“వైట్ ఆండ్ బ్లాక్? అచ్చు తప్పు!” అని మీరనుకునే లోపు దాని పై ఓ రెండు ముక్కలు. బ్లాక్ ఆండ్ వైట్ లో బ్లాక్ ని వైట్ గా వైట్ ని బ్లాక్ గా చూపించడమే. అంటే పాత్రల రోల్ రివర్సల్ మాట!
**************************************************************************
ఆ ఊరిలో అన్ని కుటుంబాల్లానే అదీ ఒక కుటుంబం. చింతల్లేని కుటుంబమా? కాదా? అన్నది మున్ముందు తెల్సిపోతుంది, తొందర పడి ఓ మాటనేసుకుంటే మళ్ళీ అవ్వాక్కవ్వాల్సి రావచ్చు. ఆ కుటుంబంలో ఒక అమ్మా, ఒక నాన్నా, ఒక నాన్నమ్మ, ఒక తాతయ్యా ఉన్నారు. అత్తలూ, మామలూ, పెద్దమ్మలూ, పెద్దనాన్నలూ, బాబాయిలూ, పిన్నులూ అంతా కల్సి, జనాభా లెక్కలు రాసుకోడానికి అరగంట సమయం పట్టేంత మంది ఉన్నారు. ఇంత మందున్న ఇంట్లో మరో ముఖ్యమైన నివాసి “సందడి”. అందరూ నిద్రపోయాక, ఎవ్వరూ నిద్రలేవని కాసేపూ సందడి కూడా నిద్రిస్తుంది. మిగితా అన్ని వేళలా సందడే సందడి.
మనమనుకున్న ఒక అమ్మా, ఒక నాన్న పిల్లలు మాటా – మౌనం. మౌనం మళ్ళీ అక్కే ఇక్కడ కూడా, కానీ ఇక్కడ మాత్రం మాటే రాజ్యం. పది మందీ తిరుగుతూ ఉండే ఈ సావిట్లో మౌనానికి స్థానమేదీ? ఏ మూల వసారాలోనో కూర్చొని ఉంటుంది. మాట మాత్రం కాళ్ళకున్న మువ్వల సవ్వడి, గాజుల గలగలతో ఇల్లంతా చకచకా తిరిగేస్తుంటుంది. పొద్దున్నే సుప్రభాతపు గీతంతో పాటు “లే.. పొద్దు పొడిచింది” అంటూ మొదలుకుని, స్నానాల గది దగ్గర “నే ముందంటే.. నే ముందు” అంటూ, పూజల వ్యవహారంలో “ఆ పళ్ళెం అందుకో, ఈ ప్రసాదం తీసుకో” అని మంత్రాల మధ్యన, కూరగాయలమ్మతో బేరాల్లో, ఫలహారాల వేళ “తిను సరిగ్గా.. మళ్ళీ పొద్దు పోయే దాకా రావు” అన్న నాజుకైన మందలింపులో, పరుగు పరుగున పనులకెళ్తున్న వాళ్లకి అప్పగింతల్లో, పాలెర్ల మీద కేకలేస్తూ, భోజనాలయ్యాక ఆడవాళ్ళ కుబుర్లో, బడి నుండి వచ్చిన పిల్లల అల్లర్లలో, పిల్లల బదులు దెబ్బాడుకునే తల్లుల తిట్లల్లో, సాయంత్రం వేళే మొదలయ్యే వంట పనుల్లో, అలసి తిరిగొచ్చేవారిని ఆప్యాయతగా అక్కున చేర్చుకోవడంలో, రాత్రుల భోజనాల్లో, వీధి అరుగున కూర్చుని లోకాభిరామాయణంలో, నిద్రపుచ్చుతున్న పాపలకి కథల్లో, అన్ని చోట్లా, అన్ని వేళలా ఆ ఇంట్లో అందరి తలలో నాలుకా “మాటే”. సంతోషమైనా విషాదమైనా ఆ ఇంట “మాట”దే రాజ్యం.
మౌనం ఎప్పుడైనా సరదా పడి ఏ ఒక్కరికి జత కుదిరినా, “ఏమైంది? అలా ఉన్నావ్?” అనుకుంటూ మాట ముసిరేస్తుంది. కాస్త మొండికేసి పలకకపోతే “ఏదో అయ్యింది? ఏంటది?” అంటూ నిలదీస్తుంది. “ఏం జరిగిందంటే నే చెప్పలేను” అని అందుకుంటే “ఏ కాలేదంటే నేనొప్పుకోనూ” అని నస పెడుతుంది. ఏం జరిగిందో చెప్పలేక, మాటతో కలవడానికి మనస్కరించక, కాస్త ఏకాంతాన్ని ఆశ్రయిస్తే, “ఏదో అయ్యింది, ఏదో అయ్యిపోయింది” అంటూ మూకుమ్మడి దాడి చేసే మాటలను అధిగమించే ఏకైక అస్త్రం నిద్రను నాటకంలో ముఖ్యపాత్రను చేస్తే “ఏదో అయ్యింది.. చెప్పటం లేదు పిచ్చి వెధవా” అంటూ తలనిమురుతూనే ఉంటుంది మాట.
కేవలం కొన్ని క్షణాల మౌనం అంతే! అంతరాంతరాల్లో ఉన్న అలజడులన్నీ సర్దుకుపోతాయి. ఆ క్షణాలు కూడా మౌనానికి దక్కవు. మౌనం అంటే బాధకి పర్యాయపదమని వార భావన. మౌనం తన ఉనికి చాటుకునేది ఒకే ఒక వేళ, కొత్తగా పెళ్ళై గూటికి చేరిన జంటకి జంటగా. బిడియం, సిగ్గూ, భయం, అనుమానం కలిసొచ్చి మాట నోరు కట్టేసిన వేళల్లో, మౌనం వారిద్దరి మధ్య వారధి వేస్తూ ఉంటుంది, అందరినీ తప్పించుకుంటూనే. కానీ వాళ్ళు కూడా “ఛా.. మాటలు ఆడుకునే మాటే” లేదు అని విసుక్కుంటారు, కలిసీ కలవగానే.
మాటలతోనే పంచుకున్నా, తెంచుకున్నా! మాటల్లోనే బంధాలూ, ఒప్పందాలు! మాటలే గుర్తుంచుకున్నా, గాలికి వదిలేసినా! మాటలే – చిన్నబుచ్చినా, మైమరపించినా! మాట అందరినీ కలుపుతూ అందరిలో ఒక్కరిలా ఇల్లంతా కలియతిరుగుతుంది. మౌనం మాత్రం ఏ నిద్ర లేని చీకటి రాత్రి కోసమో ఎదురుచూస్తూ ఉంటుంది డాబా మీద.
మౌనం మాత్రం ఏ నిద్ర లేని చీకటి రాత్రి కోసమో ఎదురుచూస్తూ ఉంటుంది డాబా మీద….
nice ending…
btw
thanks for accepting… 🙂
i think you’ve changed the layout..!! it’s cool..
🙂
LikeLike
Test Comment!
LikeLike