హృదయం అద్దెకు ఇవ్వబడును.

Posted by

ఓహ్… కమాన్! మరీ అలా చూడకు. నేను మాత్రం కావాలని పెట్టుకొని కూర్చున్నానా ఆ బోర్డు? అసలు, నువ్వు నాదానివి కాలేవని తెల్సిననాడే, అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరిపి, మైలూ, గీలూ పాటించుంటే, బహుశా, ఈ పాటికి బతకనేర్చేవాడిని. కాని ఎక్కడ? ప్రియురాలు కాకున్నా, నన్ను పూర్తిగా వీడి నువ్వు వెళ్ళకూడదనే సదాశయంతో, స్నేహం పేరిట, నిన్ను నా హృదయంలోనే ఉండనిచ్చాను. సొంతం చేసుకునే ఉద్దేశ్యం నీకు లేదు కాబట్టి, అది తెల్సీ నేను స్వతంత్రించలేను కాబట్టి, నా హృదయంలో నీ నివాసం నీకూ, నాకూ, ప్రపంచానికీ ఆమోదయోగ్యంగా ఉంటుందనే అనుకున్నాను. అలాగే జరిగింది కూడా, స్నేహాలకు అతీతమైనదేదో నీ ముందరి కాళ్ళకి బంధం వేసేవరకూ. నువ్వు వెళ్ళిపోయావని గ్రహించడానికి కూడా చాలా సమయం పట్టేంత రహస్యంగా నువ్వెళ్ళిపోయావు.

గుండె తలుపులకు తాళం వేసాను; నువ్వు వెళ్ళినా, నీ తాలూకు సామాగ్రిని చూస్తూ, నిన్ను తల్చుకుంటూ పిచ్చివాణ్ణి అయ్యిపోయే ఉద్దేశ్యం నాకు లేదననుకొని. నీ జ్ఞాపకాలు నన్ను రంపపుకోతకు గురిచేసే క్షణాల్లో, మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డ వాడికి మత్తుపదార్థం అందక పోతే పిచ్చెక్కిపోయేటంతటి బలహీనమైన క్షణాల్లో, నన్ను నేను బతికించుకోడానికి మృత్యువు తలుపుల్ని కొట్టినట్టు, నీ తలపుల్ని ఆశ్రయిస్తానేమోనని గది తాళంచెవులు విసిరిపారేశాను. నీతో నా ఏకపక్ష ప్రేమాయణానికి ఏకైక ప్రేక్షకుడిగా మిగిలిపోడానికి రిహార్సల్స్ వేస్తున్న కాలంలో, వేసిన తాళం వేసినట్టుండగానే, ఎవరో నా హృదిలోకి చేరారు, చడీ చప్పుడు లేకుండా. వెధవది! తన్ని తరిమేయాలని ఎంత బలంగా అనిపించినా అలా చేయలేకపోయాను. చోద్యం చూస్తూ ఉండిపోయాను. ఈ కొత్త మనిషి, తన స్థావరాన్ని పదిలం చేసుకుంటూ పోయింది. ఒక రకంగా తనపై ఇష్టమే నాకు. కాని ఆమె చేసే ప్రతి చర్య, పలికే ప్రతి పలుకూ, నవ్వే ప్రతి నవ్వూ – అన్నీ నిన్నే తలపింపజేస్తూ ఉంటే, నాకు తెలీకుండానే ఆమెను నిన్ను అనుకున్నాను. ఇది గ్రహించటానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు.

వేసిన తాళం వేసినట్టే ఉంది. ఆమె లేదు.

“ఇచ్చట హృదయం అద్దెకు ఇవ్వబడును.” అన్నదాన్ని, “నీకు మాత్రమే” అని సవరించాను.

నవ్వుతూనో, నవ్వుతున్నట్టు నటిస్తూనో జీవితం గడిచిపోతుందనుకుంటున్న వేళ, విచిత్రంగా నువ్వే తిరిగి వచ్చావు. మహాదానందంగా, తాళం పగలగొట్టి, మేళతాళాలు లేకపోయినా, నిన్ను సాదరంగా ఆహ్వానించదలిచాను. నీవు వదిలివెళ్ళినప్పటి హృదయాన్నే నీకు అప్పజెప్పాలన్న తాపత్రయంలో ఆమె జ్ఞాపకాలన్నీ దాచిపెట్టాను. నీవు నన్ను ఇంకా చేరకముందే, మధురోహల్లో ఓలలాడుతూ నీ నడక పలికించే సంగీతం కోసం ఊపిరిబిగబెట్టుకొని చూశాను. కానీ, నువ్వు నన్ను సమీపిస్తుండగానే ఏదో అపశృతి. విస్మరించడానికి ప్రయత్నించాను. కాని నీ ప్రతి అడుగులో మెట్టెలసవ్వడి సుస్పష్టం అయ్యింది. నీ ఉనికికి కొత్త ఊపిరి పోసిందే నాకు ఉరిగా మారింది. నువ్వు గడపలో అడుగుపెడుతున్న వేళ, భళ్ళున తలుపేసింది నేనే!

జరిగిన అవమానం వల్ల ఉక్రోషంగా వెనక్కి వెళ్ళిపోతున్న నీకు, ఈ బోర్డు కనిపించింది. అదే క్షణంలో తలుపు తెరిచిన నన్ను చూసి, “You.. womanizer!” అని ఛీత్కరించుకున్నావు. వెళ్ళిపోయావు మళ్ళీ! క్షణకాలమైనా నేనెటువంటి వాడినో ఆలోచించకుండా మాట అనేసి, వెళ్ళిపోయావు. హమ్మ్..

అయినా, ఇవ్వన్నీ నీకెందుకు? అవును, ఇక్కడ “హృదయం అద్దెకు ఇవ్వబడును.” ఆసక్తి ఉన్నవారికి చెప్పు!

4 comments

Leave a comment