కడుపులో మెలితిప్పుతోన్న బాధ వల్ల పనిపై ఏకాగ్రత ఉన్నట్టు నటించటం కూడా వీలుపడ్డం లేదని గ్రహించింది ఆమె. మళ్ళీ రెస్ట్ రూంకేసి వెళ్తే, చూసే వాళ్ళు ఏమనుకుంటారోనన్న ఆలోచన ఆమెను సీటుకు అతుక్కునే చేసింది. ఇంతలో ఓ కొలీగ్ సీటు దగ్గరకు వచ్చాడు. చిన్న పనే కదా అని అతడితో మాట్లాడ్డం మొదలెట్టింది. రెండు నిముషాలు అనుకున్నది కాస్తా పావుగంటయ్యింది. బాధ తీవ్రత క్షణక్షణానికి పెరగటంతో ఆమె సీట్లోనే అసహనంగా కదులుతోంది. అతడింకా మాట్లాడుతూనే ఉన్నాడు. తన్నుకొచ్చేస్తోంది. ఊపిరి బిగబెట్టి అతడు చెప్పే దానిపై ధ్యాస పెట్టటం ప్రారంభించింది. ఆపుకోవటం వల్ల పరిస్థితి కఠినమైంది. పరిస్థితి విషమించడం వల్ల, ఆపుకోవటం కష్టమైంది. మొహంలో చిరాకు సుస్పష్టంగా కనిపించేస్తున్నా, ఆమె మాటమాటకీ నుదిటిపై వేళ్ళతో రుద్దుతున్నా, అతడేం గమనించనట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. ఉగ్గబెట్టుకోడానికి మరింతగా ప్రయత్నించింది. కాని లాభం లేదని తెల్సిపోయింది. ఇంకాసేపు ఆగితే, అంతా ఇక్కడే అయ్యిపోయ్యేట్టు ఉందని, ఒక ఉదుటున సీటులో నుండి లేచి, అతడి మొహం కూడా చూడకుండా “ఎక్స్ క్యూస్ మీ!” అననంటూ రెస్ట్ రూం కేసి పరిగెత్తింది. లోపలకెళ్ళి, నడుమును కరిచిపెట్టుకొన్న ఫాంటు బటన్ తీసి, టాయిలెట్ సీటుపై కూర్చుంది. బయటకి శబ్దాలు వినిపించకుండా, ఫ్లష్ ను తెరిచింది. ’గేట్లు ఎత్తగానే వరద నీరు తన్నుకొచ్చినట్టు’.. ఫ్లోర్ పై పడుతున్న చుక్కల్ని చూస్తూ అనుకుంది! కాసేపటికి ఉపశమనం కలిగింది. కాని అనుమానమూ వచ్చింది. ఎందుకన్నా మంచిదని ఇంకాసేపు కూర్చోంది. ఇంకా వస్తుందేమోనని వేచి చూసింది. రాకపోయేసరికి బయటకు వచ్చేసింది.
“హే.. ఆర్ యు ఒకే?!” – అప్పుడే రెస్ట్ రూంలోకి వస్తున్న కొలీగ్.
“యా.. యా!”
“నీ కళ్ళేంటి ఏడ్చినట్టున్నాయ్?”
“ఐ మీన్.. బాగా ఏడ్చాక, కళ్ళు ఉబ్బి, ఎర్రగా అవుతాయే.. అలా ఉన్నాయి.”
“ఓ అదా.. ” అంటూ, కళ్ళుమూసుకొని మొహం పై నీళ్ళు జల్లుకుంది. “too much strain యార్.. కాసేపు సిస్టం ముందుంటే, ఇలా ఎరుప్పెక్కిపోతున్నాయ్.. డాక్టర్ ఏవో మందులు ఇచ్చారనుకో..” మొహం మీద నీళ్ళు జల్లుకుంటూనే ఉంది.
“హమ్మ్.. టేక్ కేర్! కాని నీ కళ్ళు ఎంత బావుంటాయో.. I wish I had them! ఏ మస్కారా వాడుతావ్?”
ఇంకేముంది? మరో అరగంట పాటు మార్కెట్లో ఉన్న అన్నీ మస్కారాల మీదా, మేకప్ ఐటెమ్స్ మీదా చర్చించుకున్నారు – అని వేరే చెప్పాలా?