నేను నిన్ను కనలేదు.
నా ఉనికి కారణమైన మనుషులిద్దరూ ఒకరికి ఒకరు తెలియక మునుపే మీ అమ్మ నిన్ను కనేసింది; తొమ్మిది నెలల పదకొండు రోజులు నిన్ను తనలో మోసి. ఆ మోయటంలో తన ప్రాణానికే ముప్పు పొంచుండచ్చన్న సంభావ్యతను బేఖాతరు చేస్తూ. పెంచింది; ప్రపంచం కోసం నిన్ను సంసిద్ధుణ్ణి చేస్తూ. ఆకలికి, నొప్పికి, నచ్చకపోవటానికి నువ్వొకే ఏడుపును ఆశ్రయించే రోజుల్లో నీ బాధను నిర్వచించగలిగింది. నీ బోసి నవ్వుల్లో తానో పసిపాప అయ్యింది. ఆమెకు నువ్వో ఆటబొమ్మ. ఆమె నీకో పట్టుకొమ్మ.
కని, పెంచి నాకు అప్పజెప్పింది, పాతికేళ్ళ వాణ్ణి. ఆవిడలా మన పిల్లల్ని పెంచుకోవాలనుకున్నాను గానీ, నిన్నూ.. ఎలా చెప్పను?
నా ముద్దూ ముచ్చటా తీర్చని నిన్ను కాల్చుకుని తినే నసను నేను. నా మాటేదో కాదని, నిశ్చింతగా నువ్వు భోంచేస్తుంటే, సలసలకాగుతున్న నా అసహనాన్ని నీ చేతి మీద వేడి సాంబారుగా వడ్డించే దుర్మార్గాన్ని నేను. తప్పు నావేపున్నా అందాన్ని ఎరగా వేసి నిన్ను కాళ్ళబేరానికి రప్పించుకునే అహంకారాన్ని నేను. నిన్ను అనుమానించకుండా ఉండలేక, అలా అని బయటపడలేక కారణం లేని రుసరుసలు రువ్వే దౌర్జన్యాన్ని నేను. పంతాన్ని నేను. ప్రతీకారాన్ని నేను. పడక్కూర్చీలో నడుం వాల్చి పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకున్న నిన్ను గిచ్చి లేపే పేచీని నేను.
బద్ధకించే నీకు బడితపూజను కూడా నేనే. అలసినప్పుడు జోలను. అపార్థాల బురదగుంటలో పడి దొల్లుతున్న నీకు నాలుగు తగిలించి, మురికి మిగలకుండా కడిగే నీరుని నేను. లోకంతో గలాటా పడి గాయాలతో వచ్చిన నీకు వేసే మందుని నేను. నీ నిద్ర రానని మొండికేస్తే, నా నిద్రను వెలివేసే సహచర్యాన్ని నేను. అంతర్ముఖుడివై ఇహాన్ని మరిచిన నీ మీద ఓ కన్నుంచే పర్యవేక్షణను నేను. బయట రుచులు మరగకుండ నీ ఆకల్ని కనిపెట్టుకుండే అన్నాన్ని నేను. ఇప్పటికీ.. ఇప్పటికీ.. కోపానికీ, అసహనానికీ, బాధకీ, ఆకలికీ ఒకటే మౌనాన్ని ఆశ్రయించే నీ భావోద్వేగాలను చదవగలిగే మనస్తత్వవేత్తను నేను. నీ మనసుపై ఉన్న ఏకైక పరిశోధనగ్రంధాన్ని నేను.
సత్యను నేను. యశోదనూ అయ్యాను. నాకూ, నీకూ తెలీకుండానే నేను ఎప్పుడో నిన్ను కన్నాను.
” ఆమెకు నువ్వో ఆటబొమ్మ. ఆమె నీకో పట్టుకొమ్మ.”
యీ వాక్యం బాగుంది.మీ టపా తో సంబంధం లేక పోయినా ఖడ్గం మూవీ లో “నువ్వు నువ్వు ” పాట గుర్తు వచ్చినది చదువుతుంటే.
LikeLike
chinnappudu anniTiki eDupu, peddayyaka annitiki mounam comparision bagundi.superb expression of thoughts.
LikeLike
కొన్ని లైన్లు మళ్ళి మళ్ళి చదవాలి అనిపిస్తుంది. హ్మ్ .. మీ మీద అసూయగా కూడా ఉంది. ఎలా రాస్తారు ఇలా !!!
LikeLike
chala bavundandi.
LikeLike