అక్షరానుభవాలు!

Posted by

అక్షరాలతో తొలి పరిచయం గోడ వేలాడదీసిన కాలెండర్లో తెలిసున్న వాటి పక్కనే అర్థంలేని అకారాలుగా! అక్షరమేంటో గుర్తుపట్టమన్న ప్రతీసారి పోల్చలేక, పోల్చీ చెప్పలేక తడబాటు! నల్లని పలక మీద తెల్లని బలపంతో అమ్మ గుప్పిట్లో దాగిపోయిన నా వేళ్ళు నెలపొడుపులా ఉన్న అక్షరాల్ని కాస్త నిండు పున్నమిగా చేసేయటం నా ప్రస్థానంలో మరో అడుగు. తప్పుగా రాసేసి అమ్మ తిడుతుందనే భయంతో ఎంగిలి పెట్టి వాటి తుడిపేయ్యడం. “పలక సరస్వతీ దేవి, అలా చెయ్యద్దని చెప్పానా?” అంటూ అమ్మ వేసే చిన్ని దెబ్బ! రాత్రి అయినా అలక తీరని నన్ను బొజ్జునే ముందు బుజ్జగించటానికి అచ్చమైన నల్లటి ఆకాశం మీద నక్షత్రాలను చూపిస్తూ అమ్మ చెప్పే కథలో అతిధి పాత్రలో అక్షరాలు రావాల్సిందే; “ఆఆఆ.. చుక్కనీ……ఈఈఈ చుక్కన్నీ ఇలా కలిపితే “అ” కదమ్మా!” అంటూ! సాన్నిహిత్యం ఎందాక వచ్చిందంటే పలకను తిరగేసి, కళ్ళు మూసేసుకుని చింతగింజలూ, చిన్ని రాళ్ళూ, గవ్వలూ, పల్లీలు అన్నీ అక్షరాలుగా మారిపోయాయి. అక్షరాలుగా పేర్చాక వాటి చుట్టూ ఎంత కాపలా కాసినా ఎప్పుడో చిట్టుక్కున చెరిగిపోతాయి. అక్షరాలు ఎందుకో ఊరికే చెరిగిపోతాయి మరి!

“బేబీ.. టెల్ మీ అ, బి, సి..” అని అడిగిందే తడువుగా ఏకరవు పెట్టి మరీ బళ్ళో చేరాను. అమ్మ నేర్పిన అక్షరాలే కొత్తగా పేద్ద పలక మీద టీచరు రాస్తుంటే చిన్ని పుస్తకంపై నేను రాసుకోవాలి. పెన్సిల్ తో రాస్తూ ఎంగలి కూడా అవసరం లేకుండా వత్తిడితో మాయమయ్యే అక్షరాలు, పోతూ పోతూ చేతికంటుకుపోతాయి. పేజీలు తిరగేసట్టప్పుడు మళ్ళీ పేజీల్లో దాక్కుండిపోతాయి. కానీ “నీట్”, “గుడ్” రావాలంటే ఇవేమీ చేయకూడదు కదా! ఒక్కో అక్షరం నుండి అక్షరం అక్షరం కూడుకుని చదువుకుంటూ అక్షరాల్లో మునిగి తేలి అక్షరాల్తో విడదీయరాని బంధం ఎప్పుడు ఏర్పడిందో! తెలుసున్న అక్షరాలే అయినా, రోజూ రాస్తున్నవే అయినా పెన్నులో ఇప్పుడు కొత్తగా ఉన్నాయి. నాన్న రాసే పెన్నులాంటిదే కావాలి.. ఇప్పుడు నాన్నా నేనూ ఒక్కటే మరి! బాల్ పెన్నుతో అక్షరాలు పొమ్మన్నా పోవు. బతిమిలాడుకున్నా పోవు.. జీవితంలో తప్పుల్లా అక్కడే ఉండి వెక్కిరిస్తాయి. కొన్ని చెరిపేయాలనుకున్నా చెరగవు అంతే!

