మొన్న ఎవరో, “అబ్బో.. నువ్వు చాలా సీరియస్ మనిషివి. కాంప్లికేషన్స్ ఎక్కువ!” అనే సరికి మనసు చివుక్కుమంది ఒక్క క్షణం. ఆ మనిషి అలా అనడానికి కారణం తెలీగానే మాత్రం నవ్వాగలేదు. నేను నవ్వుతున్నానన్న విషయం గ్రహించిన మరుక్షణం మరో జ్ఞాపకం కళ్ళముందు కదలాడింది. ఆ మొన్నకు మొన్న మరెవరో, “మీరు చాలా సంతోషంగా గలగలాడుతూ ఉంటారు” అని అంటే, “అబ్బే లేదండీ! మీరు నన్ను చూసింది తక్కువ కాబట్టి అలా అనేస్తున్నారు కాని, నేను చాలా సీరియస్ మనిషిని. అసలు పెద్ద కష్టాలేవీ లేకపోయినా ఎందుకో బాధ పడిపోతూ ఉంటాను. సంతోషంగా ఉండడానికి ప్రత్యేక ప్రయత్నాలేవీ చెయ్యను. I know that” అంటూ వాగిన వాగుడు “నాకు నేను నా గురించి పరస్పర విరుద్ధంగా చెప్పుకుంటున్నానా?” అన్న అనుమానం కలిగించగానే ఉలిక్కి పడ్డాను. ఆ ఉలిక్కిపాటును ఓ చిర్నవ్వు వెనుక చాటేసి “ఎవరో”తో కాసేపు మాట్లాడుతూ కూర్చున్నాన్న మాటే కానీ ఆలోచనలు మాత్రం ఆగలేదు.
నా గురించి నాకు ఎవరైనా చెప్పటం ఇష్టం లేక వచ్చిన స్పందనలా అవి? నన్ను చదివేస్తున్నారేమో అన్న భయంతోనా? నన్ను అర్థం చేసుకోవటం చాలా కష్టమని గొప్పగా చెప్పుకునే అహం దెబ్బతినటం వల్లనా? లేక, అప్పటి మనఃపరిస్థితి అంత బాగోక అన్న పై పై మాటలా? ఇవ్వన్నీ సరే.. అసలు నాకు నేను తెల్సన్న నమ్మకం ఏమయ్యినట్టు? లాభం లేదు, దీని అంతేదో చూడాల్సిందే అనుకుంటూ.. పూర్తిగా అంతర్ముఖంగా మారిపోయాను.
ఇప్పుడు నేనెలాంటి మనిషో తేల్చుకోవాలంటే, ఇన్నేళ్ళనూ ఒక గాటిన కట్టి, నేను ఎక్కువ భాగం ఎలా ఉన్నానో, నేను అలాంటి మనిషినే అని నిర్ధారించుకోవాలా? అలా చేయాలంటే బతకున్న ఇన్నాళ్ళ ప్రతీ క్షణంలో నేనెలా ఉన్నానో చిట్టా రాసుకుంటూ పోవాలి. అసలు బతికేసిన ఇన్ని రోజులే గుర్తు లేవు, ఇంకందులో క్షణాలెలా తూకం వేసేది? పోనీ, జ్ఞాపకాల మీద ఆధారపడదామనుకుంటే అవీ ఖచ్చితమైన భరోసాని ఏమీ ఇవ్వలేను. అందులోనూ కొన్ని జ్ఞాపకాలు భలే మొసం చేస్తాయి. స్నేహంతో గొడవపడిన క్షణాలు తవ్వుకున్నప్పుడల్లా, మొట్టమొదట వేసుకున్న చేదు మందు రుచి మనసు నిండా నిండిపోతుంది. అదోలా అయిన పోయిన మనసు, ఆ గొడవను అధిగమించిన విధానం, ఆ గొడవ ద్వారా ఒక్కరిపై ఒకరికి పెరిగిన అవగాహనని, తడబడినా, పొరబడినా నెగ్గుకొచ్చిన క్షణాలని ఎందుకనో గుర్తు చేయలేదు, వెంటనే! జ్ఞాపకాలను తవ్వుకోవటమేమో కానీ, పూడ్చుకోవటం మాత్రం అంత సులువు కాదు.
అనంత కాల ప్రవాహంలో నా చెంతకు చేరే క్షణాలను ఎలా ఆదరిస్తానన్న దాని మీదే “నేనెలాంటి మనిషిని?” అన్నదానికి జవాబు ఉందనుకుంటాను. నాకు ప్రాప్తించే క్షణాలు ఖాళీ కాగితాల్లాంటివనుకుంటే వాటి మీద నేనేదో ఒక రంగు పూసి పంపిస్తాను. ఇప్పుడు నేను వాడే రంగులేమిటి అన్న దాన్ని బట్టి నన్ను నిర్ధారించవచ్చునేమో! నలుపా? తెలుపా? నీలమా? ఎరుపా? గులాబీ రంగా? పుసుపు పచ్చా? అనేది ఇధిమిత్తంగా చెప్పలేను. ఏ ఒక్క రంగుపై ప్రత్యేక ఆకర్షణ లేదు. కానీ ఖచ్చితంగా చెప్పగలిగేది మాత్రం: ఏ క్షణానికా క్షణపు అనుభూతి రంగును నిక్కచ్చిగా నింపేస్తాను. నలుపుగా ఉన్న క్షణాలను తెలుపు పూయ ప్రయత్నించి ఎటూ కానీ బూడిద రంగు వచ్చే అవకాశం నాతో చాలా తక్కువ. అలానే క్షణాల్లో నలుపు మరకలు పడే అవకాశాలూ చాలా తక్కువ. ఏ క్షణానికా క్షణం ఓ రంగులో ముంచి లేవదీస్తాను. ఒక్కోసారి కోటి రాగాలు ఒక్కసారిగా పలికే వేళ ప్రతీ రంగూ ఒకదాని పక్కన ఒక్కటి నిలిచిపోయి బహుళ వర్ణాల ఇంద్రధనస్సులు ప్రత్యక్షమవుతాయి. అందుకే నేనేదో ఒక్క గాటిన కట్టిపారేయడం కష్టం. నేను అదీ కానూ, ఇదీ కానూ! క్షణాల్లో నా తాలూకూ అనుభూతులు మాత్రం మనసారా కనిపిస్తాయి.
“అందుకే నేనేదో ఒక్క ఘాటిన కట్టిపారేయడం కష్టం. నేను అదీ కానూ, ఇదీ కానూ! క్షణాల్లో నా తాలూకూ అనుభూతులు మనసారా కనిపిస్తాయి.”
– 🙂 well said
LikeLike
>>ఏ క్షణానికా క్షణపు అనుభూతి రంగును నిక్కచ్చిగా నింపేస్తాను
thats what we need 🙂
LikeLike