ఇవ్వాళెందుకో రాయాలనిపిస్తోంది. రాస్తూనే ఉండాలనిపిస్తోంది.
కథలో, కవితలో కాదు. అచ్చంగా నా ఆలోచనలే. ఏ ముసుగు లేకుండా! అందుగ్గానూ నీ ఇన్‍బాక్స్ ఎన్నుకున్నాను. ఒక కాల్‍తో పోయేదానికి ఎందుకిలా కాల్చుకొని తినడమంటే.. దోరగా వేయించిన చివాట్లు పెడతావనీ..
ఎంతగా ధ్యాస మారుస్తున్నా ఒకటే ఇమేజ్ కళ్ళ ముందు కదలాడుతోంది. చేతికి లోతైన గాటు పడినట్టు. నెత్తురోడుతున్నట్టు. సూదిని చర్మంలోకి దించి పైకి లాగుతున్నప్పుడు దారపు పోగులపై రక్తం పాకుతున్నట్టు.. ఊహించుకో! తెల్లటి దారం పై మెల్లమెల్లగా పాకుతున్న ఎర్ర్రటి నెత్తురు. జూమ్‍లో ఊహించుకో! బాగుందా? హమ్మ్.. ఎందుకో అదే పదేపదే వెంటాడుతోంది.
అలా చూడకు, ప్లీజ్. ’మీ రచయితలంతా ఇంతే! దారపు పోగును భూతద్దంలో చూపించి కొండచిలువని నమ్మిస్తారు” అంటూ మొదలెట్టకు! రాయలేనివాళ్ళు అదృష్టవంతులు ఎలాగైనా! మీ కన్నీళ్ళన్నీ ఇంకిపోతాయి అనంతంలోకి.
మావి అలా కాదుగా! మాటల ఇటుకులు పేర్చి బావి కట్టుకుంటాం. వాటిని కన్నీటితో నింపుకుంటాం. చేద వేసి తోడి, మళ్ళీ బావిలోనే పోస్తాం. అది మా దురదృష్టం.
అయినా నిజం చెప్పు. రాయడమనేది అంత పెద్ద నేరమా? ’ఎందుకలా బుర్ర పాడుచేసుకోవడం?’ అని ఎంత తేలిగ్గా అడిగేస్తారేం? ఏం? మీరు పాడుచేసుకోరూ?
ఆలోచనే! అస్థిత్వం లేని ఆలోచన. అయినా అది బుర్రలోకి జొరబడి అక్కడే ఆగిపోతుందా, మీకైనా, మాకైనా? నలిమి మింగేసేంతగా పరిణామం చెందదూ? బుర్ర వేడెక్కడమే కాదు, నరాల్లో వేదన మొదలవ్వదూ? ఛాతీలో మంట పుట్టదూ? ఉండలుండలుగా కడుపులో ఏవో పల్టీలు కొట్టవూ? కాళ్ళు తేలిపోవూ? అరికాళ్ళ మీద ఏదైనా బరువుంటే బాగుణ్ణని అనిపించదూ?
God damn it! It just doesn’t remain at a psychological level. It hurts you physically. Whatever that “it” may be.
కాదంటావా? మానసిక బాధ శరీరాన్ని ఎంత ఒత్తిడికి గురిచేస్తుందో.. ఒప్పుకోరేం?! హైద్రాబాద్‍లో పీర్ల పండుగనాడు, ఛాతీ పై గాట్లు పెట్టుకుంటారు. ఆలోచనలు ఛాతీ లోపల ఎంచుమించుగా అదే పనిజేస్తాయి. కాదనమను ఎవ్వరినైనా?
సరే.. ఇంతకీ అసలు విషయం. చూసావా? ఫోన్ చేసుంటే నేరుగా టాపిక్ చెప్పాల్సి వచ్చేది. ఇక్కడ కాబట్టి నా ఇష్టారాజ్యం.
మొన్న నీతో మాట్లాడాక, ధైర్యం చేసి అక్కిని మాటల్లోకి దించాను. అలా దించడానికి చాలా రిహార్సల్స్ వేసుకుంటే గానీ ధైర్యం చాల్లేదు. నవ్వొచ్చింది. కొంచెం ఏడుపు కూడ. నిన్నా మొన్నటి దాకా, బాత్రూంకి వెళ్ళడానికి కూడా నాతో చెప్పేవాడు. అమాంతంగా పెద్దవాడైపోయాడు. ఇప్పుడు వాడికో ’స్పేస్’. అందులో నాకూ అనుమతి లేదు. రాదు. వాడి వ్యక్తిత్వం ఎన్నో పొరలను సంతరించుకుంటోంది ఇప్పుడు. వాటిలో చాలా వాటి ఉనికి నాకు తెలీను కూడా తెలీదు.
మళ్ళీ.. ఇంతకీ అసలు విషయం…
“యెస్ మామ్! ఒకరిని ఇష్టపడుతున్నాను..” అని ఒక క్షణం ఆగాడు. నేను వాడికేసి చూస్తూనే ఉన్నా. “డోంట్ ఫ్రీక్. ఇట్స్ ఎ గాళ్!” అన్నాడు ఒక కన్ను కొడుతూ, నవ్వుతూ. పదిహేడేళ్ళ రిషిని కళ్ళముందుకు తెచ్చినట్టూ.
నాకో క్షణం పట్టింది అర్థమవ్వడానికి. ఓహో! వీడు ఇంకొకడిని వేసుకొని తిరిగే అవకాశం కూడా ఏడ్చిందిగా! అందుకని అన్నాడు మాట, “డోంట్ ఫ్రీక్” అని.
చిత్రం కదూ! మనప్పుడు మనం అబ్బాయిలతో సఖ్యంగా ఉండడానికి ఎన్నో ఆంక్షలు. ఇప్పుడా ఆడా-మగా పట్టింపు లేదు. ఎవరితో పడ్డామన్నది వేరే కథ. పళ్ళు మాత్రం రాలుతాయి.
అబ్బా ప్రేమలో పడ్డాలు. ఎన్నేసి రకాలు? నలభై అంతస్థుల మీద నుండి పడుతున్నట్టు. అరటి తొక్క మీద కాలేసి జారి పడ్డట్టు. కాలు బెణికి పడ్డట్టు. జారుడుబండ మీద జర్రున జారుతూ పడ్డట్టు. తలతిక్క ఎక్కువై జారుడు బండ మీద నడవడానికి ప్రయత్నించి పడ్డట్టు. ఆదమరచి నుంచున్నప్పుడు ఎవరో బలంగా గెంటేస్తే పడ్డట్టు. కలలో విహరిస్తూ, మంచం చాలక కింద పడ్డట్టు. మణికట్టుని బలంగా పట్టుకొని ఎవరో లాగుతుంటే పడ్డట్టు. దులుపుకొని లేచే లోపు మళ్ళీ పడ్డట్టు. అగాధం అని తెల్సి, తెల్సి పడ్డట్టు. నవ్వినట్టు. ఏడ్చినట్టు. బతికినట్టు. చచ్చినట్టు. ప్రేమించినట్టు.
ప్రేమ తప్పి, గుండె చొట్ట పడినట్టు.
అయినా వీడు ప్రేమలో పడుతుంటే, నేనెందుకు ఇంత నెర్వస్ అవుతున్నాను? నాకర్థం కాదు. ప్రేమ వాడికి ఏ నరకాలు చూపిస్తుందోనని భయం. లేదా స్వర్గపుటంచుల దాకా తీసుకొని పోయి, తోసేస్తుందనేమో! భయం. బెంగ. ఆందోళన. నువ్వన్నట్టు వాడికో జీవితం ఉంది. తల్లకిందులైనా వాడి జీవితం వాడే బతకాలి. కన్నతల్లిగా వాణ్ణి అన్ని కష్టాలనుండీ కాపాడేయాలన్న తాపత్రయం ఉన్నా.. వాడి జీవితానికి నేనూ ఒక ప్రేక్షకురాలినే! కాకపోతే అమ్మను కదా! అందుకని ముందు లైన్లో కూర్చుని దగ్గరగా చూస్తానన్నమాట. అంతేనా?
అందరి తల్లులకూ ఇలానే అనిపిస్తుందా? లేక, నీ భాషలో చెప్పాలంటే నాకు మాత్రమే సాధ్యపడే మాయరోగం వల్ల అంటావా?
నువ్వు కాబట్టి ఇదంతా చదువుతున్నావ్.. కాసేపు ఆవేశంతో ఊగిపోయి, ఈ వెర్రి మొర్రి ఆలోచనలకు నా తలంటి, ఆనక శాంతిస్తావ్. అదే రిషి అయితేనా.. అసలింతదాకా వచ్చేదే కాదు. ఈపాటికి ఎప్పుడో దగ్గరకు తీసుకొని, గుండెలకు హత్తుకొని.. ఆహా! ఒక చెవిలో అతని గుండె చప్పుడు. రెండో చెవిపై అతడి అరచేయి. ఆ చేతిలో ఏదో మహత్యం. ఒక్కసారి తలనిమరగానే ఆలోచలన్నీ హుష్ కాకి.. అందుకే అప్పట్లో నా రాతలన్నీ చప్పగా ఉండేవి.
నీకు గుర్తుందా సుమా? నీకు కొత్తగా పెళ్ళయ్యిందనీ, నువ్వు మీ అత్తారింట కాపురం మొదలెట్టావనీ, మీ ఇంటికి చుట్టాల తాకిడి ఎక్కువనీ.. అన్నీ తెల్సి కూడా భోరున ఏడ్చుకుంటూ నీ దగ్గరకు పరిగెత్తుకొని వచ్చేసాను? నాకోసం, పాపం మీ ఆయన, హాల్‍లో పడుకున్నాడు ఆ రెండ్రోజులూ. మీ అత్తగారొచ్చి ఆరా తీస్తే, “చిన్నప్పటి నుండి ఎత్తుకొని పెంచిన మామయ్య పోయాడని.. తట్టుకోలేకపోతుందనీ..” అంటూ ఏదో చెప్పావ్. ఆవిడ నన్ను ఎంత బా చూసుకున్నారు! ఆ తర్వాత ఎప్పుడు నా మాటొచ్చినా, “పిచ్చి పిల్ల! ఎంత ఏడుపేడ్చిందో.. ” అని అనకుండా ఉండేవారు కారు.
నాకు అటూ, ఇటూ ఎటూ మావయ్యల్లేరని ఆవిడకు తెలీకుండానే పోయారు. ప్చ్..
రిషి కోసం ఎప్పుడేడ్చినా అంతే! కొంపలంటుకుపోయినట్టు. ఇహ, అక్కడితో అంతా అయ్యిపోయినట్టు.
రిషి..రిషి..రిషి.. అదో తపస్సులా. ఒక ధ్యానంలా.
రిషి, అక్కి ఇద్దరూ కల్సి నన్ను బాగా జడిపించేవాళ్ళు. ’ఎప్పుడో మీ వల్లే నా గుండె ఆగిపోతుంది.’ అని విసుక్కునేదాన్ని.
’వేషాలు వేయకు రిషీ! నా గుండెకు స్విఛాఫ్ బటన్ నీలో ఉంది.” అని ఎన్ని సార్లు చెప్పానో లెక్కలేదు.
నువ్వు అన్నట్టు నేను రొమాంటిసైస్ చేసానేమో! చదువర్లకు కిక్ రావాలని, నిజంగా లేనిపోనిది రాస్తామేమో. మనిషి చూడగలిగినంత పెద్ద కాన్వాస్‍పై ప్రేమను అందంగా చిత్రీకరిస్తామేమో! నీవన్నీ ఉత్త అభాండాలు కావు, నిజాలేమో!
లేదా, నా ప్రేమలోనే లోటుందో?
రిషిని వదిలి ఒక్క క్షణం ఉండలేని నేను, ఇన్నాళ్ళూ ఎలా ఉన్నాను? ఇంకా ఎలా ఉంటున్నాను? అప్పుడే నా గుండె ఎందుకు స్విఛాఫ్ అయ్యి.. పోలేదు? అయ్యుంటే అక్కీ ఏమయ్యిపోయేవాడు? వాడి కోసం బతకుతున్నా అన్నది నా పాశమా? బాధ్యతా? అవసరమా? వంక?
రిషి.. రిషి.. రిషి.. ఈ ధ్యానమింకా ఆగదేం?! ఇలా లేనిపోనివన్నీ ఆలోచించి బుర్ర పాడుచేసుకుంటుంటే వచ్చి నన్ను దగ్గరకు తీసుకొని నా తలనిమురుతాడు అన్న ఆశ చావదేం?
రాడని తెల్సీ ఎదురుచూస్తున్నాను. లేడని తెల్సీ ప్రేమిస్తున్నాను.
అవును మేం రచయితలం. సమాజం అమోదించిన మానసిక రోగులం. బదుల్లేని ప్రశ్నల కొరడాలతో ఒళ్ళు హూనం చేసుకునే పోతురాజులం. గాయాలు వేడుకలు మాకు. కన్నీటి ఉప్పదనమే ఉపశమనం మాకు.
నువ్వైనా ఎన్నాళ్ళు భరిస్తావో నేనూ చూస్తాను. ’సెండ్’ బటన్ కొడుతున్నా.. కాచుకో.
కావోలోయ్, స్నేహితుల ఇన్‍బాక్స్ ఇలాంటి పైత్యాలకు.
నీ,
విద్య
no words to say its excellent.
LikeLike
This is just lyrical. Congrats for such a wonderful prose.
LikeLike