Affectionately dedicated to HP Compaq 6720s

అద్దం లాంటి జ్ఞాపకం!!

ఏం చేస్తున్నావు ఇంకా నిద్రపోకుండా… నువ్వు నీ పనులన్నీ కట్టి పెట్టి వచ్చేదే చాలా ఆలస్యంగా.. మళ్ళీ ఇక్కడ కూడా ఆలోచనలా??

ఎవరు నువ్వు? ఈ క్షణాన నన్ను చూసినవారెవ్వరైనా గాఢ నిద్రలో ఉన్నా అనుకుంటారు.. మరి నీకెలా తెలుసు, నేనింకా నిద్రపోలేదని?

హమ్మ్.. ఏంటా నీ ప్రశ్న.. నేను నీలోనే ఉంటాను. నీతోనే ఉంటాను.. నన్నే ఎవరు అని అడుగుతున్నావా??

ఓ.. నువ్వా?? సినిమాల్లో చూపిస్తారు కదా.. ఇప్పుడు అసలైతే ఒక తెల్ల చీర కట్టుకుని నా ముందు కూర్చోవాలి.. మరేం.. కళ్ళకు కనబడవేం?? కొంతమంది నిన్ను మానస, మనోజ అంటారు.. కొంతమంది.. ఆత్మారాముడు అంటారు.. ఇంతకీ ఏ కాటగరీ నువ్వు?

పిచ్చీ.. నువ్వు భలే తమాషా అసలు. ఒక క్షణంలో.. నీతో మాట్లాడడం అపూర్వం అనిపిస్తుంది.. మరుక్షణం.. ఇదో ఇలా అమాయకత్వంతోటో, ఆవేశంతోటో.. ప్రశ్నించి చంపుతావు. సినిమాటిక్ లిబర్టీస్ అన్న పదమే వినలేదా నువ్వు?? నిన్ను రెప్పపాటు కాలం కూడా నేను వదిలుండలేను. ఇప్పుడు నేను ఆడో, మగో.. నీకేంటి సమస్య.. ఇద్దరితో అంతే “ఈజ్” తో ఉంటావు కదా నీకు నచ్చితే!!

హే.. నన్ను పిచ్చీ అనక!! ఇన్ని చెప్తున్నావు.. నీకు తెలియదా.. నా నిద్రలో ఈ కలత ఎందుకో!! నాతో అనుక్షణం ఉండే నీకు నా అంతరంగం తెలియదా? నేను నీకు కొత్తగా చెప్పేది ఏముంది.. నువ్వు చెప్తే నేను వినాలి గాని!! నీతో కూడా నాకు మాటలవసరమా?

నిజమే.. నీకు నాతో మాటలు అవసరం లేదు.. అసలు నువ్వు ఏమి అనుకుంటున్నా అది నాకు ముందే తెలిసిపోతుంది. అయినా ఈ క్షణంలో కలత చెంది ఉన్నావు. నీ ఆలోచనలు ఎక్కడో ఆగిపోతున్నాయి. ఒక దగ్గర నిలిచిపోతున్నాయి. అందుకే హాయిగా నిద్రపట్టడం లేదు. నీకు జోల పాడి నిద్రపుచ్చలేను.. కానీ నీకు నిద్రరాకపోతే నేనూ జాగారం చేయాల్సిందే!! అందుకే మాట్లాడు.. నేను వింటా.. ఊ కొడతా.. అర్ధం చేసుకుంటా..

హమ్మ్.. ఎక్కడి నుండి మొదలు పెట్టను.. ఎందుకో తనే బాగా గుర్తువస్తున్నాడు.. మాటి మాటికీ గుర్తు వస్తున్నాడు. మర్చిపోదాం అనుకునే ప్రతీ సారీ మళ్ళీ వస్తున్నాడు మనసు అరలు నుండి పైపైకి..

ఓహ్.. అబ్బాయా.. అనుకున్నా.. అలాంటిదేదో అయ్యుంటుందని..

