మాట – మౌనం (బ్లాక్ ఆండ్ వైట్)

Posted by

రాముడూ -భీమూడు”, “సీతా ఆవుర్ గీతా” సినిమా లైన్స్ మీద “మాటా-మౌనం” (పేర్లల్లో ప్రాస కుదరకపోయినా) అనే బ్లాక్ ఆండ్ వైట్ చిత్రం ఉందనుకుందాం. అదెలా ఉంటుందంటే..
*********************************************************************************

మాటా – మౌనం తోడబుట్టినోళ్ళనుకుంటే, అప్పుడు మౌనం పెద్దక్క అన్నమాట. నోట్లో నాలుక లేనిది. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన తెల్ల రంగు కాటన్ చీర కట్టుకుని (వీలుంటే వీణ వాయిస్తున్న ఫోజులో) జుట్టుని గట్టి ముడిగా బిగించి ఓ రకమైన హుందాతనం, ఠీవి, రాజరికం, దైవత్వం లాంటి భారీ పదాలన్నింటికీ చిరునామాలా ఉంటూ ఉంటుంది. మౌనం అంటే ఊర్లో అందరికీ గురి. ఎప్పుడో కానీ ఆమె అందరికీ చేరువగా రాదు కాబట్టి, ఆమెను గురించి తెగ మాట్లాడేసుకుంటుంటారు, “హెంత ఘోప్ప అనుకున్నావ్” అనీ, “అబ్భో.. ఆమె సాంగత్యం మహామునులకే సాధ్యమట” అనీ. ఆమెను చేరుకోడానికి చాలా మంది యాగాలు చేసినంత పని చేస్తారు. ఆమె పాదరవిందాలు చేరాలని తపన “పడి”పోతారు.

పూర్తిగా తెరను ఆక్రమించేసిన ఈ పాత్రను కాస్త పక్కకు జరిపితే, వీలున్నంత చోటులో హాయిగా అల్లుకుపోయే చిట్టి చెల్లెలు “మాట” మన ముందుకొస్తుంది. ఈమె పాపం, మౌనం కన్నా చాలా చిన్నది, అందుకే లోకం పోకడ తెలీని వెర్రి వెంగళ్ళప్పలా చూస్తుంటారు చాలా మంది. ఉండడానికి అనుకవ, ఖచ్చితత్వం, కలివిడతనం, సరదా అన్నీ ఉన్నా, అక్కగారితో ఈమెన పోలుస్తూ “అబ్బే.. చెల్లి ఉత్త డొల్ల, మాటలంతే!” అంటూ కొట్టిపారేస్తుంటారు. ఎంచక్కా చుడీదార్ వేసుకుని రోజుకో కొప్పు పెట్టే మాటను చెంగు చెంగున గెంతుతూ ఏ కొండనూ ఢీకొట్టని నదిలా ఉరకలేస్తుంటే కళ్ళార్పకుండా మంత్రముగ్ధులై చూసేసి, “ఆడంబరం, ఢాంభికం! అక్కను చూసి కూడా నేర్చుకోదాయే! నక్క ఎక్కడా? నాకలోకం ఎక్కడా?” అంటూ చెవులు కొరుకుంటారు.

మాటను మాటల్లోనే ఆడిపోసుకుంటారు. మౌనాన్ని అర్చించడానికీ మాటనే వాడుకుంటారు. మొహమాటస్తురాలైన మాటేమో ఎవరి మాటా కాదనలేదు. “నాకంత లేదు బాబోయ్య్.. నన్నో చట్రంలో ఇరికించేసి, పైన మాటలతో బంధించేసి మీరేదేదో అనేసుకుంటున్నారు” అనే మౌనఘోషను వినగలిగే ధీరులెవ్వరని? మౌనమే సంభాషించాలని ఉబలాటపడితే అప్పటికప్పుడు తను చెల్లెల్ని జత తీసుకెళ్ళి తన తరఫున మాట్లాడమనాలి. అక్క మాట తీయలేక ఏదో చెప్పబోయినా, మాటకి విలువేదీ?

భీకర విషాద సంగీత నేపధ్యంలో తలుపుపై జారీ జారని పైటతో నీరసంగా దిగాలుబడ్డ భుజాలను జార్చి, కంట తడి బయటకి రానివ్వకుండా శూన్యంలోకి చూస్తూ భారీ నిటూర్పులు విడుస్తూ మౌనం ఒక పక్క, చున్నీతో ముక్కు చీదుకుంటూ అడ్డొస్తున్న జుట్టును విసురుగా పక్కకు తోస్తూ కన్నీళ్ళాగక, ఓపిక లేక మంచానికి అడ్డం పడ్డ మౌనం ఒక వైపు తెర స్థలాన్ని చెరి సగం పంచుకుంటాయి.

కోట బయట మాత్రం, “మౌనానికీ జై, మౌనానికీ జై” అన్న జయజయధ్వానాలు వినిపిస్తూనే ఉంటాయి.
***********************************************************************************

మాటా – మౌనం ( వైట్ ఆండ్ బ్లాక్) – అతి త్వరలో..
మాటా – మౌనం ( నా వెర్షన్) – త్వరలో..

One comment

Leave a comment