“ఓహ్.. నా చిట్టితల్లి అప్పుడే నిద్రలేచేసిందా? గుడ్ మార్నింగ్ బేబీ!” అంటూ పడుకొనున్న పాప నుదుటున ముద్దు పెట్టాడు. స్వచ్ఛంగా నవ్విన చిన్నారి, తండ్రి మెడ చుట్టూ చేతులు వేయబోయింది, అలవాటు ప్రకారంగా. కుడి చేతి నరంలోకి చొచ్చుకొనున్న సెలైన్ తాలూకా సూది కదిలి నొప్పి పుట్టేసరికి నీరసంగా మూలిగింది. బాండేజ్ బరువుకి వంగిపోతున్న ఆ చిన్న చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు.
“నాకు జ్వరం వద్దు. ఇంటికెళ్ళిపోదాం!”
“జ్వరం తగ్గిపోగానే వెళ్ళిపోదాం.. కొన్ని రోజులే!”
“నో.. ఇప్పుడే. వెళ్ళిపోదాం.”
“సరే.. డాక్టర్ అంకుల్ రాగానే, అడిగి వెళ్ళిపోదాం. సరేనా?”
“నిన్న కూడా ఇలానే అన్నావ్. కాని ఇక్కడే ఉన్నాం.”
“లేదు. ఇవ్వాళ తప్పనిసరిగా వెళ్ళిపోదాం.”
“ఒట్టు?” – ఖాళీగా ఉన్న రెండో చేతిని చాచింది ముందుకు.
“ఒట్టు.”
“లవ్యూ..” అంటూ అతణ్ణి గట్టిగా హత్తుకుంది.
ఆ క్షణాల్లో కూతురి కళ్ళలోకి చూసే సాహసం చేయలేక, పక్క చూపులతో హాస్పిటల్ గదిని కలయజూశాడు. మ్యూట్ పెట్టిన టివిలో, దేవుడి గదిలో నుంచొని ఆందోళన పడుతున్న జయప్రద భరణిలో నుండి కుంకుమ తీసుకుంటుంది.
“నరుడి బతుకు నటన – ఈశ్వరుడి తలపు ఘటన – ఈ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన?” అన్న చరణం చుట్టంచూపుగా పలకరించటానికి రాగానే, ఉబికి వస్తున్న కన్నీళ్ళు పాపపై పడకుండా ఉండేందుకు గది సీలింగ్కేసి కళ్ళుమిటకరించి చూస్తూ ఉండిపోయాడు.