నిఝంగా క్రికెట్టేనా??

Posted by

ఒకోసారి మనకి చాలా ఇష్టమైన వాళ్ళు, ఇష్టమైనవి మనకి ఇష్టమై ఉండకపోతే బాగుండేదేమో అనిపిస్తుంది. మనకున్న ఇష్టం వల్ల వెనకేసుకు రావటం కాదు అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది, ఎవరూ నమ్మరని తెలిసినా!! ఇప్పుడే శివ గారి బ్లాగులో “ఒలింపిక్స్ లో వైఫల్యానికి కారణం ముమ్మాటికీ క్రికెట్టే కారణం”* అని చదివాకా, నిజంగానా? నిఝంగా నిజంగానా? అని అడగాలనుంది. కొన్ని నిజాలు లేకపోలేవు, కానీ అదే ప్రధాన కారణం అంటే నమ్మకంగా లేదు, క్రికెట్ట్ మీద వెర్రి ప్రేమ వల్ల కాదు, నాకు తోచే కారణాలు:

ఆటలు- రాజకీయాలు:
అవి మనకి తండోపతండాలుగా బ్యూటీ క్రౌన్లు వచ్చిన రోజులు. మన అమ్మాయి ఎక్కడికెళ్తే అక్కడ గెలిచి తీరాల్సిందే!! అప్పుడప్పుడే ఐ.టీ.లో కూడా మన ఉనికి బాగా తెలుస్తున్న రోజులు. అప్పుడు ప్రమోద్ మహాజన్ అనుకుంటా ఒక స్టేమెంట్ ఇచ్చారు: “మనం బ్యూటీ కాంటెస్టుల్లో, ఐ.టీలో ఇన్ని విజయాలకు కారణం అక్కడ రాజకీయ నాయకులు కలగజేసుకునే అవకాశం లేదు కదా!!” అని. అందరూ భొళ్ళున నవ్వారు. నవ్వు వెనుక ఎంతటి నిజాన్ని అయినా పాతి పెట్టేసే లక్షణం మనది. కానీ అది ఎంత నిజమో గమనించండి. పాలిటిక్స్ లేకపోతే మన క్రీడలెంత బాగుండేవో కదా? గ్రాస్ లెవెల్లో నిధుల దుర్వినియోగం వల్ల అసలు సౌకర్యాలే లేకపోవటం!! మిడిల్ లెవెల్లో ప్రాంతీయాభిమానాలూ, స్వార్ధాలు; టాప్ లెవెల్లో అర్ధంలేని అహాలు, పంతాలు, వెరసి మన క్రీడా వ్యవస్థ.

ఆటలు – జీవనోపాధి:
పదకొండు నుండి ఇరవై ఒకటి వరకూ యువత “బిందాస్” జీవితాన్ని గడుపుతారు చాలావరకూ!! (not an attempt to generalize, exceptions are noted) అప్పటికి చాలామంది జీవితాన్ని ఏం చేయాలి అన్న ఆలోచన అంతగా వేధించుకు తినదు. అటు తర్వాత కాస్త సీరియస్ నెస్ పెరిగి ఒక కరీర్ గ్రాఫుని మొదలెడతాము. అది నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ మనం ముప్ఫైల్లోకి వచ్చేసరికి వేగం పుంజుకుని ఇంకా ముందుకు ఉరకలేస్తుంది. అదే, ఒక ఆటగాడికైతే పదకొండు ఏళ్ళల్లోనే జీవితాన్ని మలిచే నిర్ణయం తీసుకోవాలి. వాటితో పాటు అన్నీ కలిసి రావాలి. అన్నీ అమరాక, ఒక వేళ అనుకున్న స్థాయి వరకూ వెళితే ముప్ఫై ఏళ్ళకే క్రీడా జీవితం దాదాపుగా అయ్యిపోతుంది. కానీ జీవితం మిగిలే ఉంటుంది. పేరు వచ్చినా, అది కూడు పెట్టదు. మళ్ళీ  జీవనపోరాటం. కుటుంబం తన వైపే చూస్తూ ఉంటుంది. బ్రతుకు భారం మీద పడుతుంది. అందుకే ఆటలు స్కాలర్ షిప్పులు వచ్చే మార్గంగా ఉండిపోతున్నాయి.

క్రికెట్ట్ – ఫేం – మనీ:
క్రికెట్ట్ ఆడితే బోలెడు పేరు, అంతకు మించి డబ్బు!! క్రికెట్టర్లకేం..అంతా హాయి అని అందరి ఉద్ధేశ్యం!! సచిన్, ధోనీ బాంక్ బాలెన్స్ గురించే మనకి తెలుసు. వీరికి వస్తున్న పేరు వల్ల మిగితా వారికి పేరే లేకుండా పోతోంది అని మన బాధ. క్రికెట్ట్ లో అంత డబ్బు ఎలా వస్తుంది? లాస్ట్ బాల్ రన్ తీసి మాచ్ గెలిపిస్తే, ఆ అబ్బి మర్నాడు సూపర్ హీరో ఎలా అవుతున్నాడు? ఊరూరూన అతని పేరెందుకు మారుమోగుతోంది? కార్పెరేట్ వాళ్ళు క్రికెటర్లకోసం డబ్బు పెడుతున్నారు అనుకోవడం అంత వెర్రి లేదు. క్రికెటర్లన్నీ, వాళ్ళ మీద మనకున్న పిచ్చిని డబ్బు చేసుకుంటున్నారు అంతే!! బాగా ఆడేవాళ్ళు కాదు, జనాల్లోకి చొచ్చుకుపోయే వాళ్ళు కావాలి వారికి. సచినైనా, ధోనియైనా ఓ రెండు సీరీస్ ఎత్తేస్తే, ఈ డబ్బూ ఎత్తేస్తుంది. అసలు క్రికెట్ట్ లోకి కార్పొరేట్ ఇంతిలా చొచ్చుకుపోవడానికి కారణం, క్రికెట్ట్ అడ్మినిస్ట్రేషన్ (ముఖ్యం జగ్మోహన్ దాల్మియా పాత్ర పెద్దదని విన్నాను). హద్దుల్లో ఉన్నంత వరకూ ఇది బ్రహ్మాండంగా పని చేస్తుంది ఆట కోసం. మిగితా ఆటల్లోనూ అది పెట్టడానికి ప్రయత్నించాలి!!

క్రికెట్ట్ తప్ప ఎందుకు చూడం అంటే:
లేదు గచ్చిబౌలికి వెళ్ళి హాకీ మాచులు చూడచ్చు, యూసఫ్ గూడకెళ్ళి వాలీ బాల్ చూడచ్చు. మన వాళ్ళు దారుణంగా ఓడిపోయే ఛాన్స్ ఉన్నా చూస్తాము. మళ్ళీ వెళ్తాము, మళ్ళా ఓడిపోతారు. మనకి విసుగొస్తుంది. If you want audience have a better show. అది కావాలంటే ఒక్క రోజులో కాదు. ఎన్నో సంవత్సరాల కష్టం, నిరంతర శ్రమ కావాలి. జనాలు చూడడానికి రాకపోతే కార్పొరేటూ, మీడియా ఏమీ చేయలేవు. ముందుగా కాసింత ఉత్సాహమూ అవీ ఉంటే, వాటిని పెంపొందించడానికి మీడియా ఉపయోగపడచ్చు కానీ, అసలు ఇంటెరెస్ట్ దాని వల్ల రాదు. మిగితా అన్ని వార్తల్లానే ఇవీ విని ఊరుకుంటాము. మన వాళ్ళని ఇతర క్రీడల మీద ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేకపోలేదు, కానీ ముందు ఆ క్రీడలూ, ఆ క్రీడాకారులను ఉద్ధరిస్తే, అటు తర్వాత ఆటనెలా ఆస్వాదించచూ, అభినందించచూ అన్న దాని గురించి ఆలోచించచ్చూ!! 

చైనా బాగుపడడానికి క్రికెట్ట్ లేకపోవడమే కారణమా??
అన్నా అంటారు జనాలు, చైనీస్ క్రికెట్ట్ ఆడరు అందుకే అన్నేసి పతకాలు వచ్చేస్తున్నాయని. ప్రతీ నాలుగేళ్ళకీ ఒక్కసారి ఉలిక్కిపడి లేచి, కాసేపు గొంతు చించేసుకుని మళ్ళీ ముసుగు తన్ని పడుకుంటాము. పోయిన ఒలింపిక్స్ పూర్తి కాగానే, చైనా రెండో స్థానంలో ఎందుకుందో వివరిస్తూ ఈనాడులో ఒక వ్యాసం. చైనా వాళ్ళు ఫలానా ఒలింపిక్స్ కళ్ళా మనమిక్కడ ఉండాలి అని నిశ్చయించేసుకుని, ఊరుకోలేదు. అందుకు తగ్గట్టుగా శ్రమించారు. దేశం నలుమూలల నుండీ మూడేళ్ళ పసిప్రాయంలో ఉన్నావారందరినీ, (అందరినీ అంటే అందరినీ) కాంపులకి రప్పించి, వారికి శిక్షణలచ్చి అందులో ప్రతిభ ఉన్నవారిని మరింత ప్రోత్సహిస్తూ ప్రపంచ వేదికపై నిలిపారు. ఆ దేశ జనభాతో ఇది సాధ్యపడిందంటే, ఎంత ప్రణాళికా బద్దంగా జరిగిందో!! చిన్న వయస్సులో ఇళ్ళు వదిలి ఉండాలి, మనకి ఉగాదిలా వాళ్ళ కొత్త ఏడాది పండగకి మాత్రమే ఓ రెండు రోజులు ఇంటికెళ్ళచ్చు ఏడాది కాలంలో!! ఇన్ని త్యాగాలు, ఇంత క్రమశిక్షణ, పకడ్బందీ ప్లానులూ అమలు చేస్తే ఒలింపిక్ మెడల్స్ నడుచుకుంటూ వస్తాయి. క్రికెట్ట్ లేకపోవడం వల్ల కాదు, ఆటలు తగినంత స్థానం కలిపిస్తున్నారు కాబట్టి చైనా ఎవరితో అయినా ఢీ కి సిద్ధంగా ఉంది.

“నువ్వెన్ని చెప్పూ..క్రికెట్టే కారణం” అంటారా?? సరే, నాకిక్కడో సాయం చేయండి, మిమల్ని మీ మానాన వదిలేస్తా!! నాకు గార్డెనింగ్ సరిగ్గా తెలీదు, అయినా ఎక్కడో చోట మొదలెట్టాలి కదా అని తోటలో మొక్కలు పాతేసా!! అన్ని వేరు వేరు మొక్కలు, అయినా సమానమైన గాప్ వదులుతూ అన్నీ నాటేశాను. ఇప్పుడు ఏమయ్యిందంటే అందులో ఒక్క మొక్క బాగా పెరిగిపోయింది. మిగితావి ఇంకా మొక్కలు గానే ఉన్నాయి. ఈ బాగా పెరిగిపోయిన మొక్క అన్నింటికీ అడ్డుగా ఉంది, దాని నీడ వల్ల మిగితా మొక్కలు పెరగటం లేదూ, భూమిలో ఉన్న సారాన్నంతా అదే తీసేసుకుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు నేనేమి చేసేది, “నువ్వు మరీ పెరిగేస్తున్నావు, అది నీ తప్పు” అని దాన్ని సమూలంగా తొలగించాలా?? మరీ కాదులే అని దాని కొమ్మలు కొట్టేయాలా?? లేక ఆ మిగిలన మొక్కలను ఇంకో స్థానానికి మార్చి జాగ్రత్తగా పెంచి పోషించాలా?? ఏం చేయమంటారు??

ఇప్పుడు ఆ తోట మన కీడా వ్యవస్థ అయితే, అంతలా పెరిగిపోతున్న మొక్క క్రికెట్ట్ అయితే, మిగిలిన మొక్కలు మన తక్కిన క్రీడలైతే మీ సమాధానంలో మార్పుంటుందా?? ఇప్పటికిప్పుడు జనాలు క్రికెట్ట్ మానేస్తే, మిగితావి ఎలా బాగుపడతాయి? ఎవరైనా చెప్పగలరా??

మహా అయితే ఓ నెల రోజుల పాటే ఈ చర్చలూ, ఆవేశాలు!! అటు తర్వాత మళ్ళీ నాలుగేళ్ళు ఆగాలి వీటి కోసం. ఈ నాలుగు రోజులూ ఎటూ తెగ “ఫీల్” అయ్యిపోతాము కాబట్టి, సరైన కారణాలకి ఫీల్ అవుదాం. సర్జరీలు చేసేంత మనకి లేదు, బాండేజీలతో కాలం వెళ్ళదీస్తున్నాము. ఆ బాండేజీలైనా దెబ్బ ఉన్న దరిదాపుల్లో పెడదాము. అనిపించిన చోటల్లా కాదు.

చివరిగా ఒక్క విషయం, ఇది మాత్రం నా కోపం హద్దులు లేకుండా చేసేస్తుంది. A billion people and not even a single medal అన్న నిట్టూర్పులు, తలకొట్టుకోవడాలు. Damn it!! It’s not about billions of people, it is about handful of men and women with iron will and steel resolution that get you the results. If possible stand by them, support them, cheer them or at least pray for them. ఏదీ కాకపోతే గమ్మున ఉంద్దాం, అంతే కానీ ఓడిపోయన్నంత మాత్రాన వాళ్ళు “సిగ్గుచేటు” అనడం ఇంకా బాధాకరం. ఇప్పటికే తలకు మించిన త్యాగాలు చేసి ఉన్నారు, ఇంకా అడగడం దారుణం.

పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం
ఆటనే మాటకర్ధం నిను నువ్వే గెలుచు యుద్ధం

* ఇది శివ గారిని కానీ, వారి అభిప్రాయాల్ని గాని ప్రశ్నించే ప్రయత్నం కాదు. అది చదివాక నాలో కలిగిన ఆవేశం, అంతే!! నా పాయింట్ తెలిపే విధానం అంతే!!

15 comments

  1. పూర్ణిమ :)బాగున్నాయి నీ ఊహలూ .. ఊసులూ..అలాగే నీ ఆవేశం కూడా…☺

    ♥ ఆ చెట్టు ఎంత ఎదిగినా సరే అది పనికిరానిదైతే నేను దాన్ని తొలగిస్తాను . చేలో కలుపు మొక్కలు అసలు పంటకన్నా ఏపుగా పెరుగుతాయి .. బాగా పెరుగుతున్నాయికదా అని ఊరుకుంటారా రైతులు ?

    ♦ క్రికెటర్ల డబ్బు సంపాదనని నేను వ్యతిరేకించ లేదు . బోర్డ్ వారివల్లే సంపాదించుకుని వారికి చిల్లర ఇస్తుందన్నా.. .

    ♣ BCCI కి ప్రభుత్వం ఎందుకు రాయుతీలివ్వాలి ???

    ♠ క పతకాల విషయానికి వస్తే కర్ణుడు చావుకి కారణాలనేకం లాగా చాలా కారణాలున్నాయి గాని ప్రదాన కారణం క్రికెట్ట్ అని నా అభిప్రాయం ..

    ☼ ఆటనేదానికర్దం పసిడిపతకం కాదు … నిజమే కాని కనీసం ఆడటానికి ఎంట్రీలే లేని గోరంగా ఉంది కదా..

    ◘ ఒలంపిక్స్ ని వదిలేస్తే ప్రపంచవాప్తంగా పేరున్న పుట్ బాల్ , బాస్కేట్ బాల్ ,రగ్బీ ,హాకీ లలో మన వాళ్ల పరిస్తితి ఏమిటి ..

    ◙ నా ఉద్దేశ్యంలో క్రికేట్ కు పేకాటకి గుర్రప్పందాలకి తేడా ఏమీలేదు .. అవన్నీ క్లబ్ క్రీడలే ..

    Like

  2. పూర్ణిమా,
    చాలా బాగా చెప్పారు. వెనకటికెవడో తలపాగా కట్టలేక తలొంకరన్నాడట.
    శివ గారు,
    క్రికెట్టేమీ కలుపు మొక్క కాదు మాష్టారు. అందులో క్రీడాకారులు గవాస్కర్, కపిల్, సచిన్ లాంటి వాళ్ళు ఆ క్రీడకి క్రేజ్ తెచ్చారు. ఇప్పుడు సానియా వచ్చిన తరువాత టెన్నిస్ కి క్రేజ్ వచ్చింది. మిగిలిన క్రీడలకి కూడా రాయితీలు ఉన్నాయి. సరయిన వసతులు లేవు అని అంటారేమో గానీ చాలా మంది అజరుద్దీన్ లాంటి వాళ్ళు కాళ్ళకి ప్యాడులు లేకుండా సైకిల్ మీద 10 కిలోమీటర్లకి పైగా రొజూ ఉదయాన్నే వెళ్ళీ ప్రాక్టిస్ చేసావారంట. ఇప్పటికి వర్ధమాన్ క్రికటర్లు అల్నే ఉన్నారు.

    Like

  3. నిజంగా క్రికెట్ కాదు..అసలు క్రికెట్టైనా మరేదైనా ఎందుకు చూస్తాం.. ఎంటర్‍టైన్‍మెంట్ కోసమేకదా… ఎవరికి ఏది నచ్చితే అది చూస్తారు. మిగతా ఆటలు కూడా అంతగా నచ్చితే వాటినే చూస్తారు … అంతేకానీ ఇలా మిగతా ఆటలు పైకిరాకపోవడానికి క్రికెట్టే కారణం అనడం అంత హాస్యాస్పదం లేదు. కొంతమంది గొప్పకోసం చెప్పే సోది ఇది… దేనిదారి దానిదే… మన మీడియాకి రాయడానికి ఏమ్ లేక ఇలా ఏదో ఒకటి రాసేస్తే అది చదివి నిజమనుకొనేవాళ్ళు ఎంతమందిమి లేము… ఇక చైనా గురించి మీరు చెప్పినది అక్షర సత్యం… అది కమ్య్యూనిస్ట్ దేశం.. అక్కడ ప్రభుత్వానికి నచ్చితె ఏమన్నా చేయొచ్చు… మనకు ఎక్కువమంది దేన్ని ఇష్టపడితే దానికే అగ్రతాంబూలం… ఒక నాలుగు నెలలు ఆగండి మళ్ళీ నాలుగేళ్ళవరకూ క్రికెట్టే దిక్కు మనకి… 20-20 వచ్చేసిందికదా.. అన్నట్టూ ఇప్పుడు చైనా కూడా క్రికెటర్లని తయారు చేస్తోందంటా… అప్పూడు ఏం రాస్తారో… చైనా క్రికెట్‍లో కూడా అద్భుతాలు సృష్టిస్తుంది మనం ఎప్పట్నుండో పోషిస్తున్నా క్రికెట్‍లో కాడా వెనుకపడిపోయాం అంటారేమో…

    మనకు ఎందుకో క్రికెట్ నచ్చలేదని ( అది కూడా ఎందుకో తెలియదు ) … దానిని ఇష్టపడేవాళ్ళందరూ బద్దకస్తులూ, పనిలేనివాళ్ళూనా.. ప్చ్…. ఏమనాలో కూడా తెలియడం లేదు…

    Like

  4. అదిరి౦దమ్మా పూర్ణిమ గారు,
    కొత్త టైపు పోస్టు,కొత్త టాపిక్,కొత్త ఆవేశ౦.హ హ హా.చాలా బాగు౦ద౦డి.

    Like

  5. ప్రియ: థాంక్స్!!

    శివ గారు: క్రికెట్ట్ ఆటలోనూ అందం ఉంది. అది చూడలేకపోతే మరేం ఫర్వాలేదు!! కానీ మరీ కలుపు మొక్కగా తీసిపడేయాల్సిన అవసరం లేదు. కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలున్నప్పుడు, లక్షలో క్రికెట్ ఒక కారణమే అవుతుంది.

    మురళి గారు: బాగా చెప్పారు.

    గీతాచార్య గారు: చూశాను మీ బ్లాగు!! నెనర్లు!!

    శంకర్ గారు: నిజమే.. its disappointing!!

    క్రాంతి గారు: నా ఆవేశంలో మరీ అంత కామెడీ కనిపించిందా?? ఆ??

    Like

  6. క్రికెట్టే కారణమా?
    ఇది మరీ దారుణం, ఇవీ నాకు అనిపించిన, కనిపించిన కారణాలు.
    1) మన వాళ్ళకి సరైన ముందుచూపు లేకపోవడం,
    2) మనదేశంలో అన్నింటికీ అడ్డుపడే కుటిల రాజకీయాలు,
    3) మీడియా సపోర్టు,
    ఇలా చెప్పుకొంటూ పొతే, శివ గారు చెప్పినట్టు ఒక లక్ష కారణాలు వచ్చేట్టున్నాయి.
    శివ మాస్టారు మీరు మరీనూ, క్రికేట్టేమి కలుపు మొక్క కాదండి.

    Like

  7. Too good.. ఈ పోస్టులో ఆవేశం అవగాహన రెండూ కనిపిస్తున్నాయి. నువ్వేది రాసినా, అందులో ఆవేశం, అల్లరి, ఆర్ద్రత వీటిలో ఏ అన్శమున్నా సరే, నువ్వు కదిలించి తీరతావు…

    Like

  8. I don’t think cricket has anything to do with India’s poor performance in olympics or other sports on the itnernational arena.

    Other nations have their own one or two favorite pastime entertainment sports – like most of european nations are crazy about soccer.

    IMO, it is the lack of a clear vision on part of the policy makers – మొత్తమ్మీద, విద్య, మానవ వనరుల రంగానికి పట్టిన దౌర్భాగ్యమే ఇది.

    Like

  9. చైనా సరే, కమ్యూనిస్ట్ దేశం.. చిన్నప్పట్నించే పిల్లలకి శిక్షణ ఇచ్చి బోల్డన్ని మెడల్స్ కొట్టేసారు.. మరి కమ్యూనిస్ట్ కాని మిగతా ఎన్నో దేశాలు, వాళ్ళు సాధించే మెడల్స్ మాటేమిటి!!? నాకైతే krikeT is part of the problem అనిపిస్తుంది.. అంటే నా ఉద్దేశ్యం క్రికెట్ ఆడేవాళ్ళు కాదు!!

    “గచ్చిబౌలికి వెళ్ళి హాకీ మాచులు చూడచ్చు, యూసఫ్ గూడకెళ్ళి వాలీ బాల్ చూడచ్చు. మన వాళ్ళు దారుణంగా ఓడిపోయే ఛాన్స్ ఉన్నా చూస్తాము. మళ్ళీ వెళ్తాము, మళ్ళా ఓడిపోతారు. మనకి విసుగొస్తుంది.”

    అవును విసుగొస్తుంది, except it is cricket!
    ‘మా తాతలు నేతులు తాగారు.. మా …. చూడండి ‘ చందాన అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం world cup సాధించారని ఇప్పటికీ మురుసుకుంటాము.. మొన్న 20-20 కప్ గెలవకముందు వరకూ మనవాళ్ళు సాధించిన అమోఘమైన విజయాలేమున్నాయి!?!? అయినా ఆ క్రీడకి రావాల్సిన నిధులు ఆగలేదు.. కారణం రాజకీయాలే కానీ, కార్పొరేట్ వ్యాపార ధోరణే కానీ!! ఒకటి మాత్రం నిజం, ఎన్నిసార్లు చతికిలబడ్డా క్రికెట్ కి లభించే ప్రోత్సాహం మిగతా క్రీడలకు దొరకదు 😦

    Like

  10. మారు మూల పల్లెనుంచి జాతీయ స్థాయిలో(1968-72) హాకీ ఆదిన ఓ అక్క గుర్తుకు వచ్చింది.
    సెలక్షన్లు, రాజకీయాలు, వివక్షలు వత్తిడి పడలేక స్పోట్స్ కోటాలో వుద్యొగంలో జేరి పరాసాంతగా వుంది నాపిల్లల్ని పోటీ ఆటలకు పంపను, వ్యాయంకోసం మాత్రమ ఆడమని చెబుతాను అంటుండేది.

    ఆడిన వాళ్ళాంతా చేదు అనుభవాలతో నిండిపోతే
    ఇంక పతకాలు ఎక్కడనుండి వస్తాయి????

    Like

  11. చాలాసహేతుకమైన ఆలోచనా, ఆవేశం.

    Like

Leave a comment