ఛా.. నువ్వూ మనుషుల్లా ఆలోచిస్తావా??

నీకే తెలుస్తుంది.. చెప్తూ ..పో..

కాలేజీ రోజులు గుర్తు వస్తున్నాయి. చదువు మీద నా శ్రద్ధ, అందరికన్నా ముందుండాలని పట్టుదల, బాగా చదివేసి.. జగత్తును ఓ ఊపు ఊపేయాలని, స్వామీ వివేకానంద అన్న “men and women of iron will and steel resolution” అలా నేను సైతం అనిపించుకోవాలనీ, దేశాన్నేదో ఉద్ధరించేయాలని.. ఎన్ని ఆశలు, ఎన్ని ఆశయాలు. ఆ స్నేహాలు, ఆ పరిచయాలు, ఆ పోట్లాటలు, ఆ ఆనందాలు, ఆ అవేశాలు.. ప్రపంచమంతా నాకోసమే అన్నట్టు.. అందరూ నాకోసమే ఉన్నారన్న భావన. అయినా ఎంత అల్లరి చేసేదాన్ని.. నేనుంటే ఎంత గోలగా ఉండేది క్లాసంతా!! భలే బంకులు కొట్టడం.. అందరి చేత కొట్టించడం.. సచిన్ ఆట చూడాలని!! ఇప్పుడెంతగా మారిపోయానో కదా… I’ve become unusually quiet!! ఉన్నావా?? నిద్రపోయావా??

ఊ…

సరే… అలా ప్రపంచమంతా నా సామ్రాజ్యం అనుకుంటుండగా ఈ అబ్బాయి నాకు తారసపడ్డాడు. నాకు మార్కులు బాగా వచ్చాయని సర్ మెచ్చుకుంటుంటే.. వెనక ఉన్న వాళ్ళంతా.. “మా వాడికి ఇంకా వచ్చాయి” అని అంటే.. వెనక్కి తిరిగి చూసా.. మొదటిసారిగా. పెద్ద ఎలక్షన్ లో గెలిచినంత ఫోజు. చిర్రెత్తుకొచ్చింది. ఆ క్షణాన నిశ్చయించుకున్నా.. నాకు శత్రువులంటూ ఉంటే.. అతగాడనే!! లేకపోతే.. నా ముందు అంత ఫోజా. ఆ సాయంత్రం నా మిత్రబృందం అంతా దీని గురించే మాట్లాడుకున్నాము. ఎలా అయినా వచ్చే అన్ని పరీక్షల్లో మాదే గెలుపు అనీ!! అది కూడా భారీ మెజార్టీతో అని. అలా మొదలయ్యింది కోల్డ్ వార్ మా ఇద్దరి మధ్యా.. 

వార్!! మాటల యుద్ధమైతే నీతో గెలవడం కష్టమే..

లేదు.. మా ఇద్దరికీ మాటలు లేవు.. కలిసి చదువుకున్నన్ని నాళ్ళు.. మేమెప్పుడూ ముఖాముఖిన మాట్లాడుకోలేదు.. పేరు పెట్టి పిలుచుకోలేదు. నాకప్పటిలో భయం… అబ్బాయితో మాట్లాడితే ఎవరు చూసి, ఏమనుకుంటారో అని. నా గురించి ఎవరు ఎలా మాట్లాడినా అది నా బాధ్యతే.. అనుకునే దాన్ని. అందుకే అబ్బాయిలతో మాట కలిపేదాన్ని కాదు. తనూ మాట్లాడేవాడు కాదు.. తనది భయం కాదు. అది తెలుసు నాకు.

ఒక్క క్షణం.. ముఖాముఖిన మాట్లాడుకోలేదు.. మరి ఇంకెలా??

నీకూ తెలివిబానే ఉందే!! హమ్మ్.. నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడినా.. అందులో తనకి చెప్పదలచుకున్నది ఉంటే.. తను గ్రహించేవాడు. తనూ ఎవరితో మాట్లాడుతున్నా.. నాకు చెప్పదలచుకున్నది నాకూ తెలిసేది. అలా ఇతరులతో మా మాటలు మాకు రాయబారాలు అన్న మాట.. అలానే మాట్లాడుకునే వాళ్ళం, పోట్లాడుకోనే వాళ్ళం, వేరే వారిని ఇరికించి నవ్వుకునే వాళ్ళం, పొగుడుకునే వాళ్ళం.. అంతేగా కసురుకునే వాళ్ళం. మేం మాట్లాడుకోమనే అనుకునేవారంతా.. కానీ అందరికన్నా ఎక్కువ మాట్లాడుకునేది మేమే…

ఊ..

తన పాటలు పాడేవాడు.. బాగా!! బాగా అంటే.. గాత్రం అదీ కాదు.. కూనీ రాగాలే!! ఎప్పుడంటే ఎప్పుడు.. ఎక్కడంటే ఎక్కడ.. మొదలు పెట్టేవాడు. క్లాసుకి లేటయితే.. వెనుక బెంచీల్లో కూర్చోవాల్సి వచ్చేది. అప్పుడు నా తిప్పలు చూడాలి. ఊరికే hum.. చేసేవాడు. నేను డిస్టర్బ్ అయ్యి ఊరుకుంటే పర్వాలేదు.. నేనూ మొదలెట్టేసేదాన్ని అప్రయత్నంగా.. ఇప్పుటికి కూడా ఆ జబ్బు వదలలేదు.. నేనూ పాడేస్తా అలానే..

ఓహ్.. అది అంటు రోగమా?? బాగుంది.. అతగాడి నుండి ఇంకేమి నేర్చుకున్నావు?

ఒకసారి మేము క్లాసు అయ్యిపోగానే.. బయటకి వచ్చి చూస్తే.. హోరున వర్షం పడుతుంది. నేను వస్తుందనుకోలేదు.. ఒక్కసారిగా అంత వర్షం.. పారవశ్యంలో “wow” అని గట్టిగా అనేశా!! అది విని వెనకనుండి ఎవడో.. వెకిలిగా నవ్వాడు. ఎవరంటూ వెనక్కి తిరిగి చూడబోయాను.. తన కళ్ళ దగ్గరే.. నా కళ్ళు నిలచిపోయాయి. క్షణం క్రితం నా రెప్పల మాటున వెరసిన ఆనందం, ఇప్పుడు తన కంటిలో ఆశ్రయం పొందింది. ఎవడో.. ఎదో అన్నాడని.. నా ఆనందాన్ని కాళ్ళరాసాను. ఎంత కోపం వచ్చిందో.. కానీ తనూ వినే ఉంటాడు.. అయినా ఆనందం తప్ప మరేమి లేదు. అప్పటి నుండీ నా సంతోషం..  నాకు చాలా ముఖ్యం, ఇతరులకే కష్టం కలిగించనంత కాలం. ఎవరు ఏం అనుకుంటున్నారో కాదు. ఇప్పుడు అది కొంత మంది.. set apart attitude అంటున్నారు.. ఇంక్కొందరు పొగరు అంటున్నారు. నాకు నచ్చింది చేస్తున్నా.. అటు తర్వాత విని ఊరుకుంటాను.

హమ్మ్.. వైరంతో మొదలై స్నేహం దాకా వచ్చారు మాట..

ఏమో.. నాకు తెలియదు. అతడు నా స్నేహితుడు కాదు. కానీ అటు తర్వాత నా అన్ని స్నేహాలకీ అతడే కారణం. అతడు నా శత్రువు కాదు.. తను నాకు చేసినంత మేలు ఇంకెవ్వరూ చేయలేదు. ఆ యుద్దంలో నేను ఓడిపోయింది అంటే.. అది నా అర్ధం లేని అహం. గెలుచుకున్నదీ అంటే జీవితం.

ఏది ఏమైనా ఇప్పడతడో జ్ఞాపకం..

