Affectionately dedicated to HP Compaq 6720s

కొన్న కొన్ని తెలుగు పుస్తకాలు

నిన్న విశాలాంధ్ర వారేదేదో పుస్తక ప్రదర్శన పెట్టారనగానే షరా మామూలుగా దాడి చేశాను. నేను ఏ తెలుగు పుస్తకాలు (ఆ మాటకొస్తే ఈ మధ్యన చదువుతున్న చాలా పుస్తకాలు) బ్లాగర్ల సిఫార్సులే! అందుకే చెప్పిన వారికి ధన్యవాదాలు చెప్తూ తెలుసుకోగోరే వారితో పంచుకున్నట్టూ ఉంటుందని ఇక్కడ ఇలా ఓ టపా పెడుతున్నాను.

ఇప్పుడే మువ్వల సవ్వడి చూసొస్తున్నా.. అప్పుడప్పుడూ చూస్తాను. మనం సాధారణంగా ఆడుకునే “dumb charades” ఆటలాంటి ఒక రౌండుందిలో! ఒకరు అభినయిస్తూ ఉంటే మరొకరు ఆ పదాలను గుర్తుపట్టి, ఆ వాక్యం పూర్తి చేయాలి. ఒక అమ్మాయి “లంబోదర.. అంబాసుత” అభినయించి. అవతలి అమ్మాయి బాగానే గుర్తు పట్టింది కానీ, “బొజ్జ గణపయ్య, బొజ్జ గణపయ్య” తప్పించి చెప్పలేకపోయింది. ఆ అమ్మాయి అభినయించాల్సిన వంతు వచ్చేసరికి “తెలుగు చదవటం వచ్చునా?” అని అడిగేశారు ప్రభగారు. నిజంగానే తెలుగులో మాటలు కష్టమయ్యిపోతున్నాయి.

తెలుగులో మాట్లాడేటప్పుడు హాయిగా, వచ్చిన ఆంగ్లపదాలకు తెలుగుతో దోస్తీ చేయించేసి గట్టెక్కేస్తాము. అక్కడో తెలుగు పదం ఆలోచించాలనిపించదు. (కనీసం నాకు) ఇంకొన్ని సార్లు వచ్చిన తెలుగుపదాలు అంతా వాడేస్తున్నారు కదా అని నేనూ వాడేయడమే! తెలుగు భాషపై పట్టు సాధించడానికి కొన్ని పుస్తకాలు:

 • ఆధునిక వ్యవహార కోశం బూదరాజు రాధాకృష్ణ: వాడుకంలో మనం ఉపయోగించే అనాకానేకమైన ఆంగ్ల పదాలకి తెలుగులో సమానాంతర పదాలున్నాయి. నూట యాభై రూపాయల ఈ పుస్తకాన్ని కొని పెట్టుకుంటే చాలా అక్కరకు వస్తుంది.
 • వీరిదే తెలుగు జాతీయాల పుస్తకం కూడా, ఏ ఏ జాతీయాలు ఎందుకు ఎలా ఏర్పడ్డాయి, ఏ అర్థంలో ఎప్పుడు వాడుకోవాలనుంటాయి. సుమారు రెండొందల పేజీల్లో చాలా జాతీయాలను విశీదికరించారు. అంతర్జాలంలో తెలుగు జాతీయాలు నిధి మాత్రం ఈనాడే!
 • వ్యావహారిక భాషావికాసం కూడా వీరిదే. మాసిపోయి దుమ్ముపట్టేసిన ఈ పుస్తకంలో కొన్ని వ్యాసాలున్నాయి, చదివితే గానీ చెప్పలేను వాటి గురించి.
 • మాటలూ-మార్పులూలో మాటల అర్థాలేమిటి, అవెందుకు మార్పుచెందాయి అని వివరించారు.

అసలు, బూదరాజుగారి ఏ పుస్తకమైనా వదిలిపెట్టకుండా కొనాలనుకున్నాను. చాలా విని ఉన్నాను. చదువరిగారి అప్పుడో పుస్తకాన్ని పరిచయం చేసిన గుర్తు, అక్కడే తొలి పరిచయం!

అనుకోకుండా శ్రీపాద గారు తగిలారు. శుక్రవారం పూటే ఫోన్ చేసి అడిగితే, శ్రీపాద వారివి కొత్త ప్రింట్లేమీ రాలేదన్నారు. పూర్తిగా ఆశ వదులుకుని వెళ్ళాను గానీ, నా దగ్గర లేని “పుల్లంపేట జరీ చీర” అనే కథల సంకలనం, “విషభుజంగము“, “రక్షాబంధనం” నవలలున్న పుస్తకం కనిపించాయి. ఇంకా మిగితావి ఎక్కడ ఎప్పటికి దొరికేనో! “అనుభవాలు-జ్ఞాపకాలు” ఇంకా రెండు నెలల తర్వాత వస్తుందట!

“శ్రీపాద ఎవరు?”, “ఎందుకు చదవాలి?”, “అంత బాగా రాస్తారా?” అన్న ప్రశ్నలు ఆయన ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ఎదురవుతున్నాయి. నేనింకా ఆ తేనెని నాలుక కొస మీద పెట్టుకున్నానంతే, అందుకే “తప్పక చదవాల్సినవి” అని తప్పించి ఇంకేమీ చెప్పలేను. ఎందుకు తప్పదో, పెద్దలు ఎవరైనా వివరిస్తే బాగుంటుంది. పరిచయం చేస్తే, కలవడం సులువనిపిస్తుంది!

రవిగారు చెప్పినా కూడా ఏదో ఆశతో తిరుమల రామచంద్ర గారి రచనల గురించి అడిగాను. “హంపీ నుండి హరప్ప దాకా” తప్పించి, మరేమీ దొరకలేదు. దొరకవని మూలెక్కడో అనిపిస్తున్నా, కాస్త నిరుత్సాహపడ్డాను.

శ్రీరమణ గారి పేరడీలు కొన్నాను, కాస్త చదివాను కూడా! నేనిప్పటికే చదివున్నవారి పేరడీలు మనసుకి తగిలాయి (striking)! అలానే “రంగుల రాట్నం” కూడా తీసుకున్నాను. దీని టాగ్‍లైన్ “చమత్కారాలు-మిరియాలు-అల్లం బెల్లం-మురబ్బాలు” అని చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంకా వీరి రచనల పేర్లు చెప్పగలరు, తెలిసినవారు.

మిరియాలంటే, మల్లాది రామకృష్ణశాస్త్రిగారి “చలవ మిరియాలు” గుర్తొచ్చాయి. కొన్ని వ్యాసాల సంకలనం ఇది. కొనేటప్పుడు శ్రీపాద, చలం గురించి ఉందనగానే మారు ఆలోచనలేకుండా కొన్నాను పోయిన సారి. కొన్ని చదివటం జరిగింది. శ్రీపాద గురించి వారి మాటల్లో, “చదువరులకు చదువు చెప్పగలిగినది ఆయన రచన – విద్యాబుద్ధులున్న అహంకారులకు కనువిప్పు చేసినది ఆయన వచనము! తీయందనపు-తీయందనము చవులిచ్చిదాయన శైలి”. ఈ మధ్య కాలంలో నేను చదువుతున్న తెలుగుని తెలుగంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏమిటా అని అనుమానం వస్తుంది. మల్లాదివారి “నవలలు-నాటికలు” కొన్నాను.

అమరావతి కథలు చెప్పారు కదా అని కొనేశాను, ఏముంటుందందులో అని కూడా చూడకుండా. ఇందాకే చూశాను, చిట్టి చిట్టి కథలున్నాయి. ఎంత చిట్టిగా అంటే పొద్దున లేచి ఆఫీసుకి తయారయ్యే హడావిడిలో ఓ ఐదు-పది నిముషాలు కేటాయిస్తే అయ్యిపోయేంత. ప్రింట్ సూపర్. పైగా బాపూ బొమ్మలూ.పక్కకు పెట్టాలనిపించటం లేదు.

బేతవోలు రామబ్రహ్మం గారి “పద్యారామం” కూడా కొనేశాను. “ఏంటి పద్యాలే!” అని సక్కిలించనక్కరలేదు, పద్యాలు రాకపోతే ఏముందిలే అనుకున్నాను గానీ, అమ్మో.. సౌరవ్ ని ఎట్టా మిస్స్ అయ్యేది? రాహుల్, సచిన్ క్యూలో ఉన్నారాయే! అందుకే.. ఇక నేర్చుకోవాల్సిందే! ఈ పుస్తకం పద్యాలు నేర్చుకోడానికే కాక, ఆస్వాదిండానికీ కూడా ఉపయుక్తంగా ఉంటుందని తెలిసింది. పద్యాలకై కొనాలనుకున్న చాలా పుస్తకాల దొరకనే లేదు, ఇది తప్పించి.

ఆరుద్రగారి “గేయాలు-గాయాలు” తప్పించి నా దగ్గర ఏమీ లేవు. ఈ సారి కొన్న పుస్తకాలు “రాముడికి సీత ఏమవుతుంది?” – అదో వెర్రి ప్రశ్న అనుకుంటారు గానీ, దానిలో చాలా విషయం ఉందనీ, దానిపైనే ఈ వ్యాసాలన్నీ అట. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం కూడా కొనేశాను, ఇప్పుడే చదివే ఉద్దేశ్యం లేకపోయినా. మన “complete references – java / C/ whatever” ఉన్నంత పరిణామంలో ఉన్న ఈ పుస్తకాల వెల మాత్రం రూ.250 మాత్రమే! చెప్పేది సమగ్రమైన చరిత్రైనా, చదివిన ఒకట్రెండు పెజీల్లోని తెలుగు ప్రలోభపెట్టింది. (tempt చేసింది, ఆధునిక వ్యవహార కోశం సంప్రదించటం (refer) ఇదప్పుడే పదోసారి)

ముణిమాణిక్యం కాంతం కథలూ దొరికాయి. ఇది కాస్త పెద్దగా ఉండే ఏ అరచేతిలోనైనా ఇమిడిపోగలంత చిన్ని పుస్తకం, చాలా తక్కువ పేజీలు కూడా ఉన్నాయి. చిన్ని హాండ్ బాగులో పెట్టేసుకుని, ఏ దారిలోనే చదువుకోవచ్చు. అలానే చలం గీతాంజలి, ఆరుద్ర కూనలమ్మ పదాలు కూడా. (అంతర్జాలంలో కొన్ని పదాలు ఇక్కడ ) ఏదీ యాభై రూపాయలకు మించదు.

ముళ్ళపూడి వెంకటరమణ గారి “కదంబ రమణీయం” తీసుకున్నాను. నిన్నంతా దాన్నేసుకుని నవ్వుతూ కూర్చుని ఈ టపా రాయటం ఆలస్యం చేశాను. వెనుకా ముందూ ఆలోచించకుండా “సాహితీ సర్వస్వం”లోని అన్ని భాగాలూ కొనిపెట్టేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆయన రచనలు మనం చదవక్కరలేదు, ఆయనే చదివించుకుంటారు. నిజం!

పుస్తకాలన్నీ అరలో సర్దుకున్నాక, అందరి కన్నా ఎత్తుగా, అందరికీ ఆధారమల్లే నిల్చున్న పుస్తకం “మా సలపూడి కథలు”, వంశీది. గోదావరి యాసకి ఓ జిందాబాద్ కొట్టి ఇటొచ్చానో లేదో నాకీ పుస్తకంతో పరిచయం అయ్యింది. రెండొందల యాభై రూపాయల ఈ పుస్తకం హార్డ్ బౌండ్ చేయబడుంది. పుస్తకంలో కథలూ – కథల్లో గోదావరి యాసా ఏమో గానీ, ఈ పుస్తకానికి ప్రధాన ఆకర్షణ మాత్రం బాపూ బొమ్మలే. ఇవి కూడా ఎక్కువ ప్రతులు లేనట్టున్నాయి, ఎక్కడో మూలనపడేసి అవశాన దశలో ఉన్న ఒక కాపీ ఇచ్చారు. చిన్నప్పుడు కొన్ని పుస్తకాల్లో కేవలం బొమ్మలకోసం తిరగేసేవాళ్ళం కదా ఒక ముక్కా చదవకుండా, ఈ పుస్తకం అలానే ఉంది. కథలు చదవాలంటే బాపు బొమ్మలమీద యావ తగ్గించుకోవాలి.

అసలు ఈ పుస్తకమే కాదు, ప్రతీ పుస్తకంలోనూ బాపూ హవా అలానే ఉంది. ఈ సారి ఎక్కువగా కథల పుస్తకాలు తీసుకోవడం కూడా కారణమేమో! “భారతంలో చిన్ని నీతి కథలు” – ప్రయాగ రామకృష్ణ గారిదొకటి తీసుకున్నాం! మా చెల్లి తనకు తాను ఓ తెలుగు పుస్తకం కాసేపు చదివి ఎన్నుకున్న పుస్తకంగా దీనికో కొత్త రికార్డు వచ్చేసింది. హమ్మ్.. చూడాలి చదువుతుందో లేదో!

ఇవ్వన్నీ ఎప్పటికి చదవటమయ్యేనో అని ఓ పక్క ఉన్నా, మన ఇంట్లో ఉన్న వీరితో సాన్నిహిత్యం త్వరగానే పెరిగుతుందనే ఆశ. “ఇంతటి మహానుభావుల్ని ఊరికే వదిలేయడం సాధ్యపడుతుందా!” అని నమ్మకం, వారి మీదా, నా మీదా! 🙂

సినిమాలకై నవతరంగం ఉన్నట్టు, పుస్తకాల కోసం కూడా ఒకటేదైనా ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది. తెలుగు పుస్తకాలపై వచ్చిన టపాలన్నీ ఓ చోటుంటే “ఎవరే పుస్తకం గురించి రాసారు” అని గుర్తుపెట్టుకోనక్కరలేదు. ఆయా బ్లాగులకెళ్ళి వెత్తక్కకరలేదు. ఇప్పుడిప్పుడే తెలుగు సాహిత్యాన్ని తెలుసుకోవాలనే వారికి అనుకూలంగా ఉంటుంది. A one stop for all posts written about books! ఏమంటారు?

ఏది ఏమైనా బ్లాగులు రాయడం మొదలెట్టి ఉండకపోతే, నేను చాలా అజ్ఞాతంలో బతికేసేదాన్ని. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు!

46 Responses to “కొన్న కొన్ని తెలుగు పుస్తకాలు”

 1. భస్మాసుర

  “A one stop for all posts written about books! ఏమంటారు?”

  Good idea.

  Whomsoever It concern
  If ever that thing materializes, make sure that those who review books are qualified and grounded in reality.

  The self proclaimed intellects, psuedo secular retards, religious fanatics, western educated loonies are extremely harmful!

  Like

  Reply
 2. teresa

  This is a wonderful Investment 🙂
  అమరావతి కథలు చాలా బాగుంటాయి, అవి చదివిన వెంటనే మాత్రం పసలపూడి కథలు చదివే ప్రయత్నం చెయ్యొద్దని నా హెచ్చరిక. pasalapooDi really pales in comparison to Amaravathi. (you can not help but but draw a comparison)
  Happy reading 🙂

  Like

  Reply
 3. కత్తి మహేష్ కుమార్

  తెలుగు పుస్తకాల గురించి లేదా పుస్తకాల గురించి ఒక బ్లాగుండటం మంచి ఆలోచన.మీరే మొదలెట్టొచ్చేమో చూడండి. మీ వెనకాల మేము నడవడానికి రెడీ!

  Like

  Reply
 4. gaddeswarup

  Soon ‘Adhunika Vyavahara Kosam’ may be available on the internet; that is what I heard from the publisher. Perhaps, it can be supplemented by collections from those in the blogosphere.

  Like

  Reply
 5. Purnima

  భస్మాసుర:

  >>make sure that those who review books are qualified

  Hmm.. we do have eemaata which makes sure of quality reviews by literary giants.

  All I'm suggesting here is any post with no major qualification about any book, should be at place.
  Eg" A post that includes novel name as the title and a quote the text as it is from the book and nothing else. I feel this is also useful at times.

  I understand that a good book shouldn't be presented in bad light, just because we didn't like it.

  Btw, what did u mean by "qualified"?

  Like

  Reply
 6. ఫణీంద్ర

  చాలా రిచ్ లిస్టు పూర్ణిమా!

  అమరావతి కథల విషయంలో తెరెసా గారి మాట ఒప్పుకుంటాను. వాటి ముందు పసలపూడి కథలు ఓ మూలకు రావు. అమరావతి కథల్లో ఉన్నదేదో వాటిలో లేదు. ఎందుకో నాకు ఎక్కలేదు. కాని బాపు బొమ్మల వల్లనైనా డబ్బులు కిట్టేస్తాయి.

  ఆ పుల్లంపేట జరీ చీర పుస్తకం నా దగ్గరా ఉంది. నాకు చాలా నచ్చింది. నీకూ నచ్చుతుందనుకుంటున్నాను. శ్రీపాద “అనుభవాలు-జ్ఞాపకాలు” వస్తే మాత్రం, దయచేసి, నాకో మెయిల్ కొట్టటం మర్చిపోకు.

  నువ్వు కొన్న ఆరుద్ర పుస్తకం “సమగ్రాంధ్ర చరిత్రా”? “సమగ్రాంధ్ర సాహిత్యమా”?

  ఇంతకీ ప్రదర్శన ఎక్కడ?

  Like

  Reply
 7. laxmi

  మంచి కలెక్షన్ పూర్ణిమగారు. కాంతం కథలతో పాటు కాంతం కాపురం కూడా చూడండి బాగుంటుంది. ముళ్ళపూడి వారి “కదంబ రమ్ణీయం” తో పాటు “గుత్తొంకాయ కూర, మానవ సంబంధాలు” కూడా బాగుంటుంది. “కథా రమణీయం” కూడా మంచి కలెక్షన్.

  “Happy Reading”

  Like

  Reply
 8. భస్మాసుర

  One doesn’t need to be a neurotic to treat neurosis. But if you are suffering from flu, you don’t go to a religious leader, but to a qualified physician.

  People reviewing the books they read and publishing in their blogs is a good thing, they are free to do so. There are people out there who masquerade their commonsense wisdom to producing knowledge, which is useless.

  who is qualified then? anyone/everyone/whoever feels like reviewing, as long as they don’t mindlessly invoke slogans of the mainstream media to address issues and pose as if they produce knowledge.

  Like

  Reply
 9. Dreamer

  తెరెసాగారు, నేను పసలపూడి కథలు చదివి, తర్వాత అమరావతి కధలు చదివాను, I didn’t even felt the slightest “stroke” of comparision between them.

  వంశీ మీద అభిమానం కానివ్వండి, గోదావరియాసంటే ఇష్టం కానివ్వండి, అమరావతి కథలకంటే నాకు పసలపూడి కథలే నచ్చాయి. May be the undercurrent darkness in every story in the latter is also a reason.

  Like

  Reply
 10. చైతన్య క్రిష్ణ పాటూరు

  మంచి కలెక్షన్ సంపాదించారు. నేను కూడా తెరెసాగారు అభిప్రాయంతో ఏకీభవిస్తాను. అమరావతి కథలతో పోలిస్తే పసలపూడి కథలు అంత గొప్పగా అనిపించలేదు నాకు. అమరావతి కథలు కొన్ని చిన్నవైనా చాలా లోతైన అనుభూతిని ఇస్తాయి. పేరు గుర్తులేదు కానీ వర్షం గురించిన కథ ఒకటి ఉంటుంది. కథంతా వర్షం తప్ప ఇంకేం విషయం ఉండదు. అయినా గొప్ప అనుభూతిని ఇస్తుంది. పసలపూడి కథల్లో వంశీ మార్కు ఉంటుందిగానీ ఈ రకమైన లోతు కొంచం తక్కువనిపించింది. కానీ ఫణీంద్ర గారన్నట్టు బాపు బొమ్మల కోసమైనా కొనదగ్గ పుస్తకం. కొన్ని కథల్లోనైతే, బొమ్మే కథంతా చెప్పేస్తుంది.

  Like

  Reply
 11. శ్రీవిద్య

  నాకిన్నాళ్ళు తెలుగంటే ఇష్టం అంతే. కానీ తెలుగంటే ప్రేమ, విపరీతమైన దాహం మొదలయ్యింది మాత్రం ఈ మధ్యనే. ముఖ్యంగా తెలుగు పుస్తకాలని పరిచయం చేస్తూ నువ్వు రాసే టపాల మూలంగా… థాంక్స్ పూర్ణిమా.

  Like

  Reply
 12. Afroz

  Have u read sri ramana’s “Mithunam”??
  its collection of his short stories.

  I loved the book,especially the title story…

  Like

  Reply
 13. కత్తి మహేష్ కుమార్

  @భస్మాసుర:పుస్తకసమీక్ష రాయాలంటే కావలసింది ideology కాదు. ఆ పుస్తకం నచ్చడం.ఆపుస్తకాన్ని ప్రేమించడం.అభిమానించడం. లేదా,మనస్ఫూర్తిగా ఆ పుస్తకం నచ్చకపొవడం.ఇప్పటివరకూ పూర్ణిమ చేస్తున్నది అదే.

  పాఠకులను మించి పుస్తకాన్ని జడ్జిచేసావారుంటారా? qualified విమర్శకుల పేరుతో, ఈ మధ్య డాక్టర్ కేశవరెడ్డి గారి నవల “మునెమ్మ” పై జరిగిన విశృంఖలత్వం మీకు తెలియనిది కాదనుకుంటాను.

  నవతరంగంలో సినిమాల గురించి అదే జరుగుతుంది. ఒకే సినిమా గురించి వంద అభిప్రాయాలు అక్కడ పంచుకోవచ్చు. అందరికీ ఆ హక్కుంది.అందరు పాఠకులకూ,ప్రేక్షకులకూ అదే పుస్తకం/సినిమా అదే స్థాయిలో నచ్చాలనీ లేదు. అభిమానించాలనీ లేదు.

  ఇక మీరు చెప్పిన “proclaimed intellects, psuedo secular retards, religious fanatics, western educated loonies” లకు కూడా ఇందులో వివక్ష లేదు. They are neither lessor humans nor lessor readers.

  Like

  Reply
 14. కొత్త పాళీ

  Good Show, Purnima. Happy reading. Don’t forget to keep blogging about every book you finish .. or even before you finish..

  @ భస్మాసుర ..”western educated loonies”? Doesn’t that include all of us?

  Like

  Reply
 15. బొల్లోజు బాబా

  అమరావతి కధలు బాగుంటాయి. కధనం గొప్పగా ఉంటుంది.

  కానీ పసలపూడి కధలు ఒక లాండ్ స్కేప్ పైంటింగ్ లా ఉంటాయి.
  ఒక మాండలీకాన్ని పట్టుకొని దానికొక కావ్యత్వాన్ని కల్పిస్తాడు వంశీ.

  మానవసంబంధాల లోని సటిలిటీస్ ని బాగా పట్టుకొంటాడు వంశీ.

  పసలపూడికధలలో కూడా ఒకటి రెండు నాకు నచ్చలేదు. చప్పగా అనిపించాయి.

  సమాజంలో ఎదో ఒకవర్గం తరపున చెప్పినట్టుండకుండా, అన్ని పొరలలోని వ్యక్తులగురించి పసలపూడి కధలు పరిమళిస్తూంటాయి.

  రెంటిలో దేని ఫ్లేఫర్ దానిదే.

  మీ పోస్టు బాగుంది.

  Like

  Reply
 16. సుజాత

  Motorolan,
  పసలపూడి కథల్లో కథంతా నెరేటర్ ద్వారానే నడుస్తుంది. డైలాగులు అంత గా ఉండవు. ఉన్నా అవి అచ్చమైన గోదావరి యాసను పెద్దగా ప్రతిబింబించేంతగా ఉండవు.

  పసలపూడి కథలు ముందు చదివినా, అమరావతి కథలు ముందు చదివినా రెంటినీ పోలిస్తే మాత్రం నా వోటూ అమరావతి కథలకే! కథలు prolonged గా ఉండవు. మహా అయితే ఒకటిన్నర పేజీ! ప్రతి కథలో జీవితం తాలూకు చేదు, తీపి కల్సి ఉంటాయి. ఈ కథల్ని నేటివిటీ చెడకుండా శ్యాం బెనెగల్ “అమరావతి కి కథాయే” పేరుతో దూరదర్శన్ తెరకెక్కించిన తర్వాత అమరావతి కథలు బోలెడంత మంది కొని చదివారట.

  Like

  Reply
 17. నిషిగంధ

  ప్చ్!! మళ్ళీ ఇంకోసారి మనస్ఫూర్తిగా బాధపడుతున్నా, మా ఇల్లు మీ ఇంటి పక్కన లేదేంటా అని!! 🙂 నైస్ కలెక్షన్!

  hmmm.. పసలపూడి కధలు అమరావతి కధలంత ప్రభావాన్ని మిగల్చకపోయినా ఒక విషయం మాత్రం నాకు నచ్చింది.. గోదావరి జిల్లాల వారి అలవాట్లు, వ్యవహారాల గురించి చాలా బాగా తెలుస్తుంది.. అదీ కాక ఈ రెండు పుస్తకాలు వేరు వేరు ప్రాంతాల గురించి కాబట్టి తేడాలు కూడా అంతే బాగా తెలుస్తాయి..

  Like

  Reply
 18. భస్మాసుర

  @ Purnima- I am not against your idea. I support it. When rightly executed, it will be of great use. I, for one, think that you do a great job of reviewing the books you’ve read.

  @Kathi – This being Purnima’s blog and her thread, out of respect for her, I choose not to reply you. However, I am sure time will present many opportunities at which point we will discuss about it in detail 🙂

  Like

  Reply
 19. భస్మాసుర

  @కొత్త పాళీ గారు,

  sorry for being ambiguous. Western education in itself doesn’t entail one is a loony. Accepting theories at the face value just because they happen to come from west is what makes one a lunatic.

  Like

  Reply
 20. Dreamer

  May be Marshal’s law of marginal utility ruined my stint with “Amaravathi kathalu” 😛

  Like

  Reply
 21. Purnima

  భస్మాసుర: పుస్తకాల మీద ఆసక్తి లేక చదవనివాళ్ళుంటే ఫర్వాలేదు. కానీ పుస్తకాల మీద మక్కువ ఉండి కూడా సమాచారం లేక, దూరంగా ఉండేవారికి ఏదైనా ఒక చోటుంటే బాగుంటుందని అర్థం. ఏడాది క్రితం సౌమ్య, ఫణీంద్ర, కొ.పా మరికొందరి బ్లాగుల్లో పుస్తకాల టపాలు చదివే నేను మొదలెట్టాను.

  ఇప్పుడు రాసేవారి సంఖ్య ఎక్కువైనందున, ఫలానా అంటూ ఒక చోటు ఉంటే బాగుంటుందని. అటువంటిదంటూ ఉంటే మాత్రం, దాని నిర్వహణలో చాలా సాధకబాధకాలుంటాయన్నది నిర్వివిదాంశం! 🙂

  మీ ప్రోత్సాహానికి నెనర్లు!

  తెరిసా గారు: కదూ.. అమ్మకి చూపించాలి మీ కమ్మెంట్! :-)(wonderful Investment)
  ఈ కథల పుస్తకాలు నేను సాధారణంగా అప్పుడొకటి అప్పుడొకటి చదువుకుంటాను. నవలలైతే ఎటూ తప్పదు కదా అని. మీ సూచన పాటిస్తాను.

  మహేశ్ గారు:చూస్తున్నా..

  స్వరూప్ గారు: చాలా మంచి సమాచారం తెలియజేసారు. నెనర్లు! ఈ పుస్తకం అంతర్జాలంలో ఉంటే చాలా మందికి ఉపయోగకరం.

  ఫణీ: థాంక్స్! అనుకున్నంత బాలేని ఈ ప్రదర్శన కోఠీలో గాంధీ జ్ఞాన్ మందిర్‍లో జరిగింది.

  Like

  Reply
 22. krishna rao jallipalli

  మీ లైబ్రరీ కి చాలా మంచి పుస్తకాలు చేరాయి. మీరు కొన్నవి అన్నీ తెలుగు పుస్తకాలు… వచ్చిన కామెంట్స్ మాత్రం ఇంగ్లీషులో.(కొన్ని).. ఏమిటో …

  Like

  Reply
 23. Purnima

  లక్ష్మి గారు: నెనర్లు! కథా రమణీయం ఉందండీ నా దగ్గర. తక్కినవి కొనాలి. గుత్తొంకాయ.. పుస్తకం నే పట్టెక్కిళ్ళిన జాబితాలో ఉంది. కానీ దొరకలేదక్కడ.

  మంచి పుస్తకాలు సూచించినందుకు నెనర్లు.

  చైత్యన కృష్ణగారు: పొద్దున్నే అమరావతి పుస్తకంలో కథ చదివాను. మొదటి కథ వరద గురించి, అది చదివి ఏం ఆశించచ్చో అర్థమయ్యిపోయింది. 🙂 మీ వ్యాఖ్యకి నెనర్లు.

  శ్రీవిద్య: 🙂

  అఫ్రోజ్: మిథునం కథలు దొరకలేదండీ, ఈ సారి వెతకాలి.

  Like

  Reply
 24. Purnima

  కొత్తపాళీ గారు: అలా ప్రతీ పుస్తకానికి రాయడం కుదరకపోవచ్చును అనే, ఇలా ముందే టపా పెట్టేశాను. ప్రయత్నిస్తాను. నెనర్లు!

  Motorolan: ఏ పుస్తకం అందం దానిదే! దీన్ని చదివేశాక నా అభిప్రాయం చెప్తాను.

  సీనూ గారు, బాబా గారు: నెనర్లు

  నిషీ: వచ్చేయ్ మరి! 🙂

  Like

  Reply
 25. ప్రవీణ్ గార్లపాటి

  బాగుంది. ఎన్ని పుస్తకాలో!
  పుస్తకాలు విరివిగా చదివే మీ లాంటి వాళ్ళు కలిసి తప్పకుండా బ్లాగు మొదలుపెట్టండి.

  Like

  Reply
 26. రాధిక

  అమరావతి కధలు నేను చదవలేదు.కాబట్టి నాకు దానిలోని గొప్పతనం తెలియదు.కానీ పసలపూడి కధలు చాలా సార్లు చదివాను.మా గోదావరి యాస వల్ల,అందుఓ చెప్పే ఊర్లు,ప్రదేశాలు బాగా తెలియడం వల్ల అనుకుంటాను నాకు తెగ నచ్చేసాయి.”మానవసంబంధాల లోని సటిలిటీస్ ని బాగా పట్టుకొంటాడు వంశీ” అన్న బాబాగారి మాట ఒప్పుకుతీరాలి.
  మీ సమీక్షలు చదవాలంటే నాకు అందుకే భయం.ఇన్ని పుస్తకాలు బాగున్నాయంటూ చెపితే నా బాధ తన్నుకుని వచ్చేస్తుంది.నీ లిస్ట్లో కొన్నే నేను చదివాను.

  Like

  Reply
 27. వేణూ శ్రీకాంత్

  చాలా మంచి కలక్షన్ పూర్ణిమా… ప్రతీ పుస్తకానికి రివ్యూ కుదరదు అంటే నాకు కుదరదు 🙂 అన్నిటికి చిన్ని రివ్యూ అయినా రాయడానికి ప్రయత్నించు. నీ సమీక్షలు బాగుంటాయి పుస్తకం నేను చదివినా నీ view point తెలుసుకోడం అసక్తి కరం గా ఉంటుంది…..

  పసలపూడి కధలు అమరావతి కధలు రెండు ఒక ఊరికి సంభందించిన చిన్న చిన్న కధలు అని తప్ప వేరే సారూప్యత నాకు ఏక్కడా కనపడలేదు. పసలపూడి కధలలో కధనం ఆసక్తికరం గానే సాగుతుంది కానీ కొంత Darkness ఉంటుంది చాలా కధల లో… నాకు అమరావతి కధలే బాగా నచ్చాయి…

  అప్పట్లో అమరావతి కధలు మొదట చదివిన తర్వాత అవి బాగా నచ్చి ఇలాంటి చిన్న చిన్న కధ ల పుస్తకాలు అన్నీ వరసగా కొని చదివేసాను కాని అన్నిటికన్నా అమరావతి కధలే బాగా నచ్చాయి.. నేను చదివినవి.
  వంశీ పసలపూడి కధలు (బాపు గారి బొమ్మలు వంశీ కధనం, గోదావరి యాస వెరసి అద్భుతం),
  దర్గామిట్ట కధలు (నెల్లూరు ముస్లిం యాసతో సాగే ఈ కధలు ముస్లిం జీవన విధానాన్ని దగ్గరగా చూపిస్తూ అసక్తికరం గా సాగుతాయి),
  పోలెరమ్మ బండ కధలు (ఇవి దర్గామిట్ట కధలకి continuation బాగానే ఉంటాయి),
  భనుమతి గారి అత్తగారి కధలు (ఇవి కొంచెం పెద్ద కధలు నాకు అక్కడక్కడా బోర్ కొట్టింది)

  Like

  Reply
 28. గీతాచార్య

  కొంత కాలం క్రితం వరకూ నేనే పుస్తకాల పిచ్చోడిని అనుకునే వాడిని. బ్లాగటం మొదలైన తర్వాత ఫర్లేదు ఇంకా పుస్తకాక్షులున్నారని సంతోషం కలిగింది. మంచి కలక్షనే చేశారు.

  One stop for books? Yeah. It’s a nice idea.

  Read…?

  Like

  Reply
 29. Purnima

  కృష్ణారావు గారు: నెనర్లు!

  ప్రవీణ్ గారు: నెనర్లు! చూడాలి పుస్తకాల సైటు విషయం

  రాధిక గారు: ఇప్పటికే కొన్ని చదివేసి, నాకన్నా మీరే ముందున్నారు గదేంటి? ఇంకేటి మరి? 🙂
  పుస్తకాల పేర్లు, వాటి గురించి కాసిన్ని వివరాలు తెలిసుకుంటే ఎప్పటికైనా పనికొస్తాయని నా నమ్మకం. అంతా సిఫార్సు చేసే పుస్తకాలే కొంటున్నాను కావున, మరీ విసిగించే పుస్తకాలు దొరక్కపోవచ్చు!

  వేణూ: మంచి లిస్ట్ ని పంచుకున్నందుకు నెనర్లు! చదవడమంటూ జరిగితే, రాయడానికి ప్రయత్నిస్తాను.

  గీతాచార్య గారు: బ్లాగుల్లో అదే మరి ప్రత్యేకత!

  Btw, what was “Read..?” Were you asking something?

  Like

  Reply
 30. vbsowmya

  “one stop for all posts on books”
  – Its a good idea. Navatarangam like site for books …. imagination కి చాల బాగుంది. Get more opinions. Will discuss more offline.

  Like

  Reply
 31. రవి

  శ్రీ రమణ మిథునం అన్న కథల సంపుటి ఉన్నది. అది మిస్ అవకండి.

  “రంగుల రాట్నం” నేనూ మొన్నా మధ్య కొన్నాను. అందులో ఓ వ్యాసం ప్రేరణతో టపా కూడా రాసాను (అష్టవిధ బ్లాగికలు).

  ఇక మీరు చెప్పిన సమగ్రాంధ్ర సాహిత్యం ఒక వాల్యూమ్ ఖరీదు 250.అలాంటివి మొత్తం నాలుగు.

  ఇంకో కొన్ని పుస్తకాలు సూచిస్తా మీకు. నండూరి రామమోహనరావ్ గారి విశ్వదర్శనం 2 సంపుటాలు., మహీధర నళినీ మోహన్ గారి రచనలు. (ఒక్కొక్కటి ప్రయత్నించండి), నామిని సుబ్రహ్మణ్యం నాయుడు నవలలు..

  మీతో ఇంకెప్పుడైనా తీరిగ్గా చర్చించాలి. మంచి పుస్తకాల లిస్ట్ మీ దగ్గర ఉంది.

  Like

  Reply
 32. Purnima

  రవి గారు: నెనర్లు!

  మీ అష్టవిధ బ్లాగికలు టపా గుర్తుంది నాకు. నేనింకా శ్రీరమణ గారి పుస్తకం మొదలెట్టలేదు. మిథునం దొరకలేదు. ఈ సారి ప్రయత్నించాలి.

  కొత్త జాబితా తెలియజేసినందుకు ధన్యవాదాలు!

  అన్యధా భావించక, ఏ మాత్రం ఇబ్బంది లేకపోతే, మీ మేల్ ఐ.డి చెప్పగలరు!

  Like

  Reply
 33. గీతాచార్య

  Yeah! I was about to ask that have you got time to read all these things?

  btw did you get ‘jameelya’?

  Collection of books is always a very nice investment.

  Like

  Reply
 34. చైతన్య

  పూర్ణిమ గారు మీ ఆలోచన బాగుంది. మరి మీరే మొదలెట్ట కూడదా ప్లీజ్..

  Like

  Reply
 35. గీతాచార్య

  పూర్ణిమ గారూ,

  కొంచం ఆ విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన హైదరాబాద్ లో ఎక్కడ జరుగుతోందో చెప్పగలరా?

  గీతాచార్య.

  Like

  Reply
 36. Purnima

  గీతాచార్య: ఇది కోఠీ గాంధీ జ్ఞాన మందిర్ లో జరుగుతుంది. నన్నడిగితే, ఇక్కడకన్నా బాంక్ స్ట్రీట్ విశాలాంధ్రకి వెళ్ళటం నయం.

  Like

  Reply
 37. Satya

  meekosam konni baala sahityalu.

  1. pralaya kaveri kathalu
  2. Poleramma banda kathalu

  indulo pralaya kaveri kathalaku net lo evaro link pettaga choosanu. chala chala bagundi narration

  http://www.telugupeople.com/discussion/MultiPageArticle.asp?id=22714&page=1

  i am trying for Poleramma banda kathalu.

  Btw.. Pralaya kaveri ante mana Pulikat Lake ki poorva Namam.

  ivi kaaka, meeru ee sites lo books vetakavachu

  1. http://www.avkf.org
  2. http://www.indiavarta.com/StoreFront/arrayproduct.aspx?CategoryID=lMx/b5mt1kU=&catename=XOLjDUrOVfM=&index=10

  Bahusa ivi meeku telsinave kavachu.

  – Satya

  Like

  Reply
 38. కావ్య

  పూర్ణిమ గారూ,

  మీ ఈ టపా నాకెంత ఉపయోగ పడిందో చెప్పలేను.చాలా రోజుల నుంచి తెలుగులో కొన్ని మంచి పుస్తకాల గురించి information దొరికితే బాగుండునని అనుకుంటున్నాను.మీ టపా వల్ల,ఈ కామెంట్స్ వల్ల చాలా పెద్ద లిస్టే దొరికింది.Now I can happily start reading :)అందరికీ ధన్యవాదాలు!!

  Like

  Reply
 39. రాకేశ్వర రావు

  పసలపూడి కథలు ముందు సోదిలా అనిపించినా, చదవగా చదవగా కొంత బాగానేవున్నాయి. బాబా గారు అన్నట్టు అవి ఒక కోనసీమ డాకుమెంటరీ లాంటివి.

  భారతంలో చిన్న కథలు అద్భతుమైన పుస్తకం అందరూ కొనాలి.

  తెలుగు జాతీయాల పుస్తకం నాగరాజుగారి ఇంటికాడ చూసాను. తప్పక కొనాలి ఈ సారి అనుకున్నాను. చాలా బాగున్నాయి జాతీయాలు. ఈనాడు లంకె ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  ముళ్ళపుడీ శ్రీపాద నేనూ కొనాలి. అందుకే మొన్న రాజమండ్రిలో పుస్తకాల కొట్ల కోసం అడిగాను.

  గత రెండు సంవత్సరాలుగా చదివిన పుస్తకాల వార్షిక టపా కూడావేసుకోవాలి 🙂

  Like

  Reply
 40. saisahithi

  మంచి ప్రయత్నం
  ఇటువంటి బ్లాగు చాలా అవసరం.
  పుస్తక పరిచయం వెరైటీగా ఉంది.

  Like

  Reply
 41. kRsNa

  mee tapaa chusaka urgent ga velli pustakaalanni koneyalanipinchindi. anni okesaari konaleka, eppatnuncho konaalanukunna pasalapudi kathalu konnaanu. thnx. Best Wishes.

  Like

  Reply
 42. ఆనంద ధార

  తెలుగు పుస్తకాలు గురించి బ్లాగు వుండడం చాల అవసరం.. అలాగే మంచి పుస్తకాలకు సమీక్షలు కూడా ఆ బ్లాగు లో రాస్తే మంచిదని నా అభిప్రాయం. అందు వలన మంచి తెలుగు పుస్తకాలు ఎంతో మందికి చేరుతాయని నా భావన.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

%d bloggers like this: