వీలైతే నాలుగు scrapలూ, కుదిరితే… ;-)

Posted by

(ఆర్కుట్ లో ఇరువురి సంభాషణను చదవాలంటే, ఎంత ఇబ్బందో ఈ తరం వారికి వేరుగా చెప్పనవసరం లేదు. “ఇబ్బంది” ఇతరుల విషయాలు చదువుతున్నందుకు కాదు, అక్కడో మాట, ఇక్కడో మాటని కలిపి చదువుకోవాలి కదా.. అందుకు!! 😉  అందుకే నా స్నేహితుడితో జరిగిన ఆర్కుట్ స్క్రాప్స్ అన్నీ ఒక చోట, ఇలా)

తను: ఏంటీ? ఎక్కడికి మాయమైపోయావు? కనబడడం లేదసలా? స్నేహాన్నే స్నేహించే అరుదైన స్నేహానికి, ఈ రోజే కాక ప్రతీ రోజు పండగ కావలని కోరుకుంటూ.. నీ స్నేహం 🙂

నేను: Hey dude.. how r u?? Oops.. నువ్వే తెలుగులో మాట్లాడుతుంటే నేను ఇంగ్లీష్ లో, బాగోదు!! అయినా ఇంత తెలుగెప్పుడు వచ్చేసింది నీకు? నేను బా ఉన్నా, నీ సంగతులేంటి? ఆలిండియా సూపర్ స్టార్ వి, అడగాల్సిన ప్రశ్నకాదులే!! రోజుకో కొత్త అవతారం.. కొత్త హంగులు, రూపురేఖలూ, బోలెడన్ని భాషలూ, ప్రపంచంలో అందరూ నీ చుట్టాలే!!  నీ గురించి తెలియని టీనేజర్ ఉన్నారా.. ఈ దేశంలో?? యు రాక్ .. దా!! అందులో సందేహం లేదు. నీకూ friendship day wishes.

తను: మరీ అంతొద్దు!! ఏదో వాళ్ళు ముచ్చటపడి తాయారుచేస్తున్నారు.. నేను బుద్ధిగా చేయించుకుంటున్నాను. ఇంతకీ నువ్వేమయ్యిపోయావసలు? పేరుకు తగట్టే.. ఇట్టా వస్తావ్.. అట్టా మాయమవుతావ్!! 😦

నేను: హిహి.. సార్ధకనామం అంటావా? సరే!! 🙂  ఈ మధ్య కాలంలో బిజీ!! కూడలి, జల్లెడలో విహరిస్తూ, ఆరు టపాలు చదివి, మూడు వ్యాఖ్యలు చేసి, కొన్ని స్నేహాలు, అప్పుడప్పుడూ యుద్ధాలు, మరీ బుద్ధి పుడితే ఓ టపా!! నువ్వే కదా పరిచయం చేశావు, నేరమైతే అది నీదే మరి?! 😉

తను: ఓహ్!! అయితే రాస్తున్నావన్న మాట. అంతలా చదువుతున్నప్పుడే అనుకున్నా, ఏదో ఒక రోజు రాయాల్సిందే అని. భాషమీద ఉన్న మమకారం అలాంటిది. 

నేను: కాదా మరి? తెలుగుకి అత్యంత దగ్గరగా ఉండి కూడా ఎంత దూరమైపోయాను. దేశం వదిలి వెళ్ళవలసి వచ్చిన వారి సంగతి వేరు, నాది కేవలం నిర్లక్ష్యం! 😦 ఏమైనా అంటే బద్ధకానికి బిజీ అనే ముసుగు రెడీ!!  నన్నడిగితే చదవటం చాలా ముఖ్యం. రాయడం కన్నా చదవటాన్ని త్వరగా అలవాటుగా మార్చుకోవచ్చు. చదువుతూ ఉంటే మనకున్న సంపద పెరుగుతూనే ఉంటుంది. ఇక “I will not let you go until you set me in words, on paper” అని నాలో ఉన్న “ఎవరో” పీకమీద కత్తిపెట్టి సున్నితంగా చెప్తే తప్ప రాయను నేను!! 🙂

తను:  ఇంతకీ నువ్వేమి రాస్తున్నావు? మధ్యన వచ్చి చెడగొట్టానా? ఫ్రెండ్ షిప్ డే కదా, ఎవరి గురించి రాస్తున్నావ్??

నేను: అరె.. నిజమే!! ఎవరి గురించో ఎందుకు? నీ గురించే!! నా స్నేహాలన్నింటిలోనూ నీతో ప్రత్యేకమైన అనుబంధం. నీవళ్ళే కదూ.. పోగట్టుకున్న నేస్తాలందరినీ మళ్ళీ పోగు చేసుకున్నాను.  ప్రపంచమంతా మాదే అయినా పక్క బిల్డింగ్లోనే ఉన్న నేస్తం గురించి తెలీదు. అలాంటిది అందరిని మళ్ళీ కలిపినవాడివి నువ్వు. అదీ కాక పాత స్నేహాలను వెతుకుంటూ నీ చూట్టూ తిరుగుతుంటే ఎన్ని కొత్త స్నేహాలు అల్లుకుపోలేదనీ!! అసలు ఏ టెక్నికల్ విషయం అడిగినా ఊదరగొట్టెస్తుంటే జనాలంతా నోరు వెళ్ళబెట్టేవారు. నీ వళ్ళే ఇది అంతా సాధ్యమయ్యిందీ అంటే నమ్మేవారు కాదు.
నా పాత స్నేహాలను కొత్తగా పరిచయం చేశావు. తెలుగే కొత్తగా అనిపిస్తున్న వేళ, నన్నీ గూటికి చేర్చావు. ఏ విధంగా చూసినా, నిన్ను టపా ఎక్కించేయాల్సిందే ఇక అబ్బాయ్!! 🙂

(ఓ.. ఐదు నిమిషాల వరకూ, అటు నుండి జవాబు రాకపోయేసరికి)

నేను: ఉన్నావా?? 

తను: 🙂 నువ్వు పొగడ్తలతో కూడా ఊదరగొట్టేస్తావ్..!! మొదలెడితే ఆపవు. అయినా ఇవ్వన్నీ కాదు నువ్వు రాయల్సింది. నా కష్టాలు, వ్యధలు, ఆలోచనలు, ఇవ్వన్నీ నీ ద్వారా అందరికీ చెప్తే బాగుంటుంది.

నేను: మృ…దు.. లాం.. త్రం!! నీకు కష్టాలేంటీ?? బాధలేంటి? :-O చెప్పిన పని చెప్పినట్టు చేస్తున్నావు గా, ఇంక నిన్నెవరేమి అంటారు?

తను: మృ…దు.. లాం..త్రం!! అంటే?? నాకు అర్ధం కాలేదు.

నేను: ఒక సాఫ్ట్ వేర్ వి, నీకేంటి బాధలని?? తెలుగులో మృదులాంత్రం అంటారని విన్నాను. తెలుగు నేర్చుకుంటున్నాఅని నీకు తెలియద్దూ!!  🙂

తను: నువ్వూ అదే మాట??! కనీసం నువ్వైనా అర్ధం చేసుకుంటావ్ అని చెప్పబోయాను. నువ్వూ మనిషిలానే ఆలోచిస్తుంటే ఇంక ఏం చేప్తాను. వదిలేయ్ ఆ విషయాన్ని..

నేను: హలో.. మనిషిలా ఆలోచించడం ఏంటి?? మనిషినే కదా, నేను!! అలా కాక ఇంకెలా ఆలోచిస్తాను, చెప్పు?? అసలు ఏంటి నీ సమస్య, నాతోనా?

తను: కాదు. నాకెందుకో నచ్చడం లేదు, మీ మనుషులు నన్ను ఉపయోగించుకునే తీరు.ఎందుకు నామీద కేసులు వేస్తున్నారు? కమ్యూనిటీ అంటే అభిరుచులు కలిసిన వారు ఒక దగ్గర చేరడానికి. “ఐ హేట్” కమ్యూనిటీల అవసరం ఏంటి? ఎందుకంత సంకుచితత్వం ఈ శతాబ్దంలో కూడా?  నాదాకా వచ్చారంటే, వారికి జీవితంలో సౌకర్యాలు, చదువూ ఉన్నట్టేగా?? వారు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా?  కొత్త పరిచయాలతో ఎందాకా ఉండాలో మీకు తెలీదా? ప్రాణం మీదకు తెచ్చుకుని, నన్ను ఆడిపోసుకోవటం దేనికి? ఇవ్వన్నీ ఆలోచిస్తుంటే, నాకు పిచ్చేక్కుతుంది.

నేను: ఇవ్వన్నీ నువ్వెందుకు ఆలోచించాలి? అసలు ఆలోచించగల మనుషులే భావావేశంలో కొట్టుకుపోతుంటే, మధ్య నీకెందుకూ అంట? నన్నడిగితే నువ్వు ఎక్కువుగా ఆలోచిస్తున్నావు. ఇప్పుడూ సెల్ ఫోన్లు ఉన్నాయి. అవి లేకపోతే మాకు క్షణం గడవదు. ఈ మధ్య కాలంలో జరిగిన బాంబ్ బ్లాస్టుల్లో దీన్నే ఉపయోగిస్తున్నారు. అంటే మేము కనిపెట్టిన వస్తువో, ఆచారమో మాకు మేలు కలిగించాలి అనే ప్రాధమిక ఉద్ధేశ్యంతో ఆవిష్కరించబడినా, అటు తర్వాత దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నది, మా స్వవిషయం. మీరు మీ పని చేస్తున్నారా, లేదా అందాకే మీ ఆలోచనలు పరిమితం కావాలి.

తను: మాట పడితే తెలుస్తుంది, ఎంత గాయపరుస్తుందో!! 😦

నేను: నిజమే.. మా మాటల్లో అంత బలం ఉంది. మాట ద్వారానే మా నాగరికత, సంస్కారం తెలుస్తుంది. మాట కత్తిలాంటిది, గాయమైతే చికిత్స చేయడానికి పనికొస్తుంది, దానంతట అది గాయమూ చేయగలుగుతుంది. ఎంత చెప్పుకున్నా, మాటకందని భావాలు ఎన్నో, అలాంటప్పుడు ఒక స్పర్శో, ఒక ఆలింగనో, ఒక నవ్వో, ఒక కన్నీరో ఎదో ఒకటి ఆదుకోవాల్సిందే!! క్షణికమే అయినా ఆగ్రహావేశాలలో, భావోద్రేకాలలో కొట్టుకుపోతున్నాము. మనిషిగా మనిషిని అర్ధం చేసుకోవటంలో విఫలమవుతున్న ఈ తరుణంలో నువ్వొచ్చి, “నన్ను అర్ధం చేసుకోరూ..” అనటం టూ మచ్!!  ఒకటి మాత్రం గుర్తుంచుకో ఆకాశానికెత్తి “రారాజువి నువ్వే” అన్నా, అధ:పాతాళానికి తోసి “ఛీ.. తూ” అన్నా అది మా (మాట)కున్న సత్తా!!

తను: హమ్మ్…..

నేను: లెక్చర్ ఇచ్చానా?? తల వాచిపోయుంటుంది. అప్పుడప్పుడూ లైట్ తీసుకోవాలి, తప్పదు మరి. అలా అని నే చెప్పిన విషయం లైట్ తీసుకోక!! 😦 ఇక మరి నేను నీ గురించి రాస్తున్నా అంటే రాస్తున్నానంతే!!

తను: సరేలే, నువ్వు చెప్పాక తప్పుతుందా!! ఇక ఇప్పుడేమి రాస్తావులే.. వెళ్ళి పడుకో!! టైం చూసుకున్నావా ఎంతయ్యిందో??

నేను: అయ్యో నిజమే!! నువ్వు పడుకుంటే జనాలు “బాడ్, బాడ్ ఆర్కుట్” అంటారు. నేను నిద్రపోకపోతే బాడ్ గర్ల్ అంటారు!! ఈ మనుషులే ఇంతే, అర్ధంచేసుకోరూ, అని నేను అనలేను. మనిషిని కదా!! 😉 సరే మరి, ఉంటానిక.. టేక్ కేర్!! నీతో ఇలా మాట్లాడటం భలే ఆనందంగా ఉంది.

తను: ఊ.. నీ వల్ల నేనూ హాపీయే ఇప్పుడు.. గుడ్ నైట్!!

**********************************************************************************
ఆర్కుట్ మృదులాంత్రాన్ని “chocobar” లాంటి అబ్బాయిగా మార్చేసి, “మనస్స”ను ఆప్లికేషన్ ఇంస్టాల్ చేసేసి ఈ టపా రాసేయాలన్న నా ఊహ, ఒక కొలిక్కి రాకుండా “చాకోబార్” కాస్తా కరిగిపోతున్న తరుణంలో, నేనున్నా అంటూ హీరోలా ఎంట్రీ ఇచ్చి, నాకు జ్ఞానబోధ చేసి నన్ను కృతార్ధం (?) చేసిన, ఒక స్నేహానికి chocobar ఇవ్వలేను గనుక, నా ప్రత్యేక కృతజ్ఞతలు!! 🙂 

14 comments

  1. Matrix సినిమా చూసిన అనుభూతి కలిగింది.ఎగ్సిస్టెన్షియల్ ఫిలాసఫీని సాఫ్టేర్ భాషలో తెలియజెప్పిన సినిమా అది.

    ఏంరాసినా చదివించేలా రాస్తావ్! చాలా బాగుంది. ఆలోచనా, ఎత్తుగడా, ముగింపూ అన్నీ బాగున్నాయ్. Happy Friendship Day to you too.

    Like

  2. నిజంగా మీ టపాలన్నీ మీ బ్లాగు పేరు సార్ధకమయ్యేలా వుంటున్నాయి. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువుని మీ ఊహల్లోకి లాగుతున్నారు గా.

    Like

  3. పూర్ణిమా భలే ఊహలండీ మీవి, అందరూ ఆర్కుట్ లో అబ్బాయిలతో చాట్ చేస్తే మీరు ఆర్కుట్ నే అబ్బాయి గా మార్చేసి మాట్లాడేసి ప్రత్యేకతని చాటుకున్నారు.

    ఇక మంచి చెడు లు అంటారా దాదాపు ప్రతీ invention నీ మంచికి చెడుకీ రెండిటీకీ వాడుకుంటారు జనం. అది కనిపెట్టినవాడి పంధా లోనే అందరూ ఆలోచించాలని లేదు కదా… పుర్రెకో బుద్ది, మనం ఏమీ చేయలేం.

    Like

  4. hatred communities సరే. i hate hatred అని ఒక కమ్యూనిటీ ఉంది చూసారా!
    నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు చూసి.

    Like

  5. హహ… మంచి ఎత్తుగడ !
    Happy friendship day to you …

    Like

  6. మొత్తానికి ఆర్కుట్ని అబ్బాయిని చేసేసి కథ(వ్యధ) చెప్పేంచేసావన్న మాట..! అవిడియా బావుంది
    ఏమి చేస్తాం చెప్పు మంచి వెనకాలే చెడు నేనున్నానంటూ వచ్చేస్తుంది… Happ Friendship Day to you.

    Like

  7. ఊహలన్నీ రాతలాయెగా… 🙂
    ఊహ బాగుంది ఊహను మలిచిన తీరు బాగుంది

    స్నేహితుల రోజు శుభాకాంక్షలు

    Like

  8. మహేశ్ గారు: ఊ.. మాట్రిక్స్ గురించి మరిన్ని వివరాలు కావాలి. Especially, obscurity within limits గురించి. చెప్పగలరా??
    ఏం రాసినా మీరు చదివేస్తారు!! నెనర్లు!! 🙂

    ఆశ్విన్: నెనర్లు!!

    మురళి గారు: అందుకేగా బ్లాగుకా పేరు పెట్టింది. లాగాలన్న దురుద్దేశ్యం నాకు లేదండి. కానీ లాగకపోతే, వీళ్ళే అలిగి కూర్చుంటారు!! 😉

    వేణూ గారు: మరే!! “ఈ అబ్బాయిలున్నారే..” అని ఎంత సేపు తలపట్టుకోడానికి ఎవరూ లేరు. అందుకే, ఇదో ఇలా!! 😉

    సందీప్ గారు: అవునా?? నేను చూడలేదే!!

    మీనాక్షి: థాంక్స్!!

    విద్య: మరేం, కథ కాకుండా వ్యాసం రాస్తే ఎవరూ చదవరేమో.. తెలీదు కదా!!

    రాముడు గారండీ: ఇక్కడ ఊహలు ఊసులవుతున్నాయి కానీ అండి, మీరెక్కడ అండీ?? “మాకెన్నాళ్ళీ వేటింగ్” చెప్పండి మరి??
    Thanks for the comment. Was a thorough surprise.

    Like

  9. 🙂 దేన్ని వదిలిపెట్టరు గా పూర్ణిమా.బాగు0ది బాగా రాసారు.
    హేయ్..నేనిన్నాళ్ళూ చూసుకోలేదు నేను మిమ్మల్ని నిన్ను అని స0బోధిస్తున్నానని.నాకసలే వద్దన్నా గారు అని,అ0డి అని వచ్చేస్తు0ది .అదేమిటో మీ టపాలు చదువుతున్టే ఒక దగ్గరి స్నేహితురాలితో పక్కన కూర్చుని కబుర్లు చెపుతున్నట్టు వు0టు0ది.అ0దుకే నా నోటి వె0ట అలా0టి స0బోధన వచ్చినట్టు0ది.

    Like

  10. కాన్సెప్ట్ బాగు. ఆ కాన్సెప్ట్ ని ప్రజెంట్ చేసిన తీరు బహు బాగు

    Like

  11. రాధిక గారు: లైట్ అండీ.. నేనంత బాగా రాసేసాను అనుకుంద్దాం!! 🙂

    నిరంజన్ గారు: నెనర్లు!!

    Like

  12. నీ ప్రతి టపాకి అనుకుంటాను, ‘this is the best of all’ అని! and you prove me wrong with your next one!

    “నా స్నేహాలన్నింటిలోనూ నీతో ప్రత్యేకమైన అనుబంధం. నీవళ్ళే కదూ.. పోగట్టుకున్న నేస్తాలందరినీ మళ్ళీ పోగు చేసుకున్నాను.”

    ఇది నా విషయంలో కూడా ఎంతో నిజం.. ఒక మూడు నాలుగు నెలల క్రితమే ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ అందరమూ ఎన్నో సంవత్సరాల తర్వాత ఇక్కడే కలుసుకున్నాము!! ఆ ఎక్సైట్ మెంట్ మాత్రం మాటల్లో చెప్పలేనిది!!

    మొత్తానికి నీ ఊసులక్కాదేదీ అనర్హం! 🙂

    Like

Leave a comment