First published on patrika.kinige.com
(హరిశంకర్ పార్సాయి (1924-1995) హింది సాహిత్య జగత్తులో వ్యంగ్యహాస్య రచయితగా సుప్రసిద్ధి చెందినవారు. కేంద్రసాహిత్య ఎకాడెమీ అవార్డు గ్రహీత. అలతి పదాలతో, నిరాడంబర శైలిలో కొనసాగే వీరి రచనలు సమాజంలో పేరుకుపోయిన కుళ్లును కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. ఉపరితలంలో హస్యం ఉబికినట్టు కనిపించినా, వీరి రచనల్లో అంతర్లీనంగా కనిపించేది సమాజం పట్ల బాధ్యత. “షికాయత్ ముఝె భీ హై” అనే వీరి వ్యాసాల సంపుటి నుండి “న్యాయ్ కా దర్వాజా” వ్యాసానికి తెలుగనువాదం ఇది.)
సామెతల్లో చెప్పినట్టు ఏం జరగటంలేదు ఈ మధ్య.
సామెతల ప్రకారం – అబద్ధానికున్నముసుగును తొలగిస్తే నిజం నగ్నంగా కనిపిస్తుంది. అబద్ధానికన్నా నిజానికి సిగ్గెక్కువ.
ఇప్పుడు న్యాయం తలుపు తట్టాక ఈ సామెతలకు విరుద్ధమైనవి కనుగొన్నాను. కొంతమంది పేదవాళ్లపై అబద్ధపు కేసు బనాయించబడింది. మేము వాళ్ళ తరపున న్యాయస్థానం తలుపులు తట్టాము. న్యాయం తలుపు దగ్గరే డ్యూటీ మీద కూర్చుంటుందనీ, ఇలా తలుపు తట్టగానే అలా న్యాయదర్శనం అవుతుందనీ అనుకున్నాము. ఎంతసేపటికి తలుపు తెరుచుకోకపోయేసరికి ఆందోళన మొదలైయ్యింది. ఏమయ్యింది? న్యాయం “సిక్ లీవ్” గానీ తీసుకొనిపోలేదు గదా? అసలే, ముసలితనం కావటంతో తరచూ జబ్బు పడే అవకాశం ఎక్కువ.
చివరికి మేమే తలుపులు బద్దలుగొట్టుకొని లోపలికి ప్రవేశించాము. అంతా ఖాళీగా ఉంది. బాత్రూం తలుపు నెడితే, ఒకడు నగ్నంగా స్నానం చేస్తూ కనిపించాడు.
మేం అడిగాం – నువ్వు న్యాయానివి కదూ? త్వరగా బట్టలు వేసుకో. నీతో మాట్లాడాలి.
అతను అన్నాడు – నేను న్యాయాన్ని కాదు, అన్యాయాన్ని. నగ్నంగానే ఉంటాను. అన్యాయానికి సిగ్గేంటి: న్యాయానికి కవల సోదరుడిని. ఒకేలాంటి మొహం. జనాలు అతడనుకొని నన్ను కలుస్తుంటారు.
మేం అడిగాం – ఇద్దరి మధ్య ఏదో ఒక తేడా అయినా ఉండాలే!
అతను అన్నాడు – ఆ, ఉంది. చూడు, నాకు మెల్ల. ఎటో చూస్తున్నానని నువ్వు అనుకుంటావ్, కానీ నేను నిన్నే చూస్తున్నాను. మా సోదరుడు న్యాయం ఒంటి కన్నువాడు. ఒకవైపే చూస్తాడు. ఇప్పుడు వాడికి చెవుడు కూడా వచ్చింది.
మేం అడిగాం – మరి తలుపు కొట్టినప్పుడు ఎవరు తీస్తారు?
అతడు అన్నాడు – నేనే తెరుస్తాను. అదే కదా మజా. జనాలు నన్ను న్యాయమనుకుంటారు.
మేం అడిగాం – మీరిద్దరూ ఎవరి పిల్లలు?
అతడు అన్నాడు – “ఎవిడెన్స్ ఆక్ట్” మా నాన్న. “ఇండియన్ పీనల్ కోడ్” మా అమ్మ.
మేం అడిగాం – మేము న్యాయాన్ని కలవాలి. అతనేడీ?
అతనన్నాడు – ఇప్పుడే పెరటి గుమ్మం నుంచి పోలీస్ స్టేషన్‍కు వెళ్ళాడు. వచ్చేస్తుండచ్చు.
ఏం బాబూ, ఖలీల్ జిబ్రాన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నావా? లేదు. న్యాయస్థానపు గుట్టు రట్టు చేస్తున్నాను. న్యాయం తలుపు తట్టేవాళ్లారా, మీరేమో ముందు గుమ్మం తలుపు తడుతుంటారు, అదేమో పెరటి గుమ్మం గూండా పోలీసుల ఆజ్ఞలు పాటించడానికి వెళ్ళిపోతుంది. న్యాయానికి చెవుడు. తలుపు కొట్టేది కూడా వినిపించదు. తలుపు కొట్టగానే తెరిచే ఆ మెల్లకన్ను వ్యక్తి అన్యాయం. తలుపు కొట్టినంత మాత్రాన దొరికేది అన్యాయమే. తలుపు బద్దలుగొడితే గానీ న్యాయం దొరకదు.
ఏం బాబూ, ఇప్పుడు నక్సలైటు అవుదామని ప్రయత్నిస్తున్నావా? లేదు. ఇది పెద్ద ప్రయత్నించకుండానే వచ్చి అంటుకునే బిరుదు. ఈ మధ్య నేను ఒక పత్రికలో, పోలీసులు హాస్టల్‍లో చొరబడి అమాయకులైన విద్యార్థులను ఎందుకు కొట్టారని రాస్తే, నేను నక్సలైట్ ఐపోయాననే గుసగుసలు వినబడ్డాయి. నల్లులు కుట్టినా అది నక్సలైట్ల పనే అనిపిస్తోందిప్పుడు. పిల్లవాడు పాలకోసం ఏడ్చినా తండ్రి వాడి తల్లితో అంటాడు – “పాలు పట్టీయకు. వాడికి ఆకలీ లేదు పాడూ లేదు. నక్సలిస్టయి కల్లోలం సృష్టిస్తున్నాడు.”
ఉన్నట్టుండి సత్యపు గుట్టు కూడా రట్టయిపోతూంటుంది. దేవునిపై ప్రమాణం చేసి న్యాయస్థానాల్లో ఎన్ని అబద్ధాలు చెప్తారో అన్ని దేవుని వీపు వెనుక అయినా చెప్పరు. నరుడు కరుడుగట్టిపోయి నారాయణుని ముందే అబద్ధాలు చెప్పటానికి అలవాటు పడిపోయాడు. ధర్మం మంచివాళ్ళని పిరికివాళ్ళ గానూ, చెడ్డవాళ్ళని ధైర్యస్తులుగానూ చేస్తుంది. అసత్యం కొద్దిపాటి పవిత్రత సాయంతో సత్యపు బెర్తు ఆక్రమించేస్తుంది. ఆ సాయం గంగామాత కావచ్చు, జంధ్యప్పోగు కావచ్చు, ధర్మమే కావచ్చు, లేక ఈశ్వరుడే కావచ్చు.
ఇప్పుడిక్కడ సాక్ష్యం ఇచ్చేందుకు బోనులో నించున్న వ్యక్తి భగవంతుణ్ణి సాక్షిగా చేసేసుకున్నాడు – ప్రభూ, రా, నేను నీ ముందు అబద్ధమాడాలని ఉబలాటపడుతున్నాను. వాడు చదువూ, సంస్కారం, అందంగల వాడు. పోలీసులకు ఇలాంటి దొంగ సాక్షి దొరికాడంటే పోలీస్ లైన్‍లో హనుమంతుని ముందు కొబ్బరికాయలు పగులుతాయి. హనుమంతునిది మరో వింత. ఆయనకు ఎన్నో పేర్లు – ‘శత్రు వినాశక హనుమాన్’, ‘సంకట మోచన హనుమాన్’, ‘పోలీసు మహావీర్’. పూనాలో వేశ్యవాడల్లో ఉన్న హనుమంతుని పేరు – “వగలాడి మారుతి”. భారతీయుడు ఓ అద్భుతం. అతగాడి దగ్గర వగలాడి మారుతీ ఉన్నాడు, నపుంసకుల మసీదూ ఉంది. సరే, మనం మాట్లాడుకుంటున్నది హనుమంతుని గురించి కాదు, దొంగ సాక్షి గురించి. వాణ్ణి వెంటబెట్టుకుని ఇప్పటిదాకా ఇనస్పెక్టరు తాను దొంగ సాక్ష్యానికి పట్టుకొచ్చింది సాక్షాత్తూ సత్యహరిశ్చంద్రుణ్ణే అన్నంత దర్పంగా వరండా అంతా తిరిగాడు.
నిజాయితీపరునిగా కనిపించటానికి ఆ సాక్షి పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు. అబద్ధాన్ని పద్ధతిగా చెబితే చాలు, దాన్నే నిజమనుకుంటారు. వాడు గుండెల నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకుని చుట్టూ చూస్తున్నాడు. ఆత్మవిశ్వాస పూరితమైన అబద్ధం నిజమనిపించుకుంటుంది. నమ్మకంగా చెప్పని నిజం కూడా అబద్ధమైపోతుంది. నిజంలా కనిపించటానికి అబద్ధానికి ‘మేకప్’ కూడా కావాలి. వాడు మొహానికి స్నో పౌడర్ పూసుకున్నాడు. మంచి సూటు తొడుక్కున్నాడు. అసలు నిజం అంటే ఏమిటి? మంచి బట్టలేసుకున్న అబద్ధం.
వాడి మొహం కేసి చూశాను. పెదాలు బాగా పగిలున్నాయి. పళ్లు బయటకు కనిపించడానికి తొందరపడుతూ ఉన్నాయి. అబద్ధాలకోరుదీ, వాగుడుకాయదీ నోరు ఇలానే తయారవుతుంది. అబద్దాలకోరుల్లో మళ్లా రెండు రకాలు: మితభాషి, లొడలొడవాగేవాడు. మితభాషి పరిణతి చెందిన అబద్ధాలకోరు. అతను ఒకట్రెండు వాక్యాలలో అబద్ధాన్ని సర్దేస్తాడు. లొడలొడవాగేవాడు మాత్రం ఇంకా తన అబద్ధం అతకలేదని అనుకుంటాడు. అందుకని మరో పది మాటలు లొడలొడా వాగేస్తాడు. ఈ దెబ్బకి దవడలు సాగిపోతాయి. వీడి దవడలు కూడా అలానే సాగిపోయున్నాయి. వీడి నోరు అబద్ధాల చీముతో ఉబ్బిన కణితిలా ఉంది. కాస్త పొడిస్తే చాలు చీమంతా బయటకు పొర్లిపోతుంది.
వాడు ఇప్పుడు దగ్గి గొంతును సవరించుకున్నాడు. జేబు రుమాలుతో నోరు తుడుచుకున్నాడు. చూస్తుంటే, సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన వాడిలా లేడు, న్యాయపు కూతురిని పెళ్ళాడ్డానికి వచ్చిన పెళ్ళికొడుకులా ఉన్నాడు.
ప్రభుత్వ వకీలు అడిగిన ప్రశ్నలే అడిగాడు. అతగాడు చెప్పిన సమాధానాలే చెప్పాడు. ఫలానా వ్యక్తి మృతుణ్ణి లాఠీతో కొడుతుండగా అతను చూశాడు.
అతనికి లాఠీని చూపించారు. ఏదో పాత మిత్రుణ్ణి గుర్తుపట్టినట్టు గుర్తుపట్టాడు దాన్ని.
అతనికి ఒక రాయి ముక్క చూపించారు. అతను దాన్ని కూడా గుర్తుపట్టేశాడు – అదే రాయి, అక్కడ పడి ఉన్న రాయి.
నేను పక్కనే కూర్చున్న వకీలు దోస్తుతో అన్నాను – ఏరా, ఇదేంటి? వీడు రాయిని ఎలా గుర్తుపట్టగలడు?
అతనన్నాడు – గమ్మునుండు, ఎవిడెన్స్ ఆక్ట్ ప్రకారం అది సబబే!
సాక్షికి రక్తం కలిసిన మట్టిని చూపించారు. అతను మట్టిని కూడా గుర్తుపట్టేశాడు.
నేను వకీలు దోస్తుతో అన్నాను – ఇది మరీ విడ్డూరం. వీడు మట్టిని కూడా గుర్తుపట్టేస్తున్నాడు. అతనన్నాడు – మాట్లాడకు. ఎవిడెన్స్ ఆక్ట్!
నాకేమనిపించిందంటే – ఇప్పుడు వకీలు ఇతనికి గాజు సీసాలో బంధించిన ఈగను చూపిస్తాడు. అడుగుతాడు – ఈ ఈగను గుర్తుపట్టగలవా నువ్వు? సాక్షి అంటాడు – ఇది అదే ఈగ, కొట్లాట సమయంలో అక్కడ చక్కర్లు కొట్టిన ఈగ . నేను గుర్తుపట్టేశాను. దీని మొహం మా అమ్మలా ఉంది.
అంతా ఎవిడెన్స్ ఆక్ట్ మహత్యం!
హరిశ్చంద్రుడు తన కలలో ఎవరికైతే దానం ఇచ్చాడో ఆ బ్రాహ్మణుడే గనక ఆస్తుల స్వాధీనం విషయంలో కోర్టుకెక్కాల్సి వస్తే, అప్పుడు అతను కూడా ఇద్దరు ముగ్గురు ప్రత్యక్ష సాక్షులను తీసుకొచ్చి నిలబెట్టి ఉండేవాడు. అప్పుడు వాళ్లనేవారు – మా ముందే ఈ విప్రునికి హరిశ్చంద్ర మహారాజు దానం ఇచ్చారు. వకీలు అడిగేవాడు – ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు చెప్పుండేవారు – మేం కూడా రాజావారి కలలోనే ఉన్నాము.
డిఫెన్సు న్యాయవాది ‘క్రాస్ ఎగ్జామినేషన్’ చేయడానికి లేచి నుంచున్నాడు. ఇది దడపుట్టించే విషయం. ఒకసారి నన్నూ గడగడలాడించాడు. అప్పుడు నేను చెప్తూన్నది నిజమే, అయినా వకీలు రెండు నిమిషాల్లో ఆ నిజానికి చెమటలు పట్టించాడు.
సాక్షి సన్నద్ధమయ్యాడు. నోరు తుడుచుకున్నాడు. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ నింపుకున్నాడు.
వకీలు అడిగాడు – సంఘటనా స్థలం నుండి నువ్వెంత దూరంలో ఉన్నావు?
అతడు ఇంకా నోరు తెరవకుండానే వకీలు మళ్లీ అన్నాడు – తొందరేమీ లేదు. ఆలోచించుకొని చెప్పు.
‘ఆలోచించుకొని చెప్పు’ – ఈ సూచన సాక్షిని కంగారుపెడుతుంది. అతడికి తాను అనుకున్నంత తేలిక వ్యవహారం కాదిది అని తెలుస్తుంది. ప్రశ్న కష్టమైనది. ఆలోచించాలి.
అతడు ఇందాక ప్రభుత్వ వకీలుకు తాను పదడుగుల దూరంలో ఉన్నాడని చెప్పాడు.
ఇప్పుడు ఆలోచించుకొని చెప్పాడు – పది – పదిహేను అడుగుల దూరం.
వకీలు – అలాగా, పదడుగుల దూరంలో ఉన్నావా?
సాక్షి – అదే, పదిహేను – ఇరవై అడుగుల దూరం.
వకీలు – అయితే పదిహేను – ఇరవై అడుగుల దూరంలో ఉన్నానంటావ్.
సాక్షి – ఆ, ఇరవై – ఇరవై అయిదు అడుగుల దూరం అనుకోండి.
మూడు ప్రశ్నల్లో అతడు పదిహేను అడుగుల దూరం జరిగిపోయాడు. ఒకవేళ వకీలు ప్రశ్నలు అడుగుతూనే ఉండుంటే, అతడు సంఘటనా స్థలానికి ఐదు మైళ్ళ దూరానికి వెళ్ళిపోయేవాడు. కానీ అతనికి మాత్రం సంబరంగానే ఉంది, వకీలుని “కన్ఫ్యూజ్” చేసినందుకు.
– నువ్వు సంఘటనస్థలానికి ఎన్ని గంటలకు చేరుకున్నావ్?
– తొందరేమీ లేదు. ఆలోచించుకొని చెప్పు.
– ఒంటిగంటన్నర – రెండు.
– అలాగా, ఒంటిగంటన్నర – రెండు గంటలకు వచ్చావేం.
– అవును, అదే రెండూ – రెండున్నర గంటల మధ్య.
– ఒహో, రెండూ – రెండున్నర గంటల మధ్య చేరావన్నమాట.
– అదే, రెండున్నర – మూడు గంటలనుకోండి.
– మృతుని వయస్సు ఎంత?
– ఇరవై ఐదు – ముప్ఫై ఏళ్ళు.
– అలాగా, ఇరవై ఐదు – ముప్ఫై ఏళ్ళవాడా!
– అవును, ముప్ఫై- ముప్ఫై ఐదు ఏళ్ళవాడు.
– అంటే అతడి వయస్సు ముప్ఫై – ముప్ఫై ఐదు ఏళ్ళు ఉండచ్చన్నమాట.
– అదే, ఒక ముప్ఫై ఐదు – నలభై ఏళ్ళు అయ్యుండచ్చు.
కొన్ని రోజుల పాటు నేనీ సాక్ష్యాల ఆటను చూస్తూనే ఉన్నాను. నాకు మతిపోయింది. బయట ఎంత వెతికినా నిజాయితీ గల మనిషీ ఒక్కడూ దొరకడు, కానీ న్యాయస్థానాల్లో మాత్రం ఇంతమంది నిజాయితీపరులు ఏయే మూలల్లోంచి వచ్చి పోగవుతున్నారో అర్థం కాలేదు. అబద్ధం చెప్పడానికి అన్నింటి కన్నా సురక్షితమైన చోటు న్యాయస్థానం. ఇక్కడ రక్షణ కోసం దేవుడూ, న్యాయమూర్తి హాజరవుతూ ఉంటారు.
నా వకీలు-దోస్తు అన్నాడు – ఇదంతా చట్టపరిధిలోనే జరుగుతుంది. ఒకవేళ న్యాయమూర్తి సాక్షిని నమ్మితే, ఉరిశిక్ష. నమ్మకపోతే, విడుదల.
ఉన్నది ఒక్కడే సాక్షి, కానీ అతని వల్లే ఒక వ్యక్తికి ఉరి ఐనా పడవచ్చు, లేదా విడుదలైనా కావచ్చు. అదే సాక్ష్యం ఆధారంగా ఆ వ్యక్తిని ఒక న్యాయమూర్తి ఉరిశిక్షకు అర్హుడుగా భావించవచ్చు, అతణ్ణే ఇంకొక న్యాయమూర్తి నిర్దోషిగా భావించవచ్చు.
నేను వకీలు దోస్తుతో అన్నాను – మనిషికున్న ఈ న్యాయవ్యవస్థను యంత్రం ఎక్కువ రోజులు సహించదు. ఏదోరోజున ఇక్కడ న్యాయస్థానం బదులు ఒక పెద్ద కంప్యూటర్ ఉంటుంది. అందులో మీ న్యాయవాదులనీ, సాక్షులనీ, న్యాయమూర్తిని అందరిని కలిపి వేస్తారు. కంప్యూటర్ నడిచి, మీలో ఒకరి తోలుమీద నిర్ణయం ముద్రితమై బయటకు వస్తుంది.
అన్యాయంగా కేసులో ఇరికించబడ్డ ఈ ముగ్గురు నలుగురు వ్యక్తులూ రోడ్డు పక్కన మురుక్కాలవ అవతల గుడిసెలు వేసుకుని బతుకుతున్నారు. వీళ్లు ఉరికంభం పై వేలాడటానికి ఖర్చు కూడా చేశారు – వకీళ్లను నియమించుకున్నారు, పోలీసులకు డబ్బు తినిపించారు.
అంతే కాదు, ఇక్కడ యేసు తన శిలువను తానే తయారుచేసుకుంటున్నాడు, లేదా ఉరికంభం మీద వేలాడుతున్నాడు. యేసుకి తన కాళ్ళ మీద తనే మేకులు కొట్టుకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు. ఆయన అంటున్నాడు – తండ్రీ, వీళ్ళని ఎట్టిపరిస్థితుల్లో క్షమించకు. ఎందుకంటే, ఈ వెధవలకి, వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుసు.