హైద్ లో ఓ సాయంత్రం, సముద్ర తీరాన!

Posted by

కల కాదుగా నిజమే కదా, నిను చూస్తున్నా
సంతోషమై కెరటానిగా పడి లేస్తున్నా

నిజ జీవితంలో కూడా నేపధ్య సంగీతం పాటలూ ఉంటే, ఇలాంటి పాటలన్నీ ఏరుకుని మరీ “ప్లే” చేసుకోవాల్సిన సందర్భం అది నా జీవితంలో! నేను ఇన్నాళ్ళు చూడని, ఎప్పటికి చూస్తానో తెలియని “సముద్రం” నా కళ్ళముందు నిలవడం, ఒక మరుపురాని అనుభూతి. మా తొలి ముఖ పరిచయానికి కోవళం వేదికగా మారింది. నేనొచ్చానని తెలిసి సముద్రం మరీ ఉత్సాహంగా ఉరకలు వేస్తుందోమో అన్న ఊహా రాకపోలేదు. 🙂 ముఖ పరిచయం ఇప్పుడే అయినా, సముద్రం నాకెన్నాళ్ళగానో తెలుసునన్న ఫీలింగ్. నేను చిన్నప్పటినుండీ బాగా చూసిన నీటి సమూహం అంటే హుస్సేన్ సాగరే!! అంతకు మించి నదులని కానీ, సముద్రాలనీ కానీ చూసే భాగ్యం లేకపోయింది. అయినా అవెందుకో నా మనసులో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. నగర జీవితం అంటేనే సహజ సిద్ధమైన ప్రకృతికి దూరంగా ఉంటుంది. అయినా సముద్రుడు నాకు అత్యంత ఆప్తుడు అన్న భావన కలగడానికి నేను “ఊహించుకోవడమే” కారణం. వాస్తవికతకు దూరంగా ఉండే ఊహల వల్ల ఏంటి ప్రయోజనం అని చాలా మంది అభిప్రాయం. ఊహలంటే ఊసుపోక చెప్పుకునేవి, వాటి వల్ల ఒనగూరేది ఏమీ లేదనిపించచ్చు. Some men see things as they are and say why, I dream things that never were and say “Why not” అన్న కోట్ చదివినప్పుడల్లా వాస్తవికతంటూ మనకి కనిపించనవి, అనిపించనవి ఉన్నాయని తెలుసుకోకుండా, మనల్ని మనమే బంధించేసుకోకుండా కాపాడేవి ఇవే అనిపిస్తుంది.

మా వాళ్ళు నా చేతిలో ఒక డిజీ కామ్ పెట్టేసి, “అదో అలా వస్తున్న అల ఇలా ఈ రాయిని ఢీకొట్టినప్పుడు, నువ్వులా క్లిక్ మనిపించేయ్” అని చక్కా చెప్పి ఫోజులిచ్చి నిలబడ్డారు. నేనూ సిద్ధమే, అల సిద్ధమే, మా వాళ్ళూ సిద్ధమే, ఇక క్లిక్ మనిపించటమే తరువాయి అన్న క్షణాన చట్టుకున్న ఓ మోస్తారుగా ఉన్న అలలు  రెండు ఇరువైపులనుండీ వచ్చి చూట్టేసాయి. అంత చల్లని నీరు ఒక్కసారిగా అంత ఉదృతంగా తాకేసరికి “వాఆఆవ్” అంటూ నేను అరుస్తూ గెంతులు వేయడం, ఫోజు భంగపడిన మా వాళ్ళు నన్ను తిట్టుకోవాలో, అలలను తిట్టుకోవాలో తికమకపడుతుండగా, వెనుక నుంచి మరో పెద్ద అల. “బీ రెడీ.. బీ రెడీ” అన్న హడావిడి, ఫోజులూ, మళ్ళీ అలలు, మళ్ళీ కేరింతలూ. “రా, రా” అని పిలిస్తే అలలు రావు. “ఇప్పుడు కాదు” అంటే వినవు. అచ్చు ఆలోచనలానే! “ఇది ఎలా చేయటం అబ్బా” అని తల పట్టుకుని కూర్చున్నప్పుడు ఆలోచనలు రావు. ఏ కిశోర్ కుమార్ పాటలో మునిగిపోయినప్పుడో, అన్నీ సర్దేసుకుని నిద్రకు ఉపక్రమిస్తున్న వేళకో చట్టుకున్న మెరుస్తుంది ఐడియా నాకైతే. మీకలా అనిపించిందా?

హమ్మ్.. సముద్రంతో ఆటలూ, పాటలూ అన్నీ అయ్యాక గూటికి చేరాను. నా సముద్రం (అంతర్జాలం)లో ప్రయాణం షరా మామూలుగా కొనసాగుతూ ఉన్న వేళ, “నాకైతే తిలక్ లో కొద్దిగా hemingway లక్షణాలు కనిపిస్తాయి” అన్న అభిప్రాయం విని, కాసేపు గూగిల్లాను. వచ్చిన టన్నులకొద్దీ ఇన్ఫో ని చూసి చట్టుకున్న టాపిక మార్చేశాను. అయినా “పరిచయాలు” ఏర్పడాలీ అన్న సమయానికి ఏర్పడుతూనే ఉంటాయి. తప్పించుకునే మార్గం ఉండదేమో! “The Old man and the Sea” అన్న పుస్తకం మీరు చదివారా? అన్న ప్రశ్నను మర్నాడు జీటాక్ తేలిగ్గా మోసుకొచ్చేసింది. “లేదే.. చూడాలి” అని ఈ సారి గూగిల్లితే నిన్న రాత్రి “ఇప్పుడు కాదులే” అనుకున్న hemingway!  ఈ పుస్తకం ఒక నొవెల్లా అనగానే ఆశ పెరిగి బద్ధకాన్ని పక్కకు తోసేసింది. చిటికేసే లోపు పి.డి.ఎఫ్ ఫార్మాట్ దొరకడం, ఎడమ చేతి వేళ్ళతో చిటికె వేయడానికి ఓ పది సార్లు ప్రయత్నించే లోపు ప్రింట్ ఔట్లు రావడం, ఈ వీకెండ్ సముద్రంతో నా డేట్ ని మళ్ళీ ఫిక్స్ చేశాయి. ఈ సారి హైద్ వేదిక. 🙂

మొదలెట్టాను చదవటం, పుస్తకం పేరులో ఉన్న “ఓల్డ్ మాన్” 80 రోజుల నుండీ ఒక్క చేపను కూడా పట్టలేకపోయి, నీరసించి ఉన్న జాలరి. నిరాశ, అదృష్టలేమిని పక్కకు తోసి మళ్ళీ సముద్రంలో వేటకు పోతాడు. అతను చేపలు పట్టడం నేర్పిన శిష్యుడు తోడు రాకపోవటంతో ఒంటరిగా బయలుదేరుతాడు. పడవలో ప్రయాణం మొదలెట్టాక, కథంతా ఆ ముసలతనూ, సముద్రమూ మాత్రమే పాత్రలు. సముద్రాన్ని మచ్చిక చేసుకుంటూ ఓపిగ్గా చేప పడుతుందేమో అని వేచి చూస్తూ ఉంటాడు. కాళ్ళూ చేతులూ సహకరించకపోయనా, తనతో పాటు మరో వ్యక్తి సాయం లేకపోయినా తదేక దీక్షతో తన పని చేసుకుంటాడు. శారీరిక శ్రమను, మానసిక ఆందోళనను పట్టించుకోకుండా పడ్డ శ్రమకు తగ్గ ఫలితంగా అతని ఒక చేప పడుతుంది. అది మామూలు చేప కాదు, చాలా బరువుగా, పెద్దగా అందంగా ఉండే చేప. తన గాలానికి చిక్కిన చేపను చంపగలిగాడా? ఒక్కడే ఒడ్డుకి తీసుకురాగలిగాడా? అమ్ముకుని అన్ని రోజుల దరిద్రాన్ని పోగొట్టుకున్నాడా? ఇన్ని రోజులుగా దోబూచులాడిన “లక్” ఇప్పుడైనా అతనికి సాయం చేసిందా?  అన్నదే తక్కిన కథ! రెండు ముక్కల్లో కథ మొత్తం చెప్పేయచ్చు, కానీ చదివితేనే బాగుంటుంది. 🙂

కథ చదువుతూ కొన్ని సార్లు కునిపాట్లు పడ్డాను. అది నాకు విపరీతంగా నిద్ర వస్తుందా? లేక రచన కొంచెం డల్ గా ఉందా? చెప్పాలంటే నేనింకోసారి చదవాల్సిందే! మరీ ఊపిరి బిగపెట్టి చదివించేలా లేదనే అనిపించింది. కానీ ఎప్పటిలాగే రచనలో ఎలా చెప్పారు కన్నా, ఏం చెప్పారు అన్నదే నాకు ముఖ్యం కనుక ఈ కథ నాకు బాగా నచ్చింది. ఈ రచనలో సముద్రాన్ని  “as feminine and as something that gave or withheld great favours, and if she did wild or wicked things it was because she could not help them” వర్ణించడం కొత్తగా అనిపించింది. నేనెప్పుడూ సముద్రాన్ని పుఃలింగంలోనే చెప్తారనుకున్నాను. ఈ కథనుండి నేర్చుకోవాల్సిన నీతి ఏమనగా “నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండు. ఏమి / ఎవరు కలసి వచ్చినా రాకపోయినా!” ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి మనకి కావాల్సిన ఫలితాలు రావెందుకో? అయినా ప్రయత్నించడం మాత్రమే మానకూడదు. ఇందులో ఒక చోట ముసలతను అనుకుంటాడు “అదృష్టం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు. కానీ అది వచ్చేటప్పకి మనం పూర్తిగా సిద్ధమై ఉండాలి. మన ప్రయత్నంలో ఎక్కడా లోపం ఉండకూడదు” అని. Jonathan Livingston Seagul తర్వాత చాన్నాళ్ళకి ఒక మంచి కథ చదివాను అనిపించింది.

ఇది చదవడానికి సిద్దమవుతుండగా తారసపడిన వ్యక్తిని “మీరు చదివారా?” అని అడిగాను. “ఇది చదవలేదు కానీ  Iceberg Theory ఈ రచయితదే. తెలుసునా?” అని ప్రతిగా నన్ను అడిగారు. నాకు వారు వివరణ ఇచ్చిన దాని బట్టి, వికీలో చదివి కాసేపు ఆలోచించిన దాని బట్టి కొంచెం కొంచెం అర్ధమవుతూ ఉంది. నేరుగా చెప్పకపోయినా పాఠకుడుకి ఆ విషయం తెలిసేలా రాయడం.. హమ్మ్! ఇంటెరెస్టింగ్. వీలైనంత త్వ్రరగా అలాంటి రచనలు చదవాల్సిందే!

ఒక అల వచ్చి తీరం తాకగానే నెమ్మదిగా నిష్క్రమించి మరో అలకి దారి ఇస్తుంది. అలానే ఒక ఆలోచన మరో ఆలోచనకి దారిచ్చి మరుగున పడుతుంది. ఒక లింక్, ఇంకో లింక్ కి దారి చూపిస్తుంది. సో.. ఏ విధంగా చూసుకున్నా ఈ ఆదివారం సాయత్రం నేను సముద్రంతో హాయిగా గడిపేశాను. ఇంతకీ ఈ పుస్తకాన్ని మీరు చదివారా?? 

18 comments

 1. నీ అనుభవాల అలల మధ్య హెమింగ్వే సముద్రాన్ని అందిపుచ్చుకున్నావన్నమాట. Better late than never…భౌతిక విజయంకన్నా,నైతిక విజయం అత్యంత విశాలమైనదని చెప్పే నవలిక ఇది.

  తెలుగులోకూడా ఈ విషయాన్ని ఆధారం చేసుకుని డా.కేశవరెడ్డి గారు (మా జిల్లానే చిత్తూరు)”అతడు అడవిని జయించాడు” అని ఒక నవల రాసారు. దాన్నీ వీలుంటే చదవండి.ఇది మన సంస్కృతికి చాలా దగ్గరగా ఉంటుందికాబట్టి ఇంకా స్వేచ్చగా ఆనందించి,అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది.

  Liked by 1 person

 2. పూర్ణిమా,
  Old man.. చదివిన చాలా రోజులకు అతడు అడవిని జయించాడు చదివాను నేను. మొదటి దాని ప్రేరణతో రెండో నవల రాసినా రెండింటి నేపధ్యం వేరు కావడంతో రెండింటినీ పోలిక లేకుండా ఎంజాయ్ చెయ్యగలిగాను. కేశవ రెడ్డి గారి పుస్తకాలు ఏవైనా చదివావా నువ్వు? లేకపోతే ముందు అతడు అడవిని జయించాడు చదువు! ఆ తర్వాత మిగతావి ఎక్కడ దొరుకుతాయో నువ్వే వెదికి మరీ చదివేస్తావు. oldman చేపకీ ముసలివాడి పందికీ గల (వాటికి కాదు, వాటిని పట్టి సాధించడంలో రెండు పాత్రలకీ) సారూప్యత ఏమిటో వివరించు నీ స్టైల్లో ఆ తర్వాత!

  Like

 3. అసలు సముద్రం లేని ఊళ్ళో జనం ఎలా ఉంటారో నాకర్థంకాదు. శ్రీశ్రీ అనంతంలో అంటాడు, “ఊళ్ళో సముద్రం లేకపోతే నాకూపిరాడదు, రోజూ వెళ్ళకపోయినా సరే”.
  అది చదివి అర్జెంటుగా భుజంతట్టి అభినందించేసి “మాష్టారూ, మీరు గ్రేట్…Great men think alike” అందామనుకున్నాగానీ… ఏం చేస్తాం, నేను పుట్టడానికి ఆర్నెల్లముందే ఆయన నిష్క్రమించారు.

  PS: ఇప్పుడు నేనుంటున్న ఊళ్ళో సముద్రం లేదు. మరి ఊపిరెలాఆడుతోందని అడిగితే… జీవితంతో పడిన సవాలక్ష రాజీల్లో ఇదొకటి 😦

  PS to PS: మీరిప్పటిదాకా సముద్రం చూడలేదా?? You are a wonder !!!

  Like

 4. “రా, రా” అని పిలిస్తే అలలు రావు. “ఇప్పుడు కాదు” అంటే వినవు. అచ్చు ఆలోచనలానే!

  చాలా నిజం కదా ఈ మాట.. 🙂

  ఒక మంచి పుస్తకం పరిచయం చేసినందుకు థాంక్స్.

  Like

 5. ఆలోచనల కెరటాల మీదుగా హెమింగ్వే సముద్రాన్ని ఈదారన్న మాట.

  Like

 6. I find it criminal that you mention Bach’s “Jonathan Livingston Seagull” and Hemmingway’s “Oldman and the Sea” in the same breath. No comparison.
  Bach’s work is a mere fable, a parable. Oldman and the Sea is .. there’s no word in English for this .. అదొక కావ్యం!
  మిగతా విషయాలు తరవాత ..
  @Falling Angel .. మీ పేరు బహు బాగు. తెలుగులో పెట్తకూడదూ?

  Like

 7. కొత్త పాళీ గారు:

  Honestly there was no intention to compare the authors or their writing skills. If I had given that impression, then that is problem with my expression. Regrets for that. I know how it hurts!

  ఈ కథ పూర్తవగానే నాకా కథ గుర్తు వచ్చిందంతే! ఎలా చెప్పారూ కన్న ఏం చెప్పారు అన్నదే ఈ టపా రాసేటప్పటికి నా ఉద్ధేశ్యం. నిజం చెప్పాలంటే చదవడం అయ్యిపోగానే “ఆహా” అన్న ఫీలింగ్ ఏమీ కలగలేదు నాకు, ముసలతని కష్టం తప్పించి! కథ నచ్చింది. కథనాన్ని ఇంకా స్టడీ చేయాలి నేను! ఇందులో “ఏదో” ఉందని అర్ధమవుతోంది. కానీ ఆ ఏదీ ఏమిటో, అది ఎలా తెలుసుకోవాలో మరలా చదివితే గాని చెప్పలేను. “If you read his stories carefully” అంటూ హెమ్మింగ్వే రచనలు ఒక పెద్ద థీసిస్ ఉన్న లింక్ ని చూశా ఇవ్వాల పొద్దున. I got to be extremely careful అని మీ వ్యాఖ్య రాక ముందే నిర్ణయించుకున్నాను. ప్రయత్నిస్తాను.

  ఈ లోపే తొందరపడి టపా రాయడం దేనికి అన్న అనుమానం వస్తే, సముద్రాన్ని తీరం నుండి చూసినప్పుడు ఎలా ఉందో, పడవలో వెళ్తూ మధ్యలో చూసినప్పుడు ఎలా ఉంటుందో, మునిగాక ఎలా ఉంటుందో, ఆ అనుభవాలను పొందుపరచుకోవడమే! హెమ్మింగ్వేతో నా పరిచయం ప్రస్తుతాన్నికి తీరాన్ని తాకే అలలతో ఉన్న పరిచయమే! ఇంకా చాలా చాలా ఉందని తెలుసు. ఈ సముద్రాన్ని ఈదడానికి చిన్ని చిన్ని చిట్కాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు. 🙂

  Like

 8. “I got to be extremely careful అని మీ వ్యాఖ్య రాక ముందే నిర్ణయించుకున్నాను.”
  Yes, you ought to be.

  Like

 9. @పూర్ణిమ: కొత్తపాళీగారి సూచన నేను అంగీకరించినా,నువ్వు ఆచరించాల్సిన అవసరంకూడా లేదని నా నమ్మకం.

  ఎందుకంటే,నువ్వు చదువుతున్నప్పుడు మిగతా రచనలు గుర్తురావడం సహజం అవి ఎవరి కొలమానాలకు తూగుతాయి అనేది పాఠకురాలిగా నీకు అనవసరం.నువ్వు ప్రొఫెషనల్ విమర్శకురాలివయ్యుంటే కొత్తపాళి గారు చెప్పిన కొలమానాల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే.

  కాకపోతే ఒక పాఠకురాలిగా నీ స్పందనతెలిపెటప్పుడు అదీ చైతన్యస్రవంతి పంధాలో తెలిపేటప్పుడు ఇలాంటివి జరగడం సహజం.నేను ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చూసేటప్పుడు ‘దానవీరశూర కర్ణ’ గుర్తొచ్చింది.దానిని అసంబద్ధం అని ఎవరైనా చెప్పగలరు. కానీ అదే “మనిషి ఆలోచనాస్రవంతి”.

  Like

 10. వావ్, గర్భంలో శిశువు చుట్టుపక్క ద్రవం, సముద్రపు నీళ్ళలాంటిదేనట. అందుకే మనిషి కి సముద్రం చూడగానే హృదయం ఉప్పొంగుతునిది అని ఎక్కడో చదివాను. నాకు మాత్రం సముద్రం చూస్తే, ఆనందంగా కేక పెట్టాలనిపిస్తుంది.

  భలే ఉంది టాపిక్.

  (మీరు చెప్పిన రచనల సంగతి నాకు అస్సలు తెలీదు :-()

  Like

 11. ప్రేమించె హ్రుదయనికి ప్రణమిల్లవే… మనసా ప్రనమిల్లవే..
  వంచన ఏరుగని ఏదడకు శిరసు వంచవే… మనసా శిరసు వంచవే..

  మరు మల్లియ మనసులొ మలినముండునా..
  ఏద కోయిల గొంతులొ కల్లలుండునా…

  ఆ మల్లియ మనసుకు..
  ఆ కోయిల గొంతుకు…
  ప్రణమిల్లవె…. మనసా…ప్రణమిల్లవే…

  [పూర్ణిమ గారు.. ఇదే first time మీ బ్లాగ్ చూడటం. మనం(అంటే నేను) కొంచం reverse కదా.. అంటే,ఏ బ్లాగ్ ఐనా first post నుంచి చదువుతా. మీరు ఈ పాట గురించి అడగటం చూసా .
  ఇప్పుడు మీకు ఆ పాట దొరికి ఉండవచ్చూ. కాని.. ఏందుకో ఒక వెళ దొరకక పొతే పాపం కదా అనిపించి…నాకు గుర్తు ఉన్నంత వరకు రాసా.
  ఈ పాట చక్రవాకం లొ కుడా వచ్చింది. i love this song]

  Like

 12. @sujji,

  Thanks a ton. This is a huge favour for me. I love this song to the core. And you just gave what I wanted.

  Thanks again.

  Like

 13. తెలుగు బ్లాగ్ చదివినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది, అదే ఆనందానికి నేను ఇప్పుడు లోనైనాను చాల సంతోషం.

  Like

 14. Oldman and the Sea” గురించి విన్నాను కానీ చదవలేదు. మీరిచ్చిన లింకు ద్వారా చదువుతున్నాను.
  ధన్యవాదములు.

  బొల్లోజు బాబా

  Like

 15. మీరు వేర్వేరు అనుభవాల్ని కదంబమాలగా గుచ్చటం చాలా బాగా చేస్తున్నారు. ఆ రీతిలో ఈ టపా ఆహ్లాదకరంగా ఉంది.

  అలలు – ఆలోచనలు, పాతదే అయినా మంచి పోలిక.

  హెమింగ్వే ప్రవేశం దగర్నించీ, మీరు ఎవరెవరితోనో సంభాషించినట్టు కొన్ని వాక్యాలు ఎదురైనై . అవి కొంచెం గందరగోళంగా ఉన్నై. ఎవరో చెబితేనే నేనీ పుస్తకం చదివాను అని చెప్పుకోడం మీ నిజాయితీ కావచ్చు గానీ, మీ టపాని ఇప్పుడ్ చదువుతున్న పాఠకులకి అది మరీ ఆసక్తికరమైన అవసరమైన సమాచారం కాదు .. పుస్తకం చదూతుండగా, లేక చదివేశాక మీ భావస్పందనల గురించే మా ఆరాటమంతా!

  Like

 16. టపా మొదలుపెట్టిన తీరు as usual గా అమోఘం.. “అతడు అడవిని…’ నాకూ చదువుతున్నప్పుడే ఒకరు ఈ ‘Old man…’ గురించి చెప్పారు.. ఇదిగో అదిగో అంటూ దాటేశాను కానీ ఇప్పటి వరకూ ఆ పుస్తకం వైపు మనసు పెట్టనేలేదు.. నీ టపా చదివాక ఇక టైం వేస్ట్ చేయకూడాదనిపిస్తుంది 🙂

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s