Affectionately dedicated to HP Compaq 6720s

మనసు విప్పిన మనసైన నేస్తం…

ఆయ్.. నమస్కారమండీ.. ఇక్కడ ఎదో జ్ఞాపకాల పోటీ జరుగుతుందట కదండీ.. అందుకే నేను ఒచ్చానండీ.. నా గురించి చేప్పుకుందాం అనీ. న్యాయంగా అయితే ఈ అమ్మడు వచ్చి “ఇదో.. ఇవీ నా జ్ఞాపకాలు” అని చెప్పాలండీ.. కానీ ఎక్కడండీ.. తను రావటం లేదండీ.. పైగా నన్ను తలుచుకోగానే మూలగడం మొదలెట్టుదండీ.. అందుకే నేనే చెపుదాములే అని వచ్చేశానండీ.. మొదలెట్టేయమంటారా అండీ??

నా పేరు “ఉత్తరం” అండీ.. ఆయ్!! అల్లా కాదండీ.. తూర్పూ..ఉత్తరం.. వాస్తు అవి కావండీ!! నేను మీరు రాసుకునే ఉత్తరాన్ని, లేఖ అని కూడా అంటారే.. అది నేనే అండి. మరే!! మీరంతా నన్ను మర్చిపోయారనుకున్నా గానీ.. బానే గుర్తుపట్టేసారే!!

అయినా నేనేమయినా ఆషామాషీ దాన్నా అండీ మీరంతా నన్ను మర్చిపోవడానికి. దూరాభారంలోనూ మీ ఆప్తులతో నేను కాదటండీ.. మీకు సాయం చేసేది, మీ మనసు ఆవలికి చేర్చేది. నన్ను రాయడానికి మనసును కదిలిస్తే చాలును కదండీ. తోకలేని పిట్టవలె ఎంతెంత దూరమైనా ఎగిరి మీ వాళ్ళ చేతుల్లో పడనటండీ!! మనసు మనసుతో రాయబారం కుదిర్చేది నేనే కదండీ!! నా గురించి నాకు అంతగా చెప్పడం అలవాటు లేదనుకోండీ.. అయినా ఇదో ఈ అమ్మాయి కోసం చెప్పాల్సి వస్తుంది.

ఈ అమ్మికి ఉత్తరాలు రాసే అలవాటు భలే విచిత్రంగా అంటుకుంది లేండి. అమ్మానాన్నలతోనే ఉండడం, చుట్టాలతో రాకపోకలు, చుట్టూ ఎప్పుడూ కావలసిన వారు ఉండడం, అన్నీ అమర్చిన జీవితంలో.. నా అవసరం లేదేమో అనుకున్నా.. కానీ తనకెప్పుడూ రాయటమంటే ఇష్టమండి. కలం కాగితం ఉంటే వాటి అంతు చూసేస్తుంది. తన ఒక చోట కూర్చిని ఉంటే.. చూట్టూ కాగితాల సముద్రం ఉండాల్సిందే అండి! ఈ కాలంలో లాప్ టాప్ ముందు కూర్చుంటుందా.. అయినా కాగితాలు, కలం చేతికందేంత దూరంలో ఉంటాయండీ. రాయడాన్ని ఇంతిలా ఇష్టపడే తను.. నా నుండి ఎందాకా దాగుతుందా అని నాకు ముందునుంచీ అనుమానమేనండి. బాగా రాస్తుందా లేదా అన్నది మీ అనుమానం కావచ్చండీ.. కానీ నాకవ్వన్నీ ఎందుకండీ.. తన చిన్నారి చేతులు నామీద కదులుతూ ఉంటే.. కలంతో వత్తి పెట్టి రాసినా నాకు బాధ తెలియదండీ. ఇంతకీ మా పరిచయం ఎలా మొదలయ్యిందో చెప్పనే లేదు కదూ..

వీళ్ళకి తెలుగు వాచకంలో పి.టీ. ఉష గురించి ఉండేదండీ ఒక తరగతిలో. అందులో ఎవరో విదేశీయుడు ఉషగారిని మీద అభిమానంతో అడ్రెస్ తెలియకపోయినా.. పి.టీ.ఉష, ఇండియా అని మాత్రమే రాసి నన్ను పంపించాడట. అది కూడా ఆవిడకు చేరిందట.. ఆవిడేమైనా సామాన్యురాలా చెప్పండీ!! అది విన్న ఈ అమ్మీ, తన మిత్రత్రయం అప్పుడప్పుడే ఒక వెలుగొందుతున్న క్రికెటర్ల పై చిగురిస్తున్న అభిమానాన్ని ఈ విధంగా పరీక్షించాలి అనుకున్నారు. చిరునామా లేని ఉత్తరాలు పంపించి ఎవరి నుండి సమాధానం వస్తే వారే గొప్ప అని!! అందరిలోకీ రాయడం పై మక్కువ ఎక్కువ, పైగా చేతి రాత కూడా బాగుండడంతో ఈ అమ్మాయే రాసింది .. అదే తన మొదటి లేఖ. ఎంతో శ్రమించి రాసిన ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేసారో గుర్తు లేదో కానీ.. ఈ ముగ్గురు అమ్మాయిలూ ఒక్కటైపోయ్యారండి.

ఉత్తరాలు రాస్తే.. భాష, భావవ్యక్తీకరణ రెండూ మెరుగవుతాయని పై ప్రయత్నంతో గ్రహించిన వీరు.. బడిలో రోజూ కలుసుకుంటున్నా.. వారాంతంలో ఒక్కో అంశం మీద లేఖలు ఇచ్చిపుచ్చుకునేవారు. అడపా దడపా పాఠశాలకు వచ్చే సెలవల్లో ఉత్తరాలు రాసుకోవడంతో ఇంకా దగ్గరయ్యారు. అప్పుడు మన పని యమా బిజీ గా ఉండేది.. ఇటు నుండి అటూ, అటు నుండి ఇటూ.. ఒకటే తిరుగుడండీ!! ఏమిటో రాసుకునే వారు.. కానీ మనసంతా నేనుగా మారేదాన్ని.. ఆయ్!! “ఏమిటమ్మా .. ఇవీ?? పోస్టేజీ స్టాంపులు ఎంతవుతున్నాయో.. చూసుకో” అని పోస్ట్ మాన్ వాపోయేవాడండీ పాపం!! అయినా వీళ్ళు భారతాలు రాసుకునేవాళ్ళూ… అది ఉత్తరమో.. ఉత్తరాల దొంతరో వారికే తెలిసేది. అలా అని “నేను లేచా.. నిద్ర పోయా..” అంటూ ఉండేవి కావండి.. నాకు తెలుసు గదా!! మనసు మనసుతో మాట్లాడుతుంటే.. ఎన్ని మాటలయినా తక్కువే.. కదండీ!! మనసులను కలిపే నాలో ఎన్ని అక్షరాలున్నాయో లెక్కపెట్టడం అవివేకం.. ఎంత మనసుందో చూడాలి అంతేనండి!!

పాఠశాల అయ్యిపోయాక.. అందరూ వేర్వేరు కాలేజీలకు మారిపోయారు. నా చలువ వల్లే పాత వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కాలేజీ అంటే.. కొత్త స్నేహాలు.. అప్పుడప్పుడే ఏర్పడిన స్నేహంలో అంత గాఢత ఉండదు కదండీ.. ఉత్తరం రాయగలగాలి అంటే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం తప్పనిసరి.. ఎదో ఒక రూపంలో ఒకరికొకరు అర్ధం అవ్వాలి. తన తాతగారితో పోట్లాడినంత పని చేసి మరీ నెహ్రూ రాసిన “Discoveries of India” పుస్తకాన్ని తెచ్చి ఇచ్చిన స్నేహానికి కృతజ్ఞతగా ఏమి చేయాలో తోచక.. నేరుగా లేఖ రాస్తే తన ప్రవాహంలో కొట్టుకుపోతుందేమో అని భయపడి.. నన్ను నన్ను గా రాయబారానికి పంపిందండి. అప్పుడు నేనేమోనండీ,, “ఆయ్.. నా పేరు ఉత్తరమండీ..మీతో మాట్లాడాలండీ” అంటూ అమ్మి మనసులో మాట గడుసుగా చెప్పేసానండీ!! అంతే.. అప్పటి నుండీ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులే!! మరో సారి ఒక స్నేహం అలిగిందని, కలత చెందిందనీ నన్ను పంపిందండి. ఏ మంత్రం వేసిందో గానీ ఆ పిల్ల భలే సంతోషపడిపోయింది.

స్కూల్ వాళ్ళతో మనో రాయబారాన్ని నాతో సంపూర్ణంగా నడుపుతూనే.. కొత్త నేస్తాలకు నా రుచిని కొంచెం కొంచెం చూపిస్తూ.. ఊరిస్తూ ఉండేదండీ. ప్రేమలకు సాయం చేద్దామని.. కవితలు, లేఖలు రాసేవారున్నారని మీకు తెలుసు కదండీ?? ఈ అమ్మి మాత్రం  “ప్రేమ” అనే ఆపోహతో ఉన్న ఓ రెండు జంటలను తన ఉత్తరాలతో చెడగొట్టింది. ఒకరికి అనునయంగా రాస్తే.. మరొకరికి చెంప చెల్లుమనిపించింది. మహా నగరంలో పెరిగీ, ఇంగ్లీషు మీడియం స్కూల్లలో చదువుకుని, సకల ఆధునిక సౌకర్యాలు ఉన్నా.. నన్ను ఆదరించడం నాకెంత ఆనందంగా ఉండేదో చెప్పలేను. కానీ విపరీతమైన చదువులు, రాత్రీ పగలూ కాలేజీలలోనే ఉండడం.. వాటికి తట్టుకోలేక నన్ను కొద్ది కొద్దిగా తగ్గించేశారు. పూర్తిగా అయితే మానలేదులేండీ.. వాళ్ళ గజిబిజి జీవితాల్లో.. కలిపే సన్నని దారంగా.. నేనే!! కానీ ఏం చేస్తాం.. ఒక్కోసారి వత్తిడి విపరీతంగా ఉంటుంది.. అప్పుడు వీళ్ళు నన్ను మరిచిపోయారని కాదు కానీ.. పక్కకు మాత్రం పెట్టారండి.

అటు తర్వాత కాలంలో నేను చాలా తగ్గిపోయాను. అయితే నేం?? మనసు ఏ మాత్రం కలతగా ఉన్నా వీరు చట్టుకున్న నన్ను తెరుస్తారు.. అల్మారాలోంచి. పాతబడిపోయి.. కాగితం రంగు మారి, అక్షరాలు పల్చబడ్డా.. ఆ కళ్ళు నన్ను చదువుతుంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పద్దూ.. అంతకు మించిన జ్ఞాపకాలు ఉంటాయా చెప్పండి. ఫోన్ లో మాట్లాడాక.. మళ్ళీ ఆ గొంతును వినాలనుకుంటే సాధ్యమా?? కాలమనే అలల్లో కొట్టుకుపోకుండా.. నేనే కదా అన్ని జ్ఞాపకాలను పోగు చేసింది. ఆ ఆనందంతో నేనుండగా.. ఈ అమ్మాయి ఏమో ఒకటే బాధపడుతుంది చూడండి.

“నేనే నిన్ను దూరం చేసేసుకున్నానో.. అంతా నాదే తప్పు. సమయం కుదరటం లేదన్నది వంక మాత్రమే.. రాయాలంటే రాయలేను?? నేనే నీకు అర్ధం లేని కారణాలతో దూరమైపోతున్నా” అంటుంది. ఆధునిక సౌకర్యాలు పెట్టుకుని కూడా మూస పద్ధతులు పాటించడం దేనికండీ? చక్కగా నేనే ఉత్తరం నుండి ఈ-మెయిల్ గా మారాను అనుకోవచ్చు. ఇప్పుడేమో ఎంచక్కా తెలుగు అక్షరాలతోనే రాయచ్చు కదా.. అని నేనంటే.. “చేతి రాత మనిషికి ప్రతిబింబం లాంటిది. అది లేనప్పుడు.. నువ్వెంత వెలితిగా ఉంటావో తెలుసా?” అని నిలదీస్తుంది. ఇదీ తన వరుస.. ఒక్కసారి ఇదే అని నిర్ణయించుకున్నాక.. ఒక పట్టాన వేరే మాట చెవికెక్కించదు. నువ్వు నా నేస్తానివి.. నా నేస్తాలందరికీ నా అంతఃసౌందర్యం చూపించిన దానవూ.. ఇప్పుడు నిన్నెలా ఒక మూల పడిన జ్ఞాపకంగా పరిచయం చేయను? అని బాధగా అడిగితే.. నా కళ్ళు మాత్రం చెమ్మగిల్లవా చెప్పండి!!

నిజమే.. ఉత్తరం అంటేనే ఒక ఆత్మను ఆవిష్కరించడం. ఇరు ఆత్మలు సంభాషించుకునే ఆనంద వేళ. ఒక ఉత్తరం మనుషుల దగ్గరకు తీసుకొచ్చినంతగా వేరే దేని ద్వారా సాధ్యం కాదు. ఏకాంతంలోనూ విశ్వఘోష వినిపించేది.. ఉత్తరం రాసేటప్పుడే!!  ఉత్తరం ఎప్పుడూ.. ఎక్కడా.. ఎవ్వరూ… ఒక్కరే రాయరు. మాట్లాడుకోడానికి.. పోట్లాడుకోడానికి ఇద్దరు కావాల్సినట్టే.. ఉత్తరానికి ఇద్దరు కావాలి. ఒక ఉత్తరం రాసేటప్పుడు కలిగిన సాంత్వన.. అవతలి వ్యక్తి ఆ ఉత్తరాన్ని చదివేటప్పుడు వినిపించే హృదయ సవ్వడి.. అనిర్వచనీయం!! చేతిలో కాగితాలు కావవి.. చూట్టూ అల్లుకుపోయిన మనసు యొక్క స్పర్శ. వ్యక్తిగతం గానే కాక.. సామాజిక, చారిత్రిక విశ్లేషణలకు కూడా ప్రముఖుల లేఖావళి ఎంత ఉపయోగపడుతుందో వేరే చెప్పనవసరం లేదు. అంతగా చేరువైన ఉత్తరాలు.. దూరమైతే బాధ నాకర్ధమవుతుంది. ఎప్పుడూ లేఖలు రాసుకోని వారి సంగతేమో గానీ.. ఒక్కసారైనా నన్ను రుచి చూసినవారు..నేను లేకపోతే.. ఆ వెలితిని భరించలేరు.

సాంకేతిక విప్లవం వల్ల నేను మీ అందరికీ దూరం అయ్యుండచ్చు.. కానీ అదే సాంకేతిక విప్లవం.. మల్లా మీదగ్గరకు నన్ను తీసుకువచ్చింది. ఈ-మెయిల్ కూడా నా రూపాంతరం గానే చూడండి.. even if many of them r 2 cursory 4 u.  ఫోన్లు తప్ప వేరే గతి లేకపోతే.. మీరెంతగా నన్ను “మిస్స్” అయ్యేవారో ఊహించుకోడానికే భయంగా ఉంది. అయినా కాలంతో మారాలి.. మీరైనా.. నేనైనా!!

అదీ నా కథ. తను చెప్పలేదు కాబట్టి నేనే రావల్సి వచ్చిందండీ!! ఆసాంతం ఓప్పిగ్గా విన్నందుకు ధన్యవాదాలండి! ఎక్కడో మూల ఉన్నదానిని ఇప్పటికిప్పుడు గబుక్కున లేచి వచ్చి.. ఏదో చెప్పేసాను.. భాష, యాసలో తప్పులుంటే.. పెద్ద మనసుతో క్షమించగలరూ!! ఇక ఉంటాను.. సెలవండీ!!

***********************************************************************************
నాకు మనసైన ఉత్తరం, మనసు విప్పి, నా గురించి మీతో మాట్లాడితే.. ఎలా ఉంటుందా.. అన్న ఊహకి రూపాంతరం ఈ టపా!! బహుమతులిస్తామని ఊరించినా.. జైల్లో పెడతామని బెదిరించినా.. నేనిలా నా ఊహలతోనే మీముందుంటాను ఎప్పుడూ.. 🙂

Letters are among the most significant memorial a person can leave behind them.ఇది ఏ మాత్రం నిజమైనా.. నా దగ్గర ఒక పెద్ద ఖజానా ఉన్నట్టే!! ఈ జ్ఞాపకాలు నాతోనే కాక.. నా ఉత్తరాల రూపంలో నావాళ్ళందరి దగ్గరా ఉండడం.. నా అదృష్టం!! నాతో నన్ను నన్నుగా పంచుకున్న ప్రతీ నేస్తానికీ ఈ టపా అంకితం!!

23 Responses to “మనసు విప్పిన మనసైన నేస్తం…”

 1. మేధ

  నాకు కూడా ఉత్తరాలు వ్రాసే అలవాటు ఉంది.. వైన్ పాతది అవుతున్నకొద్దీ రుచి పెఉగుతున్నట్లు, ఉత్తరం మాధుర్యం కూడా ఏళ్ళు గడుస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది… ఆ పాత ఉత్తరాలని చూస్తే ఎంత బావుంటుందో.. ఇప్పుడు ఉత్తరాలు రాసే సంఖ్య తగ్గినా, నా ఈ-మెయిల్ పెద్ద ఉత్తరం లానే ఉంటుంది!!! మా ఫ్రెండ్స్ నన్ను ఇంత పెద్దవి ఎలా రాస్తావు మాకు కూడా ట్రైనింగ్ ఇవ్వు అంటుంటారు!!!

  మీరన్నట్లు పాత ఉత్తరాలు ఖజానానే….

  Like

  Reply
 2. భావకుడన్

  పూర్ణిమా,

  చాలా కదిలించింది. మరుగవుతున్న ఉత్తరం ఆవశ్యకతను చెప్పకనే చెప్పావు. పైగా చెప్పాలనుకున్న దాన్ని అందంగా చెప్పటంలో చాలా శ్రద్ధ కనపడుతోంది. చిన్న విషయం-పాత ఉత్తరాలు ఉన్నాయి అన్న concept ను తీసుకొని ఉత్తరాల ప్రాముఖ్యం, నీ వ్యక్తిత్వ పరిచయం – ఈ రెండిటినీ మేళవించిన తీరు అమోఘం.

  మొదట మొదలెట్టిన భాషకు, చివర అంతం చేసిన భాషకు వ్యత్యాసం వచ్చింది. టపా నిడివి వల్ల అయ్యుండొచ్చు-కొంచం జాగ్రత్త తీసుకొని ఉంటే బావుండేది.

  ఇంతకు ముందు ఎపుడో “నాలా భావుకత ఉంది నీ బ్లాగులో” అని నా జబ్బలు నేనే చరచుకొన్నట్టు గుర్తు. కాదు- “భావుకతకే నిర్వచనంలా ఉంది” నీ ఈ టపా. congrats.

  Like

  Reply
 3. వేణూ శ్రీకాంత్

  బావుంది పూర్ణిమా…నిజమే మారుతున్న కాలం తో మనమూ మారి email నే ఉత్తరం అనుకోక తప్పడం లేదు కానీ… మనసులో భావాలకి అనుగుణం గా మారే చేతి రాత తో ఉన్న ఉత్తరాన్ని చదవ గలగడం తనే ఎదురు గా ఉండి మాట్లాడినంత అనుభూతిని ఇస్తుంది, అది మిస్ అవుతున్నాం, తెలుగు చదవగలగడం కొంత ఊరటనిచ్చినా ఇక్కడ ఎవరు వ్రాసినా ఎలా వ్రాసినా అదే లిపి.

  Like

  Reply
 4. sneha

  చాలా బాగున్నాయి పూర్ణిమ నీ జ్ఞాపకాలు

  Like

  Reply
 5. కొత్త పాళీ

  Beautiful.
  ఈ పూర్ణిమ టపాలకు ..ఏల కల్గెనో ఈ అతులిత మాధురీ మహిమ అని కించిత్ ఆశ్చర్యపడక పోలేదు. హా తెలిసెన్ .. ఉత్తరాల సుధారస ధారలు గ్రోలడం గ్రోలిపించడం ఉగ్గుపాలతో అలవాటైన వారికి బ్లాగు టపాలొక లెక్ఖా.
  చాలా సంతోషం.

  Like

  Reply
 6. కత్తి మహేష్ కుమార్

  జ్ఞాపకాలని ఉత్తరం మాధ్యమంగా చెప్పి, జీవితంలోని వివిధ స్థాయిల్ని ఆవిష్కరించడం…మంచి ప్రయోగం.

  మొత్తానికి ఓపెనింగ్ బ్రాట్స్ వుమన్ గా వచ్చి సిక్సర్ కొట్టావ్. చూద్దాం రానూ రాను ఇంకెన్ని బంతులు పడతాయో!

  Like

  Reply
 7. Hemanth Potluri

  చాల బాగుంది మీ జ్ఞాపకాలు పట్టిక .. మీ బ్లాగ్ చాల బాగుంది..
  మీ .. హేమూ

  Like

  Reply
 8. కల

  అమ్మ పూర్ణిమా..
  ఇంచుమించు ఇది నా ఐడియా లానే ఉంది. నాది ఎలా కాపీ కొట్టేసారు? అమ్మో నా ఐడియాలన్నింటిని భద్రంగా అల్మారాలో దాచుకోవాలి.

  చాలా బావుంది. ఉత్తరాలతో ఆత్మీయతను పంచినట్టు మాటలతోను, చేతలతోను పంచలేం ఆన్న మీ భావాన్ని చాలా చక్కగా చెప్పారు.
  ఇద నా స్వగతం..
  నాకు, నా స్నేహితుడికి మధ్య ఒకసారి మాటపట్టింపులు వచ్చాయి. ఒక 4 రోజులు ఇద్దరం మాట్లాడుకోలేదు. తర్వాత వాడు నాకో లేఖ పంపించాడు. చూద్దును కదా, అది ఒక తెల్ల కాగితం. దాని పైన ఏమి రాయలేదు. నాకు బాగా కోపం వచ్చింది. విసురుగా వాడింటికి వెళ్లి ఏంటిది అని కోపంగా అడిగాను. “నీ స్నేహం దీనిలా ఇంత స్వచ్చంగా ఉంటుంది. దీన్ని పాడు చేసుకోవడం నాకిష్టం లేదు.
  ఇంకా ఎం చెప్పాలో నాకు మాటలు రావడం లేదురా. మాటలకన్నా మౌనం ఎక్కువ భావాన్ని పంచుతుందని నువ్వే చెప్పావ్ గా ఇదే నా మౌనం.” అని చెప్పాడు. దాంతో నా కోపం అంతా దూదిపింజలా ఎగిరిపోయింది. ఆ సంఘటనను మళ్లీ నాకు గుర్తుచేసింది మీ ఈ ఉత్తరం.

  లోపాల గురించి భావకుడన్ గారు చెప్పినట్లున్నారు.

  Like

  Reply
 9. ప్రతాప్

  పూర్ణిమా,
  ఉత్తరాలతో జ్ఞాపకాలని తవ్వుకోవడం ఆన్న ఆలోచన బావుంది. రచన, వర్ణన, శైలి ఇత్యాదులన్నీ సూపర్. ఈ ఉత్తరం సంగతి ఆత్మకధలా ఉంది. ఇంచుమించు భానుమతిగారి ఆత్మకధ స్థాయిని చేరుకుంది. అన్యధా భావించకండి, ఈ ఉత్తరం మోసిన మరచిపోలేని జ్ఞాపకాలూ తక్కువ అని నా అభిప్రాయం.

  Like

  Reply
 10. duppalaravi

  పూర్ణిమ గారూ, ఇంత సున్నితమైన విషయాలను ఎంత అందంగా అక్షరాలలో అమర్చారో కదా! నెమ్మదిగా పూలను ఒకదానికొకటి చేర్చి అందమైన హారంగా అల్లినట్టు కమనీయ భావ ధారను మా ముందు పరిచారు. మాటల మత్తు జల్లారు. ఎటో వెళ్ళిపోయింది మనసు. మామిడికుదురులో వైఆర్ గాంధీ అని మా గురువు గారు పెద్ద పెద్ద ఉత్తరాలు రాసేవారు. చదవడానికి, అర్థం చేసుకోవడానికి కొన్ని రోజులు పట్టేది. అదో మత్తు లోకం. పైగా సంతకం రజని అని చేసేవారు. ఇంటర్ చదువుతున్న నామీద మా ఇంట్లో అనుమానాలు. అలాగే మధుబాబని ఇప్పుడు హైదరాబాద్ లో ప్రకృతి వైద్యుడు, అతను రాసే ఉత్తరాలు కూడా మరులు గొలిపేవి. మళ్ళీ అవన్నీ మనసులో కదిలి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడలా లేదు కదా అని. నమస్తే.

  Like

  Reply
 11. sujata

  aha ha ha .. Dil khush hogayaa..

  balike !!! ’emi nee korika’ ? ani adagaalanipinchindi !!

  Like

  Reply
 12. బొల్లోజు బాబా

  మీ పోష్టు చదువుతుంటే, చానాళ్లక్రితం నా మిత్రునికీ నాకూ జరిగిన ఉత్తరాల పరంపర గుర్తుకు వచ్చింది.

  ఒక ఇన్లాండ్ లెటర్ లో సరిపోక, పైన పార్ట్: 1, పార్ట్ : 2 అంటూ నాలుగైదు ఉత్తరాలు ఒకె సారి పోష్ట్ చేసుకొని ఆనందించేవాళ్లం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈమెయిల్స్ ఇచ్చుకుంటున్నాము.
  బ్యూటిఫుల్ థాట్స్.
  బొల్లోజు బాబా

  Like

  Reply
 13. జ్యోతి

  శభాష్! పూర్ణిమ. ఉత్తరం మనోభావాలు చెప్పావు. నిజమే చేతితో రాసినా, కంఫ్యూటర్లో టైప్ చేసినా ఉత్తరమైన మెయిల్ ఐనా మన మనసులోని భావాలు, బాధలు, ఆలోచనలు అలా మనసునుండి చేతులలోకి అలా అలవోకగా వెళ్ళిపోయి అక్షరాలుగా మారిపోతాయి. నేను కూడా ఎన్నో పాత మెయిల్స్ అలాగే దాచుకుని అప్పుడప్పుడు చదువుకుని ఆ స్నేహితులను అప్పటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటాను..

  Like

  Reply
 14. పూర్ణిమ

  మేధ గారు: నెనర్లు!!

  భావకుడన్ గారు: చాలానే రాసారు.. నాకు మాత్రం “శ్రద్ధ కనపడుతోంది” అన్నది ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. My efforts may not be good, but they are the most sincere!!

  భాష విషయంలో తడబడ్డాను.. కానీ అంత కన్నా బాగా రాయడం చేతకాలేదు. దాని మీద “కృషి” మాత్రం జరుగుతుందని హామీ ఇస్తున్నాను!! మీ వ్యాఖ్యకీ, అభినందనలకీ, పొగడ్తలకీ, అభిమానానికీ, విమర్శలకీ బోలెడన్ని ధన్యవాదాలు!!

  వేణూ: నెనర్లు!! మీతో నేనూ ఏకీభవిస్తున్నాను!!

  స్నేహా: నెనర్లు!!

  కొత్త పాళీ గారు: అది వ్యాఖ్య కాదు.. నాకో పాఠం కదూ!! Thanks for everything!!

  మహేశ్ గారు: హిహి..నేను క్రికెట్ ఆడితే.. మీరే అంపైర్.. డౌట్ లేకుండా!! 😉 నెనర్లండీ!!

  హేమంత్ గారు: ధన్యవాదాలు!!

  Like

  Reply
 15. పూర్ణిమ

  కల గారు: అన్నన్నా.. రాత్రి రెండు గంటలవుతుందనీ, నిద్రవస్తుందనీ ఏ మాత్రం ఆలసించినా మీ బ్లాగులో నేనిలా వ్యాఖ్య రాయాల్సివచ్చేది మాట. ఇంత మంచి పని చేసినందుకు నాకు నేనే ఓ చాక్లేట్ ఇచ్చుకోవాలి. 🙂

  మీ వ్యాఖ్య నాకెంత సంతోషాన్ని ఇచ్చిందో చెప్పలేను. ప్రతీ మనిషీ ప్రత్యేకం.. ప్రతీ అనుభవం ప్రత్యేకం. మీరు మీ జ్ఞాపకాలు మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను!! లోపాల మీద కుస్తీ మొదలుపెట్టాను.

  ప్రతాప్: ధన్యవాదాలు!! పెద్ద పోలికే పెట్టారూ.. ఎవరూ మన మీద పరువు నష్టం దావా వేయరు కదా?!! 😉 ఇందులో “మర్చిపోలేని జ్ఞాపకాలు” లేవండి. Those are too personal for me to blog. It was a deliberate attempt.

  రవి గారు: మీరు చెప్పినంత అందంగా నేను రాసానో లేదో అనుమానం వస్తుందిప్పుడు. కానీ మీరంతా ఇలా మీ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటుంటే.. నాకెంత ఆనందంగా ఉంటుందో.. పెద్ద ఉత్తరాలు రాయటం.. చదవటం.. రెండూ నాకు చాలా ఇష్టమైనవి.

  సుజాత గారు: ఇంకా ఆలోచనలో ఉన్నారా?? అడగండి.. నా లిస్ట్ రెడీగా ఉంది!! 😉

  బాబా గారు: “పార్ట్ లు.. పార్ట్ లుగా చూస్తే ఇదీ బానే ఉందే..” 🙂 మీ అందరూ ఇలా జ్ఞాపకాలను నెమరువేసుకోవడం.. భలే సంతోషంగా ఉంది నాకు!!

  జ్యోతి గారు: మీతో “శెభాష్” అనిపించుకుంటా అని ఊహించలేదు. నెనర్లు!!

  Like

  Reply
 16. ఏకాంతపు దిలీప్

  @ పూర్ణిమ
  నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నిజంగా చాలా అసూయగా ఉంది. నాకు చిన్నప్పటి నుండీ చాలా ఉత్తరాలు రాసెయ్యాలని, ఉత్తరాల కోసం ఎదురుచూడాలని ఉండేది. కానీ నాకా భాగ్యం లేదు 😦 ఎప్పుడైనా రాస్తే కదా నాకు ఉత్తరం వచ్చేది.. ఎందుకో ఆ కోరిక కోరికలానే ఉండిపోయింది. పెద్దయ్యాక అందరికీ పెద్ద పెద్ద ఈ మైల్లు ఇచ్చేవాడిని… కానీ నాకు మహా అయితే నాలుగు లైన్ల రెప్లై వచ్చేది. ఇప్పటికీ నేనెవరికైనా మనసుపెట్టి రాస్తే అది పెద్దదైపోతుంది. 🙂 ఎంసెట్ అయిపోయాక నాకు చుట్టాలింట్లో పరిచయమైన నేస్తం వాళ్ళ ఊరు వెళ్ళిన తరవాత రాసిన ఉత్తరం జీవితంలో నేను మొదటిసారిగా అందుకున్న ఉత్తరం. అప్పుడూ కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. బెంగళూరు నుండి ఢిల్లీ వచ్చిన తరవాత నా బి టెక్ క్లాస్మేట్, బెంగళూరులో రూమ్మేట్, నా దగ్గరి స్నేహితుడు అయిన సుబాష్ రాసిన ఉత్తరం (ఈ మైల్) స్నేహితులందరు రాసిన ఉత్తరాలాలన్నిటిలోకి విలువైనది. అబ్బా నా చాలా జ్ఞాపకాలు ఇక్కడ రాసేస్తానేమో. ఆపేస్తున్నా…

  నువ్వు లేఖతో నీ జ్ఞాపకాలని, లేఖల పాత్రని, విలువలని పంచుకోవడం కొత్తగా చాలా బాగుంది.

  Like

  Reply
 17. Srividya

  నాక్కూడా పేద్ద పేద్ద ఉత్తరాలు రాసే అలవాటు వుంది. ఉత్తరం అంటే మన మనసు తీసుకుని వెళ్ళి వాళ్ళ ముందు పెట్టడమే……… అలాంటి ఉత్తరాల్ని చాలా అందంగా గుర్తు చేసావు.. నా ఫ్రెండ్స్ అందరికీ పెద్ద బెద్ద మెయిల్స్ పెట్టేయ్యాలింక.

  Like

  Reply
 18. పూర్ణిమ

  దిలీప్ గారు: 🙂 మీ అసూయ ఎంతవరకూ సమంజసమో నాకు తెలియటం లేదు. ఉత్తరాలు రాసుకునేటప్పుడు బానే ఉంటుంది. ఆ ప్రవాహం ఆగిపోయిన తర్వాత ఎప్పుడైనా గుర్తు వస్తే మనసు కలుక్కుమంటే ఆ బాధ కన్నా అసలు ఉత్తరాలు లేకపోవటమో మేలేమో అన్నేంతగా మిస్స్ అవుతున్నాను నేను ఉత్తరాలని ఇప్పుడు. మీ జ్ఞాపకాలను నాతో పంచుకున్నందుకు చాలా సంతోషం!!

  శ్రీవిద్య: నీకున్న బుద్ధి నాకు లేకపోయింది. తెల్లారే లేచి, ఏదో ఘనకార్యం చేసినట్టు మా వాళ్ళకీ లంకె పంపించినా.. తిరిగిన వచ్చిన తిట్లపురాణం ఇంకా చదువుకుంటున్నా!! You enjoy madi!!

  Like

  Reply
 19. ప్రవీణ్ గార్లపాటి

  చాలా బాగుంది ఈ టపా…
  ఉత్తరాలు చాలా జ్ఞాపకాలనే అందిస్తాయి. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి వచ్చే ఒక్కొక్క ఉత్తరం కోసం చూసిన ఎదురుచూపు ఇప్పటికీ గుర్తే.
  నా మొహం వెలిగిపోతుంటే మా స్నేహితులు అడిగే మొదటి విషయం ఇంటి నుండి ఉత్తరం వచ్చిందా అని 🙂

  Like

  Reply
 20. Kranthi

  పూర్ణిమ గారు,
  అ౦దరిలా గొప్పగా చెప్పలేను కానీ ఏదో నా సోది చెప్పకు౦డా ఉ౦డలేను.
  అ౦దరూ ఉత్తరాల్లో మనసుల్ని చదువుకు౦టారు.మీరు ఉత్తర౦ మనసునే చదివేసారు.
  భావకుడన్ గారు అన్నట్టుగా అరటి మొక్కకి అ౦టు కట్టినట్టు,గోడపైన ఇటుక పేర్చినట్టు చాలా శ్రద్దగా రాసారు(ఎక్కడో విన్నట్టు౦ది కదూ నిజమే సినిమా డైలాగేలె౦డి).Nice one keep writing.

  Like

  Reply
 21. kaavya

  పూర్ణిమ గారూ,చాలా చక్కగా చెప్పారు ఉత్తరాల ఊసులని.నిజంగా ఉత్తరాలు మనకు కలిగించే దగ్గరితనం మనవారికి దూరంగా ఉన్నప్పుడే తెలిసేది.ఎన్ని అద్భుత అనుభవాలు ఈ ఉత్తరాల సొంతం!!ఎన్ని అద్వితీయ భావలు వీటి పుణ్యమాని ఒకరి మనసు నుంచి మరో మనసును తాకుతయి!!చాలా రోజుల తర్వాత వీటిని తీసి చదువుకున్నపుడు మనకు కలిగే భావలు నిజంగా అద్భుతమే కదండీ.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

%d bloggers like this: