రోడ్ నెం. 12, బంజారా హిల్స్ ..
ఉదయం పది గంటల సమయం..
రెడ్ సిగ్నల్ పడ్డం వల్ల ట్రాఫిక్ ఆగింది. నిముషం తర్వాత పుస్తకంలోంచి తలపైకెత్తి చూస్తే నా కుడివైపు ఆ అబ్బాయి.
కన్నార్పకుండా ట్రాఫిక్ లో ఎవర్నైనా చూస్తూ ఉండిపోయామంటే, అవతల వ్యక్తి అయితే ఆకర్షణీయంగా ఉన్నట్టు అర్థం. లేకపోతే ఆసక్తికరంగా ఉన్నట్టు అర్థం.
ఈ అబ్బాయి బైక్ మీద ఉన్నాడు. ఎంచక్కా హాండిల్ మీద తల వాల్చేసాడు. “నిద్రపోతున్నాడా?” అన్న అనుమానంతో కార్ విండో పేన్ తొలగించి చూశాను. దూరం ఎక్కువ కాకపోవటంతో, కంటి కొసల చివర్నుండి చూసి, నేను అతణ్ణి గమనిస్తున్నానని అతడికి అర్థమయ్యి, ఠక్కున లేచి కూర్చున్నాడు. సిగ్నల్ తొలగడానికి ఇంకో నలభై సెకన్లు ఉండి ఉంటాయి. నేను చూడ్డం ఆపలేదు. అలా ఎలా బైక్ మీద తలవాల్చి పడుకున్నాడో నాకు అంతుపట్టటం లేదు. అవతల పార్టీ మాత్రం క్లాసులో కునుకు తీస్తుండగా పక్కనున్న పిల్ల చూసి పళ్ళికిలిస్తే కలిగేంతటి ఇబ్బంది కలగింది.
ఆకుపచ్చని రంగు పడగానే అతడు రయ్య్ మంటూ నేరుగా వెళ్ళాడు. నేను ఎడమ వైపుకి వెళ్ళిపోయాను.
నాకా సంఘటన మరుపుకి రావడానికి చాలా రోజులు పట్టింది. ఆ అబ్బి నిద్రపోలేదు, కాని నిద్ర తప్పించి ఇంకేదీ అలా తలవంచేలా చేయగలదు అనుకోలేదు. అసలు, కాస్త సందు దొరికినా నిద్రాదేవిని ఆహ్వానించటం తప్ప మరో ఆలోచన రాని నాకు, నిద్రే కారణం అని బలంగా అనిపించింది. రోజులకు తరబడి నిద్రపోని, పోలేని వాళ్ళు పరిస్థితి ఇలానే ఉంటుందనేసుకొని, దాని ఆధారం ఒక కథ / స్కెచ్ రాయడానికి ప్రయత్నించాను.
ఆ తర్వాత, జీవితం ముక్కు పిండి మూడు చెరువులు తాగిస్తుంటే, అప్పుడు తెల్సింది, నిద్రలేమి వల్ల కన్నా, ఆలోచనా భారం వల్ల తలవాలిపోతూ ఉంటుందని. బహుశా, అతనిదీ అలాంటిదేదో కథ అయ్యుంటుంది. లేదూ.. ఇంకేదో అయ్యుంటుంది. నాకు మాత్రం ఇదో బైక్ విన్యాసం.
Whoever that guy may be, he left an indelible impression!
🙂
LikeLike