పుస్తకంలో నేను :P

Posted by

మా ఆఫీసులో ప్రతీ వార్షికోత్సవానికి డబ్బులు పోసి “ఎంటర్‍టేన్‍మెంట్” కొనుక్కోకుండా, మేమే మమల్ని మేమే ఎంటర్‍టేన్ చేసుకుంటుంటాం! “ఏం చెయ్యాలి?” నుండి “ఎలా చెయ్యాలి?” వరకూ అన్నింటికీ చర్చలే! ఆ చర్చల్లో గమ్మునుండక, తల్లోకొచ్చిన ప్రతీ ఐడియాను ప్రతి తలతో పంచుకోవచ్చు. ఐడియా బాలేకపోతే “ఊహు” తో ఊరుకుంటారు! అదే బాగుంటే, ఐడియాను నిర్విఘ్నంగా సఫలం చేసే బాధ్యత చెప్పినోళ్ళ నెత్తి మీదే పడేస్తారు. నోరూరుకోని నాబోటి బద్ధకస్తులకి ఇటువంటి ఘట్టాలు – చంచాలో మహాసాగరాలు ఈదటంతో సమానం. ఏదో బ్లాగర్ల పుణ్యమా అని బోలెడు మంచి పుస్తకాలు కొనుక్కున్నాన్న అత్యుత్సాహంలో, “ఎంత బడాయి ఈ పిల్లకి!” అనుకునేరు జనులు అన్న జంకూ బొంకూ లేకుండా ఓ చాంతాండంత లిస్ట్ రాసిందే కాక, చివర్న నా బుద్ధి వంకరను చూపించుకోటానికన్నట్టు.. “పుస్తకాలకీ నవతరంగం లాంటి సైటు” అని నిప్పు అంటీ అంటించకుండా పక్కకు పోదాం అనుకుంటుండగా, అసలు పొరపాటున కూడా నా బ్లాగు తనంతట తాను చదవని సౌమ్య, ఆ టపా చదివి, “ఐడియా బాగుంది.. బాగుంది” అంది. నేను ఉబ్బితబ్బియ్యైపోతున్న వేళ, “మనమిద్దరమే చేయ్యచ్చేమో!” అనగానే గుండెల్లో మొదలైన రైలు “మనమిద్దరం చేద్దాం” అన్న స్టేషను దాటి “మనమిద్దరం చేస్తున్నాం” వరకూ సౌమ్య నడుపుకొచ్చేసింది. ఇహ ఆలస్యం చేస్తే లాభం ఉండదని నేను “రాస్తారోకో”లు మొదలెట్టాను. “అమ్మాయ్.. నా వల్ల కాదు! నేనిందుకు పనికి రాను. యు నో.. ఐ కాన్ట్ డు థిస్. అది కాదు, అసలు నాబోటి వాళ్ళు ఇంతటి మహత్తక్కార్యాలకు ఎలా కుదురుతారు?” లాంటివెన్నో అంటూనే ఉన్నా! కానీ ఒక్కసారి కమిట్ చేయించడానికి కమిట్ అయ్యిన సౌమ్య మాట ఎవ్వరైనా వినాల్సిందే కాబట్టి.. పుస్తకం.నెట్ తో నా ప్రస్థానం మొదలయ్యింది.

నేనింత వరకూ ఇలాంటి కమ్మింట్‍మెంట్ తో కూడిన లాంగ్ టర్మ్ ప్రాజెక్టుల్లో ఇన్‍వాల్వ్ కాలేదు. అందుకు ముఖ్యాతి ముఖ్య కారణం నా అభిరుచులు పెద్ద కారణాలేమీ లేకుండా ఊరికూరికే మారిపోతుంటాయి. నా మూడ్ ఏమో ఉత్తపుణ్యానికి, ఉత్తపాపానికీ మారి(మారకుండా) పోతూ ఉంటుంది. (దీన్నే మా ఇంట్లో “బద్ధకం” అంటూ ఉంటారు.. అదే నిజం అని నేను చెప్పను!) ఎరక్క పోయి ఇరుకున్నా కాబట్టి ఎప్పుడోకప్పుడు “రిటైర్డ్ హర్ట్” కావచ్చులే అన్న ధైర్యంతో ముందుకు పోవడానికి సిద్ధపడ్డాను.

ఓ ఏడాది పాటు అనుభవాలన్నీ రాసుకోవాలంటే కాస్త కష్టమే. హైలైట్స్ లో ఎక్కువగా బౌండరీలే చూపించాలి. కానీ అసలు ఇన్నింగ్స్ ఏర్పడేది సింగిల్స్ వల్ల. పుస్తకం.నెట్ కోసం చాలా విధాలుగా నా comfort zone దాటుకొని కొన్ని చేయాల్సి వచ్చింది. అందులో ఎప్పటికీ నాతో నిల్చిపోయేది మాత్రం అబిడ్స్ ఫుట్‍పాత్ మీద అమ్మకందారులతో వారి వ్యాపార సంబంధ విషయాలు మాట్లాడ్డం. కోఠీ, అబిడ్స్ వీధులు తిరిగి బోలెడన్ని చెప్పుల జతలు అరగదీశాం. హైద్ లో ఈ మాల్స్ అవీ రాక ముందు పుస్తకాల నుండి ప్రతీ వస్తువు షాపింగ్ ఆ వీధుల్లో జరగాల్సిందే. హైదరాబాదీ అంటే బాగా బేరమాడగలగాలి అన్న తమాష వ్యాఖ్య ఉంది. అసలు ఏ మాటా అనకముందే “ఇంకో మాట చెప్పు” అనాలంట! నాకు బొత్తిగా బేరాలాడడం రాదు. నేనో వస్తువు తీసుకొని “ఎంత?” అంటాను. వాడు, “వంద” అంటాడు. నేను “పాతిక” అంటాను. వాడు బాగులో దాన్ని వేసి నాకు ఇచ్చేస్తాడు. అంటే దీని అర్థం, అది ఏ ఐదు, పది రూపాయల వస్తువని! అందుకే నా స్నేహితురాళ్ళందరూ నన్ను షాపింగ్ కని తీసుకెళ్లి వస్తువుల ఎన్నిక కాగానే బయటకి పంపించేస్తారు. బేరమాడ్డం రాకపోయినా, బేరం షాపోడికి అనుకూలించే చేయటంలో నా దగ్గరేదో రహస్య విద్య ఉందని వాళ్ల నమ్మకం. అలాంటి నేను, ఫుట్‍పాత్ మీద అరికాళ్ళ మీద కూర్చొని నేను కంగారుపడుతూనే తడబడుతున్న వాళ్లని నెమ్మదింపచేసి, ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టి – అదో ప్రహసనంలా అనిపించింది. కొన్ని పనుల ఫలితం చూడ్డానికి చాలా చిన్నగా అనిపిస్తాయి. నిజానికి అవి చిన్నవే కూడా! కాకపోతే వాటి వల్ల మనలో వచ్చే మార్పులు ఎంత గణనీయం అంటే, మనం మరెన్నో పెద్ద పనులు చెయ్యటానికి ఊతాన్ని అందిస్తాయి.

పుస్తకం.నెట్ వల్ల కలిగిన మరో సదవకాశం, కొందరితో పరిచయాలు. బ్లాగుల వల్ల స్నేహాలు చాలానే కలిగాయి. అందునా, నా వయస్సూ, నా ఆలోచనలూ, నా ఆవేశాలకూ దరిదాపుల్లో  ఉన్నవారితో కాబట్టి ఓ రకంగా పాతుకుపోయాయనే చెప్పాలి. పుస్తకం.నెట్ వల్ల కల్సిన కొందరు మనుషులు మాత్రం, నా ప్రపంచానికి చాలా దూరంగా ఉండేవారు. “కదంబి” రామకృష్ణ ఆచార్య గారితో పరిచయం అలాంటిదే! ఆయనతో మొదటిసారి మాట్లాడినవన్నీ పూసగుచ్చినట్టు ఇక్కడ రాసినా కూడా, ఇంకా ఎన్నో చెప్పటం మర్చిపోయానే అనిపిస్తూనే ఉంటుంది. ఆచార్యగారి పుస్తక పఠనాభిలాషను పక్కకు పెడితే, ఆయన గత యాభై ఏళ్ళుగా రోజూ పొద్దున్నే ఒకటే షాపుకి అదే ఉత్సాహంతో వస్తున్నారంటే మాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆయన “నేను కొట్టుకు రాకుండా ఉండలేను, ఆదివారం నాడే నాకు ప్రాణం మీదకి వచ్చినట్టు ఉంటుంది.” అన్నప్పుడు ఆయన కళ్ళల్లోని వెలుగుని తర్జుమా చెయ్యాలంటే ఏ భాషా సరిపోదు. ఇంకా పూర్తిగా  మెలకువ రాకముందే, “అబ్బా.. ఇవ్వాళ ఆఫీసుకు వెళ్లాలా? ఇవ్వాళ అర్జెంటు పని వచ్చే అవకాశం ఉందా? లీవ్స్ ఎన్ని మిగిలాయ్ ఇంకా?” అనుకుంటూ ఓ అరగంట నిద్ర కోసం కక్కుర్తిపడే నాకు, ఆయన ఉత్సాహం చూస్తూ ఉంటే నిజంగానే సిగ్గేసింది. ఆయనతో మాట్లాడ్డం కానిచ్చుకొని తిరిగొచ్చేస్తుండగా..

“అమ్మాయ్.. దాహం” అని సౌమ్య, “అమ్మమ్మో.. దాహం” అంటూ నేనూ, పక్కనే ఉన్న బేకరీకి పరిగెత్తాం వాటర్ బాటిల్ కోసం. ఇద్దరి మొహాలు వాడిపోయి ఉన్నాయి. టైం చూసుకుంటే అర్థమయ్యింది, ఆయనతో మేం దాదాపు మూడు గంటల సేపు మాట్లాడాం అని. (మాట్లాడాం = ఆయన మాట్లాడుతుంటే మేం వింటూ నోట్స్ రాసుకున్నాం.)

“చాలా అలసిపోయినట్టు అనిపిస్తోంది. ఎక్కడైనా కూర్చొని ఏదో ఒకటి తినాలి” అన్నా నేను.
“అవును.. కానీ ఆయనకి ఛాన్స్ ఇస్తే ఇంకో మూడు గంటల పాటు అదే ఎనర్జీతో కొనసాగేలా ఉన్నారు. మనమేంటి ఇలా?” అని ఊసురోమంది సౌమ్య.
“మనం యూత్ కదా” అన్నా నేను.

ఇది చదివి మీకు నవ్వురాకపోయుండచ్చు కానీ, మేం మాత్రం విరగబడి, పగలబడి నవ్వుకున్నాం. “మేం అలా నవ్వుకుంటూనే పనిచేస్తాం” అని అంటే చక్కగా చిర్నవ్వు చిందిస్తూ పనిలో మునిగిన ఇద్దరు మీ మనోఫలకం మీద కనిపిస్తుంటే, అబ్బే.. అది రాంగ్ పిక్చరైజేషను. మా నవ్వులు పనులు ఆపేంత భారీ స్థాయిలో ఉంటాయి మరి!

ఎ.ఎ.హుస్సేన్ షాపుకెళ్లినప్పుడు కూడా ఆ షాపు ఓనరతో మాట్లాడ్డం భలే మంచి అనుభవం. ఆయన భోం చేసి వచ్చేలోపు (మొదట్లో, అజ్ఞానం కొద్దీ ఎప్పుడు తోస్తే అప్పుడు షాపుల్లోకి దూరి “ఇంటర్వ్యూ ప్లీజ్” అనేవాళ్లం.) నేనూ, సౌమ్య ఆ షాపులో పుస్తకాలన్నీ పేరుపేరునా చదివి పండగ చేసుకున్నాం. “మీ కాఫ్కా” అని తను ఆటపట్టిస్తుంటే, “అదో.. మీ అగతా క్రిస్టీ” అని నేను. మధ్యలో ఎక్కడో “మన” అనుకునే బాపతు పుస్తకాలు తగలడం. అక్కడున్న కొన్ని ఫిక్షన్ పుస్తకాల పేర్లు మామూలుగానే ఉన్నా (మారీడ్, బట్ అవైలబుల్ లాంటివి 😉 ) మేం జోకులేసుకున్నాం. సినిమా పేర్లన్నీ కలిపి సినిమా పాటలొచ్చినట్టు, పుస్తకాల పేర్లతో ఓ కథ రాయాలని అనుకున్నాం. (ఈ ఐడియా పేటెంటెడ్ అని తెలియజేసుకుంటున్నాం. )

యనభైల్లో వచ్చిన కొన్ని సినిమాల్లో హిరోయిన్‍లా (కళ్లద్దాలు పెట్టుకొని చేతి సంచి పట్టుకొని దేశాన్ని ఉద్ధరించే కొందరి వీరవనితల పాత్రలు) రోడ్లమీద పడేసరికి చాలా మంది, మాకిదే ఉద్యోగం అనుకున్నారు. జీతమెంతేంటి? అనడిగారు. “అబ్బే.. ఊరికే.. ఊసుపోక చేస్తుంటాం” అని చెప్తుంటాం. మొన్న బుక్ ఫేర్ లో జోకాతి జోకు: “అమ్మాయిలూ మీరేం చేశారూ.. తెలుగు?.. ఎం.ఏ లాంటివి?” అనడిగారు ఓ స్టాల్ ఆయన. మాకు నవ్వాగలేదు. మధ్యన మధ్యన నవ్వాపుకుంటూ, “లేదండీ.. మేం సాప్ట్ వేర్ ఇంజనీర్లం” అని చెప్పి నవ్వసాగుతూనే ఉన్నాం. నా స్పోకన్ బ్రోకెన్ టెల్గూ విని కూడా ఆయన అలా అడిగారంటే.. (నాకు నవ్వాగటం లేదు.)

అర్జీ, ది డ్వార్ఫ్ పుస్తకావిష్కరణలో చంద్రహాస్ చౌదరిని కలవటం, బ్యూటిఫుల్ ట్రీ పుస్తకావిష్కరణలో ఐ.వి. సుబ్బారావు గారినీ, ఆ పుస్తక రచయితతో మాట్లాడ్డం, బుక్ ఫేర్ వాక్ సందర్భంగా ప్రముఖులకి పుస్తకం ని పరిచయం చేయటం – పుస్తకం.నెట్ లేకపోయినా నేనీ సందర్భాల్లో ఉండేదాన్ని, కానీ ఇంత స్ట్రాంగ్ purpose లేకపోయేది. నా ఫ్రెండ్ నన్ను ఏడిపించటానికి అంటూ ఉంటాడులే.. “పుస్తకంని అడ్డం పెట్టుకొని పండగ చేసుకుంటున్నావు కదా!” అని. అందులో చాలా నిజం ఉందనే అనిపిస్తుంది. 🙂

“పుస్తకం పనులున్నాయ్.. నాకు ఈ వీకెండ్ కుదరదు!” అని స్నేహితులతోనూ, “నాకు వేరే పనులున్నాయ్.. నేను ఇంట్లో ఉండటం లేదు శనివారం మొత్తం” అని ఇంట్లోనూ మా వాళ్లతో చాలా సార్లు చెప్పాను. నేను ఉద్దరిస్తుందేమిటో వాళ్లకి అర్థం కాకపోయినా, నా వెర్రి గురించి ఐడియా ఉన్నవారు కాబట్టి అడిగినప్పుడల్లా వదిలేసారు. అందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది – 2009లో టాలీవుడ్ నష్టాల్లో కొట్టుకుందిట! నేను మాత్రం నా జీవితంలోనే అత్యధిక సినిమాలు చూసి ఏడ్చాను. (రెండూ నిజమే – చూడ్డమూ, ఏడ్వటం). ఇహ ఇంట్లో వాళ్లు నాతో వేగడంలో సర్టిఫికేషన్స్ సంపాదించారు కాబట్టి, వాళ్ల గురించి ఇప్పుడొద్దు! పాపం, పుస్తకాలంటే అట్టే ఆసక్తి లేకపోయినా కేవలం నాకోసం పుస్తకం పనుల మీద వచ్చి, బోరు కొడుతున్నా గంటల కొద్దీ పనయ్యే వరకూ ఓపిక పట్టే స్నేహితులుండడం వల్ల, ఒకదాని కోసం మరోటి మిస్స్ అవుతున్నానేమో అన్న మీమాంస తప్పింది. పుస్తకం.నెట్ సమిష్టి వ్యవసాయం! (నేను కోతి కొమ్మచ్చి సిరీస్ కొని చదివా!) అందులో నా వంతు నేను చేసానో లేదో కానీ, నాకు చేతనైనంత మాత్రం చేయగలిగాను.

కాలం గమ్మత్తైనది. కాలం అనంతమే! ఒక్కోసారి పట్టుకోలేనంత చిన్నదిగా ఉంటుంది. ఒక్కోసారి పెనుభూతమై ఏడిపిస్తుంది. ఒక్కోసారి నత్తనడక నడిచి విసిగిస్తుంది, మరోసారి సునామీలా మారి ముంచేస్తుంది. గడచిపోయిన కాలమంతా గతమై వెక్కిరిస్తూ ఉంటుంది. మంచుపొగలో నుంచొని అస్పష్ట చిత్రాన్ని చూపించే భవిష్యత్తు భయపెడుతూ ఉంటుంది. రెంటి మధ్యా సంధికాలమైన “ప్రస్తుతం” మీద గతం నీడలూ, భవిష్యత్ భయాలు. అయినా, గమ్మెత్తైనదీ అని ఎందుకు అన్నానంటే జరుగుతున్నప్పుడు మాత్రం కాలం జర్రున్న జారిపోతూ ఉంటుంది.  ఏదో క్షణాన మనల్ని దానికి అప్పజెప్పేస్తే, మిగితా అంతా లాక్కెళ్లిపోతుంది – ఇదే నాకు 2009 నేర్పించింది.   In an otherwise disastrous year personally, I can still look back for some lovely moments, thanks to the words – “Let not the fear of not continuing stop us from starting.”

అందరకీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Sowmya’s Post here

12 comments

  1. పుస్తకం గురించి, ఈ టపా గురించి, మీరూ, సౌమ్య గారు, ఇద్దరి గురించీ ఏది చెప్పినా కృతకంగా ఉంటుంది. So, only words left from my side are – Wish you the very best all the time, always.

    Like

  2. :)… Very well then, perhaps I too can take that as an inspiration and act on my whims and hope they take me further. Nothing to lose if I am not moving further, I am already staying whereever I am, by not moving forward, right? 🙂

    Happy New Year and congratulations on the wonderful thought and execution.

    Hope that there shall be many more to come in the future and hope that there shall be as much satisfaction in all those, as it is now…

    Have a great year ahead…

    Like

  3. 🙂 Congratulations..

    మీ ఇద్దరూ మరెన్నో సంవత్సరాలు ఈ వెబ్సైట్ ను విజయవంతంగా నడిపి మరిన్ని మైలురాళ్ళు చేరుకోవాలని కోరుకుంటున్నాను.

    మీకూ మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    Like

  4. పూర్ణిమ బాగా రాశారు.,మీ ఇద్దరి స్నేహం, కలిసి పుస్తకం.నెట్ నిర్వహణ. అన్నీ ముచ్చట్లు బహు ముచ్చటగా వున్నాయి..
    “ ఒక్కసారి కమిట్ చేయించడానికి కమిట్ అయ్యిన సౌమ్య మాట ఎవ్వరైనా వినాల్సిందే కాబట్టి “
    కదా పూర్ణిమ..

    Like

  5. “కొన్ని పనుల ఫలితం చూడ్డానికి చాలా చిన్నగా అనిపిస్తాయి. నిజానికి అవి చిన్నవే కూడా! కాకపోతే వాటి వల్ల మనలో వచ్చే మార్పులు ఎంత గణనీయం అంటే, మనం మరెన్నో పెద్ద పనులు చెయ్యటానికి ఊతాన్ని అందిస్తాయి.”

    ——————————–
    ఎనిమిదేళ్ళ క్రితం రాసా ఒక చోట “చిన్న చిన్న లక్ష్యాలు సాధించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం
    పెద్ద విజయాలకు దోహదపడుతుంది”

    ——————————–

    “కాలం గమ్మత్తైనది. కాలం అనంతమే! ఒక్కోసారి పట్టుకోలేనంత చిన్నదిగా ఉంటుంది. ఒక్కోసారి పెనుభూతమై ఏడిపిస్తుంది. ఒక్కోసారి నత్తనడక నడిచి విసిగిస్తుంది, మరోసారి సునామీలా మారి ముంచేస్తుంది. గడచిపోయిన కాలమంతా గతమై వెక్కిరిస్తూ ఉంటుంది. మంచుపొగలో నుంచొని అస్పష్ట చిత్రాన్ని చూపించే భవిష్యత్తు భయపెడుతూ ఉంటుంది. రెంటి మధ్యా సంధికాలమైన “ప్రస్తుతం” మీద గతం నీడలూ, భవిష్యత్ భయాలు. అయినా, గమ్మెత్తైనదీ అని ఎందుకు అన్నానంటే జరుగుతున్నప్పుడు మాత్రం కాలం జర్రున్న జారిపోతూ ఉంటుంది. ఏదో క్షణాన మనల్ని దానికి అప్పజెప్పేస్తే, మిగితా అంతా లాక్కెళ్లిపోతుంది”

    ————–
    కాలం గురుంచి చక్కగా చెప్పారు.
    —————

    Like

  6. అల్లప్పుడెప్పుడో తిరుపతి వేంకట కవులు అన్నారు. అప్పుడే వేంకట పార్వతీశ్వర కవులనీ అన్నారు. తర్వాత పింగళి కాటూరి అన్నారు. మొన్నీ మధ్య వరకూ నాగిరెడ్డి చక్రపాణి అంటుంటే విన్నాము. ఇప్పటికీ బాపు రమణ అని జపిస్తున్నారు. బాగానే ఉంది. కానీ ఇలాంటి జంట కవిత్వం కవయిత్రులు చేయలేదా అని ఆరుద్రగారి సమగ్ర ఆంధ్ర సాహిత్యం పూర్తిగా అన్ని సంపుటాలూ కాకపోయినా కొన్ని ఐనా చదివిన నేను వెంటనే జ్ఞాపకానికి రాక తలగోక్కుంటుంటే …. అదిగో! అప్పుడు కనిపించాయి ఈ రెండు పేర్లు పూర్ణిమ సౌమ్య అని. ఈ జంట పేర్లు చరిత్రలో తొలివా లేక మలివా అనే చర్చ వ్యర్ధం.
    చరిత్ర సృష్టించటం మాత్రం తథ్యం. అందుకే ఈ అభినందనలు. Hats off to YOU both. May God bless YOU.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s