నిశి, నిశాంతంలో పూర్ణిమ

Posted by

“గిటారై మోగుతున్నది యద” – ఊహ! హృదయమే ఒక వాయిద్యంగా మారి, సుతారంగా మీటిన ప్రతీ స్పర్శకీ స్పందించి సంగీతాన్ని వినిపిస్తుందన్న ఊహ. ఊహకందని అనుభవం ఏమిటో కానీ, ఊహించుకున్న అద్భుతం ప్రత్యక్షానుభవంలోకి వస్తుందంటే మాత్రం ఉద్వేగంతో ఊపిరికి ఊపిరాడదు. మనో నేత్రానికి చిరపరిచితమైన చిత్ర పటం, కళ్ళ ముందు సజీవంగా  ప్రాణంతో నిలుస్తానంటుంటే వెన్నులో జలదరింపు ప్రాణం పోసుకుంటుంది. గొణ్ణం తీస్తున్న నా వేళ్ళు వణుకుతున్నాయి: చూడాలన్న ఆత్రుత, చూడగలనా అన్న సంకోచం, చూస్తే కదా తెలిసేది అన్న తర్కము, చూడకుండా ఉండగలనా అన్న అనుమానం! గిటారైన నా యద ఇప్పుడు వినిపిస్తుంది – సంగీతమో, రొదో!

అసలు ఇష్టం, భయం mutually exclusive అయ్యిపోతే బాగుణ్ణు. ఇష్టముంటే భయం వేయకూడదు, భయపెట్టేదేది ఇష్టమవ్వకూడదు — ఇలాంటిదో డీల్ ఉంటే! లేకపోతే ఇష్టపడీ భయం వల్ల దూరం చేసుకోవాల్సి వస్తుంది. భయం వేస్తున్నా ఇష్టం మాయమైపోకుండా పరీక్షిస్తుంది. అసలూ ఆనందం, అందం, ప్రేమా లాంటివన్నీ సున్నితంగా అనిపించి మనం ఇష్టపడతాము కానీ, అవి కూడా దగ్గరై వాటి విశ్వరూపం కనబరిస్తే, భయం వేయక మానదు.  వాటిని ఓపలేక నరనరాలు మెలితిరిగిపోతాయి. అడుగులు తడబడతాయి. మనసు గతి మారుస్తుంది, హృదయం లయ తప్పుతుంది. ముంచేసే ఆనందం కూడా ఒక ఉపద్రవమే!

“Just open the door, Purnima” నాకు నేను గట్టిగా చెప్పుకోవాల్సిన మాటలనుకున్నా, మరో గొంతులో నమ్మకమై పలుకుతుంటే నెమ్మదిగా తలువు తెరిచాను. కీచుమంది తలుపు, దానితో పాటే చీకటి. అంతా నల్లని నలుపు, దూర దూరాల వరకూ నలుపు. కాస్త ముందుకెళ్ళాను, వీధుల్లో దీపాలు వెలుగుతున్నాయి, గదిలో ఇంకా లైటు ఉన్నా అంతా నల్లని చీకటి. “చీకటే సముద్రమయ్యిందా? సముద్రమే చీకటయ్యిందా? అవునూ.. ఆకాశమేది? అరె, సముద్రంలో భలే కలిసిపోయిందే! చీకటి అన్నింటినీ కప్పేసింది, అక్కడెన్నున్నా, వాటి అస్థిత్వం ఏదైనా, ఇప్పుడు చీకటి మైకంలో అన్నింటిన్నీ మరచి ఆదమరచి ఉన్నాయి. కానీ ఏంటీ హోరు? ఓహ్.. సముద్రం ఘోష చీకటిలో కూడా స్పష్టంగా ఉంది. ఒక అల పరుగు పరుగున వచ్చి తీరం తాకెళ్ళిపోయింది. సముద్రమంటే ఇష్టపడ్డానికిదే కారణం – ఆ అంతస్సంఘర్షణ, అలుపెరుగని పరుగులు, అంతులేని కల్లోలం, అనంతమైన కలవరం. ఎవరి కోసమో అంత తపన? ఎవరి రాకకై అసహనం? ఏ “అందాన్ని” ఆవిష్కరించటానికో ఆ పరిశ్రమ? దగ్గరిగా వెళ్ళాలనుంటుంది, కానీ భయం! మహాయితే తీరం చేరి ఆ ఇసుకల్లో ఆచితూచి అడుగులేస్తుంటే, ఏ అలో కనికరించి పాదాలు తాకి పోతే సరే గానీ, అంతకన్నా ముందుకెళ్ళే సాహసం, ధైర్యం ఎక్కడిది? అది ఇష్టమైన భయం. భయంగా మారే ఇష్టం. ప్రాక్టికాలిటీ చేతిలో దారుణంగా ఓడిపోతుంది, ఎంత రొమాంటిక్ ఆండ్ డ్రీమీ అయినా ఇలాంటి సమయంలో!

హమ్మ్..  అనంత సాగారాన్ని రెండు కన్నుల్లో నింపుకుని దాన్ని పునఃచిత్రీకరించలేకపోయినా, ఈ ఘోషను ఎక్కడదాకా అయినా వినిపించగలను అన్న ఐడియా మానవ మేధస్సు మీద గర్వంగా మారుతూనే ఇంటి నెం. డయల్ చేశాను. “అమ్మా! భారతదేశం అంటూ అంతమయ్యిపోయే భూభాగంలో ఉన్నాను. టిప్ ఆఫ్ ఇండియా! నా ముందరొక ఒక చిన్ని గట్టు, సముద్రంలో చీలికలా ఉంది. అక్కడితో ఇండియా అయ్యిపోతుంది. ఇంకంతా సముద్రం, చూసేంత వరకూ, చూస్తున్నంత వరకూ, ఇదో అలల హోరు విను..” అన్న నా మాటలకి, ” అవునా? చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఏమీ వినిపించటం లేదు. తెలుసా, ఇవ్వాల చిరంజీవి పార్టీ పెట్టేస్తానన్నాడు” అని అమ్మ. ఇప్పుడు నాకు చిరంజీవి అవసరమా? లోకానికి దూరంగా ఉన్నాను-వద్దు పో అంటూ డిస్కనెక్ట్ చేశాను.

“కాస్త అన్నం తిని పడుకో” అని బతిమాలుడుతున్న నేస్తానికి “ఊ..హూ” తప్ప సమాధానం లేదు. “సరే, కనీసం జ్యూస్ తాగుదువు రా, కిందకి వెళ్దాం” అన్నప్పుడు ఊ కూడా లేకుండా, బయలుదేరాము. కళ్ళల్లో ఇంకా చీకటి, నల్లని నలుపు పేరుకుపోయున్నాయి. వీధిలోకి రాగానే మాత్రం, అవే గతుకు రోడ్లు, చిన్ని గల్లీలు, అగ్గిపెట్టెల్లాంటి షాపులు, తీవ్రంగా అనిపించే లైట్లు, వ్యాపారం, వాణిజ్యం, జీవనాధారం, లాభాలు-బేరాలు, బతుకు భయం – ఓ జనారణ్యం. పక్కనే ఉన్న అనంత సాగారం ఇప్పుడెక్కడో ఉందనిపించేంత నాగరికం, ప్రకృతనంతా మడతపెట్టి పక్కకు నెట్టేసినట్టు! జ్యూస్ తాగేశాక, కాసేపు తిరుగుదామనుకుంటూ ఇంకో రెండు వీధుల్లో తిరిగాము. ఒక్కో షాపూ మూసేస్తున్నారు. “అప్పుడే” అన్న నా అశ్చర్యానికి, ” టైం పదిన్నరవుతుంది. మీ హైద్ లోనే మూసేస్తారు ఈ పాటికి” అన్న సమాచారం ఒక్కసారిగా బెంగను తట్టిలేపింది.

అవును హైద్ లో రాత్రి పదిన్నర వేళకి, ఎలా ఉంటుందో టక్కున్న కళ్ళ ముందు నిలిచింది. అప్పటి వరకూ ఉరుకులు పరుగులు తీసిన నగరం, ఇక ఇవాల్టికి ఇదే ఆఖరి పరుగు అన్నట్టు అంతగా రద్దీ లేని రోడ్లు పై వాహనాలు రయ్యిమంటాయి. ఫ్లోరోసెంట్ వెలుగుల్లో నీడలు మరీ సాగిపోతాయి, రోజంతా పడ్డ శ్రమకి తార్కాణంగా. వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలన్న తాపత్రయం కొందరిది, ఈ రాత్రికి ఇదే నా ఇల్లనుకుంటూ బస్సు స్టాప్పుల్లో, డివైడర్ల పై పరచిన గడ్డిలో నిద్రపోయే నిశ్చింత (?) మరికొందరిది. సద్దుమణిగే కొద్దీ నిశ్శబ్దంగానే నిశ్శబ్ధం ఆవహిస్తుంది నగరాన్ని. మత్తైన చీకటిలో హాయిగా నిదురోయి, మళ్ళీ ఓ కొత్త ఉదయాన్ని సాదరంగా ఆహ్వానిస్తుంటుంది. “ఓహ్.. హైద్!” అని నిటూర్చే లోపు, మళ్ళా హోటల్ వచ్చేసింది. “ఇక నేను పడుకుంటాను, చాలా అలసిపోయాను” అంటూ గుడ్ నైట్ చెప్పి గదిలోకి వచ్చాను.

గదిలోకి వచ్చాను సరే, ఇప్పుడెలా ఉండడం? సముద్రం భయపెడితేనో! లైట్ అలానే ఉంచి, టి.వీ పేట్టేసుకుని పడుకుంటే సముద్రం ఉనికి కోల్పోదూ కాసేపటికి! ప్రయత్నించా. అనవసరమనిపించింది. మళ్ళీ కాసేపెళ్ళి బాల్కనీ నుండి సాగరాన్ని చూశాను; చూస్తూనే ఉండిపోయాను. నిద్ర ఇంక ఒపిక పట్టేట్టు లేదు, తప్పదని లైట్లు తీసేసి, టీ.వీ కట్టేసి, అలల హోరు జోల పాడుతుంటే హాయిగా నిద్రకి లొంగిపోవటం.. బానే ఉంటుంది. నిద్రతో కూడా యుద్ధం చేస్తూ మెలకువకి, నిద్రాస్థితికి మధ్య మనోఫలకం అనే కాన్వాస్ పై ఆది, అంతం లేని ఆలోచనల బొమ్మలు గీయడం, ఊహలకి జీవం పోయటం – ఒక అందమైన అనుభూతి. నిద్రెటూ గెలిచేస్తుంది, ఆ గెలుపుని ఆలస్యం చేస్తూ అనంత ఊహా లోకంలో విహరిస్తూ ఉండడం ఆనందం. సముద్రంలోనూ, నా నిద్రలోనూ ఒకటే కలవరం. మెలుకువ వచ్చేసరికి మూడయ్యింది. ఇంకా అంతా చీకటే!  మళ్ళీ కాసేపటికే నిద్ర గెలిచేసింది.

ఆరవ్వడానికింకా కాసేపుందన్నంగా లేచాను. కిటికీ తీస్తే అంతే చీకటి, ఏ మాత్రం పల్చబడలేదు. అసలింత దూరమొచ్చిందే సూర్యుడెలా నిద్ర లేస్తాడా అని చూడడానికి. అంతా సిద్ధమై సూర్యుడి కోసం పడిగాపులు కాస్తున్నాం. సూర్యుడికి మరీ ఇంత మొహమాటం అనుకోలేదు, ముబ్బులను కప్పుకుని మరీ మెల్లి మెల్లిగా వస్తున్నాడు. నింగీ, సాగరం ఎక్కడ కలిసాయో తెలీడం లేదు కానీ, ఒక చోట మాత్రం రెండూ కాస్త ఎర్రబడ్డాయి. చీకటి తప్పుకుంటూ దారిస్తుంది సూర్యుడికి. సముద్రంపై కెరటాల్లా, మబ్బులు కాస్త అల్లరి పెడుతున్నా, దీక్షగా దినకరుడు పైకి వస్తూనే ఉన్నాడు. చూస్తూ చూస్తూ ఉండగా చీకటి శూన్యంలో కలిసిపోయింది, అంతటా వెలుగులు నిండిపోయాయి. పొద్దెక్కితే వీర ప్రతాపం చూపించే సూర్యుడు ఇప్పుడు మాత్రం ఆహ్లాదంగా, సంపూర్ణంగా ఉన్నాడు. హనుమంతుడికి సూర్యుడో పండులా కనిపించాడంటే నిజంగా అలానే ఉంటాడు మరి. జీవితంలో ఒకసారి కలిగే అనుభవమేమో ఇది, కనుచూపు మేర జలనిధి, నిదానంగా ఉదయిస్తున్న సూర్యుడు. పకృతి స్వహస్తాలతో గీసే అరుదైన చిత్రలేఖనం, ఈ ఉషోదయం!

“హైద్ లో నిశాంతాల మజాయే వేరు.  ఇంకా మత్తు వదలని సూర్యుణ్ణి కూడా మేల్కొల్పేలా నమాజ్ ప్రార్థనలు, గుడిలో నుండి సుప్రభాత గీతికలు కలగలసి వేకువ రాగం వినిపిస్తుంటాయి. అలా బయటకి రాగానే చల్లని గాలి ఒక్కసారిగా చుట్టుముట్టేస్తుంది. రోడ్డుపై అడుగులు శబ్దం నిశ్శబ్ధాన్ని చీలుస్తుంటే, హుషారుగా గాలితో పందెం పెట్టుకునే పేపరు/ పాలు అబ్బాయిలు సైకిళ్ళ మీద. సూర్యుడెటు నుండి వస్తున్నాడో తెలియక పోయినా, నూతనోత్తేజం మాత్రం మనసునీ శరీరాన్ని ఒక్కసారిగా ఆవహిస్తుంది. రాలిన ఆకుల్ని తుడిచే చీపురు ధ్వనిలో కూడా ఏదో లయ వినిపిస్తుంటుంది. ఇక అప్పడప్పుడే తెరిచే టీ కొట్లోనో, ఓ మూలనున్న పూరి గుడిసెలోనో పొయ్యి ముట్టిస్తే, ఆ వాసన మత్తు అంతా ఇంతా కాదు. అడుగులో అడుగేసుకుంటూ, చేతిలో చేయిని జాగ్రత్తగా పట్టుకుంటూ నడిచే వృద్ధ జంటల నుండీ, క్రమశిక్షణగా కవాత్తు చేస్తున్నట్టు పరుగు తీసే మిలిటరీ జవాన్లు వరకూ అందరి నడకలో సూర్యుడూ కలుస్తాడు. చదువుల బరువులు చిరునవ్వులతో మోస్తూ కోచింగ్ లకు వెళ్ళే యువత. చీకటిని సైతం బేఖాతరని చీల్చుకు వచ్చే బస్సుల్లో డ్రైవరుకీ, కండెక్టరికీ అప్పుడే రోజులో కొంత భాగం అయ్యిపోయ్యుంటుంది. కానీ హైద్ అంటే గుర్తు రావాల్సింది, అస్తవ్యస్తమైన ట్రాఫిక్కూ, గతుకుల రోడ్లూ, అరకొర రవాణా సంస్థా కానీ, ఇలాంటి మానవ లిఖితమైన సౌదర్యం కాదులే! ఎవరికైనా చెప్తే “అవునా, ఆ హైద్ ఏ లోకంలో ఉంటుంది” అని వెటకరిస్తారు” అన్న ఆలోచనల్లో పడి లేస్తుంటే, “Hey, Dreamy! Let’s go” అన్న పిలుపు విని సూర్యుడినో సారి మళ్ళీ కళ్ళారా చూసుకుని వెనక్కి తిరిగాను.  

అలా కన్యాకుమారిలో ఒక నిశీ, నిశాంత వేళ ఈ పూర్ణిమ! ఎందుకో ఇప్పుడీ నిశీలో ఇలా ఊసులాడడం!?

20 comments

 1. టపాకు సంబంధంలేదు గానీ ఇక తప్పటం లేదు ఎందుకంటే ఏదో ఒక కామెంట్ రాయాలని డిసైడ్ అయిపోయి వచ్చా (ఇలా మీ ప్రతి టపాకు వస్తున్నా పోతున్నా:-( } … మీ టపాలేమో ఇంతింత పొడుగు ఉంటున్నాయి, ఏం చేయను .. మొన్నీ మధ్య రాసిన టపా చూడగానే హమ్మయ్య ఇన్నాళ్లకి నాకు తెలిసిన విషయం మీద ఒక టపా వచ్చింది ఇక్కడ అని హడావిడిగా వచ్చా, తీరా చూస్తే మీరు చాలా రాశారు .. అది మొత్తం చదవకుండా వ్యాఖ్య రాయడం బాగుండదని వెళ్లిపోయా … ఈ రోజు కొంచెం ఘఠ్ఠిగా అనుకున్నా .. అయినా చేతులు ఊరక ఉండవు గదా స్క్రోల్ బార్ నొక్కనే నొక్కాయి …. అది వెళుతూతూతూ ఉంది … తీరా చూస్తే దిలీప్ గారి వ్యాఖ్య అప్పటికే ఉంది … సరేలే ఒకటుంది గదా అని వెళ్లిపోతున్నా .. ఇంకొక టపాకి ప్రయత్నిస్తా ..

  Like

 2. “నిశాంత వేళ ఈ పూర్ణిమ”

  చాలా అందమైన ఊహ.సాఫ్టువేరు ఇంజనీరులు, భవావేశము. నమ్మబుధ్ధేయదు.

  Like

 3. అదృష్టవంతులు.జీవితంలో ఒక్కసారైనా…….

  Like

 4. నేను ఒక అనుభవాన్ని చదువుతున్నానా ? లేక ఒక సినిమాలోని సన్నివేశాన్ని చూస్తున్నానా అనిపించింది. మనలో కలిగే సూక్ష్మమయిన అలోచనలను కూడా బాగా ఆవిష్కరించావు. ఇంకా కొన్ని లైన్లు చాలా పరీక్షిస్తే తప్ప రాయలేనివి.
  ఉదా:” హుషారుగా గాలితో పందెం పెట్టుకునే పేపరు/ పాలు అబ్బాయిలు సైకిళ్ళ మీద. సూర్యుడెటు నుండి వస్తున్నాడో తెలియక పోయినా, నూతనోత్తేజం మాత్రం మనసునీ శరీరాన్ని ఒక్కసారిగా ఆవహిస్తుంది. రాలిన ఆకుల్ని తుడిచే చీపురు ధ్వనిలో కూడా ఏదో లయ వినిపిస్తుంటుంది. “

  Flow of thoughts and moving in and out of the native place (Hyd) is very natural. Great Job!

  ఇక ఎప్పటిలాగే నాదో ప్రశ్న.. “అసలూ ఆనందం, అందం, ప్రేమా లాంటివన్నీ సున్నితంగా అనిపించి మనం ఇష్టపడతాము కానీ, అవి కూడా దగ్గరై వాటి విశ్వరూపం కనబరిస్తే, భయం వేయక మానదు. “

  భయం ఎందుకు వేస్తుందో నీ మాటాల్లో వినాలని ఉంది పూర్ణిమా..

  Like

 5. మళ్ళీ ఓ రెండుమూడు సార్లు చదివి,అనుభవించి,ఆస్వాదించి తరువాత ఆలోచించి వ్యాఖ్యరాస్తాను. ఇప్పట్లో చదవడం పుర్తయినా అనుభవించడం ఆస్వాదించడం ఎప్పటికి పూర్తయ్యేనో! ఇక ఆలోచించడం జరిగెపనేనంటావా?!?

  ఇలా రాసేస్తే ఎలా?

  Like

 6. కన్యాకుమారికి వెళ్ళినప్పుడు నాకు కూడా అదే ఫీలింగ్…. టిప్ ఆఫ్ ఇండియా.. నేను ఉన్నాను ఇక్కడ…. ఇక అంతా సముద్రమే…. అది అనుభవిస్తే కానీ తెలియదు…

  Like

 7. ఇష్టముంటే భయం వేయకూడదు, భయపెట్టేదేది ఇష్టమవ్వకూడదు …..పూర్ణిమ గారు బాగుంది మీ ఊసులు .

  Like

 8. ఇష్టమూ,భయమూ – చీకటీ,పూర్ణిమా ఒకే నాణానికి రెండు పక్కలు. ఇష్టాన్నీ, భయాన్నీ విడదీయాలని ఒక నిశాంతవేళ పూర్ణిమకి అనిపించడంలో ఒక అందమైన భావన ఉంది.
  ఎద గిటారు – గొంతు తీగలు – మనస్సనే వేలితో మీటితే పలికిన నాదాన్ని వినిపించడమే కష్టం.అలాంటిది చదివింపించడమంటే మరింత కష్టసాధ్యం. అలాంటి పనిని అలవోకగా అలా అందించేసిన అద్భుతమైన ఈ టపా కి అభినందనలర్పిస్తూ…

  Like

 9. ఒక చిన్ని భావం, ఒక చిన్ని ఊసు, ఒక చిన్ని అనుభూతి —ఇలా ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఈం……..త పెద్ద టపా (మెచ్చుకోలు, అసూయ కూడిన ధ్వని) రాయటం నిజంగా నీకే చెల్లు……..continue

  కంటెంట్ గురించిన కంమెంటు తరవాత, ముందు ఒక చిన్నconfession అన మాట.

  Like

 10. పూర్ణిమ గారు, ముందుగా హ్యాట్స్ఆఫ్..
  చీకటిని… ఉషోదయాన్ని… అబ్బా ఎలా సధ్యమైందండీ ఈ పోలిక..?

  కామెట్స్ అంటే అది కూడా మీమాటల్లోనే చెబ్తామనిపించింది..
  “ఊహకందని అనుభవం ఏమిటో కానీ, ఊహించుకున్న అద్భుతం ప్రత్యక్షానుభవంలోకి వస్తుందంటే మాత్రం ఉద్వేగంతో ఊపిరికి ఊపిరాడదు.”
  “ఇష్టముంటే భయం వేయకూడదు, భయపెట్టేదేది ఇష్టమవ్వకూడదు — ఇలాంటిదో డీల్ ఉంటే!”
  “ముంచేసే ఆనందం కూడా ఒక ఉపద్రవమే! “
  “ఒక అల పరుగు పరుగున వచ్చి తీరం తాకెళ్ళిపోయింది. సముద్రమంటే ఇష్టపడ్డానికిదే కారణం – ఆ అంతస్సంఘర్షణ, అలుపెరుగని పరుగులు, అంతులేని కల్లోలం, అనంతమైన కలవరం. ఎవరి కోసమో అంత తపన? ఎవరి రాకకై అసహనం? ఏ “అందాన్ని” ఆవిష్కరించటానికో ఆ పరిశ్రమ?”
  “సద్దుమణిగే కొద్దీ నిశ్శబ్దంగానే నిశ్శబ్ధం ఆవహిస్తుంది నగరాన్ని. మత్తైన చీకటిలో హాయిగా నిదురోయి, మళ్ళీ ఓ కొత్త ఉదయాన్ని సాదరంగా ఆహ్వానిస్తుంటుంది.”
  “నిద్రెటూ గెలిచేస్తుంది, ఆ గెలుపుని ఆలస్యం చేస్తూ అనంత ఊహా లోకంలో విహరిస్తూ ఉండడం ఆనందం.”
  “చీకటి తప్పుకుంటూ దారిస్తుంది సూర్యుడికి.”
  “కనుచూపు మేర జలనిధి, నిదానంగా ఉదయిస్తున్న సూర్యుడు. పకృతి స్వహస్తాలతో గీసే అరుదైన చిత్రలేఖనం, ఈ ఉషోదయం!”
  “”Hey, Dreamy! Let’s go” అన్న పిలుపు విని సూర్యుడినో సారి మళ్ళీ కళ్ళారా చూసుకుని వెనక్కి తిరిగాను.”
  ……………….
  నాకు ఈ మాటలు… కాదు మొత్తం ఈ పోస్ట్ అంతా చదువుతుంటే ఏ పి.సి.శ్రీరాం ఫోటోగ్రఫీలోనో..అందమైన narration తో కళ్ళకు కట్టినట్టు చూపించారా..? అన్న ఓ భావన.. 🙂

  Like

 11. నమస్కారం..
  నేను ఒక పోస్ట్ రాసాను..
  ప్లీజ్ ఒకసారి నా పోస్ట్ చదివి వీలుంటే మీకు నచ్చితే spread it..ప్లీజ్

  ధన్యవాదాలు..

  లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

  http://prakamyam.blogspot.com/2008/10/blog-post.html

  Like

 12. తెలుగు ’వాడి’ని గారు: కవితలు రాయడానికేమైనా క్రాష్ కోర్సులుంటే చెప్పండి మాస్టారు! ఇలా పేజీలకు పేజీలు రాయడం కూడా కష్టమే! 😦 మీకు వీలున్నప్పుడు ఒక టపా చదివి, మీ అనుభవాన్ని పంచుకోండి, దయచేసి!

  మీ అభిమానానికి నెనర్లు!

  దిలీప్: అది టైపో, ఎలాగూ అందేసుకున్నారు కావున.. ఇంకేం చెయ్యలేం!

  రంజీత్: నమ్మాలి, కనీసం నా విషయంలో 🙂

  నిషీ: థాంకూ.. థాంకూ

  నరసింహ గారు: నిజమే! ఒక్కసారైనా..

  మేధ: అవును, అక్కడికి వెళ్ళాలంతే, చూడాలంతే!

  చైతన్య: నెనర్లు!

  Like

 13. మొహన: Tough ask, నాకెందుకు భయం వేస్తుందో చెప్పాలంటే.. ఎమో, ప్రయత్నిస్తా.

  Thanks for the lovely comment!

  మహేశ్: హు.. అస్వాదించండి!

  చివుకుల గారు: ఏమా అందమైన భావన? వ్యాఖ్యకు నెనర్లు!

  భావకుడన్ గారు: ఈం….త పెద్ద టపా రాయక అని చెప్పటం లేదు కదా? 😦 నాకోసం మాత్రమే బ్లాగులో రాస్తాను ఒక్కోసారి, ఇది అలాంటి సందర్భమే! తప్పదు..ఓపిక పట్టాల్సిందే!

  నిశాంత్: థాంక్స్!

  శ్రవణ్: మీ బ్లాగు కూడలిలో ఉన్నదా?? వీలైనంత త్వరగా కలపండి.

  Like

 14. పూర్ణిమా నువ్వు ఈ టపా ప్రచురించిన రోజునుండీ ప్రతి పూటా వెంటనే చదివాలి అని ఓ నాలుగు లైన్లు చదవడం, మళ్ళీ వెంటనే “ఊహూ అక్షరాల వెంట పరుగులు తీస్తూ అక్కడక్కడా ఒకటి రెండు పదాలని వదిలేస్తూ హడావిడి గా చదివి పడేసే టపా కాదు ఇది, ప్రతి పదాన్ని అందులో భావాన్ని ఆస్వాదిస్తూ అందాన్నంతా ఊహల్లో ఆవిష్కరించుకుంటూ హాయిగా నిదానం గా చదువుకోవాల్సిన టపా” అని అనుకుని అంత సమయం వెచ్చించ లేక వెళ్ళిపోడం ఇలా ఓ నాలుగు రోజులుగా నానా అవస్తా పడి చివరకి ఈ రోజు తీరికగా చదవగలిగాను.

  చాలా బాగుంది. కన్యాకుమారి లోని ఓ అందమైన నిశి లో కడలి నీ కెరటాలను పరిచయం చేసి, జ్యూస్ తాగించి, మరుక్షణం అలా అలవోకగా హైద్ వీధులలో తిప్పి, తిరిగి కన్యాకుమారి తీసుకు వచ్చి అంత అందమైన ఉషోదయాన్ని చూపించి మరుక్షణం హైద్ లోని శుభోదయాన్ని పరిచయం చేసినందుకు వేవేల నెనర్లు. హైద్ లో ఉదయం గురించి చాలా బాగా చెప్పావు ఆస్వాదించే మనసుండాలే కానీ మానవ లిఖిత సౌందర్యం ఎంత అద్భుతం. కానీ రోజు వారీ పరుగుపందెం లో పడి పరిసరాలని గమనించే స్పృహ కోల్పోయాం అనిపిస్తుంటుంది నాకు. “ఆల్ప్స్ పర్వతాలని అలకనంద నదులని ఎన్నో ప్రయాసలకోర్చి చూస్తాం కానీ ఉషోదయాన కిటికీ తెరిచి పక్కనే ఉన్న పార్క్ లో అందాలని చూడం” అన్న యండమూరి గారి వాక్యం గుర్తుకొస్తుంది.

  Like

 15. >>ముంచేసే ఆనందం కూడా ఒక ఉపద్రవమే!

  >>ఫ్లోరోసెంట్ వెలుగుల్లో నీడలు మరీ సాగిపోతాయి.

  >>నిద్రతో కూడా యుద్ధం చేస్తూ మెలకువకి, నిద్రాస్థితికి మధ్య మనోఫలకం అనే కాన్వాస్ పై ఆది, అంతం లేని ఆలోచనల బొమ్మలు గీయడం, ఊహలకి జీవం పోయటం – ఒక అందమైన అనుభూతి.

  >>రాలిన ఆకుల్ని తుడిచే చీపురు ధ్వనిలో కూడా ఏదో లయ వినిపిస్తుంటుంది. ఇక అప్పడప్పుడే తెరిచే టీ కొట్లోనో, ఓ మూలనున్న పూరి గుడిసెలోనో పొయ్యి ముట్టిస్తే, ఆ వాసన మత్తు అంతా ఇంతా కాదు.

  మీరు మీ లోపలి భావాల్ని, చుట్టూ ఉండే మనుష్యులని, పరిసరాలనీ ఎంత సునిశితంగా గమనిస్తారో పై వాక్యాలు చూస్తె అర్థమవుతుంది. ముఖ్యంగా మీ రచనలని చదువుతుంటే నా కళ్ళ ముందే జరుగుతున్నట్లుగా అ(క)నిపిస్తుంది. కాసేపు మీరు నేనైపోతాను. అంత బాగా రాస్తారు.. ఎంత బాగా అంటే అంత బాగా..

  Like

 16. మొదటి భాగం కొంచెం గందరగోళంగా ఉంది. నాలుగో పేరాకి వచ్చే దాకా అసలు విషయం ఏంటో అర్ధం కాలేదు. కథల్లో అయితే ఇలా చెల్లుతుందేమో (నా ఉద్దేశంలో చెల్లదు), కానీ బ్లాగులో విషయావిష్కరణే ఇంత ఆలస్యం ఐతే కష్టం.

  విషయ పుష్టి లేకుండా భాష పుష్టి ఉన్నంత మాత్రాన్, అది తనంత తాను పాథకుడికి ఏమీ తృప్తినివ్వదని నా అనుభవం. ఆ దృష్ట్యా మొదటి మూడు పేరాల్లో మీరు రాసిన ఎన్నో చక్కటి వాక్యాలు, అసలు సందర్భం ఏంటో తెలియక, వృధా అయ్యాయి.

  అసలు సంగతి ఏవిటో అర్ధమయ్యాక ..
  “అది ఇష్టమైన భయం. భయంగా మారే ఇష్టం.”
  “కనుచూపు మేర జలనిధి, నిదానంగా ఉదయిస్తున్న సూర్యుడు. పకృతి స్వహస్తాలతో గీసే అరుదైన చిత్రలేఖనం, ఈ ఉషోదయం! “
  ఇలాంటి వాక్యాలు చాలా ఆహ్లాదం కలిగించాయి.

  Like

 17. నాకూ ఉన్న అలవాటుకి వేరొకరిని అక్షేపించటం అసలు చేయను 🙂

  నేను అనటం టపా మొత్తం ఒక విషయం మాత్రమె చెప్తావు కాని ఆ చెప్పేది ఎంత అందంగా చెపుతావో, ఎన్ని వర్ణాలో గుప్పిస్తావో–అని మెచ్చుకోవటం అది.

  నిజమే , కొన్ని టపాలు బయటి వారి కంటే మన ఆత్మానందానికై ఎక్కువ రాసుకుంటాము. ఇంకో బ్లాగులో ఎవరో అన్నట్టు “క్షణం పాటు విరిసి మాయమయే తామర క్షణాల సువాసనలను సదా బంధించి ఉంచాలనే ప్రయత్నాలే” కదా ఇవన్నీ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s