కేవలం జ్ఞాపకం కాదు.. రోజూ ఉదయాన్నే తయారు అయ్యేటప్పుడు అద్దం ముందు నుంచునట్టు.. అతడి ప్రతీ జ్ఞాపకం  నన్ను నేను సవరించుకోటానికి, నన్ను నేను మెరుగుపరుచుకోడానికి, నేనెలా ఉంటున్నానో.. పరికించుకోడానికి. సింపుల్ గా చెప్పాలి అంటే.. “నిన్ను నాకు చూపే అద్దం” అతడి జ్ఞాపకం.

నిజం!! అందుకే మనమింతిలా మాట్లాడుకోగలుతున్నాం. అతడు మళ్ళీ కనిపిస్తే..

కనిపించాలి అనుకోవడం అత్యాశ!! జీవితంలో ఏదైనా ఒక్కసారే..  అప్పుడే
 దాని అందం పెరుగుతుంది. ఏ బంధమైనా ప్రత్యేకం.. ప్రతీది ఓ కొత్త అనుభవం. జీవితమే చాలా చిన్నది అంటుంటారు కదా.. కాదు.. చిన్ని చిన్ని క్షణాలను ఆశ్వాదిస్తే, ఆ క్షణంలోనే ఒక జీవిత కాలాన్ని అనుభవించవచ్చు. రోజంతా మనకెప్పుడూ గుర్తుండదు.. అందులో మనకి నచ్చిన నచ్చని క్షణాలే గుర్తుండిపోతాయి. వీటినే జ్ఞాపకాలు అంటాం. జీవితంలో ఏ బంధమైనా దగ్గర ఉన్నప్పుడు అనుభవించి.. దూరమైనప్పుడు అభిమానించాలి. మరలా మరలా అదే కావాలని కోరుకోవటం అసమంజసం. To look backward for a while is to refresh the eye, to restore it, and to render it the more fit for its prime function of looking forward. 

ఒప్పుకున్నా.. ఇక నిద్రపో..

ఊ.. నీ సాయానికి ధన్యవాదాలు. ఒక్కోసారి “వినడం” కన్నా చేసే గొప్ప సాయం లేదు తెలుసా. మన దగ్గరికి వచ్చి గోడు చెప్పుకునేవారికి.. వింటున్నాం కదా అని ఓ ఉచిత సలహా పడేస్తాం. కొన్నింటికి సలహాలు అక్కరలేదు, పరిష్కారాలు ఉండవు, సూచనలు పనికి రావు. మనం “వినడం”.. అదే పెద్ద సాయం.. మనసు మాటల్లో కరిగితే అంతకన్నా ఏం కావాలి?

****************************************************************************
Memory itself is an internal rumour.  ~George Santayana, The Life of Reason అన్న ఈ quote నా దగ్గర ఎప్పటినుండో ఉంది. ప్రతీ సారి నా ఏ ఊహకి టపా రూపాంతరమో చెప్తాను. ఈసారి ఇందులో ఊహ ఎంతో, వాస్తవికత ఎందాకో మీ ఊహకే వదిలేస్తున్నాను. 🙂

21 Responses to “అద్దం లాంటి జ్ఞాపకం!!”

 1. మోహన

  >>నిన్ను నాకు చూపే అద్దం” అతడి జ్ఞాపకం.
  🙂

  >>మనం “వినడం”.. అదే పెద్ద సాయం.. మనసు మాటల్లో కరిగితే అంతకన్నా ఏం కావాలి?

  True 🙂

  Beautiful. 🙂

  Like

  Reply
 2. ఏకాంతపు దిలీప్

  @ పూర్ణిమ
  “ఏమో.. నాకు తెలియదు. అతడు నా స్నేహితుడు కాదు. కానీ అటు తర్వాత నా అన్ని స్నేహాలకీ అతడే కారణం. అతడు నా శత్రువు కాదు.. తను నాకు చేసినంత మేలు ఇంకెవ్వరూ చేయలేదు.”

  ఇలాంటి మీమాంశని ఒక్క వ్యక్తిలోనే కాకపోయినా, చాలా సందర్భాల్లో చాలా మందితో నేను ఎదుర్కున్నాను..

  హమ్మ్.. నిద్రమత్తులోనూ బాగా మాట్లాడావు! 🙂

  Like

  Reply
 3. ఏకాంతపు దిలీప్

  Memory itself is an internal rumour. ~George Santayana, The Life of Reason

  ఆ కోట్ మీద వ్యాసం రాయమంటే, నీ టపా అతికినట్టు సరిపోతుంది… చదవగానే ఫస్ట్ ప్రైజ్ నీకే అని జడ్జ్లు నిర్ణయించెయ్యొచ్చు… 🙂

  Like

  Reply
 4. ప్రవీణ్ గార్లపాటి

  absolutely beautiful!
  I can identify myself in it…

  ఏమిటో మీ జబ్బు నాకొచ్చింది. ఇంగ్లీషులో వ్యాఖ్య రాస్తున్నాను 🙂

  Like

  Reply
 5. Kranthi

  “క్షణం క్రితం నా రెప్పల మాటున వెరసిన ఆనందం, ఇప్పుడు తన కంటిలో ఆశ్రయం పొందింది”
  ఈ ఒక్క మాటలో ఎన్నో భావాలు పలికి౦చార౦డి.ఎ౦దుకో చాలా నచ్చి౦ది ఆ వాక్య౦.
  అలాగే యే ఊహకి రూపా౦తరమో ఈ టపా కూడా చెప్ప౦డి.నా చిన్ని బుర్రకి తట్టడ౦లేదు.

  Like

  Reply
 6. వేణూ శ్రీకాంత్

  beautiful, as always… వినడం గురించి, దూరమైన బంధాలు మళ్ళీ కావాలనుకోడం గురించి వ్రాసిన కొన్ని వాక్యాలని కొటేషన్స్ గా భద్ర పరచుకోవచ్చు.. ఇంకా క్రాంతి గారు కోట్ చేసిన “క్షణం క్రితం…” లైన్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఎవరో ఓ పెద్ద రచయిత్రి ఇలా మారు పేరు తో బ్లాగ్ క్రియేట్ చేసి టపాలు వ్రాస్తుందేమో అని నాకు అనుమానం వస్తుంది పూర్ణిమా..!!

  Like

  Reply
 7. కత్తి మహేష్ కుమార్

  beautiful ! sensational!!

  ఒక స్థాయిలో self discovery
  మరో స్థాయిలో mysticism
  ఒక మలుపులో సంవాదం
  మరో మలుపులో ఆత్మజ్ఞానం

  భాషలో ఆత్మను ఆవిష్కరించడం కన్నా అపురూపమైంది మరొకటుందా, ఉంటుందా!

  Like

  Reply
 8. ప్రతాప్

  పూర్ణిమా..
  ఇది చదువుతుంటే నేను 9th లో ఉండగా జరిగినవన్నీ నాకు గుర్తొచ్చాయి. మేమిద్దరం పోటీ పడి చదివే వాళ్ళం. నా మీద గెలవాలని తను ఎంతగా ప్రయత్నించేదో. కాని ఎప్పుడు మాట్లాడుకొన్నది లేదు. తర్వాత విడిపోయాం. ఇప్పుడు తను ఎక్కడ ఉందో కుడా నాకు తెలియదు. కనిపించినా గుర్తుపడతానో లేదో కూడా తెలియదు. కరిగే కాలాన్ని చూస్తేనే నాకు కోపం ఎందుకంటే ప్రియమిత్రుల్నిదూరం చేసి జ్ఞాపకాల అరల్లోకి దోసేస్తుంది కదా?
  ఈ సందర్భంలో నాకు “Cesare Pavese” చెప్పిన ఒక quote గుర్తుకువస్తోంది.
  “We do not remember days, we remember moments. The richness of life lies in memories we have forgotten”.
  ఆ జ్ఞాపకాలని మళ్లీ గుర్తుకు చేసినందుకు ధన్యవాదాలు.

