….

Posted by

ఈడు అయిపోతున్నా పెళ్ళికాని ఆమె ఊసు రాగానే అందరూ నోళ్ళు నొక్కుకునేవారు. గుసగుసలాడుకునేవాళ్ళు. కొన్నిసార్లు ఆమెకూ, ఆమె కుటుంబసభ్యులకూ వినపడాలనే గొంతుపెంచి సణిగేవాళ్ళు. పెళ్ళి కాకపోవటానికి బలమైన కారణాలు చూపించలేక, పెళ్ళి చేయలేక ఆమె ఇంట్లో వాళ్ళంతా మానసిక క్షోభ అనుభవిస్తూ ఉన్న సమయంలో..

అనుకోకుండా ఒక రోజు ఒకడు ఎవరికీ తెలీకుండా ఇంట్లోకి జొరబడ్డాడు. వచ్చీ రాగానే ఆమె చేయి పట్టుకున్నాడు. ఆకుచాటునున్న ఆడపిల్లాయె! హడలిపోయింది. ఇంట్లోవాళ్ళకి తెల్సీ తెలియగానే పెద్ద రాద్ధాంతమే అయ్యింది. ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండ డబ్బిచ్చో, కాళ్ళుపట్టుకునే అతడిని వదిలించుకోవాలనుకున్నారు. అందుకు తగ్గ సన్నాహాలు మొదలెట్టారు.

అతడు డబ్బులకు లొంగలేదు. అతడి చేతిలో వీళ్ళ జుట్టుకానీ, అతడి కాళ్ళు వీళ్ళకి అందే అవకాశమే లేదని తెల్సుకున్నారు మెల్లిమెల్లిగా. అతణ్ణి చూస్తే చాలు ఆమె జడిచిపోయేది. “ఇతగాడికిచ్చి నాకు పెళ్ళి చేస్తే ఏ నుయ్యో, గొయ్యో చూసుకుంటాను” అని కూడా అనలేదు, పాపం. “నన్ను కాపాడండో..” అని విలవిలాడిపోయేది. బిడ్డ పడే వేదనకు మించిన శిక్షేముంటుంది కన్నవారికి? మందూ-మాకు అతడిని తరిమికొట్టలేకపోతే, చివరకు భూతవైద్యుణ్ణి కూడా పిలిపించారు.

అతడి ఊహే భరించలేని ఆమె ముందుకు ఓ సాయంకాలం వచ్చి కూర్చొని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏదో ధ్యాసలో ఉన్న ఆమె ఆ కళ్ళల్లోకి చూసింది. అవి మామూలు కళ్ళు కావు. అందులోని అయిస్కాంతపు శక్తి ముందు ఆమె నిలువలేకపోయింది. పరవశురాలయ్యి అతడికి అన్నీ సమర్పించుకుంది.

ఇంత జరిగాక ఇంక దాచటం ఎవరి తరం? గుండె రాయి చేసుకొని ఆమెను అతడితో సాగనంపటానికే సంసిద్ధమయ్యారు. కొత్తబట్టల్లో ఆమె కడిగిన ముత్యంలా ఉంది. తల్లిదండ్రులు బావురుమన్నారు. అన్నాళ్ళూ నోరుజేసుకున్న ఊరు-వాడ, ఆమె అప్పగింతల్లో కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. “మూణ్ణెళ్ళు తిరక్క ముందే శుభవార్తతో మళ్ళీ రావే” అని ఆటపట్టించే వీలే లేదుగా మరి.

అలా ఆమె వెళ్ళిపోయింది, అతడి వెంట… తిరిగిరాని లోకాలకు.

2 comments

  1. చాల్రోజుల తర్వాత నిన్ను చదివేస్తున్నా.. గబగబా.. ఆ పోస్ట్ నించి ఈ పోస్ట్‌కి జారుకుంటూ.. నవ్వుకుంటూ.. నిర్ఘాంతపోతూ…
    ఈ పోస్ట్‌కి మాత్రం చాలా గాఢమైన నిట్టూర్పు!!

    Like

Leave a comment