కంటి అంచుకీ రెప్పకీ మధ్య ఏర్పడిన సూదిమందమంత సందులో తళుక్కుమన్న వెలుతురు, మసగ్గా, అస్పష్టంగా సూదిమొనలాంటి నా ముక్కు కొస, చెక్కినట్టున్ననీ చెక్కిలి: నిద్ర మత్తు వదలని కంటిరెప్పలు, నాటకం మొదలవ్వడానికి ముందు తెర లేచినట్టుగా మందగమనంతో పై పైకి లేస్తూ వరసుగా సాక్షాత్కరింపజేసిన దృశ్యాలు.
మెళుకువ వచ్చి రెప్పలు పూర్తిగా తెర్చుకున్నాక కనపడినవి: నిద్రలో తెరచుకున్న నీ పెదాలకు మల్లే మన ఇరు దేహాలు; ఓ చోట కలిసి, మరో చోట విడిపోయి.
ప్రేమించుకున్నాం. పెళ్ళయ్యింది. నిన్న రాత్రి ఒకటయ్యాం.
అయ్యామా? అయితే, ఇంకా ’నేను’ ఎలా ఉన్నాను? ఎందుకున్నాను? చీకటింట తపస్సు ఫలించి ప్రాప్తించే స్వర్గం మిణుగురు మెరుపంత క్షణికమా? దీనికోసమా ఇంత వెంపర్లాట? నిన్ను ప్రేమించినంతగా నిన్ను సొంతం చేసుకోలేనా? సొంతమవ్వలేనా?
నాకీ క్షణాల సుఖాలు, అర్థ భాగాలూ వద్దు. నువ్వు కావాలి. మొత్తంగా. నేను నీదాన్ని అవ్వాలి. పూర్తిగా.
చాచున్న నీ చేతులపై నా చేతులు చాస్తూ, నీ చీలిమండలను తాకేలా నా పాదాలను సాగదీస్తూ, శ్వాసనిశ్వాసల కారణంగా ఏర్పడ్డ నీ ఉదర చలత్పలకం పై నా కడుపును ఆనుస్తూ, నీ గెడ్డానికి నా నుదురు తగులుతూ, నా కురులు చేసే అల్లర్లు నీ చెంపలను మీటుతున్నప్పుడు, స్పందనగా నువ్వు వాటిని ముద్దాడుతున్నప్పుడు..ఆ క్షణాన, మంచుపలకగా ఘనీభవిస్తున్న నీటి సమూహం మీద బరువుగా అడుగు మోపగానే ఉపరితలం భళ్ళున పగిలి నీటిలోకి జారిపోయినట్టు, నేను నీలోకి జారిపోతే! లోపలికి ప్రవేశించగానే బయటకొచ్చే మార్గాలు వాటంతటవి మూసుకుపోతే! నీ తనువే నా కొత్త నివాసమైతే!
“అయ్యో..” లేపేసానా? పడుకో. పడుకో.
అలా నీ లోపలికి వెళ్ళిపోగలిగితే ఎంత బాగుంటుంది?! నీ వేదన్ని స్పాంజిలా పీల్చేసుకొని, నీ ఆనందంతో బుడగలా తేలిపోతూ, నీ కోరికనై, నీ ఆకలినై, నీ చీకట్లలో చీకటినై, నీ యదసడినై, నీ ఊపిరినై, నిన్ను సంపూర్ణుడిని చేయగలిగితే ఎంత బాగుణ్ణు కదూ! నీ నుండి వేరుగా ఉనికే లేకపోతే బాగుణ్ణు. ఒక మాట చెప్పనా? నీ లోపల అసలు అల్లరి చేయను. కొంచెం కూడా. ఎప్పుడో బాగా సంతోషమేసినప్పుడు నీ గుండెను డ్రమ్స్ అనుకుంటాను. మస్తిష్కమేరు ద్రవంలోకి ఎత్తు నుండి దూకి జలకాలాడుకుంటాను. నీలో ఒక కణం నుండి ఇంకో కణానికి కుప్పిగంతులు వేస్తాను. పక్క ఎముక మీద జారుడుబండ మీద జారినట్టు ఆడుకుంటాను. ఇలాంటివేవో తప్పించి అసలు అల్లరి చేయను. నిజం.
లేచావా? “గుడ్ మార్నింగ్!”
“నేనా? ఏం లేదు. ఊరికే.” దొంగ! ఇందాకనగా లేచి చాటుగా గమనిస్తున్నావా? వేషాలకేం తక్కువ లేదు.
చెప్పనా? నాకేమనిపిస్తుందో చెప్పనా? ’కామపిశాచి బాబోయ్’ అని పారిపోవూ? అయినా నాకింత దాహమేమిటి? పరిచయం లేని ఈ మెరమెరపాటేంటి? సంద్రంతో సంగమించాక, ’ఇది నా నీరు. ఇది నీ నీరు.’ అని అనే అవకాశం నదికి ఉండదు. కాని నాదింకా నా శరీరమే. నీది నీదే!
“ఐ లవ్ యు టూ.. బేబీ!” చెప్పలేనంత. చూపలేనంత. పంచుకోలేనంత. నా దాహమంత.
“మేరుద్రవంలోకి”..
మేరుద్రవం aMTE?
LikeLike
నాకీ క్షణాల సుఖాలు, అర్థ భాగాలూ వద్దు. నువ్వు కావాలి. మొత్తంగా. నేను నీదాన్ని అవ్వాలి. పూర్తిగా.
super.
LikeLike