శిలాక్షరాలైన క్షణాలు – 1

Posted by

అవి నాకు తెలుగు అక్షరాలు పూర్తిగా వచ్చి.. గుణింతాలు చదువుకుంటున్న రోజులు. అదే ఏడాది మా స్కూల్ పెట్టి పాతిక సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అంటే.. ఓ పెద్ద పండగ చేసుకోడానికి సన్నద్ధం అవుతున్న వేళ. ఆటలు, పాటలు, నాటికలు, నృత్యాలు, సైన్స్ ఎగ్జిబిషన్స్.. ఒకటేమిటి.. అన్నింటి కోసం సంసిద్ధం అవుతున్నాము. ఎగ్జిబిషన్లో పెట్టడానికి.. నేను ఎంచుకున్న అంశం.. ఇల్లూ, వాటి రకాల్లో.. రెండంతస్తుల మేడ. మిగితా వారు గుడిసెనీ, పక్క ఇల్లనీ.. ఇలా చేసుకురావాలని చెప్పారు టీచరు. ఇంటికి వెళ్ళగానే అమ్మకు చెప్తే.. చేద్దాం అనింది. కానీ మొదలెట్టాక తెలిసింది.. తనే చాలా వరకూ చేసిందని. అయినా నా భాగస్వామ్యం ఉండాలని చిన్న చిన్న పనులను కూడా పెద్ద బాధ్యతగా అప్పగించేది. అమ్మ.. మా పక్కింటిలో ఉండే అబ్బాయి.. చాలా కష్టపడి.. ఆ ఇల్లు కట్టారు. పూర్తి thermocol తో చేసింది కనుక.. దూరం నుండి.. పాలరాతిదా? అని అనిపించేలా ఉంది. ఆ మేడకి ఒక చిన్ని గేటు.. వాకిట్లో ముగ్గూ.. ఒక బుజ్జి కారు (రెండంతస్థులు మరి!!), మెట్లు, తలుపులు, కిటికీలు.. అన్నీ!! గదులు తప్ప.. ఇంటికి ఉండాల్సినవ్వన్నీ ఉన్నాయి. భలే ముచ్చట వేసింది దాన్ని చూస్తే!! ఇదో ఇప్పుడు నా బ్లాగు తెరచిన ప్రతీ సారీ అదే గుర్తు వస్తుంది.. తెల్లగా, అందంగా, ఆహ్లాదంగా, హాయిగా.. నాకోసం అప్పుడు మా అమ్మ.. ఇప్పుడు జ్యోతిగారు.. ఇద్దరూ కష్టపడి చేసిచ్చిన కానుకలు. 🙂

స్కూల్లో.. నా “ఇంటి”ని అప్పజెప్పడానికి ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి. అప్పుడే ఇచ్చేస్తే.. నా అంత అపురూపంగా చూసుకునే వారుండరని.. ఆఖరు రోజునే ఇద్దామని నిర్ణయించుకున్నాం.. అమ్మా.నేనూ!! ఒకానొక రోజు.. సాయత్రం ఏడు గంటల ప్రాంతంలో కరెంటు పోయింది. అప్పటి వరకూ.. దేదీప్యమానంగా వెలుగుతున్న వాకిలిలో ఆడుకుంటున్న పిల్లలమంతా బిక్కుబిక్కుమంటూ.. అమ్మల దగ్గరకి పరిగెట్టాము. దగ్గరకొచ్చిన పిల్లలని తీసుకుని.. ప్రతీ అమ్మా.. ఇంకో అమ్మ దగ్గరకు పరుగులు తీసింది ఆ చీకటిలో. “ఏంటిలా తీసేసాడు? అందుకే అంటారా?, భయపడద్దు.. మన జాగ్రత్తలో మనముందాం!!” ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. ఎవరూ దీపం వెలిగించలేదు. చీకటిలోనే దేని గురించో  రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా గట్టిగా ఏడుపులు, అరుపులు వినిపించాయి. ఏవరో ఎవర్నో కొడుతుంటే.. వచ్చే ఆర్తనాదాలు. అమ్మను చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటే.. అవి అంత భయం కలిగించడం లేదు.. కానీ అమ్మ భయపడుతోంది అని మాత్రం తెలుస్తుంది. అందరూ ఒక్కసారిగా.. ఒకే వైపు.. చీకటిలో కూడా.. ఒక మూలకు పరిగెట్టారు..అసలే చీకటి.. ఎవరున్నారో.. ఎవరు లేరో తెలియటం లేదు.. అయినా దాక్కున్నాము.. ఎవరి నుండో తెలియదు.. అలా ఓ అరగంట!!

అసలు ఇది చెప్పే ముందే.. అప్పుడు మేముంటున్న ఇంటిని గురించి చెప్పాల్సింది. ఆ ఇంటిని మాటల్లో పెట్టడం నాకు చాలా కష్టం.. అయినా ప్రయత్నిస్తా!! దూరం నుండి చూస్తే.. రెండు తలుపులు.. వాటి ముందు పెద్ద అరుగులు.. మధ్యన ఒక పెద్దదీ కానీ, చిన్నదీ కాని గేటు. గేటు తెరచి లోపలికి వెళ్తే సన్నని దారి.. ఓ రెండు మెట్లక్కి రెండడగులు ముందేకేస్తే.. మళ్ళా రెండు తలుపులు పక్కపక్కన, ఇంకో రెండు తలుపు ఎదురెదురుగా!! ఎదురెదురుగా ఉన్న తలుపు తీసుకుని వెళ్తే.. మళ్ళా ఒక్కో తలుపు. పజిల్లా ఉంది కదూ? (నాక్కూడా!!) నేను తలుపన్న ప్రతీదీ.. ఒక్కో కుటుంబం ఉంటుందని అర్ధం. ఒక కాపురానికీ.. ఇంకో కాపురానికీ.. మధ్య తలుపు మాత్రమే అడ్డు. అలా.. కనీసం ఆరు కుటుంబాలు అద్దెకుంటున్న చిన్న ఇల్లు అది. అక్కడ ఉన్నవాళ్ళంతా బానే ఉండేవారు. తేడాలొస్తేనే పోట్లాడుకునే వారు. కానీ ఆ రాత్రి అందరిదీ ఒకే కుటుంబం ఏమో అనిపించింది. కాసేపటికి కరెంటు వచ్చింది. అయినా నిశ్శబ్దం… కాసేపటికే అల్లకల్లోలం. మా ఎదురు వీధిలో కొందరు ఆగంతకులు వచ్చి.. అందరినీ హింసించి.. కావాల్సినవి లాక్కుపోయారు. పోతే ఫర్వాలేదు.. మళ్ళీ ఎప్పుడైనా తిరిగి వస్తారు.. ఎవరినైనా చంపేస్తారు.. అసలు ఆ రోజులే అలాంటివి..

