ట్రాఫిక్ జాం

Posted by

మళ్ళీ ట్రాఫిక్ జాం! యుద్ధంలో అయితే భీరువో, వీరుడో, విజేతో ఎవరో ఒకరిగా మిగలచ్చు. చదరంగంలోనైనా, సరిహద్దుపైనైనా సిపాయికి వెనుకడుగుండదట. ట్రాఫిక్ లోనూ అంతే. కాకపోతే వారికి ముందుకెళ్ళే వెసలుబాటుంటుంది —  చంపడానికో, చనిపోవడానికో! ఇక్కడలా కుదరదు, ఒక్కటే సాధ్యమిక్కడ – ఇర్రుక్కోవటం! ముందో బెంజు కారూ, దాని పక్కనో డొక్కు వానూ. బైక్ మీద యువ జంట, పొగలు కక్కుతున్న ఆటో , పక్కనే ఉన్న కిక్కిరిసిన బస్సు ఒక మిని గ్లోబు. కారద్దంలో కనిపించే వాహనాలు వెంటాడే గతంలా. ఇంతలో ఏ సైకిలోడో, ఆంబీషియస్ బైకోడో మన చేతగానితనాన్ని మరీ ఎత్తి చూపిస్తుంటాడు. పాములా సరసర పాకెళ్ళిపోగలనే వాడి ఫోజు ఏ కారు అద్దానికో, డివైడరుకో ఘాట్టిగా తగిలి ముక్కలవ్వాలని మనసారా శపించనూలేము. దాని మూలాన చిన్న సైజు యుద్ధం మొదలైతే అపరాధ భావంతో దూకేయడానికి కదల్లేం. చచ్చినా కదల్లేం!! “ట్రాఫిక్ లో ఉన్న మీ కోసం ఈ పాటంటూ” ఎఫ్.ఎం వొలకబోసేది, “వస్తా, లేస్తా, రాస్తా, చస్తా” లాంటి పదాలని తిప్పి తిప్పి రాసిన అసలు సిసలు తెలుగు పాట. భరించాలి — అందర్నీ! అన్నింటినీ!!  చేతులకి స్టీరింగ్ తో ఆటలాడేంత నేర్పుంటుంది, కాళ్ళకి క్లచ్, బ్రేక్, ఆక్సిలరేటర్ మీద గుత్తాధిపత్యం ఉంటుంది. ఉండీ.. ఏం లాభం?

కదల్లేక అసహనం, కదలలేని అసహాయత, కదల్లేనే అని నిరాశ, కదల్లేకపోతున్నందుకు కోపం! గాలిలా పొగ, కీకీ మనే కాకిగోల హార్నల్లు, గలాటాలు, పాటల హోరూ, చమటా, ఉక్కా తల బద్దలయ్యిపోతుంది నాకు. మెదడులోని నరాలను సూదులతో గుచ్చుతున్నట్టంటూ వర్ణించలేని బాధ! ఆకాశానికి మొత్తం ఎర్రరంగు పులమలేక నీరసించి సూర్యుడెళ్ళిపోతున్నా, ఈ రెడ్ లైట్ మాత్రం ఎదుట నిలిచి వేధించే “ప్రస్తుతం”లా కళ్ళనీళ్ళు రాకుండా ఏడిపిస్తుంది. అది దారిచ్చిన క్షణాన మాత్రం కదిలే బొమ్మల్లా ఉన్న నా కాళ్ళకీ, చేతులకీ యాంత్రికంగా “కీ” ఇచ్చేసే నా మెదడు, ఇక ఆగాగియైనా ముందుకు పోవాలన్న నిశ్చయాన్ని వాటికి తెలుపుతుంది.   

రోడ్డు మీద సర్రున్న పోతున్నా, జాంలోనే ఉన్నాను. వాహనాలు కాదు నిలిచిపోయ్యింది, నా ఆలోచనల స్రవంతే స్థంభించిపోయింది! ఒక ఆలోచనా, మరో ఆలోచనా, ఇంకేదో ఆలోచనా – ఆతిధ్యమిచ్చినవి కొన్ని, పూర్తి అపరిచుతుల్లా కొన్ని, కొన్నైతే అనామకులుగా నాలోకి చొచ్చి, ఇరుక్కుగా ఉన్నా పర్లేదంటూ ఒకదాని పక్కన ఒకటి ఓర్పుగా నేర్పుగా నడుస్తున్నట్టే నడుస్తూ ఇర్రుక్కుపోయాయి. ఒకదాని మీదకి మరోటి ఎగపాకుతోంది! ఓ “భారీ నిజం” హైడలైట్లు కళ్ళల్లోకి కొట్టడంతో ఓ ఆలోచన అదుపు తప్పి”పోయ్యింది”. “భయం” చేసే రాష్ డ్రైవింగ్ కి ఇంకొన్ని ఆలోచనలు చెల్లా చెదురై కొన్నింటికి అడ్డంగా నిలిచాయి. సైలెంటుగా చీకటినే రాంగ్వేలో వచ్చిన “దిగులు” పొట్టను పెట్టుకున్న ఆలోచనలకి లెక్కలేదు. రావడమే స్వభావమైన కొత్త ఆలోచనలన్నీ అసలేం జరుగుతుందో ఆలోచించలేక బిక్కు బిక్కుమంటూ ఆగిపోయాయి. కదల్లేక, ఆగలేక వాటికి ఊపిరాడక, జీవితం ఒక్కసారి నిలబడిపోయినట్టనిపిస్తుంది! 

“నాన్ సెన్స్! అలా ఎప్పుడూ జరగదు, అవ్వన్నీ అర్థం లేని భ్రమలు, ఊహలు, అపోహలు, భయాలూ.. ఇంకా అలాంటివేవో.. అంతే!” అంటూ నాకు నేనో అర్థంలేని అర్థాన్నిచ్చుకుంటాను. మిగితా ప్రపంచానికేదీ కనిపించదు (కనిపించనివ్వను) కనుక అసలు జాం లేనే లేదు. కానీ దాచే కొద్దీ కనిపెట్టేసే ఒక్క ఆత్మీయం దగ్గర మాత్రం, కరిగి కన్నీరయితే – ఆ మాటల జడిలోనో, స్పర్శ తడిలోనో ఈ జాం క్లియర్ అయ్యిపోతుంది. ఆలోచనలు సరదాగా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళచ్చు! కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే అక్కడే ఇదే పరిస్థితి ఇంచుమించు!

ఆశలూ, ఆశయాలు, ఆదర్శాలూ, ఆప్యాయతలూ, అనురాగాలు, అనుమానాలు, అభద్రతలూ, అపనమ్మకాలూ, ఆవేశాలు నియంత్రణలో ఉన్నంత వరకే – కాస్త అటు ఇటు అయినా ట్రాఫిక్ జాం!

18 comments

  1. పూర్ణిమ గారు చక్కగా వర్ణించారు ట్రాఫిక్ జాం గురించి. జీవితాన్ని ట్రాఫిక్ జాం ని చాలా బాగా అన్వయించారు.
    “ఆశలూ, ఆశయాలు, ……..ఆవేశాలు నియంత్రణలో ఉన్నంత వరకే – కాస్త అటు ఇటు అయినా ట్రాఫిక్ జాం” ! నాకు ఈ లైన్ బాగా నచ్చింది.

    Like

  2. బ్రహ్మాండం! మెదడ్లో ట్రాఫిక్ జాం ముందు, హైదరాబాద్ ట్రాఫిక్ ఎంత? మంచి పదచిత్రణ,భావప్రకటన.

    Like

  3. మొదటి కొన్ని పారాలు చదివిన తరువాత “ఓ దేవుడా, ఈ కవులని చంపేసేయి. లేకుంటే at least మనిషిలోని కవి పాత్రని చంపేసేయి… … ఎంత సేపు ప్రాసలు, యతులు, పద ప్రయోగాలు… మామూలు మనుషులుగా వుండలేరు ఈ కవులు” అని అనిపించింది;(… కాని చివరికి వచ్చే సరికి అర్తమైంది కవి పాత్ర ఎందుకు భయటకు రావల్సి వచ్చిందో…:)

    Like

  4. వీక్షకుల కౌంటర్ ఇంకారెండు చుక్కలు పెంచు..త్వరలో పదివేలు ఎలాగూ చేరుకుంటావు. ఇక లక్షకూడా పెద్ద లక్ష్యం కాదులే!

    Like

  5. అందమైన ఊహలు. ఇంతకన్నా రాయడానికి నా మెదడు బ్లాంక్ గా ఉందో మరి ట్రాఫిక్ జాం లో ఉందోకూడా అర్ధం కావడం లేదు.
    “గుండె గుప్పెడంత
    ఊహ ఉప్పెనంత అన్నారు కదా”.
    మరి ఈ ఊహలు ఉప్పెనలోనో, సునామి లోనో కొట్టుకుపోతున్నాయమో , వ్యాఖ్య రాద్దామంటే మనసు మూగబోతోంది.

    Like

  6. “సైలెంటుగా చీకటినే రాంగ్వేలో వచ్చిన “దిగులు” పొట్టను పెట్టుకున్న ఆలోచనలకి లెక్కలేదు. రావడమే స్వభావమైన కొత్త ఆలోచనలన్నీ అసలేం జరుగుతుందో ఆలోచించలేక బిక్కు బిక్కుమంటూ ఆగిపోయాయి. కదల్లేక, ఆగలేక వాటికి ఊపిరాడక, జీవితం ఒక్కసారి నిలబడిపోయినట్టనిపిస్తుంది! “

    అర్జెంట్ గా హైద్ కి వచ్చి నీకో హగ్గివ్వాలనిపిస్తుంది!! కొద్దిరోజులుగా నాలోనూ ఆలోచనల ఉక్కిరిబిక్కిరి.. ఇదీ అని అర్ధం కాదు.. ఇప్పుడు నీ టపా చదువుతుంటే ‘అర్రే నా ఊపిరాడనితనం పూర్ణీకెలా తెల్సు!? ‘ అనిపించింది!! ట్రాఫిక్ జాం ని ఇంతక చక్కగా ఆలోచనా స్రవంతికి అన్వయించడం నీకే చెల్లింది 🙂

    GREAT post!!

    Like

  7. మీ భాషాపాటవాన్ని, భావాల్ని కూడా మెచ్చుకోవాలి. నాచేత ఇలా ఏకబిగిని చదివించగలిగిన రచనలు అరుదు. 🙂
    అభినందనలు.

    Like

  8. "ఆశలూ, ఆశయాలు, ఆదర్శాలూ, ఆప్యాయతలూ, అనురాగాలు, అనుమానాలు, అభద్రతలూ, అపనమ్మకాలూ, ఆవేశాలు నియంత్రణలో ఉన్నంత వరకే – కాస్త అటు ఇటు అయినా ట్రాఫిక్ జాం!"
    చాలా బావుంది. ఆ పోలికలు,వర్ణనలు చాలా బావున్నాయి.

    You are getting better & better. Keep going.. 🙂

    Like

  9. ఒళ్ళు మండిపోతున్నపుడు ఎఫ్.ఎం లో వచ్చే పాటలు అద్దం బద్దలు కొట్టాలన్నత ఆవేశాని కలిగిస్తాయి కదూ !పైగా ట్రాఫిక్ అలర్ట్ లు…ఇక్కడ ఒకటి క్లియర్ కాక చస్తుంటే బేగం పేట్లో, కుకట్ పల్లిలో, పంజగుట్టలో జాం అయింది అంటూ!

    బైకు వాళ్లని, సైకిలోళ్లని కాకుండా ఇంకొకళ్ళని వదిలేశావేం? ఇరవైల్లో నడపడానికి కూడా భయపడుతూ, కన్ ఫ్యూజ్ అవుతూ, మన కారు ముందు బైఠాయించి దారీ ఇవ్వక, స్పీడుగానూ తోల్లేక,…కళ్ళు కనపడక…నరకం చూపెట్టే తాతగార్లు! నాకు ఎంత కోపమో వీళ్లంటే! నన్నడిగితే అరవై దాటిన వాళ్లు డ్రైవర్ని పెట్టుకుని తీరాల్సిందే అని ఒక రూలు తెచ్చెయ్యాలంటాను.

    అందుకే బైకైతేనే హాయి హాయి! ఏ సందులోంచైనా దూరి పారిపోవచ్చు!

    Like

  10. Thank god.. we don’t have such a traffic jam, but on the other hand i do have the brain traffic jam.. it is not yet cleared and i don’t know when it will be cleared.(my brain doesn’t follow the traffic rules ;-)).
    Anyways nice comparison for comprehension.

    Like

  11. 🙂 చాలా బాగా అన్వయించావు. నీ ట్రాఫిక్ జాం గురించి నేనైతే జాం..ఝాం… అంటూ చదివేసాను. స్పీడ్ బ్రేకర్ లేని హైవే పైన ప్రయాణంలా…;)

    Like

  12. ట్రాఫిక్ జాం పేరు చెప్పి చాలా చెప్పారు పూర్ణిమా.కొద్దిగా తత్వం కనిపిస్తుంది టపాలో.చాలా చాలా నచ్చింది.

    Like

  13. ఆశలూ, ఆశయాలు, ఆదర్శాలూ, ఆప్యాయతలూ, అనురాగాలు, అనుమానాలు, అభద్రతలూ, అపనమ్మకాలూ, ఆవేశాలు …
    that sums up the life and the experiences.

    U have improved a lot in ur blogs – pardon me if i am being too flamboyish, but from the first post to these – it is quite a transition. May be because i read all of them together ;)…Loved this post as well.

    Many a time, thoughts r stuck with nothing but a huuuuuge cloud. Fighting that inability to conceive a thought is not gonna solve it though. it requires someone/something to let out ur mindless chatter, non-sequential thoughts out and then, u r back again. 🙂

    Like

  14. పూర్ణిమ గారు ట్రాఫిక్ జామ్ కి జీవితానికి ముడి పెట్టడం బావుంది. ఆఫీసు కి వెళ్తునప్పుడు ఎవడైనా రోడ్ తవ్వడం కనిపిస్తే గుండెల్లో గునపం గుచ్చు కునట్టు అవుతోంది బాబోయి దేవుడా దీని ఎఫ్ఫెక్ట్ కనీసం వారం రోజుల పాటు ట్రాఫిక్ జాం ఆ ప్రాంతం లో .అలాగే ఇంట్లో కూడా గుండెల్లో గుచ్చుకునేలా మనం అన్నా అనిపించు కున్న దాని ఎఫ్ఫెక్ట్ కూడా ఒక వారం వుంటుంది.కాని నరకం లో స్వర్గం ల ఎ ట్రాఫిక్ జామ్ లో కూడా కొంత లాభం వుండి. బ్లాగ్ లో మనం రాద్దామనుకున్నా కొత్త టాపిక్ కి మేత దొరుకుతుంది. కార్ లో ఆలోచనలకి కంప్యూటర్ లో ప్రతిరూపం వస్తుంది. అలాగే ఇంట్లో మనసు జామ్ అయిన వారం లో ఆత్మ పరిశీలన కి అవకాశం ఏర్పడి మనం మరింత మంచి గ ఎదగ దానికి అవకాసం వుంది.సో బ్లాగేర్స్ పాయింట్ అఫ్ వ్యూ లో జామ్స్ హర్షించ తగ్గవే .

    Like

  15. I wonder how I wonder why…
    Yesterday you told me about the blue blue sky…
    And all that I can see is just a yellow lemon-tree…

    నా బాధ అర్థమయిందనుకుంటాను 🙂

    Like

  16. పూర్ణిమ గారు ఇంత బాగా రాస్తున్నారు..ఇంత ఓపిక ఎక్కడిదండీ ?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s