అతడెవరో ఎమిటో నాకు తెలీదు. ఒక్కటే తెల్సుకున్నాను, అతడు కథలు బాగా చెప్తాడు(ట) అని.
నాకు కథలంటే ఇష్టం. కథలు చెప్పటమూ రాదు, నాకు. వినటమూ రాదు. అయినా ఇష్టం.
“నా వద్ద ఎన్ని కథలున్నాయో తెల్సునా?” అంటూ భుజానున్న కథల మూటను చూపిస్తూ ఊరించసాగాడు.
“ఏదీ? నాకూ చెప్పవూ?!” అని నేనూ ఆత్రం చూపాను.
“ఊహు.. ఇప్పుడు కాదు, మరెప్పుడైనా!” అని దాటవేసేవాడు.
“ఊ.. అలాగే” అంటూ తలూపేదాన్ని.
నాకు తెలీకుండానే అతడు మూట విప్పే రోజు కోసం ఎదురుచూసాను.
రానేలేదా రోజు. అలగడాలు, నిలదీయడాలు చేతనైనవాళ్ళ ఆయుధాలు. నేను అడగలేదు. అతడు చెప్పలేదు.
రోజులు గడిచాయి. నేను అడగను. అతడు చెప్పడు.
ఇప్పుడు, నేను అడగా లేను. అతడు చెప్పాలేడు. మా కథ కంచికెళ్ళిపోయిందిగా మరి!
అతడిప్పుడు వేరే ఏదో కథలో ఉన్నాడు, నేనుండని కథలో. ఇంకా కథలు చెప్తున్నాడో లేడో! తెలీదు.
నాది వేరే కథ; నేనే కథలు చెప్పాల్సిన కథలోకి వచ్చి పడ్డాను.
“కథలు వినడానికే నాకు అర్హత లేదనేమో అతడెన్నడూ కథ చెప్పలేదు. నన్నెలా పెట్టుకుంటావోయ్, కథలు చెప్పడానికి?” అని ఈ కథను నడిపిస్తున్నవాడితో వాదులాడలేను. వాడు ఉలకడూ, పలకడూ.
ఏం చేయగలనిక? కథలు చెప్పటం మొదలెట్టాను! అతగాడిలా అపాత్రదానల గురించి సంకోచించకుండా, ’ఓ కథ చెప్పవూ?’ అని అడిగినవారందరికి కథలు చెప్పేస్తున్నాను.
“అబ్బ.. ఎంత బావుందో కథ! ఎవరు చెప్పారు నీకివ్వన్నీ?” అని అడుగుతుంటారు.
’ఇంకెవ్వరూ? అతడే!’ అని అనుకుంటూ పైకనేస్తాను.
“ఎవరు చెప్పు? ఎవరు?”
అతడు మూట విప్పలేదు. అందులో ఏమున్నాయో నాకు తెలీదు. అసలున్నాయో లేవో అన్న అనుమానమూ రాకపోలేదు. అతడు కథలు చెప్పుంటే, ఇందులో, వాటినే తిరిగి అప్పజెప్పేదాన్ని. చెప్పకపోవటం వల్ల, నా ప్రతి క్షణపు ఎదురుచూపులో ఓ కొత్త కథ అల్లుకుంది. చిత్రంగా, ఇదో ఈ క్షణంలో కూడా అల్లుకుంటోంది..
“చెప్పూ..”
“అతడెవరో ఏమిటో నాకు తెలీదు. ఒక్కటే తెల్సుకున్నాను, కథలు బాగా చెప్తాడు(ట) అని —- “
hmm…some borgesian potential there….
LikeLike
అదేమో గానీండి, మీరెవరో నాకు తెలీదు గానీండి, ఒక్కటి తెలుసు కున్నాను, మీరు టపా రక్తి కట్టించారని. !
చీర్స్
జిలేబి.
LikeLike
brilliant.
LikeLike
మేము ఒకటే చెప్తున్నాం … మీరు బాగా చెప్తారని (వ్రాస్తారని) 🙂
LikeLike
ఏదో గొప్ప పుస్తకం చదివిన అనుభూతి కలిగింది. ‘ఇంకెవ్వరూ? అతడే!’ అని అనుకుంటూ పైకనేస్తాను’ ఈ ఒక్క మాట మత్రం కాస్త మారిస్తే ఇంకా బగుండేదనిపించింది. ఐనా బగుంది
Divya
LikeLike
WOWWW!!
LikeLike