నాకు అప్పటి రాజకీయ సామాజిక పరిస్థుతులు (ఇప్పటికీ) తెలీవు.. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అని తెలుసునంతే!! కానీ అప్పటిలో హైదరాబాదు అట్టుడికిపోతుందని తెలుసు. ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. అప్పట్లో చెలరేగిన అల్లర్ల గురించే చర్చ!!  పేపరు చూడాలంటే భయం.. ఎక్కడ చూసిన రక్తం కనిపించే బొమ్మలే!! ముక్కు కోసేసి ముక్కుపుడ తీసుకెళ్ళిన ఒక ముసలి అవ్వ చిత్రం.. చిత్రంగా ఇవ్వాల కూడా నా కళ్ళముందు కదలాడుతుంది!! ఎందుకలా గుర్తుండిపోయిందో తెలీదు. అప్పటిలో.. ఇప్పుడున్నని ఫోనులు లేవు. ఉత్తరాలతోనే రాయబారం. అంటే పోస్ట్ మాన్ కోసం పడిగాపులు కాసే రోజులు, సమాచారాన్ని చేరే వేసే అతి ముఖ్యమైన విధానం. గొడవలకి ఆ ముఖ్యమైన తీగ తెగిపోయింది. ఆకాశవాణిలో ఒక గంట సేపు.. హైదరాబాద్ మొత్తానికి వచ్చే లేఖల్లో.. అతి ముఖ్యమైనవి మాత్రమే చదువుతున్నారు. చాలా చోట్ల పిల్లలు బడికి వెళ్ళటం మానేసారు. ఒక ఆవిడ తన చిన్నారిని పిట్టగోడల మీద కూర్చోబెట్టి అన్నం తినిపిస్తుంటే.. ఎవరో వచ్చి పొడిచేసారని వార్తలు వచ్చాయి. పరిస్థితి ఎలా ఉందంటే.. గాలిని కూడా ఒకసారి ఆలోచించి పీల్చాలి అనిపించేంత!! సిటీ మొత్తం జరుగుతున్నా.. మా కాలనీ దరిదాపుల్లో.. అప్పటి వరకూ ఏమీ జరగలేదన్న ధైర్యం.. ఆ రాత్రి కరెంటుతో పోయింది. కరెంటు వచ్చేసిందని చెప్పాను కదా… ధైర్యం మాత్రం.. నేను పారేసుకున్న పెంసిల్లా.. ఎక్కడో పోయింది.

“ఎదురు వీధిలోనే కదా.. మనకేం లేదులే..” అని గుంభనంతో పెద్దోళ్ళంతా ఉండాలన్నా.. ఉండలేకపోయారు. ఇన్ని రోజులూ గుండెల్లో దాచుకున్న భయం.. ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. ఏదో హడావిడి.. ఏదో ఆందోళన. అటూ ఇటూ తిరుగుతున్నారు. అన్ని తలుపులూ మూసేసారు.. ఒక గదిలోకే అందరూ వచ్చేసారు. పిల్లలందరినీ మూల కూర్చోబెట్టారు.. వాళ్ళు మాత్రం తిరుగుతూనే ఉన్నారు. పసిపిల్లలు ఏడవకుండా తల్లులు నోరు మూసేసారంటే.. ఆ రాత్రి ఎంత భయంకరంగా ఉందో ఊహించండి. పిల్లలం మాకేం అర్ధం కాకపోయినా.. బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నాము. అంతలో నాకు కడుపులో బాగా నొప్పి వచ్చింది. మా అమ్మకు చెప్పగానే.. తన గుండె జారిపోయింది..ఆ విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్ళడమంటే.. మా అమ్మకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. “తను అన్నం తినేసిందా??” పక్కింటి ఆంటీ వేసిన ప్రశ్నతో మా అమ్మకి నేనింకా అన్నం తినలేదనీ.. నేను నొప్పీ అని చెప్పింది ఆకలనీ అర్ధం కాలేదు. చావు భయం, ఆకలి మంట.. మనిషిని నిలువునా మాడ్చేసే రెండు భయంకరమైన నిజాలు. గబగబా మజ్జిగన్నం కలిపి ఇచ్చింది. నాకు ముద్ద దిగటం కష్టమైంది.. అయినా తిన్నంతా తిని.. నిద్రపోయా.. ఆ రాత్రి నాకు చాలా భయంకరంగా గడిచింది అందరికీ.. నాకు మాత్రం మా అమ్మ పక్కనే లేదన్న బెంగ తప్పకింకేమీ లేవు.

