అనంతపురం -2009

Posted by

మరొకరి పెళ్లి. మరో ఊరు. మళ్ళీ పోస్టు. Sigh!

“.. if you plucked a special moment from life and framed it, were you defying death, decay and the passage of time, or were you submitting to them?” అని ఒర్హాన్ పాముక్ నిలదీశారు మొన్నే ’ఇస్తాన్‍బుల్’ లో! క్షణాలని బంధించటం  అంటే కాలపు ప్రవాహంలో కొట్టుకుపోతూనే దానికి ఎదురునిలువటం. ఈ క్షణాన్ని రాబోయే ఎన్నో క్షణాలు ఆర్తితో చూసుకునే వీలు కలిపించటం. ఈ క్షణంలో ఆగిపోయే వెసులుబాటు లేక, అలా అని దాని అస్థిత్వాన్ని మర్చిపోయే ప్రమాదాన్ని విస్మరించలేక, ఉన్న పరిమితుల్లో చేసే ప్రయత్నం! కెమరాతో నచ్చినవి బంధించటం ఒక కళ. అందులో నాకు ఓనమాలు రావు సరి కదా, ఆ కళలో ఒక ప్రాధమికమైన ఇబ్బందిని ఎదుర్కుంటూ ఉంటాను. కళ్ళు మూసుకొని నాకు ప్రీతి కలిగించే క్షణాలు నెమరవేసుకుంటున్నప్పుడు, అవి కాస్తా నేను లెన్స్ లో నుండి చూసినట్టు గుర్తొస్తే.. నచ్చదు. అందుకే నేను ఫోటోలకి దూరం. కాకపోతే బంధించాలన్న యావ పోక, ఇలా అక్షరాలను ధారపోయడం. అదీ కాక, రాత్రి పూట చిమ్మ చీకటి విశేషాలను ఏ కేమరా బంధించగలదు కనుక అని రవ్వంత పొగరు కూడానూ.

బస్సు ప్రయాణం అనగానే నిద్ర బస్సెక్కి కూర్చుంటుందేమో, రమ్మన్నా రాదు. నిద్ర పోకపోవడం వల్ల కలిగే ఏకైక ప్రయోజనం స్వీయ దర్శకత్వాన కలలు కనడం. బస్సంతా చీకటి, ఎక్కడో ఒకటీ-అర లైట్లతో నిశ్శబ్ధం కప్పుకొన్నట్టుంది బస్సు. అర్థరాత్రి కావస్తోంది కాబట్టి, వీధి దీపాలు తప్పించి మరో వెలుతురు లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా నిద్రావస్థలో ఉన్నాయి. మూసేసిన కొట్ల షటర్లపై తేలిపోయే నారింజపండు రంగు వెలుతురు పడుతూ ఉంది. ఫుట్‍పాతులు “మేమున్నాం ఇక్కడా” అని ఏకరవు పెట్టేంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడో చోట ఏదో హోటెల్ తప్పించి నగరం మొత్తానికి బిస్తరేసేసింది. అలసిసొలసి కాసేపు ఆదమరచి నిద్రపోతుంది.

ఊరు దాటాం! ఇప్పుడిక ప్రతీదీ వింతే నాకు. విశాలమైన మైదానాలు – రాళ్ళూ రప్పలూ, అడ్డదిడ్డంగా మొలచిన గడ్డి మీద నిండు పున్నమి వెన్నల – అబ్బ, చూసి ఊరుకోవాలి కానీ, ఇప్పుడు చెప్పితీరాలనుకుంటే ఎన్ని పదాలను అందంగా అమర్చగలగాలి.  చిటికెడు కటిక నలుపు రంగులో ఓ రెండు మూడు చుక్కల తెలుపు రంగుని కలిపితే వచ్చే వర్ణం – అందులో ఏదీ స్పష్టం కాదు. అలా అని చీకట్లోనూ కలిసిపోవు. ఆకారాలు తెలుస్తాయి, మసగ్గా – ఇది రాయి, అది చెట్టు, అది కొండ, అక్కడో దారి – ఇలా అన్నింటినీ గుర్తుపట్టచ్చు. నలుపులో ఉన్న అందాన్ని ఆవిష్కరించడానికే రాత్రి ఉంటుందేమో. కనుచూపుమేర కనిపిస్తున్న మైదానం ఓ చోట ఆగిపోతుంది. అక్కడ నుండి ఆకాశం! చూస్తున్న కొద్దీ ఆకాశం. ముసుగు తన్ని పడుకోవడం చాలా మందికి ఇష్టమై ఉండచ్చు. కానీ నాకు ముసుగులో కూర్చునో, పడుకొనో ఏదైనా చెయ్యాలీ అని. చీకట్లో చదువుకోగలిగితే ఎంత బాగుణ్ణు కదూ! భూమి కూడా ఆకాశమనే ముసుగులో (a dome of blue glass) ఉన్నట్టు అనిపించింది.  కాకపోతే, మరీ మొహం మీదొకొచ్చి ఊపిరాడనివ్వని ముసుగు కాదు, ఆ ముసుగులో అనంత జీవ కోటి ఊపిరిపీల్చుకునేంతగా!

ఆకాశానికేసి చూస్తూ ఉంటే నిండైన చందమామ. నిజం చెప్పాలంటే నిండుగా అవ్వటానికి ఒక్క స్ట్రోక్ తక్కువ అయిన చందమామ! నేను చూడనంత సేపూ ఏం చేస్తాడో ఏమో కానీ, చూస్తే పాపం, ఆట మొదలు. కాసేపు ముందుకెళ్ళి పోయి, కాసేపు వెనక నుండి గబగబా పరిగెడుతూ, కొద్ది సేపు మేఘాల చాటున, మరి కొద్ది సేపు నాకంటికి కనిపించడానికి వీలు లేకుండా! ’పోయాడులే’ అనుకొన్న క్షణాన ప్రత్యక్షమవుతాడు.’ఇక్కడే ఉన్నాడ’న్న ధీమాతో ఉన్నప్పుడు మాయమైపోతాడు. మర్చిపోవటానికి ప్రయత్నించటం ఓ నరకం. ఎదురుచూస్తూ ఉండిపోవడం మరో నరకం. ఏది చెయ్యాలో తెలీక, మరుస్తూనే ఎదురుచూడ్డం, ఎదురుచూస్తూనే మరుపుకి లొంగిపోవడం – ఓ చిత్రమైన నరకం.

చంద్రుణ్ణి మరచిన క్షణాల్లో, నాకంట బడింది ఒక చుక్క, చంద్రుణ్ణి అత్యంత చేరువలో ఉందది. ఈర్ష్య కలిగింది. క్షణంలో ఏదో నిర్వేదం. నాది కా(లే)నప్పుడు, దాని మీద ఎంత ఇష్టముంటే ఏం లాభం! రెప్పవాలితే కలలెక్కడ వేధిస్తాయోనన్న భయంతో బయటకి చూస్తూనే ఉన్నాను. మధ్య మధ్య కొండలు కనిపించాయి. ’పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఓ గుమ్ముగూడిన సమూహమే కొండలూ’’అనుకున్నాను. ఒక పద్ధతి పాడూ లేకుండా, ఎవరూ పట్టించుకోకుండా వదిలి వెళ్ళినట్టు పడున్నాయి కొండలు. ’ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు ముడి సరకులను పెట్టుకోడానికి కొండల్ని ఉపయోగించి, పనయ్యాక వాటిని అలానే వదిలేశాడు’ అనిపించింది. “కొండకొకటీ, కోనకొకటీ” అని విన్నాను కానీ, అదేంటో ఈ కొండల్ని చూస్తుంటే అనాధలైపోయి బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉన్నాయే అని బాధేసింది. “ఈ దేవుడున్నాడే..” అంటూ మొదలెట్టబోయే ముందే, ఒక హైవే పాయింట్ వచ్చింది. బోలెడంత వెలుతురు. పనిచేస్తున్న యంత్రాంగం. కొద్దిసేపటి మళ్ళీ చీకటి. దేవుడే ఎటుబడితే అటు పారేసిన కొండల్ని చదును చేసుకొని తనకునుగుణంగా మార్చుకున్నాడు. అడ్డురాని వాటిని అట్టే వదిలేసాడు. “ఈ మనిషనే వాడు ఉన్నాడే..” అనుకుంటూ తల తిప్పి అవతలి కిటికేసి చూశాను.

“ఓహ్.. ఇదేదోలా ఉంది? ఏంటది?” – కిటికీలో నుండి నాకు కనిపించిన దృశ్యం నన్ను అమితంగా ఆకర్షిస్తున్నా, కన్ను ఆర్పకుండా ఆ చిత్రపఠాన్ని మెదడులో ముద్రిస్తున్నా, నాకు గుర్తొచ్చిన ఉపమానం నోటిపైన ఆడేవరకూ మెడనరాలు బిగబెట్టాయి. ఓ కొండ ఉంది – చిన్నదే! శిఖరం నుండి ఎడమవైపేమో చాలా చిన్న విస్తీర్ణం. కుడిపక్కకేమో చాలా దూరం వరకూ విస్తరించుంది. ఎడమవైపు కొండ చీకటిలో కల్సిపోయింది. కుడిపక్కనంతా విద్యుద్దీపాలు వరుసగా సమదూరంలో ఉన్నాయి. దీన్ని ఓ రెండు మూడు కిలోమీటర్ల దూరం నుండి చూస్తూ ఉంటే, భద్రాద్రిలో రామనవమి నాడు కళ్యాణంలో రామునికెదురుగా కూర్చున్న సీతమ్మవారి జడ. నల్లని జడ మీద మెరుస్తున్న నగల్లా ఉన్నాయ్ ఆ కొండ మీద విద్యుద్దీపాలు. కొండేమో దేవుడిది. దీపాలేమో మనిషివి. ఇద్దరి మేలు కలయికా ఇది?

ఒకే ఐపాడ్ నుండి వెలువడే సంగీతం చెరో ఇయర్-ఫోన్ నుండి ఇద్దరి మనుషుల్లోకి ఎక్కుత్తోంది. సంగీతానికి గాయాలు మాన్పే గుణం, సాంత్వన కలిగించే లక్షణం ఉన్నాయంటారు. నా పక్కనున్న మనిషికేమో నిద్రపుచ్చే మత్తులాంటిదేదో ఎక్కుతున్నట్టుంది హాయిగా నిద్రపోతున్నాడు. నాకేమో రెచ్చగొట్టే మాదకద్రవ్యమేదో ఇచ్చినట్టుంది.  నేను వింటుంటే కదా, ప్రతీ పాటకీ ఒక భీకరమైన జ్ఞాపకాన్ని తట్టి నిద్రలేపి, ఆ పునశ్చరణ కలిగించే బాధను పంటికింద బిగించి దిక్కులు చూస్తున్నాను. కిటికీలో నుండి రివ్వున వీస్తున్న గాలి, పైన చందమామ, అతడికి దగ్గరలో చుక్క, నేల పై చెట్లూ, కొండలూ, అక్కడక్కడా మానవ నిర్మిత భవనాలు – చీకటి మసక వెలుతురులో! ఆలోచన సుడుల్లో చిక్కుకొని ఎప్పుడు నిద్రపోయానో! నిద్రేనా అది?

“వచ్చేసిందా? ఏ ఊరీది?” అన్న మాటలతో కళ్ళు తెరిచాను. ఇంకా తెల్లారలేదు.. మసక వెలుతురే! నే వేసుకొన్న చెప్పులు బస్సు కుదుపలకి ఎక్కడో పోయాయి. వాటిని వెతుక్కోడానికి కాసేపు జిమ్మికులు చేసి, కుదరక ఆనక చూడచ్చునులే అని ఊరుకొని బయటకి చూడ్డం మొదలెట్టా. ఏవో చిన్న చిన్న ఊర్లు! ఇంకా ఎవరూ నిద్రలేవనట్టున్నారు. సీటుపై మోకాలపై కూర్చుని “అనంతపురం వస్తే చెప్పండి ప్లీజ్.. ” అన్నాను. నిద్రను వదిలించుకుంటున్న వ్యక్తి “మాక్కొత్త.. మేం ఇదే మొదటిసారి వస్తున్నాం” అన్నారు. నేను సీటు దిగి తిన్నగా కూర్చుందాం అనుకుంటుండగా కనిపించిన ఓ మహాదృశ్యం.

అవతలి పక్క కిటికీ నుండి చూస్తుంటే, విశాలమైన మైదానం. భూమి నుండి అడుగు ఎత్తుకన్నా ఎక్కువ కాని మొక్కలు అక్కడక్కడా ఉన్నాయంతే. మిగితా అంతా మట్టీ, రాళ్ళు. మిగితా అంతా ఆకాశం. లేత నీలం రంగు మొత్తం పేపరు మీద సమానంగా పెయింట్ వేసి, దాని పై లేత గులాబీ రంగును మధ్యమధ్యన నీలం ప్రస్ఫుటంగా కనిపించేట్టు అసమానంగా వేసి, మధ్యన ఒక ముదురు గులాబీ రంగుని సంపూర్ణ వృత్తంలో నింపితే – అదీ ఆ దృశ్యం. అప్పుడప్పుడే తెలతెలవారుతున్నప్పుడు ఆకాశంలో కనిపించే రంగుల మాయాజాలం. నేనింతకు ముందు చాలా సూర్యోదయాలు చూశాను. అందరూ సముద్రం దగ్గరా, కొండలపైన నుండీ చూసే వాటి నుండి అద్భుతం అని వర్ణిస్తారు కానీ, మాసబ్ టాంక్ ఫ్లై ఓవర్ ఎక్కుతున్నప్పుడు, బిల్డింగుల మధ్యనుండి స్టైలిష్‍గా వచ్చే సూర్యుణ్ణి చూడ్డమంటే నాకు భలే ఇష్టం. ఆ తర్వాత నాకీ సూర్యోదయం నచ్చింది. అడ్డు రావటానికి ఇక్కడేమీ లేకపోవటం వల్ల, లేలేత సూర్యకిరణాలు తాకి నేలకి ఒక కొత్త సొగుసు వచ్చింది. దేవుడు గొప్ప చిత్రకారుడు అనిపించాడు ఆ ఒక్క క్షణంలో.

అనంతపురంలో ఉన్న పధ్నాలుగు గంటల్లో బోలెడన్ని విశేషాలు జరిగినా, ఆ రాత్రి ప్రయాణం మాత్రం చాలా గమ్మత్తుగా అనిపించింది. విపరీతమైన బడలిక వల్ల తిరుగు ప్రయాణంలో సుబ్బరంగా బొజ్జోటం వల్ల, “తిరిగొస్తున్నప్పుడు వీటిని మళ్ళీ చూడాల”న్న నా మెగా ప్లాన్ ప్లాప్ అయ్యింది. ఫ్లాప్ అంటే గుర్తొచ్చింది, అనంతపురంలో “గోపి, గోపికా, గోదావరి” అనే సినిమాను హౌస్ ఫుల్ హాల్‍లో చూడాల్సివచ్చింది. కళ్ళల్లో నుండి, కర్ణాల్లో నుండి రక్తాలు కారాయంటే అతిశయోక్తి కాదు.. పచ్చి నిజం.  వద్దొద్దంటున్నా నన్నీ సినిమా తీసుకెళ్లారన్న కక్షను క్లైమాక్స్ కు వచ్చే సరికి తలలు బాదుకుంటున్న మా గాంగ్‍ని చూసి మాత్రం ఒక పైశాచిక నవ్వు నవ్వాను, ఆపకుండా అరగంట! నవ్వుని మహా గొప్ప “ఒఫెన్సివ్” మంత్రంగా గుర్తించాను, ఈ టూర్ వల్ల.

8 comments

  1. అద్భ్హుతం పూర్ణిమ గారూ….
    భూమి కూడా ఆకాశమనే ముసుగులో (a dome of blue glass) ఉన్నట్టు అనిపించింది. కాకపోతే, మరీ మొహం మీదొకొచ్చి ఊపిరాడనివ్వని ముసుగు కాదు, ఆ ముసుగులో అనంత జీవ కోటి ఊపిరిపీల్చుకునేంతగా…….

    మీ ఊహాచిత్రాలకి..కాల్పనిక శక్తి కి నా శతకోటి వందనాలు….

    Like

  2. అప్పుడెప్పుడో ఏడాది క్రితం మీ బ్లాగుకు తలుపులు వేసేసినప్పుడు, బోలెడంత నిరాశ పడిపోయి
    నా గూగుల్ రీడర్ లో దాచిపెట్టుకున్న పాత టపాలు చదువుకుంటూ సంతృప్తి పడుతున్న నాకు, ఇవాళ నవతరంగం పుణ్యమాని మళ్ళీ మీ కొత్త బ్లాగు దొరికితే, పిచ్చి గంతులు వేసెయాలన్నంత వెర్రి ఆనందంగా ఉంది!

    Like

  3. Nothing new. But definitely a Great job. చూసిన దృశ్యం కళ్ళ నుండి మెదడు లోకి ఇంకి, ఆ స్పందన నరనరాల్లోకీ పాకి ప్రేరేపించే ఆ అర నిముషం ప్రక్రియ కి ఇంత అక్షర రూపం ఇవ్వగలగటం నిజం గా ప్రశంసనీయం. keep going.

    Like

  4. Splendid narration. You captivated my interest through out the post, that I read it twice :)… Miles in words is always beautiful, particularly when the narration brings those miles to the eyes of the reader… I need not take this journey to experience this. I have already felt those miles … 🙂

    Like

  5. మీ బ్లాగు అందుబాటులో లేని రోజుల్లో బోలెడంత నిరాశపడిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని….పదాలను అలవోకగా వాడేస్తూ మీ ప్రతీ అనుభవాన్ని వాక్యాల్లోకి మార్చేస్తుంటారు…అదీ మీరు చూసినప్పుడు కలిగిన ఫీల్ రవ్వంతయినా పోకుండా….అలా మార్చేక్రమంలో మీరేదో ఒలికిస్తూ ఉంటారు…అందుకేనేమో బాగుంది అని సింపుల్ గా చెప్పేయటం నచ్చక వేరేలా ఎలా చెప్పాలో చదివిన ప్రతీసారి తెలియక తికమకపడుతుంది మనసు….

    Like

  6. ఈనాడు లో మీ పుస్తకం వెబ్సైటు గురించి ఆర్టికల్ వచ్చిన సందర్భంగా ప్రత్యేక అభినందనలు.

    Like

Leave a comment