నా ఊపిరికి మరో ఊపిరి జతకూడి, బరువెక్కి బుసులుకొడుతోంది. నిద్రాణమై ఉన్న తాపాగ్నికి కొత్త ఊపిరి పోస్తోంది. నీడను నీడ ముద్దాడుతున్నట్టు, అంత దగ్గరైనా ఆ జత పెదవులు నోటికి అందవేం? ఆ ఊపిరిని అనుసరిస్తూ, ఆ పెదవుల కోసం అర్రులు చాస్తూ పై పైకి లేస్తూ..
ఎత్తైన శిఖరం నుండి కాలు జారి నదిలోకి మునకేసినట్టుగా మెళకువలో పడ్డాను. చీకట్లో చేతులతో తడిమితే, సుబ్బరంగా నిద్ర పోతున్న మా ఆయన! అతడి పని కాదు.
కల? ఛీ! ఏంటి ఇలాంటి పాడు కల వచ్చింది? ఏం ఆలోచిస్తున్నానసలు? కల అర్థమేమిటి? గూగుల్ చేద్దామని, లేచి కూర్చొని మంచం మీద వెతగ్గా చేతికి చిక్కింది మొబైల్. ఆన్ చేసాను. ఆ వెలుతురులో ఒక అస్పష్టాకారం.
అంటే ఇది కల కాదు?! గుండె ఝల్లుమంది! వెన్నులో వణుకు పుట్టింది. నా మంచం మీద నాకు తెలీకుండా మరో మనిషి!
“హే.. హే..” అని మెల్లిగా అనబోయాను, భయంగా. నోట మాట పిగల్లేదు. దుడుకుగా మా ఆయన వైపుకి దూకి, ఆయన్ని తట్టి లేపాను. లేవటం లేదు. ఆందోళనలో గట్టిగట్టిగా కొడుతున్నాను. అయినా లేవడేం?
మొబైల్ లైట్ పోయింది. చీకటి. అంతా నా భ్రమేమో అనిపించింది. దాన్నే బలంగా నమ్మి పడుకోబోయాను. ముసుగుతన్నబోతుంటే నా కాళ్ళు ఆ ఆకారానికి తగిలాయి. చటుక్కున “సారీ!” అంటూ గుండెల మీద చేయి ఆన్చుకొని సంప్రదాయబద్ధంగా క్షమాపణలు చెప్పాను. సారీ? మై ఫుట్! కాలికేదో తగిలిదంటే నాది భ్రమ కాదన్న మాట.
“హే.. ఎవ..ర..ది?” – అక్షరం అక్షరం ఏరుకొని ఏరుకొని పలికాను.
తడుముకుంటూనే బెడ్ లాంప్ ఆన్ చేసాను. అస్పష్టాకారం స్పష్టమయ్యేకొద్దీ మరింత అస్పష్టంగా మారింది. మనిషని తెలుస్తోంది. కాని ముక్కూ, మొహం కనిపించటం లేదు. గుండెకు, వెన్నుకు జతగా, కడుపులో కూడా భయం మొదలయ్యింది.
ఒక ఉదుటున మా ఆయన పక్కగా జేరాను. ఎంత కుదిపినా, నిద్రలేవడేం? లాభం లేదు. నేనే ఏదోటి చేయాలి. నాకు అర్జెంటుగా కావాల్సింది ధైర్యం. అంటే, భయం లేదన్నట్టు నటించటం.
“హే.. చీకట్లో నక్కటం కాదు. ధైర్యముంటే నా ముందుకురా!” – టేక్ ఓకే అయింది, మనసులో ఒక పది కట్లు చెప్పుకున్నాక.
నా వాక్యం ఇంకా పూర్తి కాక ముందే, చేతులు కట్టుకొని, బుద్ధిగా బెండ్ లాంప్ వెలుతురు పడుతున్న చోట తల తిప్పాడు. డు-నే! అనుమానం లేదు. నాకు తెల్సున్న మనిషో, కాదో తేల్చుకోడానికి మొహాన్ని నిశితంగా చూసాను. తల మీద జుట్టుంది. తల కింది మెడుంది. తలకి రెండు వైపులా చెవులున్నాయి. కాని, ముక్కూ, కళ్ళు, పెదాలు ఏవీ కనిపించటం లేదు? లేవా? లేకపోతే.. ఇందాకటి ముద్దు సంగతో? వీడి నిర్వాకమా? లేక కలా అదీ? మరి ఇదో? కలలో మెళకువ? ఏంటిది? అప్పటికే కడుపులో ఉండలా తిరుగుతున్న భయం, గొంతుకడ్డ పడి నోట
మాట రాక, కన్నీళ్ళొచ్చాయి. కన్నీరు తుడుచుకోడానికని అలవాటు ప్రకారంగా కళ్ళద్దాలు తీయబోయాను. కాని ఏవి? ఓహ్.. నిద్రపోయేటప్పుడు అద్దాలు తీసేస్తా కదా.. అద్దాలు పెట్టుకోవాలి అర్జెంటుగా. చీకట్లో వెతికాను, చేతులతో. ఏం తగల్లేదు.
నన్ను రేప్ చేసాక, మర్డర్ చేయడానికి సమయం చాలకపోతే, సాక్ష్యాధారాలు మిగలకూడదని వీడే నా అద్దాలు దాచేసుంటాడు.
“అద్దాలు దాచేస్తే నాకేం కనిపించదనుకుంటున్నావ్, కదూ? ఆవలించమన్న సిగ్నల్ వస్తుందని నీకు తెలియకముందే, నీ పేగుల స్కాన్ తీసివ్వగలను, తెల్సా?”
ముందుగా మొబైల్ ఆన్ చేసి, గూగుల్‍ను కేకేసి “నా కళ్ళద్దాలెక్కడ?” అని కొట్టాను. బెండ్ లాంప్‍కు మూడించుల దూరంలో కుడివైపు ఉందని సెలవిచ్చింది. వెంటనే మూడించులు కొలిచి, అక్కడున్నవి కళ్ళద్దాలే అని తీర్మానించుకొని, పెట్టుకున్నాను. ఇక అతగాడిని చూడ్డమే తరువాయి.
“నీ వాయిస్‍లో డెసిబెల్స్ పెరిగాయో, నీ ఆయుష్షులో డెసిమెల్స్ తగ్గుతాయ్! జాగ్రత్త! అసలే మా ఆయన లైట్ స్లీపర్.” అని వార్నింగ్ ఇచ్చాను. మళ్ళీ డైలాగు చెప్పాల్సిన టైంలో గుర్తురాకపోతే కష్టమని.
అతడు బిత్తరపోయి, చీకట్లో దిక్కులు చూస్తుంటే, తమాషాగా అనిపించి చిన్న వికటాట్టహాసం చేసాను.
“మీ నవ్వు చాలా అందంగా ఉంటుందని ఊహించుకున్నానండి. ఇలా ఉంటుందా?” అన్నాడు.
“హే.. మీ? అండి? తె..లు..గా? చెప్పావ్ కావేం?!” అని అంటుండగానే, టివి ఛానెల్స్ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ చదవడానికి సన్నాహకపూర్వంగా వాడే డప్పు తరహా హెచ్చరికలు వెలువడ్డాయి, లోపలనుండి.
“అంటే ఆసిడ్ బాటిల్? కత్తి? కొడవలి?” అంటూ ముంచుకొస్తున్న చావు ప్రోమోస్ ఊహించుకొని గజగజ వణికిపోయాను.
“ఏంటో? మీరు మాట్లాడుతున్నది తెలుగులా వినిపిస్తోంది.. కానీ అర్థం కావటంలా?” అంటూ నిట్టూర్చాడు.
“ఇంతకీ ఎవర్నువ్వు? – వందో సారి!…
“నా నవ్వు మీద, నా భాష మీద కామెంట్లు వేయడానికి నోరొస్తుందే? ఎవర్నువ్వు – వెయ్యీ రెండో..
“సరే, వదిలెయ్య్! నీ పేరేంటి?”
“మీరేం చెప్పలేదండి.”
“ఏంటి జోకావా? నీకర్థం కావటం లేదు. మనమిప్పుడే కలిసాం కదా, అందుకని పేరాట ఆడుకోవాలి. నీ-నా ఒంటి పేరు, ఇంటి పేరు, ముద్దు పేరు, చదువు పేరు, ఉద్యోగం పేరు, వ్యాపకాల పేరు, ఇంట్లో – పక్కింట్లో వాళ్ళ పేర్లు.. ఇలా ఒకరికొరకం చెప్పుకోవాలి. ఇది అయితే గాని, మనం ఇంకే ఆటలూ ఆడుకోలేం!”
“అదేనండి. కానీ మీరు నాకు నా పేరేంటో చెప్పలేదండి.” అన్నాడు.
నిద్రలో ఉండటంతో సగం మూసుగుపోతున్న కళ్ళు కూడా విప్పారాయి, ఆ సమాధానం విన్నాక. నీ పేరు నేను చెప్పటం ఏంటి? నా మొహం అని తిట్టుకుంటూ, అతడికేసి చూసాను.
ఏముంది?
అయిపోయింది. అంతా అయిపోయింది. ఎప్పట్నుండో చెప్తున్నారు నాకు, ఇలాంటి రోజోటి వస్తుందని! పోరి పోరి చెప్పారు, “కళ్ళద్దాలు వేయించుకోవే! రెండు కళ్ళూ దొబ్బేస్తే, నీ లాప్‍టాప్‍కు దారాలు కట్టుకొని, మెళ్ళో వేలాడదీసుకొని, హార్మోనియం మీటలు వాయిస్తున్నట్టు నటిస్తూ, “కబోదిని బాబూ..” అంటూ అడుక్కోవాలి. ఈ లోపు నిన్నెవడో మాయచేసి, లాప్‍టాప్ దొబ్బేసి, పాత సామాన్లవాడికేసి, వేరుశనగ పప్పులు కొనుక్కుతినేస్తాడు. అఘోరించు.” అని.
గ్లామర్ కోసం ఫోజు కొడితే, ఇప్పుడు నాకు ఎవరి మొహంలోని రూపు రేఖలు తెలీకుండా, ఫీచర్-బ్లైండ్‍నెస్ వచ్చేసింది. ఇహ, రోజూ మా ఆయన మొహం చూసి మురిసిపోయి, ముద్దెట్టుకునే అవకాశమే లేదు. హయ్యో! ఎంత పని జరిగింది!
దుఃఖం పొంగుకొచ్చింది. ఒక్కసారి మా ఆయన మొహం చూడాలనిపించింది, కళ్ళా(ద్దాల)రా!. నా మనసు చదివినట్టుగా ఇటు తిరిగాడు.
హాశ్చర్యం. అతడి మొహంలో రూపురేఖలు స్పష్టంగా కనిపించాయి. కనిపించాయంటే కనిపించవూ మరి! పాతివ్రత్యం మహిమ అంటే ఇదే! ఎంతగా ప్రేమించానంటే నా కళ్ళు పీకేసినా, నా కళ్ళల్లో అతడే ఉంటాడు, అక్షరాలు చెరిపేసినా సుద్దతో రాసిన గుర్తులు బ్లాక్‍బోర్డ్ మీద ఉన్నట్టు.
అమాంతంగా ప్రేమ ఫ్లడ్ గేట్లు తెంచుకొని పొగింది. అతడి బుగ్గ మీద బుగ్గ ఆన్చి, “ఐ లవ్యూ!” అన్నాను మెల్లిగా, నిద్ర చెదరకుండా.
“ఐ లవ్యూ” – మరో గొంతు వినిపించేసరికి చిరాకేసింది. ఏకాంతంలో సూరేకాంతంలా, ఎవడీడు? అని విసుగ్గా చూసా, హయ్యో.. అతడి మొహంలో ఏం కనిపించటం లేదే!
గబగబా లాప్‍టాప్ అందుకని, అందులో వెతుక్కోవటం మొదలెట్టా, వ్యాధి లక్షణాలు, వైద్య వివరాలు వైగారాలు.
ఏదో నసిగాడు. నేను నా ధ్యాసలో ఉన్నాను. ఇది నాకు మాత్రమే ప్రత్యేకమైన జబ్బైతే అదో రికార్డు. అవునా? కాదా? అన్న రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను.
మళ్ళీ ఏదో నసిగాడు. “ఉండవయ్యా” అని విసుక్కుంటూనే, ఏంటని అడిగాను.
“ఐ లవ్యూ?”
నాకు ఒళ్ళుమండిపోయింది. చిర్రెత్తుకొచ్చింది. చేస్తున్న పని వదిలేసి, ఆ మనిషికేసి గుర్రుగా చూస్తూ,
“ఐ లవ్యూ? బుద్ధుందా అలా అనటానికి? ఐ లవ్యూ? ఆయ్‍య్ లవ్‍వ్‍వ్ యూఊఊఊ?? ఛ! మిమల్ని అని లాభం లేదు. చూసే సినిమాలూ, చదివే కథలూ అలా ఏడిస్తే మీరేం చేస్తారు, ఇలా ఏడ్వక? బాబూ! ఐ లవ్యూ చివర్న ఎప్పుడూ చుక్క ఉండాలి. ఐ లవ్యూ. అలా! అలా కాకపోయినా ఐ లవ్యూ అనగానే అవతలి వాళ్ళకి, “ఐ గెస్, ఐ లవ్యూ”, “ఐ లవ్యూ, కండిషన్స్ అప్లైడ్”, “లవ్ మి బాక్!” లా వినిపించకూడదు. పోనీ, అవన్నా వినిపించచ్చు. కాని, అన్నింటికన్నా చిరాగ్గా, “మాదాకోళం తల్లా!” అన్నట్టుగా అసలు వినిపించకూడదు. ఐ లవ్యూ చెప్పేటప్పుడు, ఒక పొగరుండాలి. ఒక దమ్ముండాలి. విన్న వాళ్ళకి కనీసం చిన్న షాక్ తగలాలి. జివ్వుమనాలి. నువ్వు చెప్తుంటే
నీరసం వస్తోంది.
“ఏదీ? వీలైనంత నిటారుగా కూర్చో. ఆ ఛాతిని కొంచెం విశాలం చెయ్యి. వెన్నుని వీలైనంత నిటారుగా పెట్టన్నానా? ఓ క్షణం కళ్ళు మూసుకొని, కడుపులో నుండి ఊపిరి తీసుకుంటూ చెప్పు.. ఐ…”
“ఐ లవ్.. యూ.”
“చూసావా? నేను చెప్పలేదూ! ఎంత బాగుందో కదూ! ఏదో పెదవంచునుండి పరగ్గా నటనరాని సినిమా వాళ్ళలా చెప్పకూడదు! అందులోనూ, అతిగా వాడ్డం వల్ల అరిగి ఇలా చచ్చు పదంలా ఏడ్చింది కాని, అసలు ఐ లవ్యూ ఎంతటి తారకమంత్రమో తెల్సునా నీకు?
“ఇందులో మనకి ’ఐ’ అంటే తెలీదు. క్లీన్ షేవ్ చేసుకొని, బుగ్గను వేలెట్టుకొని, “నేను ఎవర్ని?” అని ఆలోచించటం మొదలెడితే, లోకేషన్ హిమాలయాలకు మారి, అరికాలి వరకూ గెడ్డం పెరిగే వరకూ నిలువు కాళ్ళ మీద తపస్సు చేసినా తిరుగు ప్రశ్నలేని సమాధానం దొరకదు. “బొ..బొ..బొ..” అంటూ కోడిపిల్లను బుట్టకింద కప్పెటినట్టు, అసలు ఆ ప్రశ్నను తప్పించుకోడానికే ఈ ప్రేమలూ, పెళ్ళిళ్ళూ!
“లవ్ దగ్గరకు తర్వాత వద్దాం. ముందు “యు” సంగతి చూద్దాం. మనకి ’ఐ’ గురించే ఏం తెలీదు. ఇంక ’యు’, ఎలా తెలుస్తుంది? తెలీదు. తెలిసే వీలు లేదు. తెలీకోడదు కూడ. అందుకనే ప్రేమ!
“’లవ్ ఇస్ బ్లైండ్’ అంటే అదేమీ న్యాయదేవతలా నల్లకళ్లగంతలు కట్టుకొని తిరుగుతుందని కాదు. మనకి గంతలు కడుతుంది. రంగురంగు గంతలు! బహుచక్కని గంతలు.
“మనకి కట్టినట్టే అవతలి వాళ్ళకి కట్టిందనుకో, ఆహా.. గంతలు కట్టిన శుభవేళ! ఒకటే కలవరం. పలవరం. వరం. పెళ్ళవుతుంది. పెళ్ళి ఫోటోల్లో, ఫోటోలు తీసేవాడు “దగ్గరకు జరగండి, దగ్గరకు” అంటూ మిల్లీమీటరు సందుకూడా లేకుండా కొత్త మొగుడూ పెళ్ళాల్ని నించోబెట్టి తీస్తాడు. పళ్ళికిలించమంటాడు. దాన్నే, ఆ తర్వాత పెద్దగా చేయించి గదుల్లో పెట్టుకుంటారులే. పెళ్ళంటే అంతే! పక్కపక్కన నిల్చునేటప్పుడు ఒక పక్క ఫెవికాల్ పూసుకొని నుంచోవటం. ఒక చేయి, ఒక కాలు, ఒక భుజం బలంగా అంటుకుపోతాయి. అసలు పెళ్ళైన కొత్తల్లో అన్నేసి
గుసగుసలు ఎందుకంటావ్? ఇదో.. ఈ ఫెవికాల్ త్వరగా ఆరిపోవడానికి “ఉఫ్-ఉఫ్” అనటం అన్న మాట. దగ్గరతనం ఏర్పడాలన్న ఆత్రుత. ఇవతలి కాలూ, చేయి మాత్రం స్వతంత్రంగా ఉంటాయి. ఒక వైపు బంధం. ఒక వైపు స్వేఛ్ఛ. ఏదీ పూర్తిగా దక్కదు. ఏదీ కుదురుగా నిలువనీదు. ఆ రెంటికీ సమన్వయం కుదర్చడానికే చాలా పాట్లు. ఇహ, “నేను ఎవర్ని?” అన్న ప్రశ్న రాదు.
“మనకి గంతలు కట్టి ఒకర్ని చూపించి, వాళ్ళకి గంతలు కట్టకపోతే? ఏముంది? గంతల పుణ్యమా అని త్రిడిలో బ్లాక్ ఆండ్ వైట్ కలలు. వైట్ నువ్వు. ఉంటావ్. ఆమె బ్లాక్. బ్లాంక్. ఉండదు. ఉన్నట్టు ఆశ రేపుతుంది. నువ్వు రెచ్చిపోతావ్. వాస్తవం మొట్టికాయ వేస్తుంది. కల చెదురుతుంది. ఏడుపొస్తుంది. వస్తూనే, మరో అవకాశం ఉండచ్చు కాబోలునన్న బూటకపు నమ్మకాన్నీ తెస్తుంది.. మళ్ళీ కలలు. కలవరాలు. శాపాలు. ఇంతటి అవస్థలో “నేనెవ్వర్ని?” అన్న ప్రశ్న అప్పుడప్పుడూ వచ్చినా, ఆమె జ్ఞాపకం మరల్చేస్తుందిలే!
“చూసావా? ఐ-లవ్-యూ ఎన్ని విధాల…”
ఏడీ? జపం చేస్తున్నాడా? ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ.. ఆపరా నాయనా. నిద్రపోతున్నాడు మా ఆయన!
ఇంతలో ఎవరో ఏడుస్తున్న చప్పుళ్ళు. వెక్కిళ్ళు. చీదుళ్ళు. ఎవరది? నా బెడ్‍రూమే దొరికిందా, అందరికీ?
అమాంతంగా వెలుతురు మూడో వ్యక్తి మీద పడింది. ఓహ్.. మా ఆయన్ని లెక్కెట్టాలిగా. నాలుగో వ్యక్తి. ఆడపిల్ల. బుడబుడా కార్చేస్తోంది. ఆ దెబ్బకి ఈ ముక్కూ-మొహం కనిపించని శాల్తీ జపం మానేసాడు.
“ఎవరమ్మాయ్ నువ్వు?”
“….”
“బాగుంది. పేరేంటి?”
“మీరు చెప్పలేదండి.”
“అబ్బా! ఈ నేను-చెప్పకపోవటాలు ఏంటి తల్లీ? ఇంతకీ ఎందుకేడుస్తున్నావ్?”
అంతే! నేనేదో కొరడా దెబ్బలు కొట్టినట్టు, పొలుపొలో శోకాలు ఎత్తుకుంది. మా ఆయన నిద్ర పాడుచేయడానికే దాపురించారు వీళ్ళంతా. పోండి! పోండి అవతలకు. నిద్రపోనివ్వరు మనిషిని.
ఆ పిల్ల ఏడుపాపటం లేదు. గుక్క తిప్పుకోడానికి తీసుకొన్న అరసెకను ఖాళీలో ఈ శాల్తీకేసి చూస్తోంది. మొరాయిస్తున్న ఏడుపింజన్ను పట్టి పట్టి లాగుతోంది.
“అతడి కోసం వచ్చావా?”
“రాకుండా ఉండాల్సింది.”
“వచ్చేసావ్‍గా?”
“అదే బుద్ధి పొరపాటు.”
“ఏది?”
“అతణ్ణి…”
“నిన్ను ప్రేమించలేదా? అతడు?”
“…”
“అయినా వచ్చావంటే? ఆశ చావక?”
“ఆశను చంపుకున్నాను. ఆత్రాన్ని దాయలేకపోతున్నాను.”
“…”
“ఇహ.. ఉండదులెండి. మీరూ మీరూ ఒకటయ్యాక, నేనేం అయిపోతేనేం?”
“వాట్ నాన్‍సెన్స్? మీరూ, మీరూ ఏంటి?”
“అతడితో మీకు నచ్చిన విధాన ఐ-లవ్యూ నేర్పించి మరీ చెప్పించుకున్నారే?! ఇష్టం లేకనేనా?”
ఓహ్..ఎంత పొరపాటు. నా మీద ఆశ పెట్టుకొని వచ్చినవాడికి ఖాళీ చేయి చూపించక, దగ్గరుండి ఆశలెలా వ్యక్తం చేయాలో నేర్పానా? అబ్బా! నా నోరు. కాసేపన్నా ఊరికే ఉండదే!
“ఇదంతా మీ వల్లే! మీరే చేసారు. ఎందుకు నాతో ఆడుకోవడం? ఆ పూట, ఆఫీసు నుండి ఇంటికి మా ఇద్దర్నీ ఒకే కాబ్‍లో పంపటం దేనికి? ఆ తర్వాత మా ఇద్దర్నీ బస్‍స్టాప్‍లో నించోబెట్టి వదిలేయడం ఎందుకు?”
నాకేం అర్థం కావటం లేదు. నేను కాబ్‍లో పంపటం ఏంటి? నించోబెట్టి వదిలేయడం ఏంటి?
“అసలేం జరుగుతోందిక్కడ?”
“లేదు. ఆమె మాటలు పట్టించుకోకండి. మీ పనుల వల్ల మీరు మళ్ళీ మమల్ని పట్టించుకోకపోతే అది మీ తప్పు కాదు.”
“అదీ అతడి మనసు. ఇట్టే కరిగిపోతుంది. కరిగించేస్తుంది.”
కరుగుతూనే కరిగించేది.. ఏమటది? పొడుపు కథగా అడగచ్చు. ముందు, ముఖ్యంగా “మీరిద్దరూ ఎవరు? మీకు నేనెలా తెల్సు?”
“ఇహ, ఒక్క క్షణం కూడా నేనిక్కడుండను.” అంటూ విసురుగా వెళ్ళిపోబోయింది. ఆమె ఒక చేయి, అతడి చేతిలోకి వచ్చింది. వాళ్ళద్దరి మధ్య నాలుగైదు అడుగులు దూరమున్నా. అతడు ముందుకు తూలబోతుండగా, అతడి నా చేతిలోకి వచ్చేసింది. మా ఇద్దరి మధ్యా మూడగుల దూరమున్నా. నన్నా చేయి పట్టి లాగుతుండగా, నా చేయి మా ఆయన చేతిలోకి…..
చేరలేదు, నేను అరడుగు దూరంలోనే ఉన్నా!
ఆమె అతణ్ణి ప్రేమిస్తుంది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను మా ఆయణ్ణి?? ప్రేమించటం లేదా? మరి నా చేయెందుకు వెళ్ళలేదు?
లే! మధూ లే! వీడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. నిద్ర లే! నన్ను కాపాడుకో.
ఉన్నట్టుండి మా ఆయన భుజాల్లో నుండి ఒక అరడజను చేతులు పుట్టుకొచ్చాయి. ఒక్కటీ నన్ను పట్టుకోలేదు. ఒక్కోటిగా గోడల్లోంచి బయటకెక్కడిక్ వెళ్ళిపోయాయ్. ఈ ముక్కూ-మొహం కనిపించని శాల్తీది కూడా ఒక చేయి పుట్టుకొచ్చి, అలా సాగి..పోతూ..
తేలిపోయింది. మా ఆయనకు నేనంటే ప్రేమ లేదు. నాకుంది. ఖచ్చితంగా ఉంది. కాని మాయదారి చేయి, అతణ్ణి పట్టుకోవటం లేదు.
“ఆ అమ్మాయినెంత ప్రేమించాడో. ఆ కళ్ళల్లో కనిపిస్తుంది ఆ ప్రేమంతా. తర్వాత మిమల్ని. అంతే ఇదిగా. నేనే ప్రత్యక్ష సాక్షిని. కాని మీరిలా హాండ్ ఇస్తారనుకోలేదు.”
“నేనేం కావాలనివ్వలేదు.”
“ఎవ్వరూ కావాలని ఇవ్వరు. ఇచ్చినా, ఇస్తున్నారనుకోరు.”
“నా చేయి నాకు వెనక్కి కావాలి.”
“మొండి చేయి కదా చూపించారు? అది కూడా వెనక్కి లాగేసుకుంటున్నారా?”
మొండి చేయేమిటి? ఏం మాట్లాడుతోంది? ఒకసారి అక్కడి దృశ్యాన్ని నిశితంగా చూసాను. ఓహ్! నిజమే. చేతులైతే బయలుదేరాయిగాని, అన్నీ మొండివి.
అంటే.. అంటే.. ఆమె అతడిచే నిరాకరించబడింది. అతడు నాచే నిరాకరించబడ్డాడు. ఓ చేయి ఎక్కువ వచ్చిందంటే, ఇంకెవరో కూడా నిరాకరించుంటారు. మా ఆయన చేతిలోకి నాది గానీ, నా చేతుల్లో ఆయనది గానీ లేదు. అంటే.. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. హహహ.. మేం ప్రేమించుకుంటున్నాం. ఐ లవ్యూ బేబీ.. ఐ లవ్యూ… నా బంగారు కొండ. నా పగడాల కోట.
“హే.. ఆట భలే గమ్మత్తుగా ఉంది. Human chain of unrequited loves! తీరని వలపుల మానవ హారం. బాగుంది. బాగుంది.” అన్నాను చప్పట్లు చరుస్తూ.
“తర్వాత ఏంటి? ఇలా చేతులు ఇచ్చుకున్నాక? అంతేనా? బాలేదు. ఇలా చేతులు పట్టుకొని చిన్నప్పటి రింగ రింగ రోజెస్ రైమ్ చెప్పుకుంటూ గుండ్రంగా తిరిగితే? భలే గమ్మత్తుగా ఉంటుందిగా..” నేనాగలేదు.
ఉన్నట్టుండి, రింగ రింగ పాట మొదలయ్యింది. చిర్రెత్తుకొచ్చింది. “ఆపండి!” అని గట్టిగా అరిచాను. ఆగింది.
“రింగ రింగా రోజెస్..
హార్ట్ ఫుల్ ఆఫ్ ??? (రైమింగ్ వర్డ్ కావాలి.)
హషా! బుషాహ్! ఆల్ ఫాల్ ఫర్..” అని నేనే పాడాను. అందరం గిరిగిరా తిరిగి, ఒక్కసారిగా కిందపడిపోయాం. పైకి లేచాం. దులిపేసుకున్నాం.
మళ్ళీ పాట మొదలు. దాదాపుగా భూగోళమంతా భళ్ళున నవ్వుతోంది. పడుతోంది. లేస్తోంది.
మితిమీరిన ఆనందం వల్ల అలసట. మా ఆయన మరీ అలసిపోయుంటాడు పాపం. ఆరుగురితో ఆడాడుగా.
“ఇది సూపర్ అసలు. నేను వెంటనే, దీని గురించి ఫేస్‍బుక్‍లో రాయాలి. మళ్ళీ మర్చిపోతాను, లేకపోతే.” అని పైకి ప్రకటించి, గబగబా లేవడానికి ప్రయత్నించాను. కుదర్లేదు. బహుశా, ఇదంతా కలేమోనని మేల్కోడానికి ప్రయత్నించాను. కుదర్లేదు.
“కల మర్చిపోతాను. భలే తమాషాగా ఉంది, అందరికీ చెప్పాలి. మెలకువ కావాలీ…”
“మెలకువ వచ్చినా, అది మీది కాదుగా!” అందా పిల్ల.
“నిద్ర నాది. కల నాది. మెలకువ నాది కాక?”
“కల మీదే. నిద్ర మీది కాదు.”
“అంటే???”
“కలగంటున్నారేమోనన్న మీ ఊహ నిజమే. కాని మీ కలలో కాదు. వేరొకరి కలలో.”
“ఏంటీ? అదెలా సాధ్యం?”
ఆ పిల్ల గట్టిగట్టిగా నవ్వటం మొదలెట్టింది. అవును. కలలో సాధ్యం కానిదేముంది? ఏమన్నా అవ్వచ్చు. కానీ, నేను వేరొకరి కలలో కలగంటున్నానంటే.. ఎవరై ఉంటారు?
“నా గురించి కల కంటుంది ఎవరు? అందునా నేను కలగంటున్నట్టూ?”
“ఆవలింత రావడానికి సూచనగా సిగ్నల్ రాకముందే.. పేగులు.. ”
హా! కొట్టింది దెబ్బ. ఈ పిల్లకు నేనంటే ఇంత కక్షేమిటి? ఆమెను దీక్షగా చూసాను. ఆ మొహాన్ని ఎక్కడో చూసినట్టుంది. చాలా బాగా తెల్సినట్టుంది. చిన్నవే అయినా జీవం ఉట్టిపడే కళ్ళు. సూటిగా చూస్తున్న ముక్కు. పెదాలు. ఆ పెదాలు.. ఓహ్.. ఆ పెదాలు!
“చాన్నాళ్ళ క్రితం నేనో కథ రాసాను. అంటే ఏదో ప్రయత్నించాను. అందులో అమ్మాయి, అచ్చు నీలా ఉంటుంది తెల్సా?”
అమ్మాయి ఠక్కున మాయమయ్యిపోయింది. ఇవతల చూస్తే, ముక్కూ-మొహం తెలీని శాల్తీ నాకేసే చూస్తున్నాడు.
“నీకు తెల్సా? ఆ కథలో ఒక అబ్బాయుంటాడు. కథ వాడి గురించే. కాని వాడెలా ఉంటాడో రాయలేదు. ముఖ్యంగా మొహం…”
వీడూ మాయమయ్యిపోయాడు. తిరిగి చూస్తే మంచం మీద మా ఆయన కూడా లేడు.
ఎవరో నన్ను దారుణంగా ఇరికించారు? నా అంతట నేనొచ్చి ఇరుక్కునేలా చేసారు. నా బెడ్‍రూం. నా మనిషి. నేను రాసుకున్న కథలో పాత్రలతో నన్ను కట్టేసారు. ఎవరు? ఎవరు? నాకు కాక, ఈ కథ గురించి తెల్సిన వాళ్ళూ…
************
ఠాప్‍మని పుస్తకం మూసేసినట్టు మెలకువొచ్చిందతడికి. చెమటలు పట్టాయి. భయంతో ఒళ్ళు కంపించింది. మామూలుగా ఊపిరి తీసుకోడానికి కాస్త సమయం పట్టింది. చీకట్లోనే మళ్ళీ కలను పునశ్చరణ చేసుకున్నాడు, ముక్కలు ముక్కలుగా. కలలో ఆమె వచ్చినందుకు నవ్వుకున్నాడు. ఆమె భర్తా వచ్చినందుకు తిట్టుకున్నాడు. మగపాత్ర ద్వారా ఆమెకు “ఐ-లవ్యూ” చెప్పించబూనినందుకు, తన కక్కుర్తిని కసురుకున్నాడు. నా కల్లోనూ, నీ దాదాగిరి ఏంటసలు? అని విసుకున్నాడు, తీయగా. తనకు తానుగా కన్న కలలో కూడా, ఆమె ఒక్క క్షణం కూడా తనది కాలేకపోయిందనీ స్ఫురించి కళ్ళంచుల దాకా వచ్చిన నీరు, అతడు రెప్ప మూయడంతో చెంపలపైకి జారింది.
“నువ్వో కలవి..” అంటూ ఎప్పుడో రాసుకున్న కవితలో, కలని కల్లగా మార్చి భావం తూగుతుందో లేదో, సరిచూసుకున్నాడు, రెండు రోజుల తర్వాత.
🙂 ardhamayyiii avvanaTTu gaa undi.
baagundi. Terrific work! keep going!
oka novel laa edaina raayataaniki try cheyyoccu kadaa
LikeLike
పింజారీ అంటే పింజలు, జంద్యాలు వడికేవాడు,బీబీ నాంచారమ్మ వారసుడు http://nrahamthulla.blogspot.in/2013/07/blog-post.html
LikeLike
I’ve read through your article and with due respects to your sentiments, have edited the word in my write-up.
However, I’d like to know how you reached such a remote post on such a remote blog? What was the point you were trying to make here? Irrespective of the context and the environment in the story, are you recommending that word not be used? What are your expectations of the writers and directors towards that word? Please clarify.
LikeLike
పూర్ణిమ గారూ,
పదం మార్చినందుకు ధన్యవాదాలు.గూగుల్ ఎంత రిమోట్ లో ఉన్న పదాన్నయినా వెతికి పెడుతోంది.పాత్రల డైలాగులలోనైనా సరే ఒక కులంపేరుతో తిట్టకూడదని చెప్పటమే నా ఉద్దేశం.
LikeLike