అల్లరా.. నేనా??

Posted by

“కాలేజ్ స్టూడెంటా.. నేనా??..” అనే సంతూర్ ఆడ్ గుర్తొంస్తుందా?? రావాలి మరి! అసలు నా బ్లాగుకి ఏమాత్రం సూటవ్వని జ్ఞాపకాలనే.. ఏదో.. అలా అలా రాసి తప్పించుకున్నాను కానీ.. ఇప్పుడు అల్లరి అంటే పూర్తిగా చేతులెత్తేయాల్సిందే!! ఇప్పటికిప్పుడు.. అణు ఒప్పందం మీదో.. చిరంజీవి పార్టీ విషయమో.. లేక ఏదో తెలుగు సినిమా చూసి మరీ సమీక్ష రాయడమో తేలిక కానీ.. అల్లరంటే అస్సలంటే.. అస్సలంటే అస్సలు ఏమీ లేదనిపిస్తుంది.

“అబ్బా ఎప్పుడూ మనుషుల మొహం మీద తిరుగుతూ ఉంటావు.. వచ్చి నా తల మీద కూర్చో సరిపోతుంది” అని నాకు మూడేళ్ళ వయస్సులో విసుక్కుంటున్న పక్కింటి ఆంటీ తల మీద కాలుపెట్టా, నిజంగా కూర్చోటానికి.. ఇది అల్లరి కాదు..  పెద్దల మాట తు.చ తప్పకుండా పాటించడం.

“దేవుడా.. దేవుడా.. వీళ్ళ అమ్మగారికి కూడా.. మా అమ్మకి వచ్చినంత జ్వరం త్వరగా వచ్చేసి.. ఆసుపత్రిలో ఉండేలా చూడు, ఇంకొన్ని ఎక్కువ రోజులు.. దేవుడా. అప్పుడు నేను కూడా కిరణ్ కి అమ్మ చేత అన్నంలో చారు పెట్టిస్తాను” అన్న ప్రార్ధనలో..  అల్లరా?? నో వే!!

“గుడియా రాణీ.. యె హై చాక్లెట్ ఆప్కెలియె.” అంటూ ప్రతీ సారి నాకోసం ఎక్లెర్స్ తెచ్చే అంకుల్ ఇచ్చిన తాళం చెవులు గోడవతలకి ఎందుకు విసిరేసా?? అల్లరి కాదు.. ఒక చాక్లెట్ కోసం..  బంగాలీలు చేపల వేపుడు చేసేటప్పుడు వచ్చే వాసనను భరించడం.. తగదు. చిన్ని చిన్ని వాటికి మోసపోయి.. పెద్ద కష్టాలు కొనితెచ్చుకోకూడదని.

“మీ వంట్లో అంతా నీరేనట.. రక్తం తక్కువట.. డాక్టర్ అంకుల్ చెప్పారు.. నేనోసారి కట్ చేసి చూద్దున్నా.. ప్లీజ్” అంటూ ఒక బ్లేడుతో “నీరు” పట్టి కదలలేక ఉన్న ఆవిడ చూట్టూ తిరగడాన్ని.. చిన్న పిల్లల్లో ఉండే సహజమైన జిజ్ఞాస అనాలి అంతే.. అల్లరంటే ఎలా??

“ఇది జనరల్ సీటండీ.. మేము కూర్చోవాలి…మీరెళ్ళి లేడీస్ సీటులో కూర్చుంటారా.. దయచేసి” అని మర్యాదగా అడిగిన అబ్బాయిని.. “ఇక్కడ మేమెందుకు కూర్చోకూడదు.. “ఓన్లీ ఫర్ మెన్” అని రాసుందా?? అవి లేడీస్ కి మాత్రమే.. ఇవేమో ఎవరు ముందొస్తే.. వారివి.. వీటినందుకే జనరల్ సీట్స్ అంటారు” అని దబాయించిందే కాకుండా.. అప్పటికే నేను దిగాల్సిన స్టాపు వచ్చేసిందన్న కంగారులో.. హీల్స్ తో ఒకసారి తొక్కి.. నా బాగుతో కొట్టాను. దీన్ని అల్లరనరు.. “బాబూ.. అన్ని వేళలా “అంత” మర్యాద పనికిరాదు” అని ఒక క్లాసు మాత్రమే!!

క్లాసు జరుగుతున్నప్పుడు నేను గనుక వెన్నక్కి తిరిగి చూసానో.. అమ్మాయిలంతా గాజులు తీసి ఎవరికి తెలీకుండా.. మొదటి వరుసలో కూర్చున్న నా వరకూ “పాస్” చెయ్యాలి. అప్పుడు నేను వాటంన్నింటినీ ఒకే చేతికి వేసేసుకుని.. అసలు అక్కడ సర్ చెప్తున్న విషయాన్ని రాసుకుంటున్నా లేకపోయినా.. ఒక eraser తీసుకుని.. గట్టి గట్టిగా పేపరు మీద రుద్దుతూనో.. కావాలని చేతులు ఆడించడమో.. గాజుల గలగలకి క్లాసుతో పాటు మాస్టారూ కూడా నా వంకే తదేకంగా చూసే వరకూ.. ఊ..హూ.. అల్లరి అనకూడదు. “సర్.. ఇవ్వాల్టికి ఆపేయండి.. saturated!!”  అని గాజుల ద్వారా చెప్పించడం!! అన్ని వేళలా మాటలతో పనులు కావు సుమా!!

నాకు కాలేజీలో ఉండ బుద్ధి కాకపోతే.. నేనుండను.. ఇంకెవ్వరినీ ఉండనివ్వను. నేను తయారుచేసిన “బంకు (bunk) శాసనాలు” ఇంకా మా కాలేజీ బెంచీల మీద ఉండచ్చు. నేనే సచిన్ ఆట చూడడానికో.. ఈ ప్లానయితే.. పాపం.. మిగితా వారో!! అందుకని.. కాంపస్ దాటకా.. ఎవరెవరు ఏమేమి చేయాలో.. కూలంకషంగా చెప్పేదాన్ని. ఇది.. ముమ్మాటికే అల్లరే అంటూ.. మా “ప్రభుదేవా” కొంచెం గొడవపడ్డాడు ఏకంగా హెడ్ తో!! “మేనేజిరియల్ ఎకనామిక్స్” (dry..no.. driest subject) కూడా శ్రద్ధగా వినడమే కాక.. అదొక ఉత్సాహభరితమైన క్లాసన్నట్టుగా వాతావరణాన్ని క్రియేట్ చేసే నేను.. అల్లరంటే.. ఎవరు నమ్ముతారు?? పాపం.. ప్రభూ..

“అమ్మో.. హెచ్.ఓ.డీ ముందే విజిల్ వేసావా?? అంత అల్లరా?” అని అడుగుతారు నన్ను జనాలు. అది అల్లరి కాదు.. అక్కసు!! క్లాసులో ఉన్నవారందరినీ ప్రశ్న అడిగినప్పుడు.. ఆడపిల్లలేటూ దీనికి చెప్పలేరన్నట్టుగా.. అబ్బాయిల వంకే.. ఓ చిరునవ్వు విసురుతూ.. “పేరు చెప్పద్దూ.. చేసి చూపండి” అని అడుగుతుంటే.. కోపంలో.. ఆవేశంలో.. కంగారులో.. ప్రశ్నకు బదులైన “విజిల్” వేసేసాను. ఏం చేస్తాను మరి??

