జ్ఞాపకాలతో నడక

Posted by

“A walk to remember” సినిమాలో హిరోయిన్ “నాకు ఏక కాలంలో రెండు చోట్ల ఉండాలని కోరిక!” అని చెప్పినప్పుడు హీరో మామూలుగానే విని ఊరుకుంటాడు. కానీ ఉన్నపలనా ఒక రాత్రి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి నడిరోడ్డు మీద నుంచోబెట్టి, రోడ్డు పై నున్న లావాటి తెల్ల గీతకు రెండు వైపులా కాళ్ళు ఎడంగా పెట్టమని చెప్పి, అక్కడే ఉన్న బోర్డు చూపిస్తూ “చూడు.. నువ్విప్పుడు రెండు ప్రదేశాల్లో ఒకేసారి ఉన్నావు” అంటాడు. ఆ అమ్మి, తాను నుంచున్నది రెండు ఊర్ల సరిహద్దు గీతకు అటు ఇటు అని గ్రహించీ గ్రహించగానే ఆ అబ్బిని చుట్టేస్తుంది. “హే.. ఇది చీటింగ్! నేను అన్నది ఇలా కాదు.. ఈ బౌండరీలన్నీ మనం సృష్టించుకున్నవి, అలా కాకుండా నిజంగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో నేను ఒకేసారి ఉండాలబ్బాయ్.. చూపించు నీ బడాయ్!” అని ఒక్కసారైనా వాదులాటకి దిగుతుందేమో అనుకుంటాను. ఊహు.. ఎన్ని సార్లు సినిమా చూసినా ప్రతీ సారి ఆ అబ్బాయి మీద ప్లాట్ అయ్యిపోతూనే ఉంటుంది. ఆ విషయం కాస్త పక్కకు పెడితే, నాకు ఈ సీను చాలా నచ్చటానికి కారణం, this is a practical guy’s approach to a dreamy’s challenge. “నాకు ఏక కాలంలో రెండు చోట్ల ఉండాలని కోరిక!” ఎంత అసంబద్ధంగా, అలోచనారహితంగా అనిపిస్తుందో, ఆ అబ్బాయి చర్య వల్ల చట్టుక్కున తెలివైన కోరికగా మారిపోతుంది. కొందరి సాంగత్యంలో మన వెర్రితనంలో కూడా కొత్త అందాలు కనిపిస్తాయి.

“हे बच्चू तुम सुनले मेरा दिल का एक आर् डर्” (ఓయ్..నా మనసు ఆర్డర్ విను..) అనే అవకాశం నాకూ ఉంది కావున, “ముందుకెళ్తూ వెనక్కి వెళ్ళాలి” అని ఆర్డర్ పాస్ చేశాను. “ముద్దపప్పు, రాగి సుద్ద, మట్టి బుర్ర” అని నా నమ్మకం కాబట్టి పాపం చాన్నాళ్ళే పడుతుందిలే, ఆర్డర్ సర్వ్ చేయటానికనుకున్నా. కానీ ఒక శనివారం మధ్యాహ్నం పూట. కోఠీ బుక్ సెంటర్ లో ఏదో ఎగ్జిబిషన్ అనేసరికి ఎటే వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. ఈ లోపు అమ్మ, “లేదు నాకు బేగం బజార్ లో పనుంది, మీ ఇద్దరితోనూ..” అని బాంబు పేల్చింది. చేసేది లేక, మొహం వేలాడేసుకునే బయలుదేరాం.

పాత బస్తీ!! ఆ గాలిలోనే ఏదో ఉంటుంది. చిన్నప్పుడు అగ్గిపెట్టలతో ఇల్లు కట్టేవాళ్ళం. పేక ముక్కలయితే మరీ త్వరగా కూలిపోయేవి. అగ్గిపెట్టలు, లేక నోటు పుస్తకాల అట్టలతో చేస్తే కనీసం తనివి తీరా చూసుకునేంత సేపైనా ఆగుతాయి. నాలుగు అగ్గిపెట్టల్తో ఒక ఇల్లు అయ్యిపోయేది. అలా వరుసగా ఒకే రకం ఇల్లు. ఒక్కో చోట మాత్రం రెండంతస్థులు. మధ్యన మరీ ఇరుకుగా ఉండేలా కొన్ని పెట్టటం -ఇవి షాపులు. పల్చని అట్టముక్కలు తీసుకుని ఒక తలుపు ఒక కిటికీ ఆకారాలు చేస్తే, ఇళ్ళు పూర్తి స్థాయిలో తయారయ్యేవి. అటూ ఇటూ ఇళ్ళు, షాపులు కట్టేసాక, మధ్యన ఒక నల్ల కాగితం పెట్టేదాన్ని, అది రోడ్డు! అంటే ఒక వీధి పూర్తయ్యిందన్న అన్న మాట. (మొహమాటపెడితే, గల్లీ అంటాను.) ఇరుకైన రోడ్డుకి ఇరువైపులా చిన్న చిన్న గదులతో ఇళ్ళు మాత్రమే నా నమూనాలో ఉన్నాయి. వాటిలో జీవం చూడాలంటే మాత్రం పాత బస్తీలో సారి తిరగాల్సిందే. హడావుడిగా పరిగెత్తే వాహనాలు, అంతకన్నా హడావుడి పడే చిట్టి పాపాయిలు, క్రికెట్ట్ ఆడే వీరులూ, సరుకులు కట్టించుకుని వయ్యారంగా నడిచిపోయే బుర్ఖా భామల గాజుల, గజ్జెల గలగలలూ, గల్లీ చివర్న సైకిల్ మీద బీటేసే కుర్రకారు, అరుగు మీదో లేక నాలుగు కూర్చీలేసుకునో లోకాభిరామాయణం చెప్పుకునే చాచాజాన్ లు.. వాహ్! ఇక అక్కడే ఏ ఇరానీ ఛాయ్ కొట్టో, బేకరీనో, మిరపకాయ బజ్జీ బండో ఉంటే… సుభాన్ అల్లా!! హమ్మ్.. వీటితో పాటు ఒక్క గుడిలో హారతి కర్పూరం వాసన, దగ్గర్లో మసీదు దరిదాపుల్లో అగరొత్తుల వాసన! మత్తెక్కించి వదుతాయి. మా ప్రయాణం ముందుకే సాగుతోంది… నా జ్ఞాపకాలు మాత్రం వెనక్కే వెళ్తున్నాయి.

బేగం బజార్ లో పని చూసుకుని కోఠి చేరాం. హైద్ లో నాకిష్టమైన ప్లేస్ అంటే ఇదే చెప్తానేమో. ఇప్పుడంటే మాల్స్ అంటూ తిరుగుతున్నా కానీ ఆ వీధుల్లో ఎన్ని చెప్పులు అరగదీయలేదని?! (అహ.. ఉద్యోగాల కష్టాలు అవీ కాదు, షాపింగులు చేసి చేసి.. :P) పద్మవ్యూహం లాంటి ఆ రోడ్ల మీద రాయటం కోసం ఎన్ని పదాల గుమ్మరించినా, అనుభవంలోకి రావు. “మా కొట్టుకి రండి” అంటూ బెదిరింపుల్లాంటి అభ్యర్థనలు. “కొనండి” అని అడుగుతారే కానీ వినిపించడానికి అది “కొంటావా?చస్తావా?”! సైకిల్ అంత వేగంగా పోయే కారు, దాని సైరను, ఈ లోపు ఎదో నచ్చి ఉన్న గుంపులో ఒకరు ఆగిపోవటం, ముందేదో బాగుందనుకుంటే ఇంకోరు వెళ్ళిపోవటం, “ఎక్కడ?ఎక్కడ??” అన్న వెతుకులాటలు; ఇవ్వన్నీ చాలానే మంది చూసుంటారు. ఈ గోలలేమీ లేకుండా, ఇంకా పూర్తిగా ఎండ కూడా రాని ఉదయం వేళ, ఖాళీ వీధుల్లో మూసేసిన కొట్లన్నీ, నిద్రపోతున్న బిచ్చగాళ్ళని చూస్తూ, కొన్ని చోట్ల “తీస్తారా? తీయ్యరా?” అని గదామాయించి మరీ చేసిన షాపింగ్స్! “ఇంకో మాట.. ఇంకో మాట” అంటూ బోణీ బేరాలు! మార్నింగ్ షో సినిమాకి కాలేజీ బంక్ కొట్టి ఓ ఉదయం పూట కోఠీ అంతా కలయతిరిగిన వైనం ఆరేళ్ళవుతున్నా అంతే స్పష్టంగా ఉంది. నడుస్తూ నడుస్తూ పొరపాటున ఒక అమ్మాయి నా కాలు తొక్కి నాకు సారి చెప్పలేదని నేను చేసిన రాద్ధాంతం! నాకు కావాల్సిన పుస్తకం ఎవరూ అమ్మటం లేదన్న ఉక్రోషంలో చేసిన భీషణ ప్రతిజ్ఞలూ! ముందుకే కదా నడుస్తున్నానూ అని గుర్తుతెచ్చుకోవాల్సినంత వెనక్కి ఆ వీధుల్లో పరిగెడుతున్నా, అప్పటికీ ఇప్పటికీ వచ్చిన ప్రతి చిన్న మార్పూనూ గమనించగలుగుతూ అడుగులు ముందుకి సాగాయి.

కోఠీలో తినడం అంటే గోకుల్ చాట్! అక్కడికి చేరగానే గుండె నీరు కారింది. ఊసురుమంటూ గోకుల్ చాట్ వెనక్కి వెళ్తే స్వేచ్ఛగా విహరించే పావురాలు. వాటిని చూస్తుంటే భయాలూ, అభద్రతా భావాలూ కూడా అలానే చిటుక్కున ఎగిరిపోయాయి. నా పక్కనే నలుగురి అమ్మాయిల గాంగ్! “గోకుల్ బాక్ ఎంట్రెన్స్ లేదా?” అన్న ప్రశ్న వినిపించేసరికి వాళ్ల లోకం నుండి బయటికి వచ్చి హుందగా సమాధానం ఇచ్చి, మళ్ళీ ఆ కబుర్ల లోకంలో మాయమయ్యిపోయారు. కోఠీ వీధుల్లోనే సాధ్యమేమో, చట్టుకున్న ఎదురుపడ్డ అపరిచుతురాలు, అంతే టక్కున “డ్రెస్సు భలే ఉంది..ఎక్కడ కొన్నారు?” అనో లేక, “హే.. చూడు, చూడు తన డ్రెస్స్” అని చెవులు కొరుక్కోవడమో వినిపించేది. అమ్మాయిలతో మాటా మాటా కలిసి, షికారులూ, షాపింగులూ చేసే అవకాశాలున్నాయి. అదే అబ్బాయిలు ఈ ముక్కంటే, మొహం మీద తిట్లు, వెళ్ళిపోయాక మురిసిపోడాలు! అబ్బాయిలెక్కువగా ఉపయోగించే “కలర్స్” కోఠీలో పుష్కలం. కానీ అది వాళ్ల బట్టల వచ్చింది కాదు, అందానికి మించిన ఆత్మవిశ్వాసం, దానికి ఏ మాత్రం తగ్గని చిలిపితనం వల్లా వచ్చుండచ్చు. బ్రతుకింకా భయపెట్టకపోవటం వల్ల వచ్చిన నిర్భీతి కూడా అయ్యుండచ్చు. ఏదేమైనా ఇక్కడ “అందాలే వేరులే!”

ఇక తిరుగు ప్రయాణం! ఒకే క్షణంలో ప్రస్తుతాన్ని, గతాన్ని జీవించేసి హాయిగా తిరుగొస్తుంటే ఒక సుమనోహర దృశ్యం. “ఇంకో రెండు గంటల్లో బడి వదిలేస్తారు” అన్న ఆనందంలో ఉన్న సూర్యుడు, కాస్త ఉత్సాహంగానే ఉన్నాడు. నేరుగా చూసే సాహసం చేయలేనంత తీక్షణంగానే ఉన్నాడు, ఒక మసీదుకున్న రెండు మినార్ల మధ్య. నీలి మేఘాల మధ్య నిలబెట్టున్నట్టుగా కనిపించే రెండు తెల్లని మినార్లూ, మధ్యన నారింజ పండు రంగు సూర్యుడూ ఏదో పేటింగ్ లా కనిపిస్తుంటే, ఆ చిత్తరవుకి ప్రాణం పోస్తున్నట్టుగా టపటపా రెక్కలనాడించుకుంటూ ఎగిరిన పక్షి.. మాయచేసిందో ఏమో కళ్ళు దాన్నే వెంబడించాయి. అది కాస్తా, ఓ కరెంట్ తీగ మీద వాలింది కాస్త ప్రయాణానికే. అదే తీగకు వేలాడుతున్న పతంగూ, దానికున్న దారాన్ని పట్టుకున్న చూపు అక్కడో మైదానం ఉందనీ, ఇద్దరు చిన్నారులు ఆ గాలిపటానికేసే చూస్తున్నారనీ గమనించి నా చిన్నప్పుడో ఏం జరిగిందో చెప్పటానికి ఉపక్రమించిన మెదడుని “హే.. ఇక ఆపు! మళ్ళీ ఎంత దూరం తీసుకుపోతావ్?” అని అనాలనుండీ అనలేక, మరో క్షణం మరో జ్ఞాపకంలో, కళ్ళ ముందున్న నిజంలో ఒకేసారి నేను! ఇక్కడుంటూనే, అక్కడా ఉన్నాను!

2 comments

  1. “మనుషులందరికీ మనసుంటుంది. కొందరు దానిని గుర్తించనే గుర్తించరు. అనేకులకు దాని శక్తేమిటో అసలు తెలియదు. మనసు ఎంతో దూరం పోగలదు. దానికి ఎన్నో శక్తులున్నాయి. ఆచరణలోకి తీసుకొస్తున్న కొద్దీ ఒక్కోశక్తీ మనకు తెలిసి వస్తుంది”
    – బుచ్చిబాబు

    మనసుకి ఏమైనా సాధ్యమే. కేవలం ఒకే సమయంలో రెండు చోట్ల ఉండటమెంత!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s