“అసలేమయ్యిందో చెప్తే కదా నాకు తెల్సేది? ఏం చెప్పకుండా అలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు?” అమ్మ ఏదో అంటోంది ఇంకా..
“please mom! will you go from here? I wanna my space” దుఃఖం, కోపం కలగలసిన గొంతుతో అరవాలనే అసఫల ప్రయత్నం చేశాను.
“ఎందుకూ? ఇంకా చిందర వందర చేసిపెట్టటానికా? నీకు ఒక గది కాదు, ఓ ఊరు రాసిచ్చినా సరిపోదు! ఆ పుస్తకాలు చూడు, అసలు చదువుతున్నావా వాటిని? ఎక్కడంటే అక్కడ అవే. ఆ నెట్ కేబుల్ చూశావా? కాళ్ళకి తగిలి పడాతావెప్పుడో! ఆ లాప్‍టాప్ క్లోజ్ చేయ్యవేంటి? బట్టలూ.. నీ బట్టలకి మాత్రం అంతు లేదు! సర్దుకోవేంటి నీ వస్తువులూ? మొన్నా హెడ్ ఫోన్స్ తెచ్చావా, అవి చూడు ఎలా వేలాడుతున్నాయో! వెయ్యి పోసి కొనేశావ్, నేను చెప్తూనే ఉన్నా అంతవి దండగా అనీ.. పాటలు వింటావు సరే.. వినేసాక జాగ్రత్త చేసుకోవాలని తెలీదూ? ఎవరైనా పొరపాటున ఆ గదిలోకొస్తే భయపడి చస్తారు! ఇంకా స్పేస్. స్పేస్ అంటావు? ఉన్నంతలో సర్దుకోవాల్రా.. అంతే కానీ..” సందర్భంలేకపోయినా, సమయం కాకున్నా నాకు ఇవ్వాల్సిన లెక్చర్స్ కి నాన్న ఎప్పుడూ సిద్ధం.
“అబ్బా.. మీరు ఊరుకోండీ! దానికెందుకో మనసు బాలేనట్టుంది ఇవ్వాళ..” అంటూ అమ్మ అడుగు బయటకెయ్యగానే, తలుపు చట్టుకుని మూసేసి, గొళ్ళెం పెట్టేసి దానికే ఆనుకుని నిల్చుండిపోయాను కళ్ళు మూసుకుని ఒక ధీర్ఘ శ్వాసతో. ఎక్కడి నుండి పుట్టుకొచ్చేస్తున్నాయిన్ని? “స్పేస్” లేదంటూ అవీ చెక్కిళ్ళ మీద జారిపోతున్నాయి! ఏడుస్తున్నప్పుడు కళ్ళు తెరచి చూడ్డం నాకు భలే సరదా! కళ్ళనిండా నీళ్ళు పెట్టుకుని మసక మసకగా అన్నీ కలయచూడ్డం అంటే అదో ఆనందం. కానీ, ఇప్పుడసల, కళ్ళల్లో నీళ్ళు ఆగుతుంటే కదా? ఎక్కడ నుండి పుట్టుకొచ్చేస్తున్నాయి? ఎవరి కోసం? చట్టుక్కున ఏదో స్ఫురించింది. ఛ.. నిజంగానే నా గది ఎంత భయంకరంగా ఉంది? పొరపాటున ఎవరైనా వచ్చి చూస్తే ఏమనుకుంటారు నా గురించి? అసలు ఒక్క వస్తువూ సరైన చోట లేదు! అందుకే ఇలా మాటలనిపించుకుంటూ ఉంటాను. కోపం – నన్ను అంతా అంటున్నారని! కోపం – అనిపించుకునేంత వరకూ తెచ్చుకుంటున్నానని! కోపం వేళ్ళకొసల్లోకి చేరి కన్నీళ్ళను గట్టిగా తుడిచేశాయి. అవే వేళ్ళు జుట్టులోకి చొరబడి, వెంట్రుకలని బిగువుగా లాగి, క్లిప్ పెట్టాయి.
బట్టలు, చకచకా మడత పెట్టేశాను. అంత కన్నా వేగంగా బిరువాలో తోసేయడానికి దాని తలుపు తీసాను. లోపలంతా చిందర వందరగా ఉన్నాయి. వాటిన్నంటినీ బయటికి తీసేసి, అన్నీ సర్దేసి చక్కగా ఒక పద్దతి ప్రకారం, వరుసగా పెట్టాను. నలుపు కూడా కలిసున్న ఓ కొత్త ఇంద్రధనస్సును అమర్చిన ఆ అరలను చూస్తుంటే నా పనితనం మీద నాకే ముచ్చటపడ్డాను! ఇప్పుడా బిరువా తెరిచిన ఎవ్వరైనా, “ఎంత పనిమంతురాలో అమ్మాయీ?” అనుకోరూ?! నేనెప్పుడూ ఇంతే.. నాది constructive aggression అని నాకు నేనే ఇచ్చుకున్న కితాబు. బట్టలతో సాధించిన ఊపును మంచం మీద పడున్న వస్తువులపైకి మళ్ళించాను. పుస్తకాలూ, సిడీలూ, లాప్‍టాప్, సోఫా కుషన్లూ, పెన్సిల్లూ, పెన్నులూ, చాక్లెట్ వ్రాపర్లూ, కాగితాలూ, క్లిప్పులూ – అన్నీ చకచకా వాటి వాటి “హోల్డర్ల”లోకి వెళ్ళిపోయాయి కిమ్మనుకుండా! దుప్పటిని కసితీరా దులిపి పక్క వేసి, దిండ్లు రెండూ నాకు నచ్చినట్టు ఎత్తుగా పెట్టేసరికి, దుప్పటి మీదున్న రెండు గులాబీలూ “ఫర్ యూ లేడీ..” అని అభినందించాయి. వాటికో “థట్స్ మీ!” లుక్‍ను ఇస్తూ సన్నని నవ్వును మాత్రం ఆపలేకపోయాను. మంచిదే.. సిడీల పని చూడ్డానికి ఈ సున్నితత్వం కాస్త అయినా పనికొస్తుంది. ఆట ముగిసాక చిందరవందరగా ఉన్న పేక ముక్కల్ని క్షణాల్లో వేళ్ళమీద ఒక దొంతరలా మార్చగల నైపుణ్యం కూడా నా నేర్పు చూసి ఈర్ష్య చెందెలా వాటిని రాక్ లో పెట్టేశాను క్షణాల్లో.
ఇక పుస్తకాలు! ఇవ్వొక్కటీ అయ్యిపోతే నా విజయం పూర్తయ్యినట్టే! ఆఖరి మెట్టు అన్నింటకన్నా కష్టం ఎందుకంటే, లక్ష్యం అంత దగ్గరగా ఇంతకు మునుపెప్పుడూ కనిపించుండదు. కవ్విస్తూ అది ఉంటే, అడుగులు తడబడడం మామూలే! నాకన్నా ఈ గదిలో వాటి ఉనికి ఎక్కువైన పుస్తకాలు, నాతో పాటు నాలా స్వేచ్ఛగా నివసించే పుస్తకాలకి నేను ఇప్పుడో “వరుస” నేర్పించాలి. ఇన్నాళ్ళు “ఇలా, అలా” అని ఒప్పందాలేవీ లేని వాటికి ఇప్పుడు, “ఇలానే, ఇలా అంటే ఇలానే” అని నిర్భంధించాలి. ఇంకాసేపట్లో నేనూ, అవి స్వయంగా విధించుకున్న వరసల్లో ఇమిడిపోవాలి. అయినా సరే, వాటినీ సర్దేయాలి. మోండికేస్తాయేమో అన్న భయం ఉంది. అయినా చనువుతో వచ్చే ప్రత్యేక అధికార హోదాలో, నా అమాయకత్వం పాళ్ళు కలిపితే కరగకుండా ఉండగలవా అనుకుంటూ మొదలెట్టాను. ఇప్పుడే వరుసలో పెట్టాలి? పుస్తక విషయంపై సర్దుదామనుకున్నా! కాదు, ఏ భాషకా భాష ఉంటే బాగుంటుంది! అలా కాదు, ఏ భాషైనా రచయితల ప్రకారం సర్దితే వెత్తుక్కోడానికి సులువు. ఇష్టమైన పుస్తకాలూ, చాలా ఇష్టమైనవీ, అసలు నచ్చనివీ అలా సర్దితే? ఛ! మరీ మొహం మీద నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పాక్కూడా, ఇప్పుడు మళ్ళీ వేరు చేసి చూపటం దేనికి? ఏవో పడున్నాయి కదా అలానే, ఉండనీ! అన్నట్టూ.. పుస్తకాలు అడ్డంగా పెట్టనా? నిలువుగానా? ఎలా అయితే బా కనిపిస్తాయో అని కొని సర్ది చూశాను. నా చూపుకి అవెప్పుడూ ఆనందమే? కాని వేరే వాళ్ళకీ అలా కనిపించాలి కదా? ఎవరైనా చూడగానే ఆకట్టుకునేలా, “ఎన్ని పుస్తకాలు చదువుతుందో.. హమ్మ్.. రియల్లీ గ్రేట్” అనుకునేలా సర్దాలి! ఎలా? ఎలా? గూగుల్? వెతకనా?
How to organize your bookshelf?
How to organize your bookshelf to please people?
??
Hang on..
ఏం చేస్తున్నాను? నా పుస్తకాలని బుక్ ఎగ్జిభిషన్‍లో పెట్టడం లేదు కదా?! మరెందుకు ఒక మూసలో సర్దడం. ఎంత చిందరవందరగా ఉన్నా, అనుకున్న వేళలో కావాల్సిన పుస్తకం దొరక్క విసుకున్నా, వెతుక్కునా, దొరకగానే ఆనందపడినా, అన్నీ నాకే కదా సొంతం? మరెందుకు మరెవ్వరికోసమో సర్దడం? దేనికి? గది బయటకెళ్తే అటు వాళ్ళని నొప్పింపక, నేను నొచ్చుకోకుండానే నెగ్గుకొచ్చే అక్కర ఎటూ తప్పదు. ఈ చిన్ని గదిలో నా “స్పేస్”లో నేనూ, నావన్న ప్రతీ వస్తువూ మాకు నచ్చిన రీతిలో ఉండకూడదూ? కనీసం, పడుండకూడదూ?! అడవిలా ఉంటుందా అప్పుడు? ఉండనీ.. క్రోటెన్ అందాలు కావాలనుకుంటే బయటే, బాల్కనీలోనే ఉంటారు. ఈ గదిలోకి రావాలంటే నాతో సహవాసం కాదా? నా మీదే ఏ ఆంక్షలూ ఉండకూడదూ! వేటి మీదా నేను పెట్టను. నేను ఇంతే కదా!
ఓహ్.. ఇదే నా బాధా? ఇందుకేనా ఇందాకట్నుంచి ఆపకుండా ఏడుస్తున్నాను? నీ మీద ఆంక్షలు పెట్టాను కదూ? నువ్వు నాతో ఉంటే సరిపోదూ, ఇలా ఉండాలి, ఆ “ఇలా” ఏ స్నేహమో, ప్రేమో, బంధమో, మరేదో.. ప్రపంచం ఏది ఆమోదిస్తే అదే అయ్యుండాలన్న వెర్రి తపన. నిన్ను అలానే ప్రపంచానికి పరిచయం చేయలేకపోతే, నన్ను నీకు దూరం చేసేస్తారని భయం. మన చెలిమికి అందుకే నామకరణ మహోత్సవం పెట్టదలిచాను. నన్నేం చెయ్యమంటావు? అలా చేయకపోతే ఈ కన్నీళ్ళకి కూడా నీ పేరివ్వలేను. ఇదో మళ్ళీ మొదలయ్యాయి, ఆగటం లేదు! కన్నీళ్ళు నీ గుండెను చేరలేక, ఇక్కడ, ఇలా.. ఆలోచనలు కన్నీళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నాయి. ఆపలేక, ఆపుకోలేక, దిండులో మొహం దాచుకుని, మంచానికడ్డంగా బొర్లా పడిపోయాను. ఏడ్చే కొద్దీ సన్నగా వణుకుతున్న శరీరంలో తీవ్రత ఎక్కువైయ్యి తల బరువెక్కిపోతోంది. క్లిప్పు తీసి మంచం ఏ మూలకో విసిరాను. జుట్టు ఊపిరి తీసుకోవడంతో కన్నీళ్ళు ఇంకాస్త హాయిగా బయటకొస్తున్నాయి. నా వెక్కిళ్ళు బయటకి వినిపిస్తే కష్టమన్న స్పృహ రాగానే, మెల్లిగా లేచి మ్యూకిక్ ఆన్ చేశాను. ఇప్పుడు విషాద సంగీతంకావాలనుకుంటే అన్నీ ఆనందభైరవులే తగులుతున్నాయి. నాక్కావాల్సిన కిషోర్ దొరికేసరికి సిడీలన్నీ కొత్త కొత్త స్థానలను ఆక్రమించాయి, రాక్ బయట. లో వాల్యూమ్ సెట్ చేసి, ఆన్‍లైన్ వస్తే మనసేమన్నా ఊరుకుంటుందేమోనని లాప్‍టాప్ ముందేసుకున్నా, పడుకునే! ఊహు, మనసును మభ్యపెట్టలేను. లాపీని పక్కకు తోసి మరో దిండు కూడా పక్కలో వేసుకుని, ఏదో పుస్తకం తెరచి చదువుదామనుకుని. తెరిచాను.. చదవటంలేదు. అక్కడే పెట్టుకుని, మన చివరి సంభాషణ రీప్లే చేసుకుంటుంటే, హాయిగా ఉంది. కన్నీళ్ళు కూడా సన్నని ధారగా వస్తున్నాయి, ఆ హాయిని పాడు చేయకుండ!
ఆ హాయిలో కళ్ళు మూసుకున్నాను. “అందరిలో ఒక్కడిలా నిన్ను వదల్లేక, నా వాడిగా ప్రపంచానికి పరిచయం చేయలేక నేను నలిగిపోతూ, నిన్నూ నిలువనివ్వటం లేదు. నా భావలను ఓ మనసుపై అనవసరంగా రుద్దేసి..” ఆలోచనల సుడిగాలిలో కొట్టుకుంటున్నాను. “నువ్వు మమల్నే కట్టిపడేయ(లే)వు. ఇంకో మనసు ఎలా కట్టేస్తావు? నీ వల్ల తనకి ఏ ఇబ్బందీ లేదు.. పడుకో కాసేపు” అంటున్నట్టు, తెరిచిన పుస్తకంలో కాగితాలు రెపరెపలాడుతూ తల నిమిరాయి.
కట్టిపడేయలేకపోవటం – నా బలమా? బలహీనతా?
“How to organize your bookshelf”
ఈ సమస్య నాకూ చాలాసార్లు వచ్చింది 🙂 భాషల వారిగా, రచయితలు, సబ్జెక్ట్… ఎటు తెగక పుస్తకాల్ని unorganized గానే ఉంచడం అందం అనేస్కుని వదిలేస్తాను. అమ్మ నా theory ని defy చేస్తూ సర్దేస్తుంది, ఆమెకు నచ్చిన రీతిలో. 🙂
“కట్టిపడేయలేకపోవటం – నా బలమా? బలహీనతా?” — రెండూ కాదు. స్వభావం 🙂
అన్నట్లు స్వభావాలు మార్చుకోవడం కష్టం 🙂
LikeLike
యోగి: Well said! స్వభావాలు మార్చుకోవడం కష్టం. మన స్వభావంలో తెలీని పార్శ్వాలు కూడా ఉంటాయి కదా!
LikeLike