నేనేదో బుంగ మూతి పెటుకుని కూర్చున్నానని.. “దా ఆడదువూ.. నువ్వు కూడా” అని పిలిచారు. నాకు తోచినట్టు ఆడతుంటే.. “అలా కాదు.. ఇలా” అంటూ ఆట నేర్పించారు. ఇప్పుడు నేర్చుకున్న ఆటతో వారిని ఓడించకపోయినా.. ఒక పాయింట్ నెగ్గినవెంటనే.. రెండు చేతులూ.. నడుము దగ్గర పెట్టుకుని మరీ విరగబడి నవ్వే నేను.. అల్లరి చేస్తున్నానా?? కాదు కాదు.. అలా చేయటం వారికిబ్బంది అని తెలిసినా, “గురువులను ఇబ్బంది పెట్టేంతగా నేర్చుకునేవారే సరియైన శిష్యులు” అని నిరూపిస్తున్నా,, అంతే!!

Good girls are the ones who are caught least.. అన్న లెక్క ప్రకారం.. నేనూ.. “I’m a very good girl, said me all teachers” పాట ఆపకుండా పాడుకోవచ్చు!!

అలా కాకపోతే.. మాంఛి నిద్రలో ఉన్న చిగురుటాకు మీదకి తుషార బిందువు చేరితే .. అది అల్లరి అవుతుందా?  మనమెటు పోతే అటే వచ్చే చందమామ.. అప్పుడప్పుడూ.. మబ్బుల వెనుక దాక్కుంటే అల్లరి చేస్తునట్టా?? చక్కగా తలదువ్వుకుని.. అలా బయటకు వెళ్ళగానే.. గాలి వల్ల కురులు మన మాటవినకపోతే.. ఎవరిది అల్లరి.. గాలిదా, జుట్టుదా?? చిన్ని చిన్నిగా వస్తూ కవ్వించే వాన చినుకు.. బయటకి రాగానే.. ఒక్కసారిగా పూర్తిగా ముంచేస్తుందే.. మరి అదో? వస్తున్నా.. వచ్చేస్తున్నా అంటూ ఊరించే అల.. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం.. అల్లరి ఆ?? వస్తున్న కన్నీరును ఆపుకుంటూనే నేస్తం చెప్పిన మంచి మాటకు పెదాలపై నవ్వు వచ్చేస్తే అల్లరేనా?? ఒక్కో పాట వినగానే.. యదంతా గిటారై మోగుతుందేల.. అల్లరా?? ఇన్ని అనుమానాలతో.. ప్రశ్నలతో.. అల్లరి గురించి నేనేం రాయను చెప్పండి. అందుకే.. “అల్లరంటే.. అల్లరి” అస్సలు లేదనీ.. అస్సలంటే అస్సలు లేదని చెప్పేస్తున్నా.  నేను అర్జెంటుగా నా ఊహల్లోకి వెళ్ళిపోతున్నా!! 😉

31 comments

  1. ఇ0త చెప్పాకా కూడా అల్లరి అ0టామా?కానే కాదని సర్దిచెప్పుకుని నిన్ను అల్లరిపోటీ ను0డి గె0టేస్తున్నాము.పో…పోయి ప0డగ చేసుకో.

    Like

  2. రాధిక గారు చెప్పినట్టు మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టంలెండి. అల్లరంటే తెలియని మీ చేత అల్లరి చేయించం. కాబట్టి మీరు ఈ సారికి దూరంగా ఉండండి.

    Like

  3. హ హ హ … అవునవును మీకు అస్సలు అల్లరంటే తెలీదు… 🙂

    Like

  4. “. అమ్మాయిలంతా గాజులు తీసి ఎవరికి తెలీకుండా..” ఇది బెష్టు. ఐనా ఎవరండి మిమ్మల్ని అల్లరి అని అల్లరి పెట్తగలవారు .. 🙂

    Like

  5. అవును పాపం, పూర్ణిమకి అల్లరంటేనే తెలియదహో..
    దండోరా వేసి మరీ చెబుతున్నా బ్లాగూర్లో..

