాబాదీల ప్రేమకథ. కులీ కుతుబ్ షాహ్.. ప్రేయసి.. భాగమతిది మతాంతర ప్రణయం అయితే.. ఈ నేలపై మరో మనోహర ప్రేమకథ ఉందని, అది ఖండాంతరాలు దాటిందని “సలాం హైదరాబాద్” లోనే తెలిసింది. ఇది ఒక హృదయవిదారకమైన ప్రేమకథ. చదివితేనే తెలుస్తుంది.

* హైదరాబాద్ లో ఎక్కువగా వినిపించే “తీన్ మార్” సంగీతం.. ఆఫ్రికన్ జాతీయులు పరిచయం చేసిందని తెలుసా?? ఇక్కడి హలీం పర్షియా నుండి వచ్చింది. ఇక్కడి బంగారం, వజ్రం వ్యాపారులు ఉత్తరభారతం నుంచి వలస వచ్చిన వారు. విభిన్న సంస్కృతలను తనలో కలుపుకుని నిత్య స్రవంతి హైదరాబాద్. దాన్ని అర్ధం చేసుకోవాలే గాని, “భాష ఏమిటి.. నీరు ఏమిటి?” అని ప్రశ్నిస్తే అది మన అవివేకమే అవుతుంది.

*మొన్నో ఆదివారం పూట అంతా కలిసి పాతబస్తీ తిరిగి రావాలని నన్నూ పిలిచారు. నేను కుదరద్దన్నాను. వాళ్ళు వెళ్ళి చార్మినార్, మ్యూజియం, మక్కా మస్జీద్ ఇంకా చూసొచ్చారు. నేను ఇంటిలోనే ఉండి.. ఈ పుస్తకం చదివుతూ.. వారి చూసినవాటితో పాటు.. గత నాలుగువందల సంవత్సరాల చరిత్ర అనుభవించాను.

* హైదరాబాద్ మారిపోతోంది. ఒక ప్రేమనగరం ఉండి మహానగరం వరకూ తన ప్రస్థానం అమోఘం. కానీ కొన్ని అందమైనవి దూరమైపోతున్నాయి. ఇప్పుడా laidbackness లేదు, గాలిలో ఆ షాయరీ లేదు, రోడ్డు మధ్యలో పెద్ద చెట్లు లేవు, హాయిగా ఉండే అంత “ఆంగన్”లు లేవు, మనస్సంతా చేయిగా చేసి సలాం చెప్పే సర్వర్లు లేరు, జోకులేసుకుంటూ షాపింగ్ కి వచ్చిన అందరనీ ఆకట్టుకునే కొట్టువాళ్ళూ తగ్గిపోయారు. మార్పు సహజం. అందుకే వాటి స్థానే వచ్చిన వాటిని అలవాటు చేసుకోక తప్పదు.

ఇదంతా చదివి మీకు పుస్తకం చదవాలి అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ కింది విషయం గురించి మాత్రం ఆలోచించండి.

మనం ఎవరైనా ఇంటికి అతిథిగానో, ఆప్తుని గానో, చుట్టం చూపుకో, పలకరింపుకో.. మరిదేనికో వెళ్ళామనుకోండీ.. మన సంస్కారం అక్కడ ఉన్న వసతులు కాదు వారి ఆప్యాయతలు, అభిమానాలు చూడాలి అని చెప్తుంది. అది డబ్బు కట్టి ఉండే హోటల్ కాదు కాబట్టి.. నచ్చినా, నచ్చకపోయినా కలసిపోయే ప్రయత్నం చేయాలి గాని ఇలా ఉండాలి అని నిర్దేశించే అధికారం లేదు. వారి తాహతు తగ్గట్టు గుడిసెలో ఉన్నా.. మిద్దెలో ఉన్నా.. వారి మనసులే మనకు ముఖ్యం కదూ?? అలాంటి చాలా ఇళ్ళు కలిస్తేనే ఊరు అవుతుంది. అంటే.. ఇంటికి వ్యక్తిత్వం ఆ ఇంటి మనషుల బట్టి వచ్చినట్టే.. ఊరికి వ్యక్తిత్వం ఇచ్చేది ఆ మనుషులే!! అంగులు ఆర్భాటాలు బట్టి .. అది ఒక మారు మాల గ్రామమా? లేక మహానగరమా అని తేడా ఉన్నా.. వాటికీ అస్తిత్వం ఉంటుంది. మనకి కొన్ని పద్ధతులు నచ్చలేదనో.. మనకి ఆ ఊర్లో సౌకర్యంగా లేదనో ఆ ఊరిని హేళన చేయడం, తెగడడం.. నాగరికులు చేసే పని కాదు. అలా చేస్తే.. ఏ ఊరు క్షమించదు.. ఉప్పెనల్లే మీదకు ఉరుకుతుంది.

హైదరాబాద్ అనే కాదు.. మీరీ టపా ఏ ఖండం నుంచి చదువుతున్నా.. అది ఈ లోకంలో భాగమే. మిమల్ని అక్కున చేర్చుకుంది. కాబట్టి ఆనందించండి. అనుభవించండి. ఇది నచ్చలేదంటూ గోల చేసేముందు.. నచ్చిన వాటికోసం వెతకండి. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ఇంకో వ్యక్తిపై రుద్దడం ఎంత అనాలోచితమో.. ఒక నగరం పై రుద్దడం కూడా అంతే!!

హైదరాబాదీలే కాదు, ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం. ఇది ఒక జీవితం గురించి కాదు. కొన్ని వందల సంవత్సరాల్లో జీవించిన ప్రతీ ఒక్కరి కథ.. “సలాం హైదరాబాద్”!!

********************

ఈ పుస్తక కొనుగోలు వివరాలు:
పేరు: సలాం హైదరాబాద్ (తెలంగాణ నవల)
రచయిత: లోకేశ్వర్
ప్రచురణ: గాంధీ ప్రచురణ
వెల: 99
పుటలు: 250

విశాలాంధ్ర వంటి అన్ని ప్రముఖ పుస్తక కొట్లల్లో దొరుకుతుంది
అంతర్జాలంలో ఈ పేజీలో చూడండి: http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=192

19 Responses to “స్వామీ, అతని మిత్రుల కథ చెప్పనా??”

 1. sujata

  Good. I felt like this post has been written especially for me, since I have certain amount of resentment about this City. I would like to tell you that this unhappiness is due to the failing infrastructure and failing public spirit, that was hurting. For that matter, every city / town has its own humble history. And I like Delhi for its plusses and minusses.. A city should be felt with its ‘aatma’. Since I have never experienced the ‘aatma’ of this city, I never liked it from the first place. Thanks for introducing this book. I hope I will get a copy soon. However, it is not difficult to fell in love with a place where all friends live. (though Vizag is my first love.. :D) ..mmm.. Thanks.

  Like

  Reply
 2. సుజాత

  బాగుంది పూర్ణిమా! మరి ఈ పుస్తకం ఎప్పటిది, పబ్లిషర్స్ ఎవరు, ఎక్కడ దొరుకుతుంది…అసలు దొరుకుతుందా ఇవన్నీ కూడా ఇస్తే నా లాంటి వాళ్ళకు ఉపయోగం కదా! నిజంగానే కొత్త పుస్తకం ఇది నాకు!

  అన్నట్టు gulabi98@gmail.com కి నాకో మెయిల్ కొట్టగలవా, కొంచెం పనుంది!

  Like

  Reply
 3. సుజాత

  బాగుంది పూర్ణిమా ,పొద్దున్నే పొగలు గక్కే ఫిల్టర్ కాఫీతో పాటు నీ టపా చదవటం! మరి ఈ పుస్తకం ఎప్పటిది, పబ్లిషర్స్ ఎవరు, ఎక్కడ దొరుకుతుంది…అసలు దొరుకుతుందా ఇవన్నీ కూడా ఇస్తే నా లాంటి వాళ్ళకు ఉపయోగం కదా! నిజంగానే కొత్త పుస్తకం ఇది నాకు!

  అన్నట్టు gulabi98@gmail.com కి నాకో మెయిల్ కొట్టగలవా, కొంచెం పనుంది!

  Like

  Reply
 4. కత్తి మహేష్ కుమార్

  ఒక పుస్తకం సమీక్షని ఇంత personal గా చెప్పడం చాలా బాగుంది. అదీ నవరసాలు పండిస్తూ! నీకంటూ ఒక శైలి వృద్ధిచెందుతోంది, అది అద్భుతంగా ఉంది.

  ఈ పుస్తకం ఖచ్చితంగా కొనాలి. రచయి ఎవరు? పబ్లిషర్ ఎవరోకూడా చెబితే, సౌకర్యంగా ఉంటుంది.

  Like

  Reply
 5. మేధ

  Swamy and His Friends గురించి చెబుతూనే, సలాం హైదరాబాద్ గురించి వివరించారు.. నేను ఈ పుస్తకం సమీక్షలు అంతకుముందు చదివాను.. ఈ సారి ఇక లేట్ చేయకుండా పుస్తకం చదవాలి!

  Like

  Reply
 6. Kranthi

  huuuuuuuuu nice one again meeru naaku ekkadaleni interest teepisthunnaru bokks chadavatamlo.already ‘ASAMARDUNI JEEVITHAYATRA’ chadivinchesaru.ippudu idi.Koncham details chepthe konukkunta andi.advance thanks

  Like

  Reply
 7. Vamsi Krishna

  ‘chadivina pustakam – neerchukunna jeevitham’ anna tag ento artham kaaledandi…ante artham enti??

  >> Purnima: *మొన్నో ఆదివారం పూట అంతా కలిసి పాతబస్తీ తిరిగి రావాలని నన్నూ పిలిచారు. నేను కుదరద్దన్నాను. వాళ్ళు వెళ్ళి చార్మినార్, మ్యూజియం, మక్కా మస్జీద్ ఇంకా చూసొచ్చారు. నేను ఇంటిలోనే ఉండి.. ఈ పుస్తకం చదివుతూ.. వారి చూసినవాటితో పాటు.. గత నాలుగువందల సంవత్సరాల చరిత్ర అనుభవించాను.

  ippudu velli paatha basthi, charminar, museum choodandi… inkaa baaga njoy chesthaaru!!!

  — Vamsi

  Like

  Reply
 8. పూర్ణిమ

  sujata: That just not for you, it is for me as well if I’ve to leave this city. I had heard enough of my city and never counteracted, since I can empathize. You got to read this book, to understand why I went out and out with the message.

  సుజాత గారు:
  రాత్రి చాలా ఆలస్యం అయ్యిపోయి ఆ వివరాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చాను చూడండి. పుస్తకం దొరకటం అంత కష్టమేమి కాదని నా అభిప్రాయం.

  మహేశ్ గారు:
  పుస్తక వివరాలు ఇచ్చాను. గమనించగలరు. మీ అభినందనకు నెనర్లు!!

  మేధ గారు:
  నేనూ ఏదో పొద్దుపోక ఈ పుస్తకాన్ని కొన్నాను. కానీ చదివాక తెలిసింది, మిస్స్ కాకూడని పుస్తకం అని. చదవండి.. నిరుత్సాహ పరచదని నా నమ్మకం.

  క్రాంతి గారు: నెనర్లు. పుస్తక వివరాలు ఇచ్చాను చూడండి.

  వంశీ గారు:
  నేను రాసే పుస్తక పరిచయాలను సమీక్షలు అనరు.. ఎందుకంటే ఆ పుస్తకంలో ఏముంది, ఏలా రాసారు, బాగుందా, శైలి ఏంటి, శిల్పం ఏమిటి.. వీటి గురించి ణేను చెప్పను గనుక. నేను చదివిన పుస్తకంలో నాకు నచ్చిన పాఠాలు, నాకు ఆనందం కలిగించిన విషయాలు మాత్రమే చెప్తాను. It’s all about the personal impressions the book has left on me. అందుకే ఆ టాగ్!!

  నిజమే.. ఒక సారి ప్లాన్ వేయాల్సిందే!!

  Like

  Reply
 9. సిరిసిరిమువ్వ

  మంచి పరిచయం. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ పుస్తకం. సుజాత(గడ్డి పూలు)గారి లానే నాకూ హైదరాబాద్ అంత నచ్చదు,కాని ఈ పుస్తకం చదివాక హైదరాబాద్ అంటే కాస్త ఇష్టం ఏర్పడింది. హైదరాబాద్ గల్లి గల్లి మనలిని తిప్పుతుంది ఈ పుస్తకం.
  @సుజాత (మనసులో మాట),ఈ పుస్తకం 2005లో వచ్చిందండి. అన్ని పుస్తకాల షాపులలో దొరుకుతుంది.

  Like

  Reply
 10. సిరిసిరిమువ్వ

  పూర్ణిమా!”ఇది నచ్చలేదంటూ గోల చేసేముందు.. నచ్చిన వాటికోసం వెతక్కండి”…. “వెతక్కండి”నా , “వెతకండి”నా, అప్పు తచ్చా?? సరిచేయండి లేకపోతే అర్థమే మారిపోతుంది.

  Like

  Reply
 11. వేణూ శ్రీకాంత్

  పూర్ణిమా పుస్తకం గురించి చాలా బాగా పరిచయం చేసారండీ… పుస్తకం లో చెప్పినట్లు ఉంటే అందరికీ నచ్చుతుందండీ కాని హైదరాబాద్ మారిపోతుంది అని చెప్పిన విషయాలే ప్రస్తుతం ఉన్న వాళ్ళకి నచ్చక పోడానికి కారణాలు అని అనుకుంటున్నా. పలకరింపు గా నవ్వితే పైకీ కిందకీ అనుమానాస్పదం గా చూసే వాళ్ళని చూస్తే ఎవరికి విసుగు రాదు చెప్పండి… బస్సుల్లో అసభ్యం గా ప్రవర్తించే కుర్రాళ్ళు, ట్రాఫిక్ రూల్స్ పాటించని జనాలు, ఓ చిన్న గుడి పేరుతో రోడ్ వెడల్పు చేయడానికి అడ్డుకునే మత పెద్దలు, కొంటే కొను లేకపోతే లేదు అన్నట్లు చూసే వ్యాపారులు వీళ్ళందరి మధ్య ఎంత సర్దుకుపోయినా ఏదో ఒక రోజు ఊరి మీద విసుగు రాక పోదు. కానీ నలు మూలల నుండీ భిన్న సంస్కృతుల జనాలు వచ్చి చేరుతుండే కొద్దీ ఇలాంటి మార్పు తప్పదేమో…

  ఊరు నచ్చాలి అంటే మొదట మనుషుల వ్యక్తిత్వం నచ్చాలి ఆ తర్వాతే వసతులు, కానీ నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయే బంధువుల ఇంటికీ అక్కడే స్తిరపడదాం అనుకునే ఊరికి పోల్చ లేమేమో. వసతులు కల్పించవలసిన అవసరం, అవకాశం ఉండి కూడా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుంటే చూస్తూ జీవిత కాలం సర్దుకుపోతూ ఉండలేం కదండీ… అలానే వాతావరణం, కాలుష్యాన్ని తగ్గించి కొంతవరకు మనము ప్రభావితం చేయగలిగినా, కొన్ని ఊర్లలో అన్ని కాలాల్లోను Extreme గా ఉండే వాతావరణాన్ని తిట్టుకోకుండా ఎలా ఉండగలం చెప్పండి. ofcourse ఇవన్ని భరిస్తూ ఉండమని ఊరు మనని బతిమిలాడదు మనని అక్కున చేర్చుకుని మన అవసరాలు కొన్ని తీరుస్తుంది కనుకే మనం ఉంటున్నాం అంత మాత్రాన అసహనాన్ని కనీసం మాటలలో అయినా వెళ్ళగక్కుకోనివ్వక పోవడం అన్యాయం.

  Like

  Reply
 12. పూర్ణిమ

  సిరిసిరిమువ్వగారు: నెనర్లు 🙂 అచ్చు తప్పు సరి చేసాను.

  వేణూ గారు: మీరంటున్నది నేను అర్ధం చేసుకోగలను. నాతో చాలా మంది హైదరాబాద్ ని అంటుంటే కూడా విని ఊరుకున్నాను. తిరిగి మాట్లాడలేదు.. వారిని అర్ధం చేసుకున్నాను. ఈ పుస్తక పరిచయంలో మాత్రం అలా ఎందుకు రాసానో.. ఇది చదివితే గానీ అర్ధం కాదు. అసలు 1960లో అంత భీభత్సమైన తెలంగాణ పోరాటం ఎందుకు జరిగిందో కారణాలు తెలియాలి. I strongly recommend the study of the book, if u want to really know what I mean.

  Like

  Reply
 13. వేణూ శ్రీకాంత్

  Sure Purnima, I am planning for a trip to india next month and making a big list of books and movies i want to get. So i already added this one to my list.

  Like

  Reply
 14. ఏకాంతపు దిలీప్

  @ పూర్ణిమ
  ఏ బావిలోనుండి తోడతావు ఇన్ని భావాలు?!!
  ఆ పుస్తకం చదినప్పుడు అన్ని భావాలు నన్ను తడతాయో లేదో నాకు తెలియదు కానీ ఈ పరిచయం చదివిన తరవాత నాకు తప్పకుండా చదవాలని ఉంది.

  మొదట్లో డిల్లీ ని అలానే తిట్టుకునేవాడిని… తరవాత అలావాటు పడ్డాను… ఒకసారి ఈ ప్రాంతంలో జీవనానికి అనుకూలమైన అంశాల గురించి నా స్నేహితునికి చెప్తూ నాలుక్కరుసుకున్నాను… నాలొ వచ్చిన మార్పుని చూసి!

  నీలాగా పరిచయం చేసేవాళ్ళుంటే ఎన్ని ఊళ్ళైనా తిరిగెయ్యగలను… ఎన్ని పుస్తకాలైనా తిరగేయగలను.. 🙂

  Like

  Reply
 15. MURALI

  మహేష్ గారు చెప్పినట్టు పుస్తక సమీక్షలా కాక చదువుతున్నప్పుడు మీ మనసు అనుభూతులు తెలియజేసారు. అందుకే ఈ టపా మనసుకి హత్తుకొనెలా వుంది.

  Like

  Reply
 16. పూర్ణిమ

  Soumya.. I picked up the book, because of the review u suggested. 🙂

  Anyway, I read it again!! Good one.. that is!!

  Like

  Reply
 17. లలిత (తెలుగు4కిడ్స్)

  పూర్ణిమా,
  టొటో చాన్ పుస్తకం మీద నువ్వు రాసిన ఆర్టికల్ తర్వాత బహుశా ఈ ఆర్టికల్ అనుకుంటా నన్ను అంతగా ప్రభావితం చేసింది.
  తప్పుగా అనుకోవద్దు. వేరే పుస్తకాల గురించి బాగా రాయలేదని కానే కాదు.
  నిజానికి స్వామీ, అతని మిత్రులు అని శీర్షిక లేకుంటే నేను ఇది ఇప్పుడిప్పుడే చదివే దాన్ని కాదేమో. ఈ పుస్తకం తప్పకుండా చదవాలి అనిపిస్తోంది.
  హైదరాబాదు గురించి నాకు గుర్తు వచ్చేది ఒకటి ఉంది. ఈ నగరాన్ని కట్టించి ఇక్కడ సముద్రంలో చేపలు నిండినట్లు జనాభా పెరగాలి అని కోరుకున్నాడట కులీ కుతుబ్ షా. నాకైతే అలా గుర్తుంది చిన్నప్పుడు చదివినట్టు. అతని కోరికే కనిపిస్తుంది నాకు పెరుగుతున్న పట్నం చూసినప్పుడల్లా.
  హైదరాబాదుని ఇష్టపడే వారినీ చూశాను. ఐతే ఇష్టపడని వారిని చూస్తే కోపం వచ్చేది నాకు. తమ స్వంత ప్రాంతంలో ఎలా ఉండే వారో అంత స్వేచ్చగానూ తమ సంస్కృతి సాంప్రదాయాలు, తమ స్వంత ఇష్టాలకి అనుగుణంగా జీవించగలుగుతూ ఈ నగరాన్ని ఇంకో నగరంతో పోల్చి కాని ఇంకెందుకైనా తక్కువ చేస్తే, ఇష్టం లేదని అంటే చాలా బాధ వేసేది కూడాను.
  ఏ ప్రాంతమైనా నువ్వన్నట్లు ఆ ప్రాంత ప్రజలు. అప్పటి ప్రజలు వేరు ఇప్పటి ప్రజలలో మనమందరమూ ఉన్నాం. సంఖ్యలో ఐతే పోలికే కష్టమేమో కదా.
  ఐనా ఇవన్నీ పుస్తకం చదవకుండా కేవలం నగరంతో నా అనుబంధం వల్ల మాట్లాడుతున్న విషయాలు.
  మనం ఉన్న చోటుని ప్రస్తుతం అది ఏ ఊరైనా మనం గౌరవించి ప్రేమించాలి అన్న నీ మాటలు కూడా అందరం అర్థం చేసుకోవాలి, అందుకు ప్రయత్నించాలి.
  చాలా బాగా రాశావు.
  అవునూ నీ గుండె ఇంత intensity of emotions ని ఎలా భరిస్తోంది? నీకు roller coasters ఇష్టమో లేదో తెలియదు కానీ emotional roller coaster మీద ఇలా పుస్తకాలు చదువుతూ ride చెయ్యడం లో నాకు అర్థం చేసుకునే సాహసం లేని ఆకర్షణో, ఆనందమో, ఉహూ సరైన పదం దొరకడం లేదు, ఏదో ఉందనిపిస్తోంది:) ఇది కూడా I tried to say in a good sense. అర్థం చేసుకో 🙂

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

%d bloggers like this: