సూసైడ్ నోట్

Posted by

విరక్తి! విరక్తి!! విరక్తి!!!

ఈ లోకమంటేనే నాకు విరక్తి!!

చేసే ప్రతీ చర్యకీ కారణం కనిపించాలంటూ వేధించే లోకమంటే విరక్తి!! పద్ధతులే పరమావధులుగా భావించి మనసు నోరు నొక్కేసే లోకమంటే విరక్తి!! కట్టుకున్న కట్టుబాట్లు అవి కప్పుతున్న శరీరాన్నే తూట్లు పొడుస్తున్నా చూసీచూడనట్టు ఉండే ఈ లోకమంటే విరక్తి!!

నా పుట్టక నా ఇష్టానుసారం కాదు. పుట్టిన తర్వాత మెల్లి మెల్లిగా పాకుతూ, కొద్ది కొద్దిగా బలాన్ని నింపుకుంటూ, కాస్త కాస్తగా వేగాన్ని పుంజుకుంటూ ఉరకలు వేసే నా మీద ఎన్ని ఆంక్షలు పెట్టలేదనీ ఈ లోకం?! పరుగు నేర్చుకున్నా, పరిగెట్టకూడదు, హుందాగా నడవాలి, రాజసం ఉట్టిపడాలని ఎన్ని సార్లు గుర్తు చేయ(లే)దూ ఈ లోకం? పరుగులాంటి నడకో, పరిగెట్టలేక నడకో ఏదైనా సరే, తొందర ప(పె)డుతున్న తొందరను దాచే ప్రయత్నం చేయాలని నన్ను పోరలేదూ? సహజ కారణాల వల్ల ఎంత ఉదృతంగా మారుతున్నా తెచ్చిపెట్టుకున్న నాజూకుతన్నాన్ని పదిలంగా కాపాడుకుని ప్రదర్శించాల్సిందే అంటూ హెచ్చరించలేదూ నన్నీ లోకం?? నవ్వించీ కవ్వించీ, ఊరించీ మురిపించీ, ప్రేమించి  వయ్యారాలు పోతూ మెల్లగా అతడికి చేరువై, వంశధారలా మారి సంగమించాలని ఉపదేశిస్తుందీ లోకం. ఇదే జీవన “స్రవంతీ” అని నొక్కి వక్కానిస్తుందీ లోకం!!   

నేనూ జీవితం ఇంతే అనుకున్నా, నిన్ను చూసే వరకూ!! తొలిసారిగా ప్రేమిస్తున్నానా?? కాదేమో!! ప్రేమంటే సన్నగా గిల్లే వాన చినుకు, మెత్తగా తాకే పువ్వు, మెల్లగా చేరే తుషారబిందువు ఏమో కదా!! మరి నువ్వో?? కట్టలు, గుట్టలు దాటేలా నీ మీద శృతి మించిన కోరికేదో నన్ను నిలువనివ్వటం లేదు. ఎందుకు మనసు పడ్డానో కథగా మలచలేను. నీ వశమైపోయానని తెలిసీ కూడా తెలియనట్టు నటించలేను. నీ మాయలో పడీ, ఆ లోతెంతో కనిపిస్తుంటే నేల మీద నడకెంత నేలబారుగా ఉందో!!  నా ప్రతీ ఊసూ నీలో “ప్రతి”ధ్వనిస్తుంటే వినాలనుంది. విరహంతో వేడెక్కున్న నీ ప్రత్యణువులోని దాహాన్ని నేనే తీర్చాలని ఆశగా ఉంది. ఆ విరహాగ్నిని చల్లార్చలేక ఆవిరైపోయానా అది వరమే!! నిన్ను చేరలేక ఎంత నిండుగా మిగిలినా కలవరమే!! 

నువ్వు సృష్టించిన నాలోని ఈ అలజడి దిగంతాలు దద్దరిల్లేలా వినిపిస్తోంది. ఆ సడికి లోకం ఉలిక్కిపడి లేచే లోపు నీలో కలసిపోవాలి. లేకపోతే నీ పై ఇష్టాన్ని కష్టమంటుంది. నీకై తపనను కేవలం “ఆకర్షణ” అని కొట్టిపారేస్తుంది. నిన్ను చేరడాన్ని “దిగజారడం”గా అభివర్ణిస్తుంది. నా అంతస్థు మరచి కిందనున్న నిన్ను కోరుకోవడం అవివేకమంటుంది. కళ్ళు మూసుకుపోయిన “ప్రేమ”లో విలువల్ని కాళ్ళరాస్తున్నానని గొడవ చేస్తుంది. మన అతి రమ్యమైన కలయిక  అ(వి)నకూడనీ పదాలతో ఉరి తీయడానికి పూనుకుంటుంది.

ప్రతీ క్షణం “నన్ను” నేనే కొద్ది కొద్దిగా చంపుకుంటే కానీ బతకలేని ఈ లోకం ఇక నాకొద్దు. క్షణకాలమైన నీ సాన్నిహిత్యం చాలునని నమ్మకం కుదిరాక ఇంకా జీవించ(లే)ని జీవితం మీద ఆశలు లేవు. చస్తూ బ్రతికే కన్నా “అంతం” లోనూ అనంత జీవనాన్ని అనుభవించగల నీ లోకానికి పయనమయ్యే ముందు ఈ లోకానికి నా వీడ్కోలు!!    

16 comments

  1. మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ says:

    అంతరాత్మకు రాసిన ప్రేమలేఖ బాగుంది, కానీ లోకం నుంచి పారిపోవడమెందుకు?

    సర్వం త్యజించాలంటే ఆ సర్వం మన దగ్గర ఉండాలి
    కదా!! (నా సొంత వాక్యం కాదు, యండమూరిది)

    ” పరుగు నేర్చుకున్నా, పరిగెట్టకూడదు, హుందాగా నడవాలి, రాజసం ఉట్టిపడాలని ఎన్ని సార్లు గుర్తు చేయ(లే)దూ ఈ లోకం? ” — ఇది కేవలం భ్రమ మాత్రమే, మహాత్ముడిలో ఉందా రాజసం? మదర్ థెరెస్సాలో ఉందా?? ఐన్ స్టైన్ లో ఉందా??? ఆత్మహత్య చేసుకుందామనుకున్న గణిత మేధావి రామానుజిడులో ఉందా????
    రాజసమంటేనే అహంభావం. రాజసం తరువాతి యోగం తామసం.
    అహంభావముంటేనే గుర్తించే లోకంతో పని లేదు

    ” ప్రేమించి వయ్యారాలు పోతూ మెల్లగా అతడికి చేరువై, వంశధారలా మారి సంగమించాలని ఉపదేశిస్తుందీ లోకం” — ఈ వాక్యం చాలా బాగా రాశారు

    ఒక వేళ నేను అనుకున్నట్టు అంతరాత్మకు కాకుండా ప్రేయసి ప్రియుడికి రాసిన ప్రేమ లేఖ అయిన పక్షంలో,
    ప్రియుడి లోకానికి చనిపోయి చేరడంలో అర్ధమే లేదు,

    Like

  2. నో! వద్దు!! రావద్దు!!! తొందరపడొద్దు!!!! ఈ రెండు లోకాలకూ ఆట్టే తేడా లేదు!!!!! :-)))

    Like

  3. An ultimate testimony to the present day emotional suppression/oppression.వ్యక్తి స్వాతంత్ర్యంకన్నా, సమాజశ్రేయస్సును ఎక్కువగా కాంక్షించే సామాజిక విధివిధానాలు ఉన్నంతవరకూ ఈ సూసైడ్ నోట్స్ రాయబడుతూనే ఉంటాయి.నిశ్శబ్ధంగా కొన్ని వేల ఆశలు ప్రతిక్షణం గొంతునులిమి హత్యచేయబడుతున్నాయి.అవి మానసికంగా,వ్యక్తిగతంగా ఆత్మహత్యలవుతూ ఉంటాయి.

    సహజ జీవనప్రవాహాన్ని, “ఇదే జీవనస్రవంతి” అని కట్టడిచేసే ఈ లోకం, ఒక్కసారి ఆ ప్రవాహం చెలియలకట్ట దాటితే సర్వం నాశనం జరుగుతుందని తెలీక హాయిగా ఉంది.వరద ఉధృతి తగ్గాలంటే, కనీసం గేట్లైనా తెరవాలి…లేదూ వినాశనానికి తయారుగా ఉండాలి.

    రచన విషయంలోని ఉధృతిని, నీ భావ గాంభీర్యంతో కట్టడి చేసావు.గుండెలోతుల్లోని విరక్తిని,పద బంధనాలతో రక్తికట్టించావు.మనసుకు నచ్చింది.నా అభినందనలు.

    Like

  4. మొదట రేరా చివరి పేరా తీసేస్తే ఇదేదో గద్య ప్రేమ కవితలా ఉంది, ఒహో ఇది సూసైడ్ ప్రేమ నోట్ అనమాటా 🙂

    Like

  5. ఇప్పటి పరిస్థితులలో సుఖంగా బ్రతకాలంటే చచ్చిన వాళ్ళకే సాధ్యం! చిన్నప్పుడే చనిపోయిన వాళ్ళకి పెద్దయ్యాక బ్రతుకు అంత కష్టంగా ఏమీ ఉండదు.

    Like

  6. సూపర్ ! – నీకై తపనను కేవలం “ఆకర్షణ” అని కొట్టిపారేస్తుంది. నిన్ను చేరడాన్ని “దిగజారడం”గా అభివర్ణిస్తుంది. నా అంతస్థు మరచి కిందనున్న నిన్ను కోరుకోవడం అవివేకమంటుంది. కళ్ళు మూసుకుపోయిన “ప్రేమ”లో విలువల్ని కాళ్ళరాస్తున్నానని గొడవ చేస్తుంది. మన అతి రమ్యమైన కలయిక అ(వి)నకూడనీ పదాలతో ఉరి తీయడానికి పూనుకుంటుంది!! This is exactly what I thought about the LOVE of my life. Later, I gave up!

    పూర్ణిమా – Good Job!

    Like

  7. రానారె గారూ, పూర్ణిమగారు 50 వాక్యాల్లో గంభీరంగా ఏమి చెప్పాలనుకున్నారో – మీరు ఒక్క వాక్యపు కామెడీతో అంతకు మించిన వేదాంతాన్ని అందించారు. వేసుకోండి వీరతాళ్ళు.
    పూర్ణిమగారూ, ఇది మిమ్మల్ని తెగడడం కాదండి. రానారె గారిని పొగడడం మాత్రమే! నమ్మట్లేదా! వేసుకోండి – రెండు – అవే వీరతాళ్ళు.

    Like

  8. కాస్త కాస్తగా వేగాన్ని పుంజుకుంటూ ఉరకలు వేసే మీ మీద మీరే ఎన్ని ఆంక్షలు పెట్టుకుని వ్రాసారు, ఈ సూసైడ్ నోట్ ని?

    పదాలతో పరుగులు కూడదంటూ, హుందాగా ఉందామంటున్నదా ఆ శృతిమించిన కోరిక!

    కాళ్ళాగని కాలపు ఆశలలో, ఊహలలో విహరిస్తూ ఉండక, ఈ “సూసైడ్ నోట్” లు ఎందుకండి?
    రానరె గారు చెబుతున్నారు కదా, అక్కడ అంతే నంట!

    Like

  9. మీరు ఈ కవిత 15-20 years back రాసి ఉంటే అప్పటి పరిస్థితులకు సరిగ్గా సరిపోయేది .. కాని…ఇప్పటి స్త్రీ …హద్దుల మద్య ప్రవహించే నిశబ్ద ప్రవాహం కాదు. రోజులు (కాదు..కాదు ..విలువలు) పూర్తిగా మారిపోయాయి. లోకం విధించిన కట్టుబాట్ల గట్టులు తెంచుకొని పోటెత్తిన వరద గోదావరి ప్రవాహం లాంటిది నేటి స్త్రీ …. ఇన్నాళ్ళ బంధీ తనం (కాదు సమాజపు రక్షణ కవచం )..పోయి కొత్త కొత్త సంస్కృతులను అలవోకగా అలవరుచుకుంటూ … “culture” అనే ముసుగులో స్వేచ్చా , స్వాతంత్ర్యాలు అనే మైనపు రెక్కలు తొడుక్కుని ఫై పైకి ఎగిరిపోతున్నామనే భ్రమలో సూర్య గోళపు మంటలకు దగ్గర అవుతున్నమనే నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాం … ఈ వరద ఉదృతి, సమాజపు పూర్తీ స్థాయి వినాశనానికి దారి తీస్తుందని నేను ఆలోచిస్తున్నాను ..anyhow…
    “విరహంతో వేడెక్కున్న నీ ప్రత్యణువులోని దాహాన్ని నేనే తీర్చాలని ఆశగా ఉంది.” ఈ వాక్యం చాల బాగా రాసారు . ఇంత స్వేఛ్చ ఉన్నా మీ తీరని వాంఛల నైరాశ్యానికి ఇది నిలువుటద్దం. మీ శృంగార బావుకత కు , తన్మయత్వానికి పరాకాష్ట. అవును నువ్వు చెప్పింది నిజమే… నిండు కుండ లాంటి పరువం తో ఒక అర్థాంగివై అతని ప్రత్యణువులోని దాహాన్ని తీర్చాలి , కాని ఒక ప్రేయసిగా తీర్చలనుకుంటే అది వసంతం రాకముందే కూసిన కోయిల చందం గా ఉంటుంది. అంత మధురంగా ఉండదు.
    ok…have a nice day…enjoy …life……no need to put an end to the life at any cost or at any point in time.

    Ganesh
    9849255958

    Like

  10. హలో పూర్ణిమ గారు, కట్టుబాట్ల మధ్య పెరిగి సమాజం నిర్దేశించిన నియమాలను పాటించ లేక అలాగని వాటిని వదిలేయలేక వున్న అమ్మాయిల మనసును బాగా ఆవిష్కరించారు. కాస్త పెద్ద చదువులు చదువుకుని వున్న కొందరి అమ్మాయిలకు బాగానే స్వేచ్చ వుంటుంది.
    మీ టపాలు తరచుగా చూస్తుంటాను. ఒక సాఫ్టువేర్ ఇంజనీరు అయివుండి ఇంత బాగా మీ వ్యాపకాన్ని continue చెయ్యటం అభినందనీయం.

    Like

  11. అలతి పదాలతో అనంతమైన చైతన్యాన్ని ఆవిష్కరించారు.
    అభినందనలు.
    మా మిత్రులొకరు ఎప్పుడూ అంటూ ఉంటారు. రచయిత-పాఠకుడు అనే ద్వంద్వంలో రచయిత వంతు సగం కూడా లేదని. ఒక రచన ఏం చెపుతోందీ అని నిర్ణయించేది పాఠకుల స్పందనే కానీ ఆ రచన కాదు అని ఇక్కడ ఇప్పటిదాకా రాలి పడిన పది స్పందనలూ ఋజువు చేస్తున్నాయి

    Like

  12. “చేసే ప్రతీ చర్యకీ కారణం కనిపించాలంటూ వేధించే లోకమంటే విరక్తి!! “

    మొదటి వాక్యం నుండీ బయట పడి, పూర్తిగా చదివే లోపు ఎన్నొ భావాలను బలవంతంగా అణుచుకుని చదవాల్సి వచ్చింది.

    Like

  13. “చేసే ప్రతీ చర్యకీ కారణం కనిపించాలంటూ వేధించే లోకమంటే విరక్తి!! “

    అసలు బతకడానికి సరైన కారణం తెలీకుండానే బతికేస్తున్న ఈ బతుకు మీద నాకు విరక్తి!
    @రానారే, మీరు రెండు లోకాలనీ చూసినట్టు అంత అధారిటీతో చెప్తున్నారే 🙂

    Like

  14. పూణిమా… చదివిన వెంటనే చాలా చెప్పాలనిపించింది… అలాంటప్పుడు అస్సలు మాట్లడలేను నేను.. అదేమిటో..! మొత్తానికి ఇప్పటికి మాటలు కూర్చుకుని రెడీ అయ్యాను. 😉

    జలపాతాన్ని, లోయతో ప్రేమలో పడిన అమ్మాయి మనసుగా, చాలా బాగా వర్ణించావు.

    అయితే ఆ అమ్మాయిలో నాకు ఎందుకో చాలా భయం, అసహనం అందువల్ల వచ్చే పిరికితనం, తొందరపాటు కనిపించాయి.

    “ఆ సడికి లోకం ఉలిక్కిపడి లేచే లోపు నీలో కలసిపోవాలి.”

    ఎందుకలా? లోకం లేచి వస్తే ఏంటి?? ఎల్ల కాలం మన గురించి మాత్రమే ఆలోచించే తీరికగానీ, ఓపిక గానీ లోకానికి లేవని నా ఉద్దేశం. మనకి నచ్చిన పని మనం చేసుకుపోతున్నప్పుడు, ఆ సంకల్పం ముందు, లోకం మొత్తం ఏకమైనా కూడా ఎదురు నిలవలేదు.

    ఇది నా అభిప్రాయం. నీకు ఇది తెలిసిన విషయమే కావచ్చు…నాకు చెప్పాలనిపించింది అంతే..

    ఇక్కడ నాకో సందేహం… ఆ లోయ’బ్బాయి’కి మన అమ్మాయి మీద అలాంటి ఉద్దేశం లేకపోతే?? ఏంటప్పుడు పరిస్థితి??

    Like

  15. When I read it first time.. I could not find any sense in it.. except a frustrated girl…. then I read again… to interpret some thing… meaning was elusive to find in those words….
    but after seeing mohana’s comment… Every word makes sense to me…

    To be frank… I love mohan’s comment more than ur post… with out that comment… I would not have read this post again…

    Now I say… its really beatiful… awesome job madam,..

    Like

Leave a comment