    Like

  6. “”మేనేజిరియల్ ఎకనామిక్స్” (dry..no.. driest subject) కూడా శ్రద్ధగా వినడమే కాక.. అదొక ఉత్సాహభరితమైన క్లాసన్నట్టుగా వాతావరణాన్ని క్రియేట్ చేసే నేను.. అల్లరంటే.. ఎవరు నమ్ముతారు?? పాపం.. ప్రభూ.”

    ఓ మై గాడ్… నువ్వు కూడా అదే చేసావా?

    పాపం ఆ సబ్జెక్ట్ చెప్పే అతను ఎచ్. ఎం. టి లో చేసి అది మూత పడితే మా కాలేజిలో వచ్చీ మెప , ఎం ఎస్ చెప్పుకునే వారు… విషయం ఉన్నా చెప్పడానికి చాలా భయపడేవారు… టెన్షన్ పడిపోయేవారు… అసలే డ్రై సబ్జెక్ట్ ఎవ్వడూ వినేవాడు కాదు, పాపం అది ఆయన భరించలేకపోయేవాళ్ళు…. ఇలాంటి పరిస్థితిల్లో ఒక ఆపద్భాందవుడు ఎప్పుడూ మొదటి బెంచ్లో కూర్చుని ఉంటాడు… వాడే ఈ దిలీపు… నన్ను చూస్తూ పాఠం చెప్పేసేవాళ్ళు.. మొత్తం 50 నిముషాలు ఆగకుండా…మధ్య మధ్యలో ప్రశ్నలు కూడా వేసి వాతావరణాన్ని క్రియేట్ చేసేవాడిని…:-)

    అసలూ ఈ స్టైలేంటి తల్లీ? ఏది రాయమన్నా ప్రపంచాన్ని నీ కళ్ళలో నుండి చూపించి అదే ప్రపంచం అని నమ్మించేట్టు…

    Like

  7. అద్బుతం, కొనసాగించండి..ఇంతింతై వటుదింతై అన్నట్లు మీరు రోజురోజుకూ మెరుగవుతున్నారు..

    Like

  8. అవును మన పూర్ణిమ చాలా బుద్దిమంతురాలు . అస్సలు అల్లరి చేయదు. మేము నమ్ముతున్నాము..

    Like

  9. అల్లరికి టీకా తాత్ప ర్యాలు ఇచ్చి చాలా చమత్కారంగా ముగించారు. చాలా మంచి రచన.
    అభినందనలు.

    Like

  10. ఈ అందమైన అల్లరికి అభినందన, ప్రేమతో ఒక మొట్టికాయ.

    Like

  11. అవున్నిజం అల్లరంటారేం!సహజమైన జిజ్ఞాస 🙂
    అంటుకట్టిన మొక్క ని పీకి చూస్తే నే కదా వేరు వచ్చిందీ లేనిదీ తెలిసేది దాన్నీ అల్లరంటారేంటో చిత్రంగా:-)

    Like

  12. Meeru allari kane kadu…
    aunty bodyloni neeru chooseki katti kooda pattaleni amayakuralivi…….

    Purnimagaru meera …Allara??? NO….

    Like

  13. పూరి అల్లరి అని తెలుసు మరీ ఇంత అల్లరి అని తెలియధు, బ్లాగు చాల బాగుంది

    Like

  14. పూర్ణిమా…

    అసలు నువ్వు అల్లరి అని ఎవరన్నారు చెప్పు? లేదు, న్యాయం జరగాల్సిందే.. !
    ఇప్పుడే వెళ్ళి నేను వాళ్ళకి నా సానుభితి తెలియజేస్తాను. 😉 నిన్ను ఆ మాట అని వాళ్ళు బ్రతికి బయట పడగలరా ? 🙂

    too good.. సినిమా చూపించావ్..!!

    Like

  15. కృష్ణా రావు గారు: నేనే అల్లరి??!! … భలే బాగుంది.. నాకు తెగనచ్చేసింది!!

    రాధిక గారు: మీరే సెలవ్విచ్చాకా… ఇక పండగే.. పండగ!!

    మురళి గారు; సరేనండి.. వెళ్ళిపోతున్నా!!

    వేణూ గారు: నిజమండీ… అస్సలంటే అస్సలు తెలీదు.

    కొత్తపాళీ గారు: మరే.. అదే బెష్టు.. సొంత ఇన్వెంషను కదా అది?! నిజమే.. నన్ను అల్లరి పెట్టగలవారెవ్వరండీ… ఎదో.. అప్పుడప్పుడు… భుజాలు తడుముకుంటే తప్ప 🙂

    ప్రతాప్ గారు: మరీ ఇంతిలా సహాయసహకారాలుంటాయనుకోలేదు సుమండీ!!

    దిలీప్ గారు: నేను చెప్పదలచుకున్న “మెపా” కాదు.. ఇంకోటి ఏదో.. గుర్తు రాక.. ఈ పేరు రాసాను. లైట్ తీసుకోండి. అయినా బెంచీ లీడర్లన్నాక ఆ మాత్రం సారూప్యాలుంటాయెమో!!

    పెదరాయుడు గారు: అభినందనలకు కృతజ్ఞతలు.

    జ్యోతి గారు: అవును… నేను బుద్ధిమంతురాలిని!!

    Like

  16. వంశీ గారు: మీ వాహ్.. వాహ్ లో.. మనసు.. ఇంకా మునిగితేలుతుంది. అందమైన వ్యాఖ్యకు నెనర్లు!!

    మాలతి గారు: మొదటి సారి నా బ్లాగుకి విచ్చేశారు.. చాలా సంతోషం. మీ అభినందనకు నెనర్లు!!

    రావు గారు: మొట్టికాయి మెత్తగా తగిలిందండి.. అభినందనకు నెనర్లు!!

    రమ్య గారు: మరేనండీ.. వీళ్ళింతేనండి… అన్నింటికీ కంఫ్యూజ్ అయ్యిపోతారు. అలా తీసి చూసి మళ్ళీ పెట్టేయచ్చు కదా??

    కిశోర్ గారు: ఈ మాత్రం అర్ధంచేసుకునే వాళ్ళుంటే.. నా గురించి మీకు తెలిసిందే కదా?? 😉

    సాగర్: Happy to have a comment from you. Thanks!!

    మురారి: థాంక్స్ అండి… నిడివి ఎక్కువ కాకూడదని చాలా తగ్గించేసాను.. అయినా బాగుందంటే.. సంతోషమే!!

    మొహనా: సమయాభావం వల్ల.. ఇవి ట్రైల్లర్స్ మాత్రమే.. సినిమా అంటే.. “పిక్చర్ అభీ బాకీ హై మెరే దోస్త్” అనాల్సి వస్తుంది. 😉

    Like

  17. అమ్మో ఇంత అల్లరా?
    చెయ్యాల్సిందంతా చేసి, మళ్ళీ ఏమీ లేదని చెప్పేస్తున్నారే.
    ఏదో నా PG లో అల్లరి చేద్దాం అనుకొంటే కాలేజీకి వెళ్ళిందే చాలా తక్కువ. ఇదంతా చదువుతుంటే నాకు బాగా అసూయ వస్తుంది. వొద్దులే, నేనిది చెబితే అసూయ ముందు…… అంటూ ఏదో సామెత చెప్పేస్తారు.
    ఏమిటి ఈ మధ్య నా బ్లాగులోకి తొంగి చూడటంలేదు. నేను కాని, నా బ్లాగు కాని ఏమన్నా తప్పిదం చేసామా?

    Like

  18. Hello Poornima gaaru…

    Every time I am about to visit a blog, I say to myself…”at least this blog” and most of the times I alttab to the next window hearing myself saying…”Shucks! this blog too!!”

    I did not have to hear it, when I visited yours. It was a pleasant experience. Thank you for the good time I am made to have.

    Like

  19. మొత్తానికి అసలు రంగు బయటపెట్టావన్నమాట!

    Like

  20. నువ్వు అల్లరిలో కూడా ఇంత డెప్త్,ఫీల్ ఇరికించిస్తే
    నేను చదువుతాను, ఆస్వాదిస్తాను, ఆనందిస్తాను
    బట్ ఏమి రాయాలొ అర్ధం కాక తల కొట్టుకుంటాను
    ఇలా చెయ్యడం కూడా అల్లరే అమ్మాయ్..!

    Like

  21. ప్చ్.. కొంచెం ఆలస్యంగా వచ్చాను.. చెప్పాలనిపిస్తున్నవన్నీ అందరూ ఇప్పటికే గబగబా చెప్పేశారు! నాకైతే అల్లరెక్కడా కనిపించడంలేదు.. ఆకతాయితనం తప్ప :))
    all jokes apart.. seriously.. అల్లరా.. నువ్వా!!!

    Like

  22. చాలా థ్యాంక్స్ అండి. మా ఇంట్లో అందరికీ చూపించాలి. ఇకపైన నన్ను అల్లరివాడు అంటే ఊరుకోను.

    Like

  23. మీరింత చెప్పాక అల్లరి అనలేము గానీ చాలా సరదాగా ఉంది.

    Like

  24. ఆహా ఎంత బుద్ధిమంతులు మీరు. మీది అల్లరంటే నేను ఒప్పుకోను.

    “మీ వంట్లో అంతా నీరేనట.. రక్తం తక్కువట.. డాక్టర్ అంకుల్ చెప్పారు.. నేనోసారి కట్ చేసి చూద్దున్నా.. ప్లీజ్” అంటూ ఒక బ్లేడుతో “నీరు” పట్టి కదలలేక ఉన్న ఆవిడ చూట్టూ తిరగడాన్ని.. చిన్న పిల్లల్లో ఉండే సహజమైన జిజ్ఞాస అనాలి అంతే.. అల్లరంటే ఎలా??”

    ఆహా వాటే జిజ్ఞాస వాటే జిజ్ఞాస? :—)

    నా చిన్నప్పుడు మా శర్మా మాస్టరు నాకు పొగరు అనేవారు. ఆ విషయం మా నాన్న గారికికూడా చెప్పారు. ఆ కథని వ్రాశాను. చదివి నాకు పొగరు లేదని చెప్తారా? నేను మీది అల్లరి కదాని అన్నాగా!

    🙂

    http://annisangathulu.blogspot.com/2008/08/blog-post.html

    Like

  25. “అప్పటికే నేను దిగాల్సిన స్టాపు వచ్చేసిందన్న కంగారులో.. హీల్స్ తో ఒకసారి తొక్కి.. నా బాగుతో కొట్టాను. దీన్ని అల్లరనరు.. “బాబూ.. అన్ని వేళలా “అంత” మర్యాద పనికిరాదు” అని ఒక క్లాసు మాత్రమే!!”

    నిజమే అన్నివేళలా అంత మర్యాద పనికి రాదు. మీది అల్లరే కాదు. బ్రహ్మాండం గా నవ్వించింది.

    “Good girls are the ones who are caught least.. అన్న లెక్క ప్రకారం.. నేనూ.. “I’m a very good girl, said me all teachers” పాట ఆపకుండా పాడుకోవచ్చు!!”

    నేనూ అంతే.

    Like

  26. ఎవరా ఈ పూర్ణిమ?!… అనుకుంటూ నీ (ఎందుకో “మీ” అనబుధ్ధి కాలేదు) బ్లాగు తెరిచానా… ఇక అల్లరే అల్లరి… పొద్దున్నే నవ్వించావ్… నా జ్ఞాపకాలను తవ్వించావ్… 🙂

    Like

Leave a comment