తెల్లారింది.. నేను లేచే సరికి మా ఇంట్లోనే ఉన్నాను. మా అమ్మ హడావిడిగా అన్నీ సర్దుతోంది. నాన్న బయటికి వెళ్ళినట్టున్నారు. మొహం కడుక్కుందామని వెళ్తే… అక్కడ నీళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి. “అవి కారం కలిపిన నీళ్ళు ముట్టుకోక” అని చెప్పింది. రాత్రి ఒకవేళ దాడి జరిగితే ఆత్మ రక్షణకోసం చేసుకున్న అస్త్రాలు అవి.. అని చాలా రోజుల తర్వతా తెలిసింది నాకు. ఆ రోజు నేను స్కూల్ కి వెళ్ళలేదు.. “సాయంత్రం మనం మన ఊరు వెళ్ళిపోతున్నాం” అమ్మ చెప్పేసరికి నా గుండె జారిపోయింది. “మరి స్కూలో??” అన్న నా ప్రశ్నలో బాధ మా అమ్మకి అర్ధమయ్యింది. “స్కూలు కూడా ఉండదు చాలా రోజులు, మనకి ఇక్కడ ప్రమాదం.. అంతా వెళ్ళిపోతున్నారు.. మనం కూడా.. ఇక ఇక్కడ ఎవ్వరూ ఉండరు” అంటూ చెప్పింది. నా మనసంతా స్కూలు మీదే.. అన్ని రోజులు తరగతులు పోతే ఎలా అని. మా అమ్మ కావల్సినవన్నీ సర్దేసింది. “నా ఇల్లు” కూడా పట్టుకెళ్దాం అని అడిగా. మీ నాన్న, నువ్వూ, నేనూ, మీ నాన్న చదివిన సర్టిఫికేట్స్.. ఇవి తప్పించి మనకిప్పుడేమీ అవసరం కావు… ఈ ఇంటినీ.. ఆ ఇంటినీ మర్చిపో అని చెప్పింది. మనస్కరించలేదు.. అయినా తప్పలేదు. అమ్మ చెప్పినట్టు అంతా వెళ్ళిపోతున్నారు.. అంటే.. నాన్న, నేను, అమ్మ, నాన్న సర్టిఫికేట్స్.. ఇవే ముఖ్యమేమో!!

“పోయిరాండ్రి బిడ్డా… మల్ల జరూర్ వస్తరనే అనిపిస్తుంది నాకు” అని మా ఇంటి దగ్గర ఉండే అవ్వ అంది అమ్మతో!! మీరూ మాతో వచ్చేయకూడదు.. ఉన్నంతలో అంతా కలిసే ఉందాం అన్న అమ్మ ఆహ్వానానికి.. “మీరీడ నచ్చితే ఉంటరు.. లేకుంటే. లే!! మీరు పోవడానికో ఊరున్నట్టు.. ఇది మా ఊరు. ఈడనే పుట్టినాం.. ఈడే మశానం అవుతాం.. మీరు పోయిరాండ్రి.. మల్ల మనం కలుతాం” అని ఆవిడనటం.. అమ్మా ఆవిడా కన్నీళ్ళు పెట్టుకోవడం.. నాకు వింతగా తోచింది. చుట్టాలు ఎవరైనా వెళ్ళిపోతుంటే మా అమ్మలనా చూసేదాన్ని!! మొత్తానికి అప్పగింతలు అయ్యాక స్టేషనుకి బయలుదేరాము. రైలు కోసం వేచి ఉండగా “చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు” అన్న తాజా వార్త వినబడింది. ఆ వార్త ఎవరికీ ఊరటనిచ్చినట్టు కనబడలేదు. ఎవరము ఎక్కాల్సిన రైలు వారు ఎక్కాము!!

తెల్లగా.. పట్టుకోడానికి చల్లగా..మెత్తగా ఉన్నా చేతికి అంటితే జిగురులా ఉండే ఫెవికాల్ తో , ఆకలితో, భయంతో, వదిలి వెళ్ళాలి అన్నప్పుడు వచ్చే బాధతో, చీకటిలో దాక్కోవటంతో.. ఇంకా నేను మర్చిపోయిన చాలా వాటితో అదే తొలి పరిచయం. హమ్మ్.. అంత చిన్నగా ఉన్నప్పటి జ్ఞాపకాలు.. ఇలా నా మనసులో శిలాక్షరాలుగా మిగిలిపోయాయి.

హైదరాబాద్ కి కొత్తగా వచ్చి అద్దెకు ఇల్లు వెత్తుక్కుంటున్న వాళ్ళు.. “అబ్బో.. ఆ ఏరియా డేంజర్.. అక్కడ మనవాళ్ళు తక్కువ.” అన్న అభిప్రాయం ఎప్పుడు నా చెవిన పడిన ఈ అనుభవాన్నంతా కూర్చోబెట్టి చెప్తాను, ఎంత కొత్తవారైనా!! ఆ రాత్రి.. అందరూ ఒక్కటై ఎదురు నిలిచారు.. ఎవరూ మమల్ని దాడి చేయలేదు.. కానీ లోలోపల ఉన్న భయం సగం చంపేసేదే! అందరూ కలిసి ఉన్నారు కనుకే భయాన్ని ఎదురుకున్నారు. మనిషికి మనిషి తోడుంటమే గొప్ప బలం. మనిషిని మనిషి మోసగించటమే వినాశనం. తోడుగా నిలవడటానికి మనిషి జాతి, మతం, ఆచారం, వ్యవహారం, భాష.. ఇవేమీ అడ్డు రావు. అలానే మోసం చేయడానికి కూడా!!

“ప్రతి నాణానికి రెండు వైపులున్నట్టు జ్ఞాపకాలకి కూడా మరో కోణం ఉంది.వాటిని భద్రంగా దాచుకునే వారికి తీపి తో పాటు చేదు అనుభవాలూ గుండెల్లో మెదులుతూ ఉంటాయి. గుంపులో ఉన్నా గోడ కట్టి ఒంటరిని చేసేస్తాయి. అలాంటి చేదు జ్ఞాపకం కూడ ఒక బాధ్యతను మనకు అందించటనికే అంటరా?” దిలీప్ గారి బ్లాగులో మొహన అడిగిన ప్రశ్నకు నా అనుభవం చెప్పాలనిపించి.. ఈ టపాల సీరీస్!!

(సశేషం)

13 comments

 1. @ పూర్ణిమ
  నువ్వు కూడా ఇల్లు బొమ్మ చేసావా? 🙂 ఇప్పుడు నాకు రెండు విషయాలు గుర్తొస్తున్నాయి.. ఒక్కటి మా నాగార్జున పబ్లిచ్ స్కూల్లో చిత్రలేఖనం పోటీలు జరుగుతున్నాయి… చిన్నప్పటి నుండీ ఆ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి అది బాగా తెలిసిందే.. కానీ నాకు అసలు బొమ్మలు గీయడం, అందులో పోటీ నాకు అదే మొదటి సారి… చాలాసేపు ఆలోచించి ఒక ఇల్లు బొమ్మ వేసేసాను… దానికి రెండొ బహుమతి వచ్చింది…

  ఆ తరవాత అదే స్కూల్లో ఎగ్జిబిషన్ కోసం ఇంటీ బొమ్మ కూడా తయారుచేసాము.. దాన్ని మా అమ్మ చాలా సంవత్సరాలు జాగ్రత్తగా ఉంచింది… కానీ కాలానికి మన్నలేదు పాడైపోయింది…

  ఇంకా… భయంలో నుండి భాధ్యతని గుర్తుచేసుకోవడం… చాలా చక్కగా చెప్పావు… ఏదోకరకమైన భయం జీవితంలా మనం ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో చెప్తుంది… కొందరికి ఓటమి అంటే భయం… ఓటమి జ్ఞాపకాల భయంతో ఓటమిని దరి చేరకుండా చూసుకుంటారు…

  Like

 2. Touching post పూర్ణిమా, ఇలాంటి చేదు జ్ఞాపకాలే ఇంకా ఎక్కువ బాధ్యతని అందిస్తాయ్. నాణానికి రెండు వైపులు ఉన్నట్లే అందరూ కలిసి ఉండి భయాన్ని జయించటం ఎంత నిజమో… అప్పటి వరకు ప్రాణ స్నేహితులు గా ఉన్న వాళ్ళు శత్రువులు అవడం కూడా అంతే నిజం. ఒక మనిషి ఆలోచనలని అంతగా ప్రభావితం చేయగలిగిన కొంత మంది నాయకులు స్వార్ధ పరులై జనాన్ని చెడువైపు గా ప్రేరేపించేలా ఎందుకు ఉంటారో మరి.

  Like

 3. నేనూ కొత్తపాళీ గారిలా wow! wow!!

  Like

 4. ఇల్లు బొమ్మల్ని నేనూ అమ్మ సహాయంతో చిన్నప్పుడు చేశాను!
  తమ్ముడు ఇప్పటికీ చేస్తుంటాడు – వాడు ఆర్కిటెక్ట్!

  >>మనిషిని మనిషి మోసగించటమే వినాశనం. >>తోడుగా నిలవడటానికి మనిషి జాతి, మతం, >>ఆచారం, వ్యవహారం, భాష.. ఇవేమీ అడ్డు >>రావు. అలానే మోసం చేయడానికి కూడా!!

  అక్షర సత్యాలు ఈ మాటలు..

  ఒక పాటలో సిరివెన్నెలగారంటారు, “నేడంటే ఎన్నో నిన్నల అనుభవసారం” అని..

  ఏ జ్ఞాపకమైనా, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, బాధ్యతని తెలియజేస్తుంది.. చేదు జ్ఞాపకం మరింతగా…

  Like

 5. nice one.
  భయం, భయం, ఎటు చూసినా భయం
  భయం, భయం, ఎటు తిరిగినా భయం
  రకతం, రకతం, ఎటు వెళ్ళినా రకతం
  రకతం, రకతం, ఎటు మళ్ళినా రకతం (ఇంక చాలా లైన్స్ ఉండాలి గుర్తుకు రావడం లేదు).
  ఆనాటి హైదరాబాదు పరిస్థితి గురించి ఏదో పత్రికలో చదివిన కవిత.
  మళ్లీ ఆనాటి పరిస్థితులని కళ్ళకు కట్టినట్టు వివరించేసారు. ఈ కవిత నాకు మళ్లీ గుర్తుకు వచ్చిందంటే కారణం మీ పోస్ట్.
  ఇంతకీ అవ్వ సంగతి ఏంటి?

  Like

 6. పూర్ణిమ…
  నిజమే. అప్పుడు నీకు ఇల్లు చేసివ్వడానికి మీ అమ్మ పడినంత కష్టం నాకు పట్టింది. ఎందుకంటే నాకు టెంప్లేట్ మార్చడం అదే మొదటిసారి. నీకు ఏది కావాలో నీకే అర్ధం కాదు అని తెలిసింది. (అంటే నీ బ్లాగుకు తగిన డిజైన్ ) నీ బ్లాగు టపాలు కూడా నేను మొత్తం చదవలేదు. కాని నువ్వు నీ ఊహలన్నీ ఊసులుగా రాస్తున్నావని తెలుసు. అందుకే ఆ డిజైన్ నా అంత నేనే మార్చాను. నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావని తెలీదు.

  ఇక నువ్వు చెప్పిన సంఘటనలు నాకు అంతగా గుర్తులేవు. ఎందుకంటే కాంగ్రేస్ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం. ముఖ్యంగా వినాయకచవితి వేడుకలు,నిమజ్జనం అప్పుడైతే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండేవాళ్ళం. మేము ఉన్నది కాస్త ఖరీదైన ఏరియా కాబట్టి అంత సమస్య లేదు. కాని అప్పటి గొడవల్లో, కర్ఫ్యూ పెట్టినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాము. ఇంట్లో బియ్యం, పప్పు , నూనె,చింతపండు (అవి ఏడాదికి తెచ్చి పెట్టుకుంటాము కాబట్టి ) తప్ప ఏమీ లేవు. అప్పటి సంఘటనలు తలుచుకుంటే భయమేస్తుంది. కాని మర్చిపోవడం మంచిది.. కాని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా అందరు ఒక్కటవుతారు.

  Like

 7. పూర్ణిమా..

  ముందుగా.. ఒక విషయం. నేనడిగిన ప్రశ్నకు అసలు ఎవరైనా ఇంతగా స్పందిస్తారని నే ఎప్పుడూ ఊహించలేదు. చాలా థాంక్స్.

  ఇక టపా గురించి, నాకు అసలు ఈ విషయాలేమీ తెలియవు. మీ టపా చదువుతుంటే నాకు కళ్ళ ముందు చిత్రం కనిపిస్తుంది. భయం, విషాదం, నిస్సహాయత ఇలాంటి సందర్భాల్లోనే ఎవరికైన తోదు ఎక్కువ అవసరం. ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఒకటిగా వాటిని జయించవచ్చు అని చాలా బాగా వ్యక్తపరిచారు.

  మీరానున్న టపాల కోసం… వేచి చూస్తూ.. మోహన.

  Like

 8. 1969 -1970  కాలంలో  ప్రత్యేక తెలంగాణా ఉద్యమం హింసాత్మకంగా ఉన్న రోజులలో, నేను ఆబిడ్స్ కు ఏదో కొనటానికి వెళ్లాను. అకస్మాత్తుగా పొలీసులు వచ్చి లాఠీచార్జ్ చెయ్యటం మొదలెట్టారు. ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి. అంతా తలో దిక్కు పరిగెత్తటం మొదలెట్టారు. నేనూ పరిగెత్తి, పొలీసుల దృష్టిలోంచి తప్పించుకోవటానికి  ఒక Q లో   నిలుచున్నా. నేను నిలబడిన క్యూ ఒక సినిమా థియేటర్ వద్ద టిక్కట్లకై నిలుచున్నది. హైదరాబాదు కొత్త నాకు అప్పట్లో. ఎక్కడున్నానో కూడా తెలియదు. టిక్కట్ కొనుక్కుని థియేటర్ లోకి వెళ్లా. నా పక్కనున్న వారిద్వారా తెలుసుకున్నా. అది రామకృష్ణా 70M.M. థియేటర్ అని. అప్పుడు ప్రదర్శింపబడిన చిత్రం It’s a Mad Mad Mad Mad World. పేరుకు తగ్గ చిత్రం. థియేటర్ బయట పడిన టెన్షన్ పోయి, మనసారా నవ్వాను, సినిమా చూస్తున్నప్పుడు, అనేక సందర్భాలలో. అలా యాదృచ్ఛికంగా ఒక మంచి కామెడీ సినిమా కష్టకాలంలో చూసే అవకాశం కలిగింది. 27 జూన్ 1969  న ఈ గొడవలకు తలవొగ్గి కాసు బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేశారు. అది ఆమోదించబడలేదు. అదంతా ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కథలో భాగం.     

   

  Like

 9. పూర్ణిమా, టపా మొదలైన విధానం చూసి చివరికి ఆ ఇల్లు బొమ్మకి ఏమన్నా అవుతుందేమో అనుకున్నాను.. కానీ తర్వాత్తర్వాత చదువుతుంటే వళ్ళు గగుర్పొడించింది.. ఇలాంటి సంఘటనల గురించి వినడమే కానీ ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు (touch wood)! మోహన అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం ఇది! నాకనిపిస్తుంది, ఇలాంటి చేదు/భయం కలిగించే జ్ఞాపకాలను ఒక పాఠంలా అవసరమైనప్పుడే గుర్తుతెచ్చుకోవాలని!

  Like

 10. very touching. అలాంటి జ్ఞాపకాలని తట్టుకోడం కూడా కష్టమే. అంట భయం మాకు ఎప్పుడూ కలుగలేదు. “శిలాక్షరాలైన క్షణాలు – 2″కూడా చదువుతా.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s