  Like

  Reply
 9. Srividya

  ఇప్పుడెంతగా మారిపోయానో కదా… I’ve become unusually quiet!!
  నా గురించి ఎవరు ఎలా మాట్లాడినా అది నా బాధ్యతే.. అనుకునే దాన్ని.
  అప్పటి నుండీ నా సంతోషం.. నాకు చాలా ముఖ్యం, ఇతరులకే కష్టం కలిగించనంత కాలం. ఎవరు ఏం అనుకుంటున్నారో కాదు.

  ఈ అక్షరాలు నా మనసులో నుంచి తీసి రాసినట్టు వుంది.
  ఈ మార్పులు, చేర్పులు, జారిపోయిన గతం కోసం నిట్టూర్పులు ఎవ్వరికైనా తప్పవేమో
  నాకెన్నో సార్లు అనిపిస్తుంది ఆ రోజులు మళ్ళీ వస్తే,
  అప్పుడు నేను వేరేలా వుంటే ఎంత బావుంటుందో అని…

  Like

  Reply
 10. కల

  పూర్ణిమా..
  చదువుతుంటే ఆ రోజులు కళ్ళ ముందర నడియాడినట్లు ఉన్నది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా ఏదో ఒక సంఘటన ఉంటుందేమో కదూ? కాకపోతే నాకా అదృష్టం లేదు. నాదంతా లేడీస్ కాలేజీ లో చదువు. ఏంటో నా చదువంతా ఉప్పులేని పప్పులా సాగిపోయింది.

  Like

  Reply
 11. జాన్‌హైడ్ కనుమూరి

  రోజు రోజూ .. పోస్టు పోస్టుకీ వైవిధ్యం చూపుతూ రాస్తున్న మీ విధానానికి అభినందనలు
  జ్ఞాపకాలను రాయగలిగిన వారు ఏ రకమైన సాహిత్య ప్రక్రియనైనా రాయగలరని అంటుంటారు.
  మీ వైవిధ్యం చూస్తుంటే అలాంటి సూచిక(టార్గెట్) వైపుగా పనిచేస్తున్నారనిపిస్తుంది.

  అభినందనలు

  Like

  Reply
 12. S

  “Memory itself is an internal rumour. ~George Santayana, The Life of Reason”
  – I liked this very much. Yes, that was a nice post. Looking forward for more posts…

  Like

  Reply
 13. పూర్ణిమ

  మోహన గారు: నెనర్లు!!

  దిలీప్ గారు: చాలా రాత్రయ్యాక మీ కమెంట్ వచ్చింది.. నిద్ర మత్తులో బాగా చదువుకున్నాను.. ఆనందించాను. నెనర్లు!! 😉
  మీరిలా ఇడియాలు ఇవ్వకండి.. ఉన్న జ్ఞాపకాలని ఈ ఊహల్లో పెట్టటానికే కష్టమవుతుంది.. ఇక మళ్ళీ “మంచి మాటలు” కూడానా??

  ప్రవీణ్ గారు: జబ్బులేమైన డబ్బులటండీ.. ఎవరికీ కనిపించకుండా దాచుకోడానికి? ఉన్నదానిని నలుగురితో పంచేసుకోవాలి అంతే!! 😉
  On a serious note, your comment would linger on my memory for a long time.. for sure. 🙂 err.. me and my english!!

  క్రాంతి గారు: నెనర్లు. చెప్పాలనుకున్నది చెప్పేసాను.. ఇక అంతా మీదే మరి!!

