(ఈ పురుగు నా మెదళ్ళోకి ఎలా చేరిందో తెలీదు – బహుశా, నా స్నేహితుడొకడు, నేను రాసినవి చదివనప్పుడల్లా, ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అనేది ఒకటుంటుందని అదే పనిగా గుర్తుచేయటం వల్లననుకుంటా – గానీ, ఇలా తక్కువలో అతి తక్కువ పదాలు వాడి ఏదైనా రాద్దామా? అనుకున్నప్పుడు, ఇది (https://pisaller.wordpress.com/2011/01/06/luvs/) తట్టింది. తర్వాత అలా ఆలోచిస్తూ పోతే, ఇంకొన్ని వచ్చాయి. ప్రేమకథలే ఎందుకూ? అంటే సినిమాల్లో, పుస్తకాల్లో, జనాల్లో ఎక్కడ చూసినా అదే గోలగా.. అందుకని ప్రాక్టిస్ తేలికవుతుందని దాన్ని ఎన్నుకున్నాను. రాం గోపాల్ వర్మ కొన్ని ప్రేమకథలు అర్థం కావంటాడు. నన్నడిగితే కొన్నింటికి అసలు అర్థాలే ఉండవు. అలా కాక, జనజీవన విధివిధానాల్లో బాగా పాతుకుపోయినవే ఇక్కడ రాసా! ఇందులో మీకు తెల్సిన సినిమాలూ, పుస్తకాలూ ఉండచ్చు. చదువుతూ, చదువుతూ ఆ ఆటా ఆడుకోండి.)
*******
నాకూ ఒక ప్రేమకథ ఉంది; రామాయణం – రావణుని జాతి అంతరించినందుకు, రామునిలో రావణుడు, అయోధ్యలోనే ఆశోకవనం.
*******
నాకూ ఓ ప్రేమకథ ఉంది; దేన్నీ కాదనలేడు – మనసిస్తే తిరగివ్వలేదు, నాది కూడా!
********
నాకూ ఓ ప్రేమకథ ఉంది; ఆత్మకథ – కవర్ పేజీపై ఆమె.
********
నాకూ ఓ ప్రేమకథ ఉంది; అక్షరాల సావాసంతో అంకురించిన ప్రేమ. నేను రాసింది ఆమెకు పంపితే, అటు నుండి వచ్చిన సమాధానం: ’వావ్! మతి పోయింది. నమ్మలేకపోతున్నా. చాలా బా రాసావ్. ఏ పత్రిక్కు పంపుతున్నావ్? ఇదో అబ్బాయ్.. నా పేరు వాడుకున్నందుకు మాత్రం పార్టీ!’ అది నా మొదటి ప్రేమలేఖ!
**********
నాకూ ఒక ప్రేమకథ ఉంది; నేను ప్రేమించాను – ఆమె పెళ్ళాడింది వేరొకరిని.
*********
నాకూ ఒక ప్రేమకథ ఉంది; ఇద్దరం ఒకటయ్యాం – ముగ్గురవ్వబోతూ ఒక్కడినే పోయాను, మిగిలి.
**********
నాకూ ఒక ప్రేమకథ ఉంది; మగ వ్యాకరణానుసారం, ’అమ్మాయి’ ఉండదు, ’అందమైన అమ్మాయే’ ఉంటుందన్న ఇంపొజిషన్ రాసాను.
***********
నాకూ ఒక ప్రేమకథ ఉంది; సత్యభామలా నన్ను తూకానికేసింది. ఏకపత్నీవ్రతుణ్ణి కాపాడ్డానికి రుక్మిణి లేదు.
***********
నాకూ ఒక ప్రేమకథ ఉంది; ఐపాడ్‍లో పాటలకు మల్లే, అతడికి సవాలక్ష ప్రేమలు. నా వంతు రాకపోతుందా అని నిరీక్షణ.
************
నాకూ ఒక ప్రేమకథ ఉంది; ఛత్.. ఐపాడ్‍లో ఎన్ని పాటలుంటే ఏం లాభం? ఆ ఒక్క పాటే లోప్ లో ఉండగా..ప్ఛ్..
************
నాకూ ఒక ప్రేమకథ ఉంది; నేనతడికి కంఠతా వచ్చిన వర్డ్స్ వర్త్ పోయెమ్ని.. అర్థమే కాను.
************
నాకూ ఒక ప్రేమకథ ఉంది; చెహోవ్ రాసిన “కిస్” కథ మలిముద్రణ దేవుడు నా నుదిటి మీద వేసాడు.
************
నాకూ ఒక ప్రేమకథ ఉంది; ఏం? హీరోయిన్ అందంగా లేకపోతే ఆడకుండా అడ్డంగా తన్నేస్తుందని భయపడ్డానికి నా జీవితమేమన్న విడుదల కానున్న తెలుగు సినిమానా?
************
నాకూ ఒక ప్రేమకథ ఉంది; పాస్‍వర్డ్ మార్చాననీ తెల్సు, కొత్తది వాడకపోతే లాగిన్ అవ్వలేననీ తెల్సు.. అయినా వేళ్ళు పాతదే కొట్టి వెక్కిరించబడతాయి.
************
మాకూ ప్రేమకథ ఉంది; అదేంటో తెల్సుకోవాలంటే వేయాల్సిన ప్రశ్న ’ఎలా కలిసార”ని కాదు. “ఎలా కలిసున్నార?”ని.
************
నాకూ ఒక ప్రేమకథ ఉంది; నాకై ఆమె ప్రేమ పొంగుతుంటే, ఎక్కడ పొర్లిపోతుందోనన్న హైరానాలో నీళ్ళందక, పిండుతున్న నిమ్మరసం చిలకరించాను. అంతే!
************
నాకూ ఒక ప్రేమకథ ఉంది; సెహ్వాగ్‍ను ఆవహింపజేసుకుంటూ మలి పరిచయంలోనే “సరి అనవా? వరమిడవా?” అంటూ గాల్లోకి లేపాను. ఫియాన్సే అట, గల్లీ లో షార్ప్ కాచ్ పట్టాడు.
*************
నాకూ ఒక ప్రేమకథ ఉంది. నేను ప్రేమన్నా, వాడు ఫ్రెండన్నాడు. నేను ఫ్రెండన్నాను, వాడు ప్రేమన్నాడు. నేనేమీ అనలేదు. అనటానికి వాడికస్సలేం మిగల్లేదు.
*************
నాకూ ఒక ప్రేమకథ ఉంది; రెక్కలు తెగిన సీతాకోకచిలుక నా మీద వాలి, నే వేసిన మందుకు కుదుటపడుతూ, నయం అవ్వగానే తుర్రుమంది.
************
నాకూ ఒక ప్రేమకథ ఉంది; అదెందుగ్గానీ? రోజూ అదే ప్లాట్‍ఫాం. అదే ట్రైన్. కమల్ హాసన్. కానీ, శ్రీదేవెందుకు రాదు?
***********
నాకూ ఒక ప్రేమకథ ఉంది; పెళ్ళి కాకముందే విడాకులు.
***********
నాకూ ఒక ప్రేమకథ ఉంది; అతడి జీవితపు పుస్తకంలో కనీసం ఓ వాక్యమవుదామనుకుంటే, ’అనవసరం’ అంటూ ఎడిటర్ కొట్టిపారేసాడు.
***********
“నాకూ ఒక ప్రేమకథ ఉంది; అతడి జీవితపు పుస్తకంలో కనీసం ఓ వాక్యమవుదామనుకుంటే, ’అనవసరం’ అంటూ ఎడిటర్ కొట్టిపారేసాడు.”
– Kevvv!! Too good!!
LikeLike
హ్మ్ కొన్ని అయితే ‘టచింగ్’ గా ఉన్నాయి
LikeLike