ఒక రోజు

Posted by

ఆమెతో నాకు పరిచయం ఉంది. సంబంధమూ ఉంది.

ఏర్‍పోర్ట్ లో కలిసాం. ఎప్పుడూ పుస్తకాల్లో మునిగిపోయేవాణ్ణి ఆ పూటెందుకో దిక్కులు చూస్తూ ఉన్నాను. ఆమె తళుక్కుమంది. ’బాగుందే’ అననుకునే లోపే ’నా తెల్సు.’ అన్న స్పృహ.

ఆమె కూడా నన్ను చూసింది. ’ఎన్నాళ్ళకూ!’ అంటూ నా వంక తేరిపార చూసింది. ఇద్దరి ఫ్లైట్లూ ఓ ఎనిమిది గంటల పాటు డిలే అవడంతో ఊర్లోకి వెళ్దాం అనుకున్నాం. నా ముందు వడివడిగా అడుగులు వేస్తూ నడుస్తున్న ఆమెను చూసి ’కొంచెం లావయ్యావే!’ అని నోరు జారాను. ఆమె అంగీకారార్థంగా విసిరిన నవ్వుకు చునువు ముదిరి ఇంకేదో కూసాను, నోటి దురుసుకు చేయి సాయం కూడా వెళ్ళింది, వలపాగ్నిలో విరహం పోసినట్టు. పెదాలపై నవ్వును కళ్ళలోకి పంపి మూతి బిగబెట్టి నా చేయి గిల్లింది, పొడుగాటి గోళ్ళు చర్మంలోకి చొచ్చుకుపోయేంతగా.

టాక్సీలో వెనుక కూర్చున్నాం. నా భుజంపై తలవాల్చి పడుకుంది. భుజంపైనా, స్లీవ్స్ పైనా అవసరానికి మించున్న బటన్స్ చెంపకు వత్తుకుపోతున్నాయని , మరి కాస్త కిందకు తలపెట్టుకొని పడుకోడంతో జాకెట్ జిప్‍లోకి జుట్టు ఇరుక్కుంది. రుసరుసలాడుతూ విసురుగా తలలేపబోయేసరికి జుట్టు మరింతగా ముడిపడిపోయింది. ఏదో తంటాపడి జట్టు విడిపించి జాకెట్ తీసేయబోతుంటే నన్ను వారిస్తూ ఒళ్ళో పడుకుంది. నిద్రలోకి జారుకుంటుండగా నేను వంగి చెవిలోకి ఊదుతూ అల్లరిపెడుతుంటే నా జేబులో పెన్ లాక్కొని నా జీన్స్ పై వత్త్తిపెట్టి ’బాడ్ బాయ్’ అని రాసింది.

ఆకలేస్తుంటే రెస్టారెంట్‍కు వెళ్ళాం. అక్కడి వాళ్ళకి మా భాష రాదు. అందుకని నాకొచ్చిన భాషలో వాళ్ళని నానా మాటలూ అనడం, అది తెలీక వాళ్ళు మర్యాదపూర్వక నవ్వులు నటించటం. నాలోని హాస్యగాడు చెలరేగిపోతుంటే ఆమె నవ్వాపుకోలేక, అలా అని అంత మంది ఉన్న చోటున నవ్వలేక కరుణించమని బతిమిలాడుకుంది. నేను మాట వింటేగా! అసలే ఆమెకు చేతికి అందేంత దూరంలో లేను. కొట్టాలంటే లేవాలి అని అనుకున్నాను. ఆమె  వెనక్కి వాలి, కొంచెంగా సాగి ఆమె కాలితో నా కాలుకేసి కొట్టుంది. హీల్స్ తగిలాయి కాలి ఎముకకు, నొప్పి జివ్వుమనేంతగా.

ఆరగించింది అరిగించడానికి నడక మొదలెట్టాం. కాసేపు గబగబా. కాసేపు నెమ్మదిగా. కాసేపు దూరదూరంగా. కాసేపు అల్లుకుపోతూ. కాసేపు ముందూవెనుకా. కాసేపు ఒకేసారి అడుగులేస్తూ. కాసేపు ఆటపట్టిస్తూ. కాసేపు బతిమిలాడుతూ. ఒక విండో డిస్ప్లే లో ఉన్న డ్రస్ చూడ్డానికి క్షణం ఆగింది. క్షణకాలపు చూపులో ఇష్టాన్ని అంతగా వ్యక్తం చేయటం ఎలా సాధ్యపడుతుందో? ’కొందాం..పద’ అన్నాను. వద్దని వారించింది. వాదులాడుకున్నాం. ’ఏం? కొనలేనివి ఏవీ ఇవ్వలేవనా ఇది కొనడం?’ అని అడిగింది. ఒక్క మాటతో నోర్మూయించడం కూడా ఎలా సాధ్యపడుతుందో?

గంటన్నర ప్రయాణం చేస్తే ఒక రొమాంటిక్ పిక్నిక్ స్పాట్ ఉందంటే అక్కడికే బయలుదేరాం. నదీ తీరం. లోతు లేదసలు. అరనిక్కరు పిల్లలు కూడా సరదాగా ఆడుకుంటున్నారు. అయినా దిగనంది. నేను ఉంటానుగా అని ఎంత చెప్పినా దిగనంది. నేను దిగి దోసిట్లో తీసుకున్న నీళ్లను ఆమెపై జిమ్మాను. ఒకట్రెండు సార్లు చేయగానే మొహం దాచేసుకుంది. ఎంత అడిగినా తలే ఎత్తదు. దోసిట్లోకి నీళ్ళు తీసుకోనూ, ఆమెను బతిమిలాడుకోనూ, నీళ్ళన్నీ జారిపోనూ. ’నువ్వూ దోసిట్లో నీళ్లలానే. ఎంత పట్టుకోవాలన్నా జారిపోతావు.’ అనేసాను ఏదో ఆలోచిస్తూ. కోపం వచ్చేసింది. సర్రున లేచింది. నా చేయి పట్టుకొని నీళ్ళలోకి దించి, ఓ పక్క పాకుడురాళ్ళపై అడుగును ఆన్చడానికి భయపడి నా మీదే బరువునంతా ఆన్చి, నన్ను నీళ్ళల్లో పడేసింది మెల్లిగా. పడ్డవాడిని లేవబోతుండగా నా భుజాలు పట్టుకొని మొత్తంగా వెనక్కి వాల్చింది. నేను అర్థంకాక ఏదో మాట్లాడబోతే నా నోరు నొక్కేసి నన్నలానే పట్టుకునుంది. అడుగు లోతున్న నీటి ప్రవాహం నా వంటి మీద నుంచి ప్రవహిస్తుంటే, నా ప్రత్యణవునూ స్వచ్చమైన శీతల నీరు తాకుతుంటే, అనిర్వచనీయమైన అద్వితీయానుభవంలో నేను పులకరించిపోతుంటే నన్ను కళ్ళార్పకుండా చూస్తూ ఆమె నా పక్కనే.

తడిపొడీ బట్టలు దులుపుకుంటున్న ఆమెను చూస్తుంటే తడిసి ముద్దైన నాలో వేడి ఎగజిమ్మింది. ఆమెను దగ్గరకు లాక్కొని కన్నార్పకుండా చూస్తుండగా సూర్యుడు సన్నగా నవ్వి మెల్లిగా జారుకున్నాడు, వెలుగుతున్న లాంతరులో వత్తిని తగ్గించినట్టు. వెలుగు కానీ చీకటీ కానీ వెలుతురులో ఆమె బుగ్గను ఆస్వాదిస్తుండగా నాలుకకు తగిలిన రక్తపు రుచి రసాభంగం కలిగించింది. గాయం చేసిన నోటితోనే సాంత్వనా కలిగిస్తున్నప్పుడు ఈసారి నా పెదవంచును తాకిన నీటి చుక్కలను నాలుకతో లోపలికి తీసుకోగానే, అబ్బా.. ఉప్పదనం.

ఇహ, ఫ్లైట్‍కి టైం అయిపోతుండడంతో తిరుగుప్రయాణానికి హడావుడి పడిపోయింది. నేనేమో ఆ వీధి దగ్గర ఆపించాను, డ్రస్ కొందామని. ’సామాన్యమైనవాటి మీద నీ కళ్ళు పడవే’ అని బిల్ కడుతూ గొణుకున్నా. ’అందుకే నీ మీద పడ్డాయి.’ అనేందుకు ఆమె పక్కనే లేదు. ప్చ్..

“ఎంత బాగా గడిచిందిగా రోజు. నమ్మకం కుదరటం లేదు.” అన్నాను.

“నాకెవరో చెప్పారులే, నిజంపై అంత త్వరగా నమ్మకం కుదరదని.”

“నేనేనా వాగింది? అది కాదు. నీకనిపించటం లేదా? ఇదంతా టూ గుడ్ టు బిలీవ్ లా ఉందని..”

“ఏమో..”

“ఏమో కాదు మొద్దూ, ఆలోచించు. ఇదంతా కల కావచ్చు.”

“నీదా? నాదా?”

“గుడ్ క్వశ్చన్. నీదీ అవ్వచ్చు. కానీ కాదనుకుంట. నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తావంటే ఊహు.. నేను నమ్మను. నాదే అనుకుంట. ఒక్కసారి గమనించు. నువ్వచ్చు నాకు నచ్చినట్టే ఉన్నావ్ ఇవాళ. ఒక సెకను కూడా నాకు దూరం కాలేదు. పూర్తిగా నాతో ఉన్నావు. నా ధ్యాసను ఇంకెటూ మరలనివ్వలేదు… ఇదంతా కలే అనుకుంట..”

“ఏమో బాబూ.. ఇప్పుడు ఏదయితే ఏంటి?”

“అలా అడుగుతావేం? కలకీ ఇలకీ తేడా లేదూ? ఇదే ఒకవేళ నిజంగా జరుగుంటే? జరక్కపోయుంటే?”

“మరేం నష్టం లేదు. అనుభవంలోకి వచ్చేసాక ఏదైతే ఏంటి?”

ఏర్‍పోర్ట్ లో ఫ్లైట్ అనౌన్స్-మెంట్.

“హే డ్రస్ పెట్టుకున్నావా?” అని అడగబోయి ఆగిపోయాను. డ్రస్ లేదు. టాక్సీలో మర్చిపోయామా? వాణ్ణి ఎలా పట్టుకోవటం? అసలెక్కడి నుండి తీసుకున్నాం టాక్సీని? వెళ్ళిన ప్రదేశాలేంటి? వాటి పేర్లేంటి? రెస్టారెంట్ వాళ్ళు మాట్లాడిన భాషేంటి? డ్రస్ కొన్న వీధి పేరు? ఆ నది పేరు? ఈ ఏర్‍పోర్ట్ పేరు? ఈ ఊరి పేరు? ఈ దేశం పేరు?

అర్రె! నా బట్టలింత పొడిగా ఎలా అయ్యాయి? నదంతా నాలో ఇంకిపోయిందా? డ్రస్ కొన్నానుగా, మరి అకౌంట్‍లో డబ్బులు తగ్గలేదు? రోజంతా అయిన ఖర్చో? నా జాకెట్‍లో ఇరుక్కున్న నీ వెంట్రుకలు? నువ్వు నన్ను కొట్టిన దెబ్బలు? నీ బుగ్గ మీద నేను చేసిన గాటేది?

“నీతో ఎప్పుడొచ్చినా ఇదే గోల. నీతో గడిపిన క్షణాలకు సాక్ష్యాలుగా వేటినీ మిగల్చవేం?”

“ఏం రుజువుంటే గానీ నేను లేనా?”

“వాదించకు. వేధించకు. దెయ్యంలా అన్నీ మింగేస్తావేం? ఎందుకిలా చిత్రహింసలు పెడతావ్.. నిజమో, అబద్ధమో తేల్చుకోలేక పిచ్చెక్కిపోతోంది.”

“ఎందుకంత గొడవ పడతావ్? నేను నిజాన్ని. నీ నిజాన్ని. నీకు మాత్రమే నిజాన్ని.”

“అంటే కలవి. మాయవి. నా భ్రమవి. అంతేనా?”

“కలయో. వైష్ణవ మాయో!”

“దుర్మార్గురాలా! ఒక్క జ్ఞాపకాన్నీ మిగిలనివ్వవా? ఎందుకిలా కలవై వెంటపడి వేధిస్తావ్.”

“నువ్వూ నాకు కలేగా.. అందుకు.”

ఇంకిపోయిందనుకున్న నది ఇప్పుడు పొంగుకొచ్చింది. “దొరికిందా సాక్ష్యం” అంటూ నుదుటిన ముద్దు పెట్టి తన దారిన తాను పోయింది. పెదాల స్పర్శ లేదు. తన్మయత్వం మాత్రం కలిగింది.

అలా ఆమెతో నాకు పరిచయమూ ఉంది. సంబంధమూ ఉంది.

2 comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s