పంచుకున్న ఆనందం..

Posted by

కిక్కిరిసిన క్రికెట్ స్టేడియం అది. ఇంకా వేసవికాలం తన ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. సాయంకాలం వేళ సూర్యుడు అస్తమిస్తూ కూడా తన తీవ్రతను రుచి చూపిస్తూనే ఉన్నాడు. స్టేడియం పడమటి సీటింగంతా ఇంకా వేడి పెనంలానే ఉంది. గుచ్చి గుచ్చి చూస్తున్న సూర్యుడిని తప్పించుకోడానికి  ప్రయత్నంగా చున్నీని తల మీద నుండి కప్పుకుంది వినీల. పల్చని తెల్లని షిఫాను నేత నుండి వెళ్ళి సూర్యకిరణాలు ఇప్పుడో కొత్త అందాన్ని సంతరించుకుని మరీ ఆమె మొహాన్ని తాకుతున్నాయి.

“లేదు రా మామ.. ఇంకా టాస్ వేయలేదు.. ఆ.. వాడు లేడన్నారు గా? ఇంకా తెలీద్రా ఆడుతున్నాడో లేదో..” అంటూ మాట్లాడుతున్నాడు రవి.

“సరే రా.. బై.. మల్లా కాల్ చేస్తా..” అంటూ కట్ చేసి, “రమేష్ గాడి ఫోన్.. రాలేనందుకు చాలా ఫీల్ అవుతున్నాడు వాడు.. ఛా.. వాడుండాల్సింది” అని వినీలకి చెప్పాడు. చున్నీని సుతారంగా వెనక్కి తీస్తూ, కళ్ళల్లోకి నేరుగా పడుతున్న సూర్యకిరణాల తీవ్రతకి మూసేసిన రెప్పలను బలవతంగా తెరవడానికి ప్రయత్నిస్తూ అతడి వైపు చూసింది.

“ఇంకా ఎంత సేపు మొదలవ్వడానికి?” అడిగింది ఏ మాత్రం ఆతృత లేకుండా!

“ఏంటి? అప్పుడే బోర్ కొడుతుందా?” అన్న తన సమాధానం బదులో ప్రశ్నవేసి, దానికి ఆమె బదులేమిస్తుందో అన్న ఆసక్తి కూడా లేకుండా, కూర్చున్న మెట్టు మీదే నిల్చుని సాగి మరీ ఆటగాళ్ళని చూసే గుంపులో గోవిందుడయ్యిపోయాడు.

“వో.. ధెఖో..” ఎవడో ఒకడి గొంతు ఓ వంద కళ్ళను ఒకే వైపు తిప్పింది.  

“గుండుగాడు.. గిబ్‍స్ రా వాడు”
“ఆ జుట్టు ఫెలో.. ఇషాంత్, ఇక్కడ నుండి కూడా మస్త్ స్ట్రైకింక్ ఉన్నడు లే”
“హే.. లుక్ ఎట్ హిమ్! రో..హిత్.. గాడ్! హిస్ చో.. క్యూట్”

వార్మ్ అప్ అవుతున్న ఆటగాళ్ళని చూస్తూ అందరూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. కిక్కిరిసిన క్రికెట్ స్టేడియం – అదో వింత లోకం. కళ్ళకి సాంత్వన కలిగించే పచ్చటి గ్రౌండ్ మధ్యలో! చుట్టూ మాత్రం మానవ హోరు జోరీగ నసలా ఒకలాంటి శబ్ధం, సున్నితమైన కర్ణభేరిని కాస్త ఇబ్బంది పెడుతూనే ఉన్నా మనస్సులో రేగుతున్న ఉత్సాహంలో అది కూడా కమ్మని పాటలా ఉంటుంది. ఇక్కడ తీరాన్న ఉన్న మానవ అలల జోరు, నడి మధ్యనున్న వాళ్ళని సూటిగా తాకుతుంటుంది. ఉవ్వెత్తున్న లేచే ఆనంద కెరటం! కేరింతలూ, పలవరింతలూ, ఆనంద హేళలూ; కుదరని పక్షంలో నిరాశా నిస్పృహలు, నిశ్శబ్దాలు, విప్లవాగ్నులు అన్నీ సాధ్యం. అదో మత్తు, ఒకే మత్తులో ఉన్నాళ్ళందరితో కలిసి పంచుకునే గమ్మత్తైన అనుభవం. ఆమె ఇదివరకెప్పుడూ చూడని ఓ వింత.

టాస్ వేయడం, ఫీల్డింగ్ టీం రావటం, బాట్స్ మెన్ వడివడిగా నడవటం, అంపైర్లు ప్లేకి లాంఛనంగా అనుమతివ్వడం, ఆట మొదలవ్వటం అన్నీ త్వరత్వరగా జరిగిపోయాయి.

“ఓహ్.. నో! అవుట్.. షిట్..” అంటూ అందరూ కూలబడిపోయారు రవితో సహా, ఫీల్డింగ్ జట్టు ఎగురుతూ ఎగురుతూ “pause” చేసినట్టు ఆగిపోవటంతో “హే.. నో బాల్! అంటే ఫ్రీ హిట్ కూడా!” అంటూ అతడిని భుజాన్ని కుదిపి మరీ చెప్పింది వినీల. అయినా అతడింకా “షాక్”లోనే ఉన్నాడు. “బౌండరీ వస్తే బాగుణ్ణు.. మన రన్-రేట్ చాలా తక్కువగా ఉంది” అంటూ వేళ్ళు పిసికేసుకుంటూ చూడసాగింది, కూర్చున్న చోటున నిల్చుని సాగి మరీ! బాల్-బాట్‍ని కలిసీ కలవగానే గాల్లో తేలుతూ జనంలోకి వస్తూనే, పట్టుకోవాలని ప్రయత్నించాయి ఎన్నో చేతులు. “సిక్సర్” అంటున్న ఆమె చేతులు మాత్రం అతణ్ణి చుట్టేశాయి.

“హే.. వావ్!”

“నిజంగా సూపర్ షాట్ కదా!”

“అది కాదు. నువ్వు.. ఫ్రీ హిట్? రన్ రేట్??!! ”

“మాకూ క్రికెట్ తెల్సు బాబూ! కొంచెం, కొం..చెం”

“రూల్స్ తో సహా!??”

“అదా.. మొన్న నువ్వు  టూరెళ్ళినప్పుడు, వీకెండ్ ఏమీ తోచక నీ క్రికెట్ డి.వి.డీస్, నువ్వు రాసుకునే నోట్స్ చూశాను. చూ..స్తూ..నే ఉండిపోయాను. బాగుణ్ణాయనిపించవన్నీ చూసేశాను. కొన్ని రూల్స్ అప్పుడే తెలిసాయి”

“……”

“కానీ ఈ ఫీల్డ్ ప్లేసింగ్స్ చాలా తికమకగా ఉన్నాయి.. ఇప్పుడు ఆ మనిషి మిడాఫ్ లో ఉన్నట్టా?” అంటూ చేతిని చాచింది. అతడేదో చెప్పేలోపే “ఏదో ఒకటిలే..ఇప్పుడొద్దు. వీ ఆర్ మిస్సింగ్ మాచ్!” అంటూ క్లాసులో ఏ కొంచెం కూడా మిస్స్ కాని మొదటి బెంచ్ విద్యార్థినిలా క్రికెట్ మీద దృష్టి పెట్టింది. అతగాడేమో లాస్ట్ బెంచ్ విద్యార్థిలా ఆమె వంకే చూస్తూ ఉండిపోయాడు.

“ఫోర్..” ఆమె గట్టిగా అనడంలో ఆశ్చర్యం నుండి తేరుకుని, ఆ ఆనందంలో మునిగిపోయాడు. ఆసక్తికరంగా జరుగుతున్న ఆ మాచ్‍ని కలిసి ఆస్వాదిస్తున్నారు. రెండు చేతులతో చప్పట్లు మానేసి, నాలుగు చేతులు కలిసిన ధ్వనిలో ఆనందాన్ని శ్రుతి కలిపారు. “అయ్యో!” అంటూ జారిపోయే భుజాలను ఒకదానికొకటిగా ఆసరాగా నిలబెట్టారు. “హు.. హ, హు..హ” అంటూ అరుస్తున్నప్పుడు అతడి గంభీర స్వరం, ఆమె నాజుకైన గొంతూ కలిసి ఓ కొత్త “జుగల్బందీ” అయ్యింది. ఇద్దరూ “ఆహా!” నుండి “అయ్యో” వరకూ ప్రతీ అనుభూతిని కలిసి పంచుకున్నారు. చేతులు పట్టుకుని నీటి మడుగులో గెంతులేసే చిన్న పిల్లల్లా వాళ్ళు మారిపోయారు.

సన్నగా, చిన్నగా వాన చినుకులు మొదలయ్యాయి. కనీ కనిపించకుండా అప్పుడో సారి, అప్పుడో సారి గిల్లి పోతున్నాయి.

“అబ్బా.. ఇప్పుడు వానేంటి? చిరాగ్గా..” అన్నాడతడు మొహం చిట్లించుకుంటూ. “మన వాళ్ళు మాచ్ గెలుస్తారన్నప్పుడే పడి చస్తుంది.. ఛా!”

“Rain, at any given moment is beautiful!”

“చెత్త వాన, దరిద్రపు వాన.. ” అతడు కొనసాగిస్తూనే ఉన్నాడు. సన్నని తుపర పడుతూనే ఉంది. కాస్త జల్లు ఎక్కువయ్యేసరికి అంపైర్లు ఒక చోట మంతనాలు మొదలెట్టారు. “ఛాస్.. ఇంత అందమైన సాయంత్రంలో ఈ వాన వచ్చి కంపు కంపు చేస్తోంది” అని మొహం మాడ్చుకుని మరీ అంటూ ఆమె వంక చూశాడు. కళ్ళు గట్టిగా మూసేసుకుని, మొహం ఆకాశం వైపు పైకెత్తి వాన చినుకుల స్పర్శలో తన్మయత్వాన్ని అనుభవిస్తుంది. వాన మీద కోపం, వానకి ఆతిధ్యమిస్తున్న ఆమె మీద కూడా చూపించబోయాడు. ఇంతలో ఆట మళ్ళీ మొదలయ్యే సరికి,  ఇద్దరికీ ధ్యాస మారిపోయింది. మొత్తానికైతే మాచ్ ఆటంకాలతో నడిచింది. ఎంతలోపు ఎంత  కొట్టాలో ఎవ్వరికీ సరిగ్గా తెలీక గందరగోళంగా మారింది. వినీలకి మరీ అగమ్యగోచరంగా ఉండి, దిక్కులు చూడసాగింది. రవి అంత ఉత్కంఠలోనూ తనకి తెలిసిన నాలుగు ముక్కలూ ఆమెకి వివరించాడు. బాల్, బాల్ కి లెక్కలు పెట్టుకుంటూ ఎలా అయితేనే మాచ్ మాత్రం పూర్తయ్యింది.

“కాస్త చూసుకుని నడవండమ్మా!” అని ఉచితంగా ఓ సలహా ఇస్తూనే తోసుకుపోయారెవరో, మాచ్ పూర్తయ్యాక స్టేడియం మెట్లు దిగుతుంటే.

“ఆర్ యు ఒకె, వినీ?”

“ఊ..” అంటూ అలసిన గొంతుతో సన్నగా మూలిగి, అడుగు ముందుకేయబోయి తూలిపడింది. “నొప్పొస్తుంది రవీ” అంటూనే తన నడుం చుట్టుకుని వచ్చిన అతడి చేతిలో తన చేతిని నిలిపి, మరో చేతిని అతడి నడుం చుట్టూ చుట్టి మెల్లిగా అడుగులు వేయడానికి ప్రయత్నించింది. ఆమెను నడిపిస్తూ ఉన్న బాధ్యతలో చినుకులు పడుతున్నాయి మళ్ళీ అన్న సంగతి గమనించలేదు. ఆ స్పృహ వచ్చిన తర్వాత వాన చినుకులు తాకిడి కొత్తగా అనిపించింది. కళ్ళు గట్టిగా మూసుకుని, మొహం పైకెత్తి వాన చినుకులు మీద పడుతుంటే, పెదాల మధ్య నవ్వు పుట్టుకొచ్చింది రవికి.

“అయ్యో.. వాన ఎక్కువయ్యేట్టుంది. ఇదో ఇది తల మీద వేసుకో..” అంటూ చున్నీని అందించబోయిన ఆమెను వారించాడు. మెల్లిగా నడుచుకుంటూ పార్కింగ్ ప్లేస్‍కి వెళ్ళేసరికి ఇద్దరూ దాదాపుగా తడిచిపోయారు.

“కాసేపాగి వద్దామంటే విన్నావు కాదు. చిర్రాగ్గా ఉందా?” అన్నది ఆమె మంద్రంగా అనునయంగా.

“హమ్మ్.. పర్లేదు. వానలో తడిస్తే బానే ఉంది. ఏదోలా ఉంది. నాట్ బాడ్!” అంటూ, ఒక్కసారి ఆమె వైపుకి తిరిగి సూటిగా చూస్తూ, “ప్లీజ్.. ఏ వాయుగుండమో తీరం దాటేటప్పుడు మనం పిక్నిక్ చేసుకుందాం అని అడగకు. నేను కొట్టుకుపోతాను” అన్నాడు కొంటెగా నవ్వుతూ.

“ఊ.. ఊ.. నువ్వు నన్ను “డక్-వర్త్ లూయిస్ రూల్* పనిచేయు విధానం వివరింపుడీ” అని అడగనంత వరకూ..” అని ఆమె ఇచ్చిన జవాబు, వాళ్ళిద్దరూ మనసారా నవ్విన నవ్వులో ఎక్కడో మరుగునపడిపోయింది. పంచుకునే కొద్దీ పెరిగే ఆనందం వాళ్ళ సొంతమయ్యింది.

******************************************************************************
* డక్‍వర్త్ లూయిస్ రూల్, వాన పీడత మాచ్‍లను కుదించడానికి అమలు పరిచే విధానం. క్రికెట్ ఆటలో అత్యధికంగా అర్థం అవ్వని రూల్ అంటే ఇదేనేమో!

9 comments

 1. hmm, paravaaledu. Ardham ayyi ardham kaanivi bhale andangaa vuntaayi, prema laaga:D… aa duckworth lewis valla manamu two matches gelichinattunnamu last series lo :O….

  the post was good…

  Like

 2. వాన, క్రికెట్…..ఏది అయినా సరే “ఊహలన్నీ ఊసులై ” లో చక్కగా అమరిపోతాయి. 🙂

  Like

 3. ఓహో కికెట్ మ్యాచ్ లో ఇంకో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నమాట! రెండోసారి చదివితేగానీ అర్థం కాలేదు. బాగుంది.

  Like

 4. how romantic!!!
  “ఆమెను నడిపిస్తూ ఉన్న బాధ్యతలో చినుకులు పడుతున్నాయి మళ్ళీ అన్న సంగతి గమనించలేదు. ఆ స్పృహ వచ్చిన తర్వాత వాన చినుకులు తాకిడి కొత్తగా అనిపించింది. కళ్ళు గట్టిగా మూసుకుని, మొహం పైకెత్తి వాన చినుకులు మీద పడుతుంటే, పెదాల మధ్య నవ్వు పుట్టుకొచ్చింది రవికి.”

  ఇది చదువుతూనే నాకూ చిన్నగా నవ్వొచ్చేసింది! నీ శైలితో మమ్మల్నీ వాళ్ళిద్దరికీ అడుగు దూరంలో నించోబెట్టేసావు! 🙂

  నీ టపా చదివాక మనవాళ్ళు వెస్టిండీస్ టూర్ కి ఎప్పుడొస్తారా అని చూస్తున్నా.. మా పతిదేవులకి క్రికెట్ అంటే పిచ్చి.. I would really like to go to a match with him 🙂

  Like

 5. టైటిల్ చూసి హమ్మయ్యా పూర్ణిమ మళ్ళా ఫాం లోకి వచ్చిందనుకున్నాను.[నాకు నీ రొమాంటిచ్ ఫీల్ కలిసిన టపాలంటే చాలా ఇష్టం]క్రికెట్ గ్రౌండ్ అన్న మాట చదివి ఈపిల్లకి క్రికెట్ అంటే ఇంత పిచ్చేమిటిరా అనుకుంటూ నీ పోస్టు స్కిప్ చేసి కామెంట్లు చదవడం మొదలుపెట్టాను.నిషి కామెంటు చూస్తే ఏమీ అర్ధం కాలేదు.ఎందుకంటే నేను ఇదేదో క్రికెట్ గురించిన టపా ఏమో,ఇండియా గెలిచిన ఆనందాన్ని గురించి చెపుతున్నావేమో అనుకుని వదిలేసాను.టపా చదువుతున్నంతసేపూ “రవి కి ఏదో అనిపించినట్టు” నాకూ అనిపించింది. స్ట్రేంజ్ ఫీలింగ్ కాదు గానీ ఎప్పుడో అనుభవమయ్యి మర్చిపోయిన ఫీలింగ్ గుర్తొచ్చింది.:) థాంక్స్.

  Like

 6. బావుంది పూర్ణిమా, అర్ధమయ్యి అర్ధమవ్వకుండా..! నీకు నచ్చింది నేను ఆనందిస్తాను. నువ్వు మెచ్చింది నేను ఆస్వాదిస్తాను అనుకున్నప్పుడేగా పంచుకోడంలో ఆనందం అవగతం అయ్యేది.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s