ఏంటలా పరగ్గా వెళ్ళిపోతున్నారు? నేనున్నాని గమనించరేం? పొరపాటునైనా?
సర్లేండి. పదండలా నడుస్తూ మాట్లాడుకుందాం. ఆకాశం చెక్కిలి మీద ఎరుపెలా తేలిందంటారు? ఎవర్ని కలవబోతున్నందుకో ఆ సిగ్గులకెంపులు? సంద్రాన్ని చూడండి.. ఏరి? అలా బిగుసుకుపోతారేం? ష్… జాగ్తత్తగా వినండి. కిశోర్ కుమార్ వద్ద ఏకలవ్య శిష్యరికం చేసినట్టు, గాలి ఈలలేస్తోంది. మీ పరధ్యానం మీదేనా? అవున్లే, మీ పరధ్యానం మీది కాకపోతే నాదవుతుందా? పదండి, మీరెటు పోతే, నేనూ అటే..
నిర్మానుష్యపు వీధిలో మానవాకరం. అటు తిరిగి నుంచున్నారెవరో? స్త్రీ? అవును.. స్త్రీయే! అదో పైట. ఆవో కురులు. గాలందిస్తున్న లయకు తాండవిస్తున్నాయి. ఈ వేళలో, ఇక్కడ? ఎవరై ఉంటారు? చూద్దామా? నాలుగడుగులు వేసిన పుణ్యానికే, ప్రసాదంగా ఆమె పరిమళ సుగంధం! ఒక్క క్షణం ఆగండి.. ఆఘ్రాణించమనీ చెప్పాలా? చోద్యం కాకపోతే?! ఇదేమిటి? అపశృతి. ఏడుపు. ఎవరిది? మనిషిదే! అంటే ఆమెదా? ఆ ప్రశ్నార్థకం అనవసరం. పదండి..పదండి.. ఆడకూతురికి ఏ ఆపదొచ్చిందో ఏమిటో? ఏమయ్యిందో కనుక్కోండి. అపరిచితమేలెండి. కాదనేవారెవ్వరున్నారని? అందుకని? పట్టించుకోరా?! సాటి మనిషి బాధలో ఉంటే.. ఆ, ఈ ఊపిరితిత్తుల మధ్య గుండెకాయని ఒకటుంటుందే మనుషులకూ? “మనిషేనా?”అనడిగితే పొడుచుకొస్తుందిగా! అందుకే. ఆమె ఊరుకోవటం లేదే?! అసలు విషయమేమయ్యుంటుందో?!
అడగండి. ఆగండి. అడగమంటే అదిలించి, బెదిరించమని కాదు. కాస్త సౌమ్యంగా. కష్టంలో ఉందాయె! బావిలో నీళ్ళు తోడినట్టు, భళ్ళున కాదు. కన్నీటి చుక్కకూ, చుక్కకూ మధ్య మీ ఆర్ద్రత వాక్యమైపోవాలి. నిట్టూర్పుకీ నిట్టూర్పుకి మధ్య కథ ఒదిగిపోవాలి. స్వామీ.. ఆడపిల్లా, ఆ పై కన్నీరు అని చేతులు నలుపుకుంటూ కూర్చుంటే, అవతల మనిషి ఏ అగత్యానికో ఒడిగడితే?! సంశయాలకు కూడని సమయం. అడుగేయండి. అడిగేయండి.
తెల్సుకొచ్చారా? ఏంటట? విరహోత్కంఠిత? అనుకున్నానులే వాలకం బట్టి. వివరాలడిగారా? చెప్పిందీ! చెప్తుందిలే! చెప్పకేం చేస్తుంది. దాచాలనుకున్నవన్నీ దాగవు కదా! కొన్ని చెప్పుకోడానికి అయినవాళ్ళకన్నా అపరిచితులైతేనే అన్ని విధాల మేలు. ఓహో. ముందు తమరి జాతకం తెల్సుకున్నాకే మనసు విప్పిందా? ఎందుకట? అబ్బో, వడపోతలే?! పరిచయమే?! ఆర్చి రమ్మంటే వార్చొచ్చావా, నాయన? (మనది మాత్రం నాలుగు పేరాల అనుబంధం కాదేంటి? ఆ మాత్ర్రం చనువు నాకు లేదేంటి?)
***********
హలో..అబ్బాయ్! ఏం కథ? ఇవ్వాళ పరాగ్గా కాక, కంగారుగా ఉన్నావ్? పద.. ఈ రోజు ఇంకో తీరానికేసి నడుద్దాం. అక్కడ, నుస్రత్ ఫతె అలీ ఖాన్ కంఠంలా వీస్తుంది గాలి. దా.. పోదాం? ఓయ్య్.. నేను మాట్లాడుతూనే ఉన్నా, ఎటెళ్ళిపోతున్నావ్? నిదానంగా.. ఎవరో లాగుతున్నట్టు, పరాధీనంలో ఉన్నట్టు..? వినిపిస్తోందా? హలో.. హలో?
***********
’ఆమె వచ్చేస్తుంది. వచ్చేస్తోంది.’ – ఆఆ.. ఏంటా తత్తరపాటు? ఎవరామె? ఎందుకు వస్తోంది? ఏంటీ చెమ్మ? కన్నీళ్ళే? ఇన్నే? నీవే? హయ్యో.. ఇప్పుడేమయ్యిందని? ఆమెవరు? బేరం బెడిసికొట్టిందా?
నువ్విలా విలవిల్లాడితే నాకూ ఏం తోచదు. దా.. ఇలా తలవాల్చు. కాస్త ఊరడిల్లు. అసలేం జరిగింది?
ఆమె. ఆ రాత్రి. ఓ గుప్పిట మూసి, తదేకంగా చూస్తూ భోరుమంటూ ఉంది. ఏం జరిగిందని అడిగాను. పట్టుకోలేకపోతున్నా, పట్టువదల్లేకపోతున్నా అంది. విలువైంది. చేజార్చుకోకూడనిదంది. మూసున్న గుప్పిట కంపిస్తోంది. నా చేతులు మీకన్నా పెద్దవనంటూ, నా దోసిట్లో ఆమె గుప్పిట ఒదిగేలా ఏర్పాటు చేసాను. చేతిలో చేయి. భుజానికి భుజం. ఆమె పైట్ నా మొహం మీద రెపరెపలాడగానే, మనసు ఇళయరాజ సంగీతం విన్నట్టు తాద్మాత్యం చెందింది. నా గుండె దూదిపింజెలా ఎగిరిపోతుంటే, పట్టుకోడానికి, ఒక చేతిని వెనక్కి తీసుకున్నాను. ఎందుకనడిగింది. చెప్పేసాను. సంగ్ధిధావస్థనుండి తేరుకొని, బహుశా, నేను నీదాన్ననంది. ఒంటిచేతిలో ఉన్న ఆమె గుప్పిటకు పూర్తి సంరక్షణ అందించే బాధ్యతనెత్తినేసుకొని, రెండో చేతిని (గుండె ఉందందులో) తెచ్చి, ఆల్చిప్పను మూస్తున్నట్టు అరచేతి మీద మరో అరచేయిని బోర్లించబోతుండా.. ఆ కంఠం వినిపించింది. ఆమె ఎగిరిపోయింది. నా గుండె చేజారిపోయింది..
హతవిధీ! ఎంతటి కష్టం? పగవానిక్కూడా వద్దీ కష్టం. పాపిష్టిదాన్ని, ఆ పూట నిను అటువేపుగా తీసుకెళ్ళకపోయుంటే..
అవును. ఈ పాపం నీదే! నా గుండెలో చిచ్చుకు కారణం నువ్వే. ఏం చేసానని ఈ శిక్ష? ఎందుకు నాపై కక్ష?
అన్నావూ?! ఎప్పుడెప్పుడంటావా? అని కాచుక్కూచున్న. నన్ను తోలుబొమ్మకి కట్టిన తాళ్ళనుకో, అచ్చైన కథలో మరి సరిచేయలేని వాక్యాలనుకో, నిను వీడని నీడనుకో, లేక నీ బుద్ధనుకో.. నువ్వెక్కడెక్కడు పోయి, ఏమేం నిర్వాకాలు చేసుకొచ్చినా, వాటి పర్వవసానాలు ఎంత విపరీతంగా ఉన్నా, నువ్వు బతికినన్నాళ్ళూ నాతోనేగా ఉండాలి, ఊరడిల్లినా, ఊసురోమన్నా! ఊరుకో.. ఏడ్వకు.
గాయమన్నాక, గాయమంటూ అయ్యాక మానకుండా ఉండదుగా. మరుపు మనిషికున్న గొప్ప వరం. కాలం ఎటూ మందేయకుండా ఉండదు. వికటించిందే అనుకుందాం. అన్నాళ్ళు అలవాటయ్యాక, కొత్తేముంటుంది? పీడలందు మధుర పీడలు వేరయా అని నువ్వు వేదాంతం గుమ్మరించకపోతావా? నేను వినకపోతానా?
ఇదో.. ఇలా వచ్చి కాస్త కుదుటపడు. పడ్డానికి ప్రయత్నించు. వెక్కి వెక్కి ఏడ్చావ్‍గా, ఇంకా ధార ఆగిపోతుందిలే! నువ్వు కాసేపు అలా పడుకో, ఈ లోపు కన్నీళ్ళు ఊరతాయి. మెలకువతోటే కొత్త కన్నీరు.
జో అచ్యుతానంద.. జో జో ముకుందా..
(ఈ పైత్య ప్రకోపానికున్న నేపధ్యం. నిన్న మళ్ళీ వైట్ నైట్స్ చదివాను. ఎంత చెడ్డా, సంజయ్ లీల బన్సాలీ అంత కాదన్న ధైర్యంతో ఇలా! మూడేళ్ళ క్రితం నాకీ రచన పరిచయంచేసి, ఈ-పుస్తకం ఇచ్చినవారికి థాంక్స్!)
మీ బ్లాగ్ ఓపన్ చేసాక, పోస్ట్ అంటూ చదివాక ‘ఊహలన్నీ ఊసులై’ మమ్మల్ని ఏక్కడికో తీసుకెళ్ళకుండా ఉండదుగా!
LikeLike
🙂
LikeLike