“అక్కా.. ఇది చూలు, మా మిస్సూ.. నాకూ ఇక్కడా g.. o..o..d అని రాసింది. నేనింటికెళ్ళీ..అమ్మకి చూపిస్తా”
“ఓహ్.. అవునా! గుడ్!! ఇవ్వాళ మా ఫిసిక్స్ టీచర్ మమల్ని బాగా తిట్టి, పనిష్మెంటు కూడా ఇచ్చింది. చేతులు పైకెత్తి గంట నుంచున్నాం”
“మలేమో.. మా మిస్స్ గుడ్ పెట్టింది”
“హమ్మ్.. ఇవ్వాళ పుస్తకాల బాగ్ కడా బరువుగా ఉంది. చేతులు లాగేస్తున్నాయి”
“అదేంటిది? నాకూ కావాలి, తింటా”
“ఛీ, అలా ఫుట్ పాత్లమీద పెట్టినవి తినకూడదు. దా.. ఇటు వచ్చేయ్! ఇంటికెళ్ళాక అమ్మ పెడుతుందిలే”
“…”
“అటూ.. ఇటూ వెళ్ళక! ఇదో నా చేయి పట్టుకో!”
“నాకు టీచరు గుడ్ ఇచ్చింది. నేను అమ్మకి చూపిస్తా”
“చూబిద్దువులే.. అదో ఆటో! ఆటో ఎక్కేస్తే మనం ఇంటికెళ్ళిపోతాం, అప్పుడమ్మకి చూపించచ్చు”
“రాండ్రి అమ్మా, దొరసానుల్లెక్క గంటల గంటల తీసుకుంటారు రానీకి! జల్దీ ఎక్కుండ్రి, నాకు మస్తు పనులున్నై”
“గేటు దగ్గర్నుండి ఇక్కడికి రావాలంటే ఎంత కష్టమంకుల్! బోలెడు ట్రాఫిక్ కదా!”
“దబ్బున పదుండ్రీ.. గా పిల్లేదీ?”
“అయ్యో.. ఆక్సిడెంట్! “
“చిన్నూఊఊ..”
“ఉస్.. బైక్ వాలే కో పక్డో రే! సాలా.. బాగ్ జా రా!”
“108 కి కాల్ చేయండి. పోలీసులని పిలవ్వండి”
“ఎలా జరిగింది?”
“ఏమో, నేనిప్పుడే వెళ్తూ ఆగాను. పాపం! చాలా చిన్న పిల్ల”
“బతుకుదంటారా?”
“చెప్పలేం.. నాకైతే నమ్మకం లేదు”
“ఏమయ్యిందీ? ఏమయ్యిందీ?”
“నేను చూశాను. ఈ అమ్మాయి ఆ ఆటో పక్కన నుంచునుందా! బైక్ వాడు ఫుట్ పాత్ మీదకి రావటంతో పాప పక్కకి తప్పుకోబోయి రోడ్డు మీదకి పడింది. ఇంతలో బస్సు.. “
“జరగండి, జరగండి సార్.. ప్లీజ్! మా కార్లో తీసుకెళ్దాం.. వీళ్ళ వాళ్ళెవరైనా ఉంటే హాస్పిటల్ కి వచ్చేయండి”
“అంకుల్.. చిన్నూ! చిన్నూ!”
” రా తల్లీ! నువ్వా ఆటోలో ఇంటికిపో. నేను అస్పతాలకి పోయొస్తా. గాళ్ళ నాన్నకి కూడా ఖబర్ చెప్పాలిగా.. నువ్వు పో ఆ ఆటోలో.. మల్లేశ్.. ఈ పిల్లల్ను జర దింపేయుండ్రి..”
“హలో.. సార్! నే యాద్గిరి, ఆటో డ్రైవర్! మీ పాపకి చిన్న ఆక్సిడెంట్ అయ్యింది. జరా జల్దీ హాస్పిటల్ వచ్చేయి సారు. ఏం ఫర్వాలే.. చిన్న దెబ్బలే! నా కాడ పైసల్లేవు. అందుకే నిన్ను పిలుస్తున్నా!”
*****************
“హలో.. బద్రీ.. ఈ దుర్ఘటన ఓ అరగంట క్రితం జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. ఇది తార్నాకా ఏరియాలో ఒక స్కూల్ సమీపంలో జరిగింది బద్రి. ఇప్పుడే ఆంబులెన్స్ లో మృతదేహాన్ని తీసుకెళ్ళారు. బహుశా… నాలుగేళ్ళ వయస్సుండచ్చు. పేరు అలేఖ్య అని తెలిసింది.”
“చంద్రశేఖర్..ఈ ఆక్సిడెంట్ చూసిన వారేమంటన్నారు?”
“బద్రీ.. ఇలాంటివి జరగటానికి కేవలం మన ట్రాపిక్ వ్యవస్థే కారణం.. అసలిక్కడ ఫుట్‍పాత్‍ల మీద కూడా నడవలేని దౌర్భాగ్యం.. ఈ దుర్ఘటన ప్రత్యక్ష సాక్షి నా పక్కనే ఉన్నారు. వారితో మాట్లాడుద్దాం. మీ పేరు చెప్పండి..”
“నమస్తే.. నా పేరు వెంకటేశ్. నేను కాలినడకన పోతున్నా. గా పాప ఎదురుగా వస్తుండె.. చూసినా గానీ.. ఇంతలోనే ఏమో అయ్యినాది.. అంతా ఓ చోట గుమ్ముగూడే సరికి.. దగ్గరకెళ్ళి చూసినా. అప్పటికే పాణం పోయినాది.”
“ఆంబులెన్స్ ఎప్పుడొచ్చిందీ..”
“ఓ అరగంటకి వచ్చనట్టు ఉన్నాది సార్..పాపను అప్పటికే తీసకపోయినారు.”
*****************
“హలో.. లక్ష్మీ! న్యూస్-వ్యూస్ టివి చూస్తున్నారా? ఎవరో చిన్న పాప చనిపోయిందట..స్కూల్ దగ్గర”
“అయ్యో.. ఎవరో కాదండీ.. మన రమ్య కూతురేట! నేనెళ్తున్నా.. మీరూ వచ్చేయండి త్వరగా!”
“అ..లే… !!”
“రమ్యా.. రమ్యా?, కాస్త మంచినీళ్ళు పట్టుకు రండి! ఆంబులెన్స్ కి కాల్ చేయండి. స్పృహ కోల్పోయినట్టున్నారు?”
******************
“ఆలేఖ్య ఆక్సిడెంట్ కేసుని మొట్టమొదటి అందించిన ఈ ఛానెళ్ళోనే మరిన్ని వివరాలు! బద్రి.. ఈ దుర్ఘటణ, ఇవ్వాళ సాయంత్రం నాలుగున్నరా ఆ ప్రాంతంలో జరిగింది. అప్పుడే స్కూల్ విడిచి పెట్టుంటారు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంటుంది. అసలు ఫుట్ పాతుల మీద కూడా వాహనాలు నడుస్తుంటాయి. అలానే ఇవ్వాలా ఈ పాప.. “
“హలో.. చెప్పండీ చంద్ర శేఖర్.. హలో.. హలో! లైన్ కట్ అయ్యినట్టుంది. సాంకేంతిక లోపం వల్ల మాట్లాడడం కుదరటం లేదు. ఇప్పుడు మనం అలేఖ్య ఇంటి దగ్గరి పరిస్థితి తెలుసుకుందాం. మా ప్రతినిధి చిత్ర అక్కడున్నారు”
“బద్రి.. ఇక్కడ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. అసలు..ఎవరూ మాట్లాడే పరిస్థితుల్లో లేరు. పాప మృత దేహం ఏ క్షణాన్నైనా ఇక్కడ చేరుకోవచ్చు! అంతా బరువైన గుండెలతో, భయంకరమైన బాధతో వేట్ చేస్తున్నారు. ఆలేఖ్య చాలా మంచి పాప అని, అల్లరి చేసేది కాదని, అందరితో కలివిడిగా ఉండేదని ఇక్కడ ఇంతకు ముందు కొందరు చెప్పారు.. అదో.. ఆంబులెన్స్ వచ్చేస్తుంది. ఈ పిక్చర్స్ మన చానల్లోనే మొదటి సారిగా.. “
“సార్.. మీ పాపకు ఇలా జరగటం పై మీ స్పందన? దీనికి ఎవరు బాధ్యత వహించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు?”
“పోనీ.. మీరు చెప్పండమ్మా.. మీ పాప ఇక లేదని.. “
“అమ్మా… దయచేసి వెనక్కెళ్ళు తల్లీ! ఇక్కడ బిడ్డను పోగొట్టుకున్న షాకులో ఉన్నారు వాళ్ళు! దయచేసి.. కాసేపు కమెరాలు పక్కకి పెట్టండి. వెళ్ళండమ్మా!”
“చూస్తున్నారు గా! ఎవరూ మాట్లాడే స్టేజీలో కూడా లేరు. ఇక్కడ క్లైమేట్ కూడా అలానే ఉంది. వర్షం కూడా కన్నీళ్ళు కారుస్తుంది. న్యూస్-వ్యూస్ టివి కోసం, కెమారా మాన్ బాలుతో చిత్ర!”
“థాంక్స్ చిత్ర! ఈ విషయమై చర్చించడానికి మనతో ప్రముఖ జర్నలిస్ట్ అప్పారావు గారున్నారు. చెప్పండి సార్! ఇలాంటి దుర్ఘటనలకి కారణం ఏమిటంటారు?”
“అసలూ.. ఇదంతా మన.. “
“ఒక్క నిముషం అప్పారావు గారు.. ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్, మనతో లైన్లో ఉన్నారు, ఆవిడేంటారో తెలుసుకుందాం.”
“My grieve condolences on the death of Baby Alekhya. May her soul rest in peace. We pray and stand by the family, in this time of loss. We request the government especially the traffic department to take necessary precautions, to avoid such untimely deaths. “
” ట్రాఫిక్ పోలీస్ కమీష్నర్, దీని పై ప్రెస్స్ మీట్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడది లైవ్ చూద్దాం”
“ఇవ్వాళ నాలుగున్నరా ప్రాంతంలో సికింద్రాబాద్ తార్నాక ఏరియాలో సెంట్ ఆన్స్ స్కూల్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ళ ఆలేఖ్య అనే అమ్మాయి మెదడుకి దెబ్బ తగిలి అక్కడికక్కడే మరణించిందని డాక్టర్లు ధృవీకరించారు. పాప కుటుంబానికి మా తీవ్ర సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాము. స్కూల్ వదిలిన తర్వాత పిల్లలు జాగ్రత్తగా ఇంటికి చేరడానికి స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటే, ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూడచ్చు.”
“ముఖ్య మంత్రి గారు ఈ సంఘటన పై మాట్లాడుతున్నారు. ఇప్పుడది లైవ్ చూద్దాం.”
“ఆరేళ్ళ పసిపాప, రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా భాధాకరమైన విషయం. మేము దీనికి చాలా చింతిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాము. మా ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల ఎక్సేగ్రేషియా మంజూరు చేస్తాము. ఇలాంటివి మరలా జరక్కుండా, స్కూల్ యాజమాన్యాలకి తగిన నిబంధనలు విధిస్తాము. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను అరికట్టడానికి, ఒక ప్రణాళికను త్వరలో తయారు చేయమని సంభందిత అధికారులకు సూచనలిస్తాము.”
“అప్పారావు గారితో చర్చ కొనసాగిద్దాం.. ఓ చిన్న బ్రేక్ తరువాత! ఈ లోపు మా ఎస్.ఎం.ఎస్ ప్రశ్న “స్కూల్స్ దగ్గర ఆక్సిడెంట్లకి ఎవరిది బాధ్యత? ఎ) స్కూల్ యాజమాన్యం బి) ట్రాఫిక్ కార్యవర్గం సి) తల్లిదండ్రులు” మీరు పంపాల్సిన నెంబర్లు.. మీ టివి స్క్రీన్ల మీద ఉన్నాయి. అలానే ఈ దుర్ఘటనపై మాట్లాడ్డానికి మీరు కాల్ చేయవలసిన నెంబర్.. 22334578″
****************
“మొన్న..ఆ పాప చనిపోయిందిగా. అందుకే ఇక స్కూల్ టైమింగ్స్ అవీ అన్నీ మార్చేస్తారట. పొద్దున్నే ఆరుకే మొదలెడతారట. పైగా వారానికి ఐదు రోజులే అట”
“అబ్బా… అప్పుడే తెల్లవారు ఝాము నాలుగింటికో మొదలెట్టాలి మన పనులు. ఏ ఝామున లేచినా మళ్ళీ అర్థరాత్రి దాటేదాకా విశ్రాంతి ఉండదు.”
*****************
“గీ రూల్స్ ఏంది భాయ్! ఒక్క ఆటో ఆరుగురు పిల్లలే అంటే, మనకేం మిగుల్తాది?”
“మనం ఒప్పుకోద్దు.. మన యూనియన్లతో మాట్లాడుదాం, ఎట్టి పరిస్థితుల్ల దీన్ని ఎదుర్కోవాలి!”
“రిషీ.. నాకు చాలా భయంగా ఉంటోంది, పాపని స్కూల్ నుండీ రోజూ మనమే తీసుకొద్దామా?”
“ఎలా కుదురుతుంది చెప్పు! ధైర్యంగా ఉండాలి. రోజూ మనకి కుదరకే కదా.. ఈ ఆటోల్లో పంపించడం!”
******************
“హే.. గ్రూప్ డిస్కషెన్స్ టాపిక్స్ తెలిసాయి. “ఇండియా-సూపర్ పవర్ ఇన్ ఐటి?”, “పాలిటిక్స్ ఆండ్ కరప్షన్”, “స్పోర్ట్స్ ఇన్ ఇండియా” అంట. “హైదరాబాద్ లో ట్రాఫిక్” ఎక్కువ అడుగుతున్నారట.”
“ఈజీ టాపిక్సే! చెప్పేయచ్చు.. ఒక క్లూ ఏంటంటే, రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. లైక్.. ట్రాఫిక్ అంటే సిక్స్ మంత్స్ బాక్ ఒక పాప చనిపోయింది కదా.. అది చెప్తే, మన జి.కె కూడా ప్రెజెంట్ అవుతుంది. ఆ పాప పేరేంటో గుర్తు రావటం లేదు”
******************
“అబ్బా.. ఈ స్కూల్ వదలగానే ట్రాఫిక్ తో భలే తలనొప్పి. పెద్ద వాళ్ళమయ్యుండి మనకే గుండె గుబేలంటుంది. ఇక చిన్న పిల్లల సంగతేంటీ? అసలొక సిస్టం లేదా?”
“ఒక రెండేళ్ళ క్రితం, ఒక చిన్న పాప చనిపోయాక ఆక్సిడెంట్లో.. నానా హంగామా చేశారంతా! కానీ ఎమీ జరగలేదు. అంతా అలానే ఉంది.”
“ఒహ్.. అవునా? అయ్యో.. పాపం!”