రాత్రి సమయం. కుండపోత వర్షం.
ఆమె వంటగదిలో పనిచేసుకుంటుంది. అతడు తలుపును భళ్ళున నెట్టి రంకెలేయడం మొదలుపెట్టాడు. ఆమె కనిపించగానే తిట్లందుకున్నాడు. మీదమీదకొచ్చాడు. మద్యం వాసన భరించలేక ఆమె ఈసడించుకొంది. అతడి కోపం పేట్రేగింది. పొయ్యి మీదున్న వేడి పాత్రపై ఆమె చేతిని బలవంతాన ఆన్చాడు. కుడిచేత్తో ఆమె ఎడమ చెంప మీద కొట్టాడు. విసురుగా దూసుకొచ్చిన చేయి అడ్డుగా ఉన్న ఆమె చెంపను చెల్లుమనిపించటంతో కిందకు వాలగా, దాన్ని రివర్సులో లేపి ఆమె ఎడమ చెంపను పగలగొట్టాడు. ఖాళీగా ఉన్న ఎడమచేతి వేళ్ళను జుట్టులోకి జొప్పించి, పిడికెడు నిండగా జుట్టు అందగానే బలంగా వెనక్కి గుంజాడు. తన చేతులను అడ్డుకోబోతున్న ఆమె రెండుచేతులనూ వెనక్కి లాగి పట్టి, ఒక గుప్పిట్లో బంధించాడు, అడొచ్చిన గాజులను నులిమేస్తూ. నిశ్చేష్టగా అతడున్న క్షణకాల సమయంలో ఆమె పెనుగులాడడం గమనించి నోటికొచ్చిన తిట్లన్నీ మొదలెట్టాడు. వాటిని వినలేక ఆమె తల పక్కకు వాల్చి కళ్ళు మూసుకొంది. ఆమె బుగ్గలను, చేతి వేళ్ళకు దవడ మాటున పళ్ళవరస తెలిసేంత బలంగా, చేతుల్లోకి తీసుకుని తలను తన వైపుకు తిప్పాడు. తిప్పి, తన కళ్ళల్లోకి చూడమని గద్దించాడు. ఆమె భయభయంగా రెప్పలు లేపడంతో ఆమె కళ్ళల్లోకి కసిగా చూస్తూ దుర్భాషలాడాడు.
వాన ఉదృతి పెరిగింది. వర్షం చప్పుడు తప్ప మరో అలికిడి వినపడనంత గట్టిగా కురుస్తోంది.
ఉన్న బలాన్నంతా కూడదీసుకొని తలను బలంగా విదిలించింది. అతడి పట్టు సడలింది. తలతోనే అతని రొమ్ములో బలంగా గుద్దింది. దెబ్బకు ఆమె చేతులు రెండూ అతడి గుప్పిట నుండి విడుదలయ్యాయి. ఈ పరిణామాన్ని అర్థం చేసుకోడానికి అతడికి కొన్ని క్షణాలు పట్టింది. నొప్పొడుతున్న మణికట్లను, పెదవంచున కారుతున్న రక్తాన్నీ చూసుకుంది. అంతలోనే బీభత్సంగా అరుస్తూ, ఆమె జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చుకొచ్చాడు, ఇవతల గదిలోకి. చేతుల్ని గాల్లోకి లేపి ఆరడుగుల తొంభై కేజీలున్న అతడు, ఐదున్నర అడుగుల యాభై కేజీలున్న ఆమెను దూది బస్తాని లేపినట్టు గాల్లోకి లేపి కింద పడేశాడు. అదృష్టవశాస్తూ ఆమె పరచున్న పరుపు మీద పడింది. దురదృష్టవశాస్తూ ఆమె పైట చెదరి, డీప్ కట్ బ్లౌజ్ ఆమె యదపైనున్న నల్లటి పుట్టిమచ్చ అతడికి కనిపింపజేసింది. ఒక్క ఉదుటున ఆమె మీదకు దూకాడు. ఆపిల్ పండును నోట కరచినట్టు, పళ్ళను ఆమె వక్షస్థలంలోకి దింపాడు. నున్నటి చర్మమూ, దాని కింద మాంసం రుచి తగులుతుండగా, పంటి కింద రాయిలా ఆమె మెడలో ఉన్న దండ తాలూకూ నల్లపూసలు కూడా అతడి నోటిన పడ్డాయి. దానితో తాడు తెగి, నల్లపూసలన్నీ వైపరిత్యం సంభవిస్తున్నప్పుడు మనుషుల్లా చెల్లాచెదురైపోయాయి. ఆటవికంగా ఆమెను అనుభవించాడు.
ఎప్పటికో అతడు నిద్రపోయాడు, గుర్రుపెట్టి. ఆమె రెప్ప మూయలేదు. వానాగింది. తడి చెత్తకుప్పల కంపు గుప్పుమంది.
తెల్లారగానే, మెళకువ రావటంతోటే అతడు బయటకు వెళ్ళిపోయాడు. ఆమె ఎప్పటికో లేచి, నల్లపూసలన్నీ ఏరుకొని డబ్బాలో దాచుకొంది. రోజూవారి పనులు మొదలెట్టుకుంది. స్నానం చేస్తున్నప్పుడు వేన్నీళ్ళు ఒంటి మీద పడుతుంటే, తన కట్టెకింకా ప్రాణముందని స్ఫురించింది. రాత్రి భాగోతం మరో కంటికి తెలీకుండా ఉండడానికి ఎక్కువ సేపు అలంకరించుకుంది. పనికి బయలుదేరింది.
ఆమెను చూస్తూనే యజమానురాలు అనుమానంగా మొహం పెట్టింది. అంట్లు తోముతుండగా, పక్కనే వంట చేస్తున్న ఆమె,
“ఏంటి? మళ్ళీ కొట్టాడా నీ మొగుడు?” అని అడిగింది, జవాబు రాదని అనుభవం మీద తెల్సున్నా.
“వాడసల మనిషా? పశువా? పద, పోలిస్ స్టేషన్‍కి.. వాణ్ణి కూడా సెల్లో పడేసి చితకబాదితే తెలుసొస్తుంది.”
“మాట్లాడవేం? వాణ్ణి కాదు. నిన్ననాలి. అసలు నువ్వు మనిషివా? ఇంతిలా చావగొడుతున్నా కిం అనవ్.. నీకు నొప్పుండదా?” అంటూ నిన్న పెనుగులాటలో గాజులు చేసిన రక్తపు చీలికల మీద నీళ్ళేసింది. ఎండిన రక్తం మీద నీళ్ళ చుక్క పడేసరికి, ఒక్కసారిగా రాత్రంతా పడిన నరకయాతనంతా కళ్ళల్లో నీళ్ళుగా తిరగుతుండగా, “నీకు నొప్పుండదా?” అన్న ప్రశ్న గుర్తొచ్చి చిన్ననవ్వు పెదాల మీద తేలాడింది.
ఆ(మె) నవ్వు యావద్భారతదేశానికి సుపరచితమైన చిర్నవ్వు. వెల్లువల్లే ముంచేసే వానలూ, ప్రకృతి వైపరిత్యాలు, మారణహోమాలు, మతకలహాలు, విద్వేషాలు, నిత్యకృత్యమైన ఉగ్రవాద దాడులు – ఇలా ఎన్ని వచ్చినా, రక్తపు మడుగులింకా ఎండక ముందే, శవాలను దాటుకుంటూనే, నెత్తురోడుతున్న శరీర భాగాలను విస్మరిస్తూ, నిల్చుని కన్నీటి చుక్క రాల్చడానికి వీలవ్వని ఆర్థిక, సమాజిక స్థితిగతుల వల్ల, గత్యంతరం లేక మనోబలాన్ని అభినయిస్తూ జనజీవితాన్ని కొనసాగించే ముంబై నగరం పులుముకునేది ఇలాంటి చిర్నవ్వుల్నే కదూ?!
నిజమే.
మనసు కదిలించారు మీరు.
నాగస్వరం.
LikeLike
ముంబై కి ఆమె కి ఎంతవరకూ పోలిక… భరించే అలవాటు వరకా.
LikeLike
ముంబాయి దాడులను అత్యాచారముతో పోల్చి అత్యాచారాన్నే దారుణంగా అవమానించారు.
LikeLike