ఆడపిల్ల అందం చీరలోనే అట- అమ్మ చెవిలో ఇల్లు కట్టి మరీ పోరుతుంది. అదేమో గానీ అక్షరాల అందం అంటే:  తెల్లని కాగితంపై నీలపు సిరా మనసునుండి కలంలోకి జాలువారి అక్షరాలుగా తెల్లని ఆకాశంలో నీలి నక్షత్రాలు. కామిలిన్ వాడి గొప్పో ఏమో తెలీదు కానీ మనసులో ఆలోచనలూ, కాగితం పై చేయీ, కలంలోంచి సీరా అలా సమాంతరంగా వెళ్తూ వెళ్తూ ఏదో క్షణాన సంగమించిన వేళ అరవిరిసిన చిర్నవ్వో – కరిగిన కన్నీరో ఎంత అనుభవం! జీవితపు కొలనులో కురిసిన అనుభూతల వర్షమే కదా.. ఈ అక్షర స్వాతి ముత్యాలు. అయితే ఆత్మీయ స్పర్శ లేకపోతే మనసైన అక్షరం – మనసును లాలించగలిగేవి ఈ రెండే! మార్కుల కోసమే మొదలయ్యినా విడదీయలేని ఈ అక్షరాలని నా స్నేహాలన్నింటికీ మూలం చేసేసి ఎన్నేసి ఉత్తరాలు? ఎన్నేసి రాయబారాలు? నాకోసమే ఎన్నెన్ని మైళ్ళు పోయిరాలేదు, కాగితాన్ని చుట్టుకుని! తడిచిపోయి- మాసిపోయి-పల్చనైపోయి-ముక్కువాసన కొట్టీ అయినా ఇప్పటికీ అలానే ఉండిపోలేదూ?

ఎలా అయినా అక్షరాలు మాయమయ్యిపోతూనే ఉంటాయనుకుంటుండగా కంప్యూటర్ వచ్చింది. అంజర్జాలంలో మొదట తెలుగు చూసిన వేళ – ఆనంద హేళ! ఇంకేం డిజిటల్ అక్షరాలు ఎప్పటికీ దాచేసుకోవచ్చు- ఎక్కడికీ పోవనుకుంటూ మర్చిపోయిన పాత ఫ్రెండుకి కొత్త పేరిచ్చి ఇక్కడ ఇలా! ఇప్పుడూ పోతాయి – ఒక క్రాష్, ఒక బ్రేక్ డౌన్ అంతా మళ్ళీ మాయం. అక్షరాలెప్పుడూ చెరిగిపోతాయెందుకు? అక్షరాలు అక్షయం కా(లే)వా? ఏమో.. దానికి నా దగ్గర సమాధానం లేదు కానీ అక్షరాలు తెచ్చే అనుభూతులు మాత్రం ఎప్పటికీ అక్షయమే! కేవలం అక్షరపునాది పైన ఎన్నెన్ని అనుబంధాల సౌధాలు నిలబడ్డాయో! అక్షరాల వెనుక మనస్సుని ఎన్నెని హృదయాలు చదువుతాయో! అక్షరాలతో నా స్నేహం ఇంకెన్ని కొంత పుంతలు తొక్కుతుందో.. కాలమే చెప్పాలి. అందాకా అక్షరాలు మీద ఆప్యాయత ఇలా వచ్చీ రానీ అక్షరాల్తో ప్రకటించుకోవడమే నేను చేయగలిగింది. ఇంకొన్ని అక్షరాలు అక్కరికి వస్తే బాగుణ్ణు కదూ!!

31 comments

  1. “నెలపొడుపులా ఉన్న అక్షరాల్ని కాస్త నిండు పున్నమిగా చేసేయటం “
    Beautiful thought.

    Like

  2. చెప్పడం మర్చిపోయాను. మన సంప్రదాయం ప్రకారం అక్షరం పొట్టలో ఉంటుందిట. అలా వచ్చినవే నిరక్షరకుక్షి, పొట్టపొడిస్తే అక్షరమ్ముక్క రాదు అనే తిట్లు. బవుశా అలా పొట్టలో ఉండే అక్షరాలు చెరిగి పోకుండా ఉంటాయేమో!

    Like

  3. >>జీవితపు కొలనులో కురిసిన అనుభూతల వర్షమే కదా.. ఈ అక్షర స్వాతి ముత్యాలు
    అక్షర సత్యాల్లాంటి మాటలు…

    Like

  4. అక్షరాల గురించి నువ్వు చెప్పింది కనుక ఆ అక్షరాలు వినగలిగితే అవి ఎంత మురిసిపోతాయో తెలుసా పూర్ణిమా? నువ్వు రాసేది వాటి గురించే అని తెలుసు కాబోలు. అందుకే అనుకుంటా ఎంత చక్కగా అమరిపోయాయో… 🙂

    అక్షరాలతోఓఓఓ నీ ఈఈఈ .. అనుభవం ఇలాఆఆఆనేఏఏఏ కొనసాగాలని కోరుకుంటున్నానూఊఊ…

    Like

  5. అక్షరం – క్షరము కానిది అంటే, నశించనిది. మీ ఊహలు అక్షరాల లానే ఉన్నాయండీ.

    Like

  6. ఎంత బాఉందో మీ పోస్ట్..
    చాలా నచ్చేసింది…అసలు..ఇంత బాగా ఎలా రాస్తారు..
    అమ్మ గుప్పిట్లో దాగిపోయిన నా వేళ్ళు నెలపొడుపులా ఉన్న అక్షరాల్ని కాస్త నిండు పున్నమిగా చేసేయటం..
    అదేమో గానీ అక్షరాల అందం అంటే: తెల్లని కాగితంపై నీలపు సిరా మనసునుండి కలంలోకి జాలువారి అక్షరాలుగా తెల్లని ఆకాశంలో నీలి నక్షత్రాలు.
    కామిలిన్ వాడి గొప్పో ఏమో తెలీదు కానీ మనసులో ఆలోచనలూ, కాగితం పై చేయీ, కలంలోంచి సీరా అలా సమాంతరంగా వెళ్తూ వెళ్తూ ఏదో క్షణాన సంగమించిన వేళ అరవిరిసిన చిర్నవ్వో – కరిగిన కన్నీరో ఎంత అనుభవం! జీవితపు కొలనులో కురిసిన అనుభూతల వర్షమే కదా.. ఈ అక్షర స్వాతి ముత్యాలు. అయితే ఆత్మీయ స్పర్శ లేకపోతే మనసైన అక్షరం – మనసును లాలించగలిగేవి ఈ రెండే!………
    చాలా చాలా బాఉంది..బా రాసారు..

    Like

  7. ఆశలకూ,ఆలోచనలకూ, అనుభవాలకూ అక్షరరూపం ఇస్తూఇస్తూ…ఇప్పుడు అక్షరాల్నే అనుభవాలుగా చేసుకున్నావు.

    ఒకరు ‘అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్ల’లంటే; నువ్వు మాత్రం, పలకపై దిద్దిన బీజాక్షరాలనుంచీ కీబోర్డుపై అద్దిన డిజిటాక్షరాలవరకూ చెప్పేసి “నేనే ఆ వెన్నెల్లో ఆడపిల్లని” అనేసావ్!

    నీ ఆలోచనలు బాగుంటాయి.నీఅనుభూతుల్ని పంచుకుంటూ, తర్కంతో కొలవలేని క్షణాల్ని మాకందిస్తావు.

    Like

  8. Beautiful toughts…
    ఈ పోస్ట్ చదువుతుంటే, ఒక చిన్ని పాప అమాయకమైన, ఇంతింతేసి కళ్ళేసుకొని, నేలపైన కూర్చొని పలక మీద అక్షరాలు రుద్దే సన్నివేశం నా కనుల ముందు మెదలాడింది. అది మీరు రాసిన విధానం వల్లే, ఇంత అందమైన ఊహని నా కనుల ముందు మెదిలేలా చేసినందుకు ధన్యవాదాలు.

    Like

  9. “అక్షరాలు తెచ్చే అనుభూతులు మాత్రం ఎప్పటికీ అక్షయమే !” ఏం చెప్పారు ! మీకు మాత్రమే సాధ్యం. మీ అక్షరాలు అద్భుతం

    Like

  10. ఆలోచనల అక్షరాల చాటున మనసైన అక్షరాలు, మనసెరిగిన అక్షరాలు. చాలా బావుంది. అందమైన అక్షరాలని అంతకన్నా అందమైన వూహాల్లో బంధించి అంతకంటే అందమైన వూసుల్లో చెప్పడం కేవలం మీకే సాధ్యమయ్యింది.

    “పలక సరస్వతీదేవి” అన్న ఈ వాక్యం చదవగానే మా అమ్మ గుర్తొచింది. అలా చేస్తే నన్ను కొడుతూ, తను మాత్రం అలానే ఎంగిలి పెట్టి తుడిచేది (అవును మరి వసారా లోంచి పెరట్లోకి వెళ్ళాలంటే కష్టం కదా మరి?). నేనేమో “అదేమిటి నువ్వు మాత్రం అలా తుడుస్తావు?” అని ప్రశ్నిస్తే, “ఇంతలేదు అప్పుడే ఎన్ని సందేహాలో దీనికీ!” అని మళ్లీ ఒక్కటిచ్చేది. దాంతో మనం సైలెంట్ అయి మన పని మనం చేసుకొనే వాళ్ళం.

    Like

  11. నేర్చుకున్న అక్షరాలకి న్యాయం చేశారు… Beautiful creation!!

    Like

  12. నిజంగానే అక్షరాలు ఎంత అద్బుతమైన అస్త్రాలు!అక్షరాలు లేని లోకాన్ని మనం ఊహించనైనా ఊహించగలమా,అంతా శూన్యమేగా!మీరన్నట్టు అక్షరాలు చెరిగిపొవచ్చు గాని,అవి అందించే అనుభూతులు మాత్రం నిస్సందేహంగా అక్షయాలే…అక్షరాల గురించి చాలా అందమైన భావాలు చెప్పారు.

    Like

  13. There is a reason why economists insist on literacy, because it reduces the cost of communication.

    మీరు అక్షరాలతో బాగానే ఆడుకుంటున్నారు 🙂 nice post!

    Like

  14. Lovely! To think that it was those letters that brought us together and to think that they still continue to unite us… A splendid thought Puri, absolutely delightful.

    Like

  15. చాలా బాగా రాసారు.. చక్కటి ఆలోచనలు.. ప్రతి మాటా అక్షర స్వాతి ముత్యాల సమాహారమే..

    Like

  16. చాలా బావుంది.. అక్షరాల గురుంచి అక్షరాలతోనే ఎంత అందగా చెప్పావో చెప్దామంటే నా డిజిటల్ అక్షరాలు నీ వర్ణనలకి సిగ్గుపడిపోయి నా కీబోర్డ్ దాటి బయటకి రానంటున్నాయి మరి..!

    Like

  17. మీ అక్షరానుభవాలతో మాకు అక్షరానుభూతిని కలిగించారు.
    అభినందనలతో….సీతారామరాజు

    Like

  18. అవును, అక్షరాలకి చాలా శక్తి ఉంది. కానీ కొంతమంది అక్షరాల్ని చెరిపేసి వాటి వెనకున్న అనుభూతుల, మనుషుల నోరు నొక్కేయవచ్చనుకుంటారు. మరికొంతమంది, ఇక ఈ అనుభూతులకు సమాధి కట్టేద్దామని అక్షరాలతోనే అందమైన epitaph లు రాసుకుంటుంటారు. నిజంగా పైన ఎవడన్నా ఉండుంటే, “పూర్ ఫెలోస్” అని నవ్వుకునేవాడు బహుశా.

    నా కామెంట్‌కీ ఈ పోస్టుకీ సంబంధం ఉందో లేదో తెలీదు. నాకు తోచింది రాస్తున్నాను. అసందర్భం అనుకుంటే కామెంట్ మోడరేషన్ ఉందిగా, అక్షరాల్ని ఆపేయవచ్చు కూడా.

    Like

  19. అక్షరాలతో అనుబంధం, నిజంగా ఎవరూ ఆలోంచించలేని ఊహ. ఊహలకే అక్షరాలు నేర్పెంత నేర్పరితనం మీది. అక్షరాలనే లక్షణంగా మీ ఊహాలోకంలోకి మీతో పాటు తీసికెళ్ళి నిండు పున్నమి ని చూపించిన వైనం నిజంగా ఎంత బాగుందంటే..మాటలు రావడం లేదు మరి. పదాలు వెతుక్కోవాలో, అక్షరాలు తడుముకోవాలో తెలియడం లేదు. అయినా తడుముకొన్నా, వెతుక్కొందామనుకొన్నా అక్షరాలు నా దగ్గిరెక్కడున్నాయి? మీతో మీరు చెప్పే ఊసుల కోసం అవన్నీ అటువైపు వచ్చేసాయిగా పరుగులు తీసి.

    Like

  20. అక్షరాల మీదున్న మమకారాన్ని చక్కగా ఎక్స్ ప్రెస్ చేసారు..

    Like

  21. బాబోయ్! ఏదో వ్రాస్తున్నారు అనుకున్నా కానీ ఇంత భావుకత ఇంత విద్వత్తు ఊహించలేకపొయాను… అక్షరాల గురించి ఎంత అందంగ వ్రాసారంటే అర్జెంటుగా ఒక అమ్మయి పుడితే అక్షర అని పెరు పెట్టెయ్యాలి అనిపించేంతలా వ్రాసారు… “అరవిరిసిన చిర్నవ్వో – కరిగిన కన్నీరో ఎంత అనుభవం! జీవితపు కొలనులో కురిసిన అనుభూతల వర్షమే కదా.. ఈ అక్షర స్వాతి ముత్యాలు” అని వ్రాయగలిగారు అంటె కేవలం ఊహలు ఊసులు కావు సుమండి… జీవితాన్ని కాచి వడపొసి చల్లార్చి పేరబెట్టి చిలికి వెన్న తీసి పాకం పెట్టి అబ్బో చాల చేసేసారు… ఒక చిన్న రిక్వెస్ట్ ఈ పోస్ట్ ఒక వేళ తెల్ల కాగితం పై నీలం సిరాతొ వ్రాసుంటే స్కాన్ చేసి upload చెయ్యండి…

    Like

  22. జీవితపు కొలనులో కురిసిన అనుభూతల వర్షమే కదా.. ఈ అక్షర స్వాతి ముత్యాలు entaa baagundo poornima

    ఊహలన్ని ఊసులే ఈ బ్లాగులో
    హాయి గొల్పు కబుర్లే మాటమాటలో
    కమ్మనీ ఈ బ్లాగు రాసింది పూర్ణిమే

    Like

  23. సున్నితమైన భావాల్ని ఇంత అందంగా చెప్పడం మీకే చెల్లింది. అన్నింటికీ కామెంట్స్ చెయ్యను గాని, మీ టపాలను చాలాసార్లు చదువుతూ ఉంటాను. చలికాలం పొద్దున్న ఎండకాస్తూ కాఫీ తాగుతున్నట్లుగా.. మీ బ్లాగు చదవడం కూడా ఒక అందమైన అనుభవం. థాంక్యూ.

    Like

Leave a comment