  వేణూ గారు: మీ వ్యాఖ్య గురించి చాలానే రాయచ్చు. కానీ ఇప్పటికి మాత్రం ఇదే చెప్పదలచుకున్న.. ఎన్ని ముసుగులు వేసి విషయాన్ని చెప్తున్నా, మీరంతా దానికి రిలేట్ చేసుకుంటున్నారు. అందుకే.. నాకు మీదగ్గర ముసుగు అవసరం లేదు. మీ అందరిలో ఒక బ్లాగరిగానే నన్నుండనివ్వండి. మీ అభినందనకీ, అభిమానానికీ నెనర్లు!!

  మహేశ్ గారు: mysticism.. ఆ పదం గుర్తువచ్చిందంటే.. నేను విజయం సాధించినట్టే. నెనర్లు.

  ప్రతాప్ గారు: నా జ్ఞాపకం మీ జ్ఞాపకాన్ని గుర్తు చేసినందుకు నాకూ చాలా సంతోషంగా ఉంది.

  ప్రభాకర్ గారు: నెనర్లు!!

  Like

  Reply
 14. పూర్ణిమ

  విద్యా: ఈ అక్షరాలు నా మనసులో నుంచి తీసి రాసినట్టు వుంది… హమ్మ్.. 🙂

  కల గారు: నాదీ అదే ఉప్పులేని పప్పు.. లేడీస్ కాలేజ్.. అయినా ఈ అనుభవం ఎదురయ్యింది. ఎలా?? మీరే ఊహించుకోండి!

  జాన్ హైడ్ గారు: పని ఏమీ మొదలు పెట్టలేదండి.. మీ వ్యాఖ్యకి మాత్రం చాలా కృతజ్ఞతలు!!

  సౌమ్యా: Welcome to my blog!! ఎప్పుడు వస్తావా అని చూస్తున్నా!!

  Like

  Reply
 15. meenakshi.a

  పూర్ణిమ గారు..మీ పోస్ట్ ఇప్పుడు చదివా..తీరిగ్గా..
  ఏమని చెప్పేది…మీకు…..
  కొన్ని లైన్స్ ఎంత బాగున్నాయో…
  ఒకటికి రెండు మార్లు చదివా….
  అసలు ఎలా రాస్తారు అంత లోతుగా..

  మీ మీను…

  Like

  Reply
 16. బొల్లోజు బాబా

  ఎంత అద్బుతమైన నేరేషను అండీ.
  చాలా బాగుంది మీ ఆలోచనా పరంపర.
  బ్యూటిఫుల్.
  బొల్లోజు బాబా

  Like

  Reply
 17. మురారి

  >>చిన్ని చిన్ని క్షణాలను ఆశ్వాదిస్తే, ఆ క్షణంలోనే ఒక జీవిత కాలాన్ని అనుభవించవచ్చు.

  chaala baaga cheppaaru

  Like

  Reply
 18. సందీప్

  అనుబంధాలను దగ్గరగా ఉన్నప్పుడు ఆస్వాదించాలి. దూరమైనప్పుడు అభిమానించాలి. అవి మళ్ళీ మళ్ళీ కావాలనుకోవడం అసమంజసం.
  You have no idea what this quote means to me. Thank u very much for that!
  నేనూ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఈ విషయం.

  Like

  Reply
 19. Mahita

  Lovely post da…

  Remembrance is hearts own way of keeping in touch with a person. And hearts have their own way of communication that no miles can separate.

  The conversation of your definition of love and life with that of your inner voice rocks Puri. I am kind of stuck with words, for u know very well what this post would mean to me too, don’t you? Every relation is a destiny. Some destiny’s are meant to make a difference, creating a significance that can be defined by holding a mirror to our lives and knowing that someone somewhere will be glowing in that pride. Knowing that someone out there can witness every move of your life as theirs and can echo your failure and success alike. To be blessed with such relations in life, however little their span of time can be, is a blessing.

  Like

  Reply
 20. Purnima

  Thanks Mahi! Your comments are like revealing the most naked of my thoughts. I do so many experiments with that basic thought that sometimes, I fear my presentation. Be here, to lemme know how I fare! 🙂

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

%d bloggers like this: