రాక్షసి

Posted by

“ఇంటికి వెళ్ళాలని లేదురా! ఇంట్లో ఆ రాక్షసి ఉంటుంది.” – కీబోర్డు పై చకచకా డాన్స్ చేస్తున్న వేళ్ళు, స్విచాఫ్ చేసిన పరికరంలా ఉన్నట్టుండి ఆగిపోయాయి. ఏం వాగుతున్నాన్నేను, తాగినవాడు మైకంలో వాగినట్టు?

“ఏం బే, అంత ఘనం రాస్తున్నావ్.. జల్దీ టైపరా సాలా!” అని అటువైపు నుండి మెసేజ్ వచ్చేసరికి, ’ఎంటర్’ కీ దగ్గరగా ఉన్న చిటికెన వేలుని గుప్పెట్లో దాచేసి, చూపుడువేలితో ఒక్కో అక్షరాన్నీ డిలీట్ చేస్తూ పోయాను.

“ఉన్నావ్రా సాలే?”

ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఏం చెప్పకూడదని మాత్రం అర్థమయ్యింది. ఇంకో రెండు మూడు నిముషాలు మాట్లాడినా, వాడు నా సంగతి పసిగట్టేస్తాడు. పసిగట్టాడో, వాడి కొంపా, నా కొంపా కొల్లేరయ్యినట్టే! మన బాధను, తమ బాధగా భావించే స్నేహితులు దొరకడం, అదృష్టదురదృష్టాలు కవలల పిల్లలై నుదుటిన పుట్టడమే. “खाली बातिल.. भरा हुआ दिल!” అన్నట్టుగా, నా బాధ ఖాళీ అయ్యి, వాడి గుండె బరువెక్కుతుంది.  క్షణం ఆలస్యం కాకుండా, బిచానం ఎత్తేయాలి.

“పోతున్నాన్రా!ఆఫీసులో ఉండాలని లేదు.”

“హహహహహ.. ఎందుకుంటుంద్రా? అంతా పెళ్ళి మహిమ!”

“ఒర్రేయ్య్.. నిన్ను ఉప్పు పాతర వేయ..”

“కతలు పడకు బిడ్డ… ఫో.. ఫో.. పండగజేసుకోరాదే!”

“చంపుతా కొడకా!” – ఎంటర్ కొట్టానో లేదో కూడా తెలీదు. లాప్‍టాప్ మూసేసి, ఎవరో తవురుకొస్తున్నట్టుగా ఆఫీసునుండి బయటపడ్డాను. “గుడ్ నైట్ సర్!” అని సెక్యూరిటీ వాడు, పాక్ పై ఇండియా మాచ్ గెలిచినంత ఉద్వేగంతో చెప్పాడు. నో బాల్‍లో కాచ్ పడితే, ఎగిరి చొక్కా చింపేసుకొని మొహమూ, నువ్వూనూ అని మనసులో గట్టిగా తిట్టుకున్నాను. గుడ్ నైట్ అట గుడ్ నైట్! ఓ పక్క కాలిపోతా ఉంటే!

బైకి తీసాను. ఎక్కి కూర్చున్నాను. ముందుకు మాత్రం పోబుద్ధి కాలేదు. ఆఫీసు తర్వాత ఇంటికే వెళ్ళాలని నియమం పెట్టినవాళ్ళని చంపి పాతేయాలి. ఖర్మ! చెప్పుకోడానికి, దేశం మొత్తంలో నేను ఎక్కడ తిరిగినా అడ్డుకునే హక్కు ఎవడికీ లేదు. ఇంత దేశముండి ఏం లాభం? ఆ అపార్ట్‍మెంట్ తప్ప, తలవాయకుండా, తలదాచుకోడానికి దిక్కే లేదు. థూ.. బతుకు!

నాకు తెల్సు.. ఇవ్వాళ సిగ్నల్స్ పడవు. ట్రాఫిక్ ఉండదు. రోజూ జీవితమంతా ట్రాఫిక్‍లోనే గడిచిపోతుంది. ఇప్పుడేమో, ట్రాఫిక్ ఉండదు. కనీసం, ఒక్కో నిముషమున్నర సిగ్నల్ పడినా, మొత్తం పది సిగ్నల్స్ దాటే సరికి పావుగంట పడుతుంది. ఆహా! పావుగంట.. పదిహేను నిముషాలు.. పంద్రాహ్ మినిట్.. ఫిఫ్టీన్ బ్లడీ మినిట్స్! కాని ఏది? ఒక్క సిగ్నల్ కూడా పడి చావదే. ఈ పూట మినిస్టర్ ఎవ్వడూ రాడా? ఒక గంటా, గంటన్నర ట్రాఫిక్ ఆపచ్చు కదా! మినిస్టర్ల బాగోగులకన్నా ఈ దేశ పౌరుడి కావాల్సిందేముంది?

హమ్మయ్య.. దేవుడు నా మొర ఆలకించాడు. ఒక సిగ్నల్ పడింది. 99 అన్న సంఖ్య కనిపిస్తోంది. వద్దూ, తగ్గకు! అలానే ఆ 99 దగ్గరే ఉండు. అయినా, ఏంటీ వెంపర్లాట? పెళ్ళి కాక ముందు జీవితం ఎంత హాయిగా ఉండేది. ఈ పాటికి ఎంచక్కా, సినిమా హాల్లో కూర్చొని, సినిమా దేవత చెంగుతో అలసటంతా తీర్చుకొని ఉండేవాళ్ళం. సినిమా చూపించేటప్పుడు, హాల్ అంతా చీకటిగా ఉండాలన్న గొప్ప విషయాన్ని కనుగొన్నవాడికి దండేసి దండం పెట్టాలి. ఎంతటి అమోఘమైన ఆలోచన అసలు. నవ్వులకీ, నిట్టూర్పులకీ మధ్యన, కుర్చీ-చివర్న-కూర్చేబెట్టే-ఉత్కంఠకీ, మెడలు-వెనక్కి-వాల్చి-కళ్ళు-మూసుకునే నిర్లిప్తతకీ మధ్య, విరక్తి-కలిగించే-మెలోడ్రామాలకీ, రససిద్ధి-కలిగించే-అందాలకీ మధ్యన చీకటి. చక్కటి, చిక్కటి చీకటి. అమ్మ కడుపులో ఉన్నప్పటి చీకటి. అమ్మ ఒడిలో తలదాల్చుకున్నప్పటి చీకటి. ప్రపంచంలో చీకటినంతా మైమరపించేంతటి చీకటి. ఆహా.. ఎంత మధురమైన చీకటి. ఆ చీకట్లో, ఎంతటి దిగులైనా, గుబులైనా ఇట్టే పాతిపెట్టేయచ్చు, మరో కంటికి తెలీకుండా! చీకటి.. చీకటి.. ఆ చీకటే నాక్కావాల్సింది.

“ర్రేయ్య్.. సినిమా?” – ఎస్.ఎం.ఎస్ పంపలేదు. అడిగి ఫలితముండదు. వెళ్ళినా, లాభముండదు. “అది కాదు, అజయ్ గాడు రమ్మంటే, అనుకోకుండా.. ఛ, ఛ.. చెపుదామనుకున్నాను, అంతలోనే.. ఛీ, ఛీ! మామూలు సినిమానే! మన అక్షయ్ ఖాన్ గాడిది. నువ్వు నాకోసం చూడకు, తినెయ్య్. లేద్లేదు, నేను బయటేం తినను..ఒట్టు. వచ్చేస్తాను..ఒక అరగంటలో నీ ముందుంటా..” ఫాంటు జేబులో పెట్టుకున్న సెల్ పావుగంటకోసారి బుసలు కొడుతుంటే, చెప్పుకోలేని చోట మంట పుడుతుంది. ఒక్క వెధవ కూడా పెళ్ళి చేసుకోకుండా ఉండలేకపోయాడు. పెళ్ళేయ్యేంత వరకూ కాలేదన్నది ఒక్కటే ఏడుపూ. పెళ్ళై ఏడ్చాక లెక్కకు మించిన ఏడుపులు. ఎవడికైనా కాలో, చేయో విరిగితే బాగుణ్ణు. రాత్రంతా హాస్పిటల్లో గడిపేయచ్చు. వర్కవుట్ అవ్వదు. నాకన్నా అమ్మగారే ప్రత్యక్షమవుతారు. నా స్నేహితులు = దాని స్నేహితులు. నా కుటుంబం = దాని కుటుంబం. నాన్‍సెన్స్.

వెనకాల వాడు, హార్న్ కొట్టి చచ్చిపోతున్నాడు. రైట్ ఇండికేటర్ వేసున్నా, లెఫ్ట్ కొట్టాన్నేను. ఆ కొట్టడం కూడా, పక్కనున్న వాడి కార్ అద్దానికి తగిలేలా కొట్టాను. నన్ను కొట్టడానికి వాడు రాబోయాడు. కానీ, అప్పటికే నేను విపరీతమైన స్పీడులో పోతున్నాను. వాడికే కాదు, ఎవ్వరికీ దొరకను. ఈ రోడ్డులో పోతే, ఏమోస్తుందో తెలియగానే, మనసు జోరు ఎక్కువయ్యింది. ఆక్సిలేటర్ మీద కాలు తీయబుద్దేయలేదు. మొహానికేసి కొడుతున్న చలిగాలికి షర్ట్ బుడగలా మారింది. నేను గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తోంది.

ఇంటిని వదిలి ఈ సిటీకి వచ్చినప్పుడు, చాలా బాధేసింది. మొదట్లో, సిటి వాతావరణంలో ఇమడలేనప్పుడల్లా కోపం, ఆత్మనూన్యతా భావం కూడబలుక్కొని వచ్చేవి. కాని, ఈ సిటి నా ఇంటిగా ఎప్పుడు, ఎలా మారిందో నేను గ్రహించేలోపే, జరిగిపోయింది. ఇక్కడ నాటుకున్న స్నేహాల వల్ల అనిపిస్తుంది ఒక్కోసారి. చదువూ, ఉద్యోగావకాశాలు, డబ్బూ, దర్పం ఇచ్చినందుకు అనిపిస్తోంది ఇంకోసారి. కాని, వీటికన్నా ముఖ్యంగా, ఈ సిటీ నాకిచ్చింది ఏకాంతాన్ని. ఒంటరితన్నాన్నీ, బోలెడంత డిప్రెషన్నీ కూడా! కానీ, ఏకాంతం ముఖ్యం.

DSZ.. Depression sucking zones – ఈ సిటీలో బోలెడు. చెప్పలేనంత, చెప్పుకోలేనంత కష్టం వచ్చి, బాధ దిగమింగుకోవటం అటుంచి, అదే మనల్ని మింగేస్తున్నప్పుడు, ఈ ప్రదేశాలకు వెళ్తే చాలు. బాధ పోతుంది. పోకపోతే, పొంగిపొర్లుతుంది. ఏది జరిగినా, ఈ ప్రదేశాలకు మించిన అనువైన చోటు లేదు. మరో మనిషి ఎదురుగా కనిపిస్తున్నా, వెర్రి చేష్టలు చేస్తున్నా, ఇక్కడి మనుషుల ఒక plain indifferenceతో వెళ్ళిపోతుంటారు. ఎవ్వరూ, ఎవ్వరినీ పట్టించుకోరు. ఎవడి ఏడుపు వాడిదే! అదెంతటి ఆనందమో, మరొకడి ఏడుపు నీదయ్యేంత వరకూ అర్థం కాదు.

సముద్ర తీరం. నిండు పున్నమి. రొమాంటిక్! చల్లటి ఇసుకలో అలా కాళ్ళూ, చేతులూ జొప్పించి కూర్చొని,  కళ్ళు మూసుకొని సముద్రం రొద వింటూ ఉంటే.. ఆహా! ఈ జన్మకు ఇంకేం అక్కర్లేదూ అని అనిపిస్తుంది. సముద్రంలో ఏదో మాజిక్ ఉంది. అదేమిటో, ఎంత ఆలోచించినా నాకు అంతు పట్టి చావదు. కానీ, ఏదో ఉంది. సముద్ర తీరాన, నుంచున్నా, కూర్చున్నా, సముద్రంలోకెళ్ళి ఈతలు కొట్టినా, ఆ మజా ఇంకెందులోనూ లేదు. అలసిపోయి ఇక్కడికి వస్తే కొత్త ఉత్సాహం వస్తుంది. ఉత్సాహంతో ఇక్కడికి వస్తే, అలసిపోయేంతగా ఆనందించచ్చు. సముద్రం.. అదో మాజిక్! అచ్చు, శ్రీ కంపెనీలో ఉన్న మాజిక్‍లా. అసలేమమ్మాయి, ఆ అమ్మాయ్! ఎక్కడుందో? ఏం చేస్తుందో? నా గురించి ఆలోచిస్తుందా? నా మీద కోపం పోయుంటుందా?

“పర్లేదు.. వేసుకోండి. చలిగా ఉంది కదా!” – బెరుగ్గా చెప్తున్న కుర్రాడి గొంతు వినిపించేసరికి, అటు చూశాను. మొహమాటపడుతూనే అందుకుంది ఆ అమ్మాయి. అహ.. మొహమాటం కాదనుకుంట!”తీసుకోండి” అన్న క్షణం నుండి, చేయి ముందుకు చాచే క్షణం వరకూ, “వీడెందుకు నాకిస్తున్నాడు? దీని వెనకాల ఉద్దేశ్యం ఏంటి? రేపు ఇది తిరిగిచ్చేయడానికి మళ్ళీ కలుద్దాం అంటాడా? ఇలానే పరిచయం పెంచుకొని, ప్రేమా, దోమా అని కూర్చుంటాడా? ఇప్పటి వరకూ, అతని వంటిని బిగుసుకొని ఉన్నది, నా వంటికి తాకగానే, అతడే నన్ను తాకుతున్నట్టు ఊహించుకుంటాడా? తీసుకోనా? వద్దా? మంచివాడేనేమో? కాదేమో?!” లాంటి సవాలక్ష ప్రశ్నల అయోమయాన్నీ, అమాయకపు చూపులో దాచేయాలనే ప్రయత్నం.

ఇస్తావ్ బాబూ.. ఇస్తావ్! ఇవ్వాళ నీ కోట్ తీసి ఇస్తావ్. రేపో, ఎల్లుండో, నీ మనసిస్తావ్. ఖర్మ కాలి ఒప్పుకుంటే, నీ జీవితాన్ని పంచిస్తావ్. పెళ్ళి అవ్వటంతో, నీ మీద సర్వహక్కులూ ఆమెకే రాసిస్తావ్. పరాయి ఆడపిల్లను చూడను అని మాటిస్తావ్. చూడాల్సివచ్చినప్పుడల్లా, నీకు నువ్వే సంజాయిషీలు ఇచ్చుకుంటావ్. అయ్యిపోయింద్రా నీ పని.. పడ్డావ్. పోతావ్!

ఉన్నట్టుండి, సెల్ ఉల్లిక్కిపడింది. “రాక్షసి సెండ్ ఎ మెసేజ్” అని కళ్ళు చదివాయ్. తెరిచి చూసాను.

“ఎక్కడున్నావ్?”
“వచ్చేస్తున్నా.. ఒక అరగంట!”
“ఎక్కడున్నావ్?”
“ఏట్లో ఉన్నా, కాట్లోకి పోతున్నా.. హాపీ?!” – డిలీట్.
“ట్రాఫిక్‍లో.. ” – సెండ్.

ఇక నాకు మిగిలింది, ఒక అరగంటే! ఆ తర్వాత, ఆ రాక్షసి హయాంలో నరకం. అందమైన, తెలివైన అమ్మాయిని చేసుకోవాలని ఒంటికాలి మీద తపస్సు చేసేంతగా పరితపిస్తాం గాని, అంతకు మించిన deadly combination ఉండదు. అంటే, ఎద్దు మొద్దులను కట్టుకోవాలని కాదు. అంటే, మరి కట్టుకోకూడదనీ కాదు. ఏదేమైనా, అందాన్ని, తెలివినీ హాండిల్ చేయటం ప్రతీ వెధవకీ చేతనయ్యే పని కాదు. నిజానికి, ఎవ్వరి వల్లా కాదనుకుంట. చావు తప్పి, కన్ను లొట్టపోయినట్టైతే, అదే డిస్టింక్షన్ వచ్చినట్టు. ఇహ, మిగితా వారి సంగతి చెప్పుకుంటే సిగ్గుచేటు. అయినా, ఈ ఆడవాళ్ళు కూడా, ప్రేమించిబెడితే చాలు కదా! ఎందుకు వాళ్ళకి అన్నేసి తెలివితేటలు? ఉండకూడదని కాదు. ఉండాలి. అవి చాలా అవసరం. కాని, మనకి కావాల్సినప్పుడే ఉండాలి. మనం చూపించాలనుకున్నవే వాళ్ళు చూడగలగాలి. అంతకు మిక్కిలి ఒక్క ముక్కా చూడకూడదు. తెలియకూడదు. అర్థం కాకూడదు. Intelligence on demand, అన్నమాట! అలా ఉండాలి.

నిక్కుకుంటూ, మూలుక్కుంటూ ఇంటికి చేరాను. లిఫ్ట్ లో ఉన్న ప్రతి నెంబరునీ నొక్కాను. ఒక్కో ఫ్లోర్‍లో ఆగుతూ, మొత్తానికి మా ఫ్లోరుకి చేరింది. డోర్‍బెల్ కొట్టడానికి కాస్త ఊపిరి, దానితో పాటు సమయం, తీసుకుందామని, కొట్టకుండా నిల్చున్నాను. తలుపు టక్కున తెరుచుకుంది. ఎలా తెల్సింది నేను వచ్చాననీ?! లోపలికెళ్ళాను. అమెరికన్ ఏర్‍పోర్ట్ లో కూడా ఇంత తీక్షణంగా తనిఖీ చేసే మెషీన్ ఉండదేమో! అలాంటి కళ్ళవి. షూస్ విప్పి, సోఫాలో కూర్చున్నాను. చేతిలో బాగ్ అందుకొని, మంచినీళ్ళ గ్లాసు అందించింది. గిరిజాల జుట్టును పైకి సగం మడిచి క్లిప్ పెట్టింది. వంకీలు తిరుగున్న వెంట్రుకలు నిక్కపొడుచుకొని చూస్తున్నాయి. నల్ల నైటీ! పాత సినిమాల్లో మాంత్రికుడి మేకప్‍కి, కాస్త నలుపు రంగు పులిమితే చాలు. మెడలో పుర్రెల దండలా పుస్తెల తాడు. నా ప్రాణానికి కేరాఫ్ ఎడ్రస్ ఆ పుస్తలని గుర్తొచ్చి, నా మీద నాకే జాలేసింది.

“స్నానం చేసిరా, ఆకలేస్తోంది.”
“నీకు ఆకలేస్తే, నేనెందుకు స్నానం చేయాలి? చెయ్యను ఫో..” – మింగేశాను.
“పోనీ.. కాళ్ళూ చేతులూ అన్నా కడుక్కొని రా!”
“నాకు తిండీ, గిండీ ఏమీ వద్దు.. నాకు ఆకల్లేదు.” – మింగేశాను మళ్ళీ. రుసరుసలాడుతూ బెడ్రూంలోకి, అక్కడ నుండి బాత్రూంలోకి, అరగంటయ్యాక మళ్ళీ బెడ్రూంలోకి. విసురుగా, తలుపేసి, లైటార్పి మంచమెక్కి, ముసుగు తన్నాను. తులుపు కొట్టుకొని, కాస్త వెనక్కి వచ్చింది. రెండు నిముషాల తర్వాత, ఆ సందులో నుండి కనిపించిన దృశ్యం: కంచం పట్టుకొని వచ్చి, టివీ ముందు కూర్చుంది. రాక్షసి! మొగుడు తినకపోయినా పట్టనిదానికి, పడిగాపులెందుకో మరి? కనీసం, “వంట్లో బాలేదా? ఏమయ్యింది?” అని కూడా అడగదు. పొగరు. అందం, తెలివీ ఉన్నాయని కల్తీ లేని పొగరు.

తినేసింది. అమ్మతో మాట్లాడుతోంది. “తినేసారత్తయ్యా.. పాపం, అలసిపోయినట్టున్నారు. చెయ్యింకా ఆరనేలేదు, వాలిపోయారు. నిద్రపట్టేసినట్టుంది.”
తర్వాత వాళ్ళ అమ్మతో. “తిన్నాడమ్మా. తలనొప్పనుకుంటా.. మంచం ఎక్కేసాడు.”
తర్వాత ఫ్రెండ్ – “హీ డిడ్‍న్ట్. ఐ డిడ్.. హిహిహిహిహి”

ఫోన్ పెట్టేసింది. టివి కట్టేసింది. నాయనా… ఇప్పుడు గదిలోకి వచ్చేస్తుంది. ఖర్మ! తప్పించుకోడానికి లేదు. ఇప్పుడెలా? వచ్చేస్తోంది? అదో.. మెయిన్ డోర్ తలుపేసి,  హాల్‍లో లైటార్పేసింది. తలుపు నెట్టింది. బెడ్ లైట్ వేసి, తలుపు దగ్గరకు వేసేసింది. నడుచుకుంటూ వస్తోంది. మంచం మీద కూర్చుంది. దిండు సర్దుకుంది. మంచం మీద కాళ్ళు పెట్టింది. నడుం వాల్చింది. లైట్ ఆపేసింది. ఎక్కడో బయట కుక్క మొరుగుతున్న శబ్ధం, గదిలో ఏసీ రొద తప్పించి, అంతా నిశ్శబ్దం. అంటే, నేను ఊపిరి పీల్చుకునేది కూడా వినిపించేంతగా. కిటికిలో నుండి పడుతున్న సన్న వెలుతురు తప్ప గదంతా చీకటి. అయినా, నా మీద వేయి వోట్ల లక్ష దీపాలు నా మీదే పెట్టినట్టుంది. గదంతా అద్దాలమయమైపోయాయి, వాటిలో నేను నగ్నంగా కనిపిస్తుంటే, శ్రద్ధగా నన్ను చూస్తున్నట్టు అనిపిస్తోంది. మడం మీద మడం ఆన్చానని గుర్తొచ్చి తీసేశాను. కాలి బొటనివేలి వెనకాల దాక్కోటానికి ప్రయత్నిస్తున్న పక్కవేలుని ఆపటానికి చాలా కష్టపడ్డాను. అర్రె.. మడం మీదకు మడం వచ్చేసిందే! ఛ!

లాభం లేదు. నేనెన్ని ప్రయత్నాలు చేసినా, ఇక లాభం లేదు. ఈపాటికి దానికి అన్నీ తెల్సిపోయుంటాయి. గుమ్మం దగ్గరే నా జాతకం పసిగట్టేసింది. అందుకే, ఒంటి మీద చేయి కూడా వేయలేదు. ఒక్క మాట మాట్లాడించడానికి కూడా ప్రయత్నించలేదు.  నేనెందుకు ఇలా ఉన్నానో? నాకేమవుతుందో? అన్నీ దానికి తెల్సు. “ఇదీ నా ఏడుపూ” అని ఎప్పుడూ ఖచ్చితంగా చెప్పలేదు. “నాకు కాస్త టైం కావాలి.” అనే చెప్పాను. “తీసుకో” అనే అంటుంది. నా బాధేంటో, దాని స్వరూపమేమిటో, కారణాలేమిటో అప్పుడప్పుడూ అడపాదడపా చెప్పటమే. అయినా కూడా, చాలా అర్థమయ్యిపోయాయి. అర్థం కాకూడనవీ అయ్యిపోయాయేమో! నాలోని చీకటినుండి ఎంత దూరంగా ఉంచుదామనుకుంటే, అంత దగ్గరకు వచ్చేస్తుంది. ఆ చీకటి వల్ల, నన్ను అసహ్యించుకుంటుందేమోనని భయం. ఆ చీకటికి భయపడి పారిపోతే.. నేను బతకగలనా?

అంత అర్థం చేసుకునేదే అయితే, అది గదిలో ఉండడం నాకు నరకంగా ఉందని తెల్సీ వెళ్ళదేం?! వెళ్ళదు. ఇంత తిట్టుకుంటున్నా, దాని అవసరం నాకుందని తెల్సుకునేసిందా? నాలో బద్ధలవుతున్న అగ్నిపర్వతాలకి, లైవ్ కామెంటరీ నేనివ్వకున్నా, నాకో ప్రేక్షకుడు కావాలనీ, అది తనే అని గ్రహించేసిందా? నేను అగాధంలోకి జారిపడిపోతున్నా, దాని చేయి అందుకొని పైకి రావడానికి నా అహం, ఆత్మాభిమానం అడ్డొచ్చి ఆగిపోతానని పసిగట్టేసిందా? బయటపడి, లోకువై పోకూడదని, బింకంగా ప్రవర్తించటమే కాక, అంతర్గత రాక్షసినీ బలంగా ఎదుర్కొంటున్నది దాని వల్లే, అని అనుకుంటుందా? లేదా, ఏదో ఒక బలహీనమైన క్షణంలో నన్ను తన కడుపులో దాచేసుకొని, యముడిలాంటి నా నుండి నన్నే కాపాడి, నవయుగ సావిత్రి అవుదామని కలలు కంటుందా?

లోలోపల నన్నో రాక్షసి తినేస్తోంది. అది నన్ను బతకనివ్వదు. బయట నా రాక్షసి నాకు కాపలా కాస్తుంది. ఇది నన్ను చావనివ్వదు.

6 comments

  1. Super like Purnima. మనసులోని భావాల్ని, మానసిక సంఘర్షణని చెప్పే వాళ్ళు బ్లాగర్స్‌లో చాలా మందే ఉన్నారు. కానీ అందరూ తమ మనసుకి అ,ఆ లు నేర్పటం మొదలుపెట్టి వాక్యాల స్థాయికి ఇప్పుడే వచ్చారు. కానీ మీరు మీ మనసు భాషని అతి సాదారణ వాడుక భాష అన్నట్టు వ్రాసుకుంటూపోతారు. మొదటి నుండీ మీ టపాల్లో ఊహలకి ఊసులు చెప్పటం నేర్పారేమొ, ఇప్పుడు ఈ మనసు భాషపై మీకు పూర్తి సాధికారత వచ్చేసింది.

    ఇక కంటెంట్ విషయానికి వస్తే అచ్చమైన సంఘర్షణ స్పష్టంగా కనిపించింది. I could able to relate it to some known persons. very well done!!

    Like

  2. మళ్ళీ మీ రచనొకటి కాజేస్తున్నా నాకు నచ్చిన రచనల్లోకి.

    నాకు నచ్చింది ఇక్కడ రెండు విషయాలు, ఒకటి సమకాలీన పరిస్థితులలోనే అందమైన వాతావరణం సృష్టించటం. చాలా బాగుంది ఫోన్ మోతలనూ, ఎస్సేమ్మేస్లనూ, సిటీ వాతావరణాన్ని అలా కథ నడిపించటం సూపర్. రెండోది మీ పరకాయ ప్రవేశనా ప్రావీణ్యం. ఈ మధ్య బానే చేస్తున్నారీ పరకాయ ప్రవేశాలు.

    Like

  3. chUstunnaTTuga undi chadivi nattu lEdu. anthe inkem cheppalenu. and mee style kuda undi eppudu vishyanni katha madyalono, last lono ardamayyettu cheppatam. greatttttttttt. 🙂

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s