ఒక ఉలిపికట్టె కథ..

Posted by

పోయిన వారాంతం విశాలాంధ్ర మీద దాదాపు దాడి లాంటిది చేసి మరీ కొన్న అనేకానేకమైన పుస్తకాల్లో, డా|| కేశవ రెడ్డి రచించిన “సిటీ బ్యూటిఫుల్” అత్యంత తక్కువ పేజీలు కలదీ, అంతే చవకా కూడా! అప్పుడెప్పుడో నవీన్ రాసిన “అంపశయ్య” పుస్తకం ఒక యాభై పేజీలు చదివి మళ్ళా ముట్టుకోలేదు. ఈ పుస్తకం “ముందు మాట”లో దాని ప్రస్తావన చూసి హడలిపోయాను. ఉన్నవే తొంభై పేజీలన్న ధైర్యంతో మొదలెట్టాను. కథ విషయానికి వస్తే దాదాపు అంపశయ్య కథే! ఇరవై యేళ్ళ వయసున్న ఒక మెడికో జీవితంలో ఓ రెండు రోజులు పాటు జరిగిన పరిణామాలు, వాటి పర్యవసానాలు! అంతే కథ.

 ఈ పుస్తకం మొదట్లో రచయిత తన మాటగా చెప్పుకుంటారు, “అస్తవ్యస్తంగా, అర్థరహితంగా, తలక్రిందులుగా ఉన్న సమాజ విలువల్నీ, కట్టుబాట్లనీ, కొందరు పూర్తిగా ఆమోదిస్తారు, వారికి ఈ సమాజం ఎప్పుడూ అక్కున చేర్చుకుంటుంది. కొందరు మాత్రం దీనికి ఐచ్ఛికంగానో, యాధృచ్ఛికంగానో ఆమోదించక ఎదురు తిరుగుతారు, వాళ్ళ జీవితాలు నరకప్రాయం చేయడం సమాజం వంతు” అని! ఇప్పుడు మనం ఒక వేళ పూర్తిగా సమాజాన్ని ఆమోదించేసినట్టయితే ఈ పుస్తకం సిటీ బ్యూటిఫుల్ కాదు, సిటీ హిల్లారియస్ అవుతుంది. ఎందుకంటే ఉన్న విలువలకి ఎదురుతిరిగే ఒక ఉలిపికట్టె కథ, అతని వ్యథ, అతని చిరాకు అన్నీ నవ్వు తెప్పిస్తాయి. ఒక వేళ మనం పూర్తిగా సమాజానికి వ్యతిరేకం అయితే, అతడి పై సానుభూతో, సహానుభూతో కలిగి అయినా పట్టువదలని అతడి నుండి కాస్త ధైర్యం కలగవచ్చు ఏమో! అప్పుడీ పుస్తకం సిటీ బ్రావో కావచ్చు!

కానీ అటూ కాక, ఇటూ కాక ఉండే నా లాంటి వారు చదివితే మాత్రం, అప్పుడప్పుడు కస్సుక్, కిస్సుక్ మని నవ్వులు , మరి కొన్ని సందర్భాల్లో విపరీతంగా కెలికే ఇబ్బంది. చూసీ చూడనట్టు చేసుకుపోయే చాలా వెధవ పనుల్ని రికార్డు చేసి ఎవడో ముందు పెట్టి రి-ప్లే చేస్తున్నట్టుంటుంది. ఉదా: మన హీరో మెడికల్ కాలేజీ ఎంట్రన్స్ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు, “ఎందుకు మెడిసన్” అన్న ప్రశ్న, “మా నాన్న వెళ్ళమన్నాడు” అన్న సమాధానం చెప్తాడు. ఇలా సమాధానం చెప్తే ఆ మనిషి మనమెలా “ట్రీట్” చేస్తామో, అక్కడున్న పేనల్ కూడా అలానే “ఇమ్మెచ్యూర్” అని నవ్వుకుంటుంది. మనం చిన్నప్పటి నుండీ శతకాల్లో, పద్యరత్నాల్లో వల్ల వేసిన నిజాయితీ మనం పెరిగే కొద్దీ “మెచ్యూర్” అయ్యిపోతుందేమో! అవతలి వారి అనువుగా ఉండేవి చెప్పాలి, నిజం కాకపోయినా. మన హిరో బయటకి వచ్చి వేరే వాళ్ళతో మాట్లాడితే గానీ తెలీదు, ఆ ప్రశ్న “నేను పేదలకు సేవ చేస్తాను”, “నేను కాన్సర్ కి ఒక నివారణ మందు కనుక్కుంటాను, ప్రపంచాన్ని కాపాడతాను” లాంటి లౌక్యమైన సమాధానాలు చెప్పాలి అని. అందుకని ఆ ఒక్క క్షణం అలా అవలీలగా నటించేసేవారికి ఈ పుస్తకం చెంప చెల్లుమనిపిస్తుంది. సిటీ స్కేరీ గా మారుతుంది.

ఇక ఒంటిరితనం గురించి! మొన్న ఎవరో “నా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోతున్నారు, ఇక లోన్లీ గా ఉండాలి” అనగానే “అందరూ ఉండగా కూడా ఫీల్ అయ్యే లోన్లీ కన్నా ఇది చాలా నయం” అన్నాను. ఒక్కోసారి చుట్టూ మనుషులు ఎక్కువయ్యే కొద్దీ మనంలోని ఒంటరితనం ఎక్కువవుతుంది.  చాటు నుండి మాటు వేసి మరీ “దిగులు” మనల్ని దాడి చేస్తే నిశ్శబ్దం, నిస్తబ్దత, నిస్సత్తువ కలగలిపి మనతో బంతాట ఆడుకునే వేళ, ప్రపంచమంతా మనకి శత్రువులానే ఉంటుంది. అందుకే దూరంగా పారిపోవాలనుంటుంది. మన హీరో మరీ ఒక అడుగు ముందుకేసి, “అందర్నీ మెషీన్ గన్ తో చంపేస్తాను” అని ప్రతిన పూనుతాడు, బీచి మీద ఏకాంతంగా కాసేపు గడుపుదాము అని వచ్చేసరికి అంతా జనం ఉండటం చూసి. మన జీవితంలో ఇలా జరిగిన ఏ సంగతో లేక సందర్భమో గుర్తొస్తే సిటీ బ్యూటిఫుల్ కాస్త, సిటీ alienated అయ్యిపోతుంది.

అర్థం లేని అహాలు, అబద్ధపు ప్రతిష్టలు, బూటకాలు, నాటకాలు ఇవేవి కొత్తగా ఈ పుస్తకం కొనీ, చదివీ తెలుసుకోవాల్సిన పని లేదు. మనం చూసిన జీవితాల్లో అలాంటివి కోకొల్లలు! ఇందులో నాకు striking అని అనిపించింది మాత్రం, ఈ అబ్బి ఎడమ చేతి వాటం కావటం. అందులో విడ్డూరం ఏమిటని అనిపించచ్చు. ఈ కథలో రచయిత దాన్ని సమాజాన్ని ఎత్తి చూపటానికి చేసిన ప్రయత్నమల్లే కనిపిస్తుంది. ఈ పాత్రకి అన్నీ ఎడం చేత్తోటే, ఆఖరికి అన్నం తినడం కూడా. కథ మధ్యలో ఒకటి రెండు సార్లు “నేను లాబ్ లో ఎక్విప్ మెంట్ విరగొట్టా” అని చెప్తుంటే, చాలా అజాగ్రత్త మనిషి అనుకున్నాను. తీరా చూస్తే ఆ లాబ్ లో అన్నీ “కుడి చేతి వాటం” వారికి అనువుగా ఏర్పాటు చేయటం వల్ల వచ్చిన ఇబ్బంది. మనం కొన్నింటికి ఎంతలా అలవాటు పడిపోతామంటే, ఇంక వేరేలా కూడా చేయవచ్చు అని ఊహించలేమేమో అన్న దిశగా రచయిత నన్ను ఆలోచింపజేయడంలో సఫలమయ్యాడు.

తెలుగు సరళంగాను, సులువుగాను ఉండి, గజిబిజి లేని శైలి అవ్వటంతో ఈ పుస్తకం చదవటం చిటుకులో అయ్యిపోయింది. కాకపోతే, ప్రధాన పాత్రధారి చీటికీ మాటికీ  “ఇంబసైల్” అనటం, ఎవరికైనా “గాడు” తగిలించటం” కాస్త చిరాకుగ్గా అనిపించాయి. నా టపా చదివి ఇదేదో మోరల్ స్టోరీ అనుకునేరు, ఇది ఒక సామాన్య యువత కథ, నచ్చిన దానికీ, చేయాల్సిన దానికీ నలిగిపోయే అతి సామాన్యమైన కథ! అయినా నవ్వుకోడానికి బోలెడు అవకాశం. బాపూ గారేసిన ముఖ చిత్రం చెప్పకనే చెప్తుంది కథ మొత్తం! సింపుల్ గా చెప్పాలంటే, ఎప్పటికప్పుడు పరిస్థులకీ, మనుషలకీ అనుగుణంగా ఒక చక్కనైన అందమైన ముసుగు వేసుకోకపోతే, మనల్ని నిజం ఎంతలా కాల్చేస్తుంది అనే కథ!

ఈ రచన చేయడానికి హెమ్మింగ్వే “ఫేర్వెల్ టు ఆమ్స్” మరియు సలింగర్ “కాచర్ ఇన్ ది రయ్” ప్రేరణ అని రచయిత పేర్కొన్నారు. నా అనంతమైన “చదవాల్సిన” జాబితాలో అవీ ఉన్నాయి!

పుస్తకం వివరాలు:
పేరు: సిటీ బ్యూటిఫుల్
రచయిత: డా|| కేశవ రెడ్డి
పబ్లికేషన్స్: నందిని పబ్లికేషన్స్
పేజీలు: 92
వెల: రూ. 50
నేను కొన్నది: విశాలాంధ్ర (అబిడ్స్)

22 comments

  1. చాలా రోజుల తరువాత బ్లాగులోకంలోకి వచ్చీరాగానే నా మనసుకి బాగా నచ్చిన రెండు వాక్యాలతో మీ బ్లాగులోనే ఆపేసారండి.

    హీరో మెడికల్ కాలేజీ ఎంట్రన్స్ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు, “ఎందుకు మెడిసన్” అన్న ప్రశ్న, “మా నాన్న వెళ్ళమన్నాడు” అన్న సమాధానం చెప్తాడు. ఇలా సమాధానం చెప్తే ఆ మనిషి మనమెలా “ట్రీట్” చేస్తామో, అక్కడున్న పేనల్ కూడా అలానే “ఇమ్మెచ్యూర్” అని నవ్వుకుంటుంది. కానీ నిజంగా ఆలోచిస్తే అతనిది నిజాయితీ.

    ఇది మామూలుగా ఐతే లౌక్యం తెలీదనో లేక బతకదం తెలీదనో అంటారు నాకూ చాన్నాళ్ళుగ ఇదే సందేహం.అది నిజాయితీ అన్న మాట.కథ మామూలుదే అయినా మీ way of Understanding బాగుందండి.

    Like

  2. ప్రతీ పుస్తకాన్ని నీదైన స్టైల్లో పరిచయం చేస్తూ వుంటుంటే, ఓహో ఒక పుస్తకాన్ని ఇలా కూడా అర్ధం చేసుకోవచ్చు, ఆ అర్ధాల్ని మన జీవితానికి ఇంత అర్ధవంతంగా అన్వయించుకోవచ్చు అనుకుంటూ ఆశ్చర్యపడిపోతుంటాను. బ్యూటిఫుల్ పూర్ణిమా… చాలా బాగా రాసావు.

    Like

  3. పూర్ణిమా, చాలా బాగుంది నీ సమీక్ష. వెంటనే పుస్తకం కొనుక్కోవాలి. రచయిత దీనికి “కేచర్ ఇన్ ద రై” ప్రేరణ అన్నందుకైనా కొనాలి. నిజంగా “కేచర్ ఇన్ ద రై”కి ఆ శక్తి ఉంది. చదివిన చాన్నాళ్ళ వరకూ Holden Caulfield మనల్ని వదలడు. ఒక nagging conscience లాగా వెంటాడి దుంప తెంచుతాడు. చాలా బాగా రాశావు.

    Like

  4. You seriously have a way with words… simply superb…but think about economy of words!!!! No offense meant…

    –Vamsi

    p.s: there was a typo…so deleted the previous comment..sorry..

    Like

  5. వావ్…సూపర్…అయితే, కథలో ప్రధాన పాత్ర ఈ సమీక్ష చేసి ఉన్నట్లు రాసి ఉంటే ఎలా ఉండేది అన్న అవుడియా వచ్చింది. 🙂

    Like

  6. అబ్బా! ఇంత తొందరగా మీరు మళ్ళీ ఇంకో పుస్తకాన్ని చదివెయ్యాలా..!? 😐 పోయినసారి చెప్పిన “The old man and the Sea” బాగుందన్నారు(నాన్న కూడా)..దాంతో వెంటనే కొనేశా..ప్చ్! చదవడానికి కొంచెం టైం పడుతుంది.(ఏమైనా స్టూడెంట్ లైఫ్ కదండీ).ఇంతలోనే మళ్ళీ మీరు ఇంకో టాస్క్ ముందుంచేశారు.. 🙂
    సరేనండీ ఇది కూడా చదువుతాను..(సెం హాలిడేస్ వస్తున్నాయిలెండి :-)). మీరు ఇలాగే “చదివిన పుస్తకం” అంటూ ఒక జాబితా తయారు చేస్తూండండి, నాకు సులువైపోతుంది 🙂 (వెతుక్కునే పనుండదు కదా!)
    ఇంక మీ పోస్ట్‌లో — మనం చిన్నప్పటి నుండీ శతకాల్లో, పద్యరత్నాల్లో వల్ల వేసిన నిజాయితీ మనం పెరిగే కొద్దీ “మెచ్యూర్” అయ్యిపోతుందేమో! అవతలి వారి అనువుగా ఉండేవి చెప్పాలి, నిజం కాకపోయినా — మాట నిజంగా నిజమే కదా అనిపిస్తుంది..ఛ ఛ నిజమే. ఆ ముసుగులో మనం కూడా పడిపోయాం.. బయటకు రావడం కష్టమే..! సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఏ టీవీ వాళ్ళో వచ్చి ఎలా ఉందని కెమేరా ముందేసుకొని అడిగితే అణాకాణీ సినిమా కూడా ఆలిండియా రికార్డ్స్ తుడిచేస్తాదని చెప్పేస్తాం.. ఇదేకదండీ ఆ నిజమైన అబద్ధం..

    Like

  7. మేధ, నిశాంత్:

    గత ఏడాది బ్లాగులు చదవటం వల్ల, బోలెడన్ని పుస్తకాలు పరిచయమయ్యినా ఈ ఏడాది మార్చి వరకూ అసలు పుస్తకం కొట్లోకి వెళ్ళే వీలు కూడా లేకుండా ఉండేది నాకు. ఈ మధ్య కాలంలో కాస్త సమయం చిక్కుతుంది కాబట్టి చదవటం కుదురుతుంది.

    ఒక పుస్తకం గురించి తెలియగానే చదివేయాలి అనిపించినా వీలు చిక్కదు. అలాంటప్పుడు నేను చదవాలనుకున్న పుస్తకాల వివరాలు ఒక చోట అట్టే పెట్టుకుంటే, నాకు బుద్ధి పుట్టీ, వీలు చిక్కినప్పుడు ఏ పుస్తకం చదవాలో నిర్ణయించుకోవటం తేలికయ్యింది. ఒక మాల్ లోకి ఏం కొనాలో నిర్ణయించుకుని వెళ్ళినప్పటికీ, అసలే ఐడియా లేకుండా వెళ్ళినప్పటి షాపింగ్ కి చాలా తేడా ఉంటుంది కదా!

    సో.. ఇప్పుడు చదవటం కుదరటం లేదని బాధ వలదు. కొన్ని సార్లు అన్నీ కూడబలుక్కుని కలిసొస్తాయి, అప్పటికి మనం ప్రిపేర్డ్ గా ఉంటే చాలు 🙂

    Have fun!

    Like

  8. రేపే హైదరాబాద్ వస్తున్నా,పుస్తకం కొని చదివి తరువాత కామెంటుతాను.

    Like

  9. నాకు నిజంగానే చదవాలనిపించి మా ఫ్రెండ్ కి ఇప్పుడే ఫోను కూడా చేశాను. వాడీ పాటికి తెచ్చేసే ఉంటాడు. కథ చూడ బోతే ఇంటరెస్టింగ్ గా ఉంది.

    “రకరకాల ముసుగులు వేస్తూ ఎపుడో మరిచాం మన సొంత ముహం…”

    వినే ఉంటారు.

    Like

  10. Excuse me madam….
    నేను వెనకాల బెంచీలో కూర్చుంటాను మనకు ఏది అంత తొందరగా అర్థం కాదు.. ఇంతకీ పుస్తకం బాగున్నట్టా బాలేనట్టా మీ రివ్యూ చూస్తే పుస్తకం బాలేదు అని చెప్పినట్టు ఉంది.. ఇక్కడ జనాలేమొ నేను ముందు చదువుతాను అంటే నేను ముందు చదువుతాను అని NTR పోయిన రొజు సాయంత్రం వచ్చిన పెసలు సంచిక కోసం ఎగబడినట్టు ఎగబడుతున్నారు…అసలు దీని భావమేమి పుర్ణిమ… ఉంకోటి ఉలిపికట్టె అంటే ఏంటి ?
    kvmkishore…

    Like

  11. @kvmkishore:

    ఒక పుస్తకం బాగుందో లేదో డిసైడ్ చేసే సీను నాకు లేదు కానీ, నాకేమనిపించిందో రాసే ప్రయత్నమే ఇది. ఈ రచన “బాలేదు” అని అనను. మన సినిమా భాషలో చెప్పాలంటే “ఒక సారి చదవచ్చు”

    ఇక “ఉలిపికట్టె” అంటే ఆక్చువల్ అర్థం నాకూ తెలీదు. “ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెదొక దారి” అన్న సామెతతోనే పరిచయం. ఉలిపికట్టె అంటే దారికి, అప్పటికే ఉన్న నియమాలనీ పట్టించుకోక, తన దారిలో వెళ్ళేవాడు అనే అర్థంతో వాడాను. ఈ కథలో ప్రధాన పాత్ర కూడా అందరిలా ఉండక, కాస్త అడ్డంగా వెళ్ళీ కష్టాలు కొని తెచ్చుకుంటాడనే చెప్పుకోవచ్చు. అందుకే ఆ టైటిల్! మరేమన్నా తెలిస్తే తప్పక చెపుతాను.

    Like

  12. ఈ పుస్తకానికి మీరు రాసిన పరిచయం కొంచెం లైట్ హార్టెడ్ దృక్కోణంగా అనిపించింది. బాగుంది. పొద్దులో ‘అతడు అడవిని జయించాడు’ పుస్తకానికి చదువరిగారు రాసిన సమీక్ష చూశాక కేశవరెడ్డిగారి పుస్తకాల్లో చాలావాటిని చదివాను. నాకు చాలా దగ్గరగా నచ్చిన పుస్తకం “ది ఇన్‌క్రెడిబుల్ గాడెస్”. కేశవరెడ్డి ఏం రాసినా చదవడం మొదలెడితే మధ్యలో ఆపలేమని నా అనుభవం. సిటీ బ్యూటిఫుల్ కథంతా ఆసక్తికరంగా వుంటూ అక్కడక్కడా ఫక్కున నవ్విస్తుంది. ముగింపు హాయిగా వుందనిపించింది.

    Like

  13. రానారె గారు: “హాయి”?? అది కూడా ముగింపు?! ఏమో నన్ను మాత్రం కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ జీవి ఏమని “ఫీల్” అయ్యుంటాడో నేను కూడా అలానే అయ్యాను. నాకున్న అనేకానేకమైన జబ్బుల్లో ఇదీ ఒక్కటి.. అవతలి వారి బాధను నాదే అన్నట్టుండడం. కానీ అటు తర్వాత దానికి సంబంధించి ఏమీ చేయను.

    కేశవరెడ్డి ఏం రాసినా చదవడం మొదలెడితే మధ్యలో ఆపలేమని నా అనుభవం. – నిజం! నేను మిగితా రచనలు చదవాలని నిశ్చయించుకున్నాను.

    లైట్ హార్టెడ్! .. ఏమో నేనులా ప్రయత్నించలేదు. అసలూ.. రవిగారి అవుడియా నాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది.. ఏదో ఒక పాత్రలోకి దూరి, ఖచ్చితంగా అతని కథ చెప్తాను, త్వరలో!

    నెనర్లు!

    